Aug 26, 2010

కరుకుగా గరుకుగా కాకరలా

"అతను కూడా అందరిలా ఎందుకుండడు? విరాగిలాగున్నాడే ! ఎప్పుడూ తీవ్రమైన ఆలోచనలో ఉండడమెందుకు ?వీడి వయస్సుకీ నడవడి ఒప్పదు," అని అమ్మ అనుకొనేది.
అంతలోనే "ఏ పిల్లతో నైనా ప్రేమలో పడ్డడేమో !" అనుకొనేది.
త్వరలోనే అమ్మ గ్రహించింది. " తన కొడుకు ఫ్యాక్టరీలో ఉండే ఇతర యువకుల్లాంటి వాడు కాడు. కానీ," అమ్మలో సంశయం,సందేహం,ఆందోళన.
'అస్పష్టమైన ఆలోచనలతో పెరుగుతున్న సంకోచాలతో చిత్రమైన మౌన జీవితంతో 'ఒకరోజు రెండులు కాదు రెండేళ్ళు గడిపారు తల్లీకొడుకులు!
ఈ క్రమం లో ఒకరినొకరు గుర్తించారు.గౌరవించారు..ప్రేమించారు.
కొడుకు అందించిన కరదీపికను తల్లి అందుకొని -ముందుకు నడిచింది.నడిపించింది.
ఇది సులభం కాదు.
అందులోను నూరేళ్ళ నాడు !
అందుకేనేమో ,మమతానురాగాలనే సాయుధాలుగా మలిచాడు గోర్కీ.
"బహుశా  ఇలాంటి పనికి కొడుకును అనుసరించిన తల్లులలో ఈమె మొదటిదేమో .."అంటాడు రీబిన్.
"జీసస్ కీర్తి కోసం ప్రాణాలర్పించే మనుషులే లేకపోతే ,జీసస్ ప్రభువే అయి ఉండి ఉండడు !"అంటుంది అమ్మ తన హృదయాంతరాళంలోంచి పుట్టుకొచ్చిన కొత్త భావంతో .
నవల ఆరంభం లోని అమాయకమైన వ్యక్తి కాదు నీలోవ్నా .నవలతో పాటు ఆమెలోను గొప్ప పరిణామం కలుగుతుంది.ఆమెతో పాటు మనకూ.
పావెల్ సాషాలను ముచ్చటైన జంటలా చూడాలని ఎంత సహజంగా కోరుకుంటుందో కొడుకు ఉద్యమ పరిణామాలను ,సుధీర్ఘ ప్రవాస జీవితాన్ని ఎదుర్కోవడాన్ని అంతే గంభీరంగా నిలబడుతుంది.
అక్షరజ్ఞానం లేని అమ్మ ఒక ఆదర్ష నాయికగా ఆవిర్భవించే క్రమంలో , సాషా,నతాషా,లుద్మీలా,నికొలొయ్,ఇవాన్,రీబిన్ ..లాంటి వారందరితో ప్రభావితం అయ్యింది.వారినీ ఆమె ప్రభవితం చేసింది. ఇది ఆధునిక పోకడ.
***
ఒక పాల పుంతకు లేద ఒక ఆధునిక విమానానికి గోర్కీ నామకరణ చేయడం ..ఊళ్ళకు వీధులకు భవనాలకు గోర్కీ పేరు పెట్టి పిలవడము ..ఇవ్వాళ మనం విషేషాలుగా భావించ వచ్చు.అవన్నీ నవీన రష్యా చరిత్రలో నామ రూపాలు మిగలకుండా మలిగిపోయి ఉండవచ్చు.
సామాన్య ప్రజానీకం లోనుంచి గొప్ప రచయితగా ఎదిగిన వ్యక్తి గానో ..బోల్ష్విక్కులకు సన్నిహిత మిత్రుడిగానో ..సోషలిస్ట్ రియలిజం ప్రతిపదించిన సాహితీదార్షనికుడిగానో ..పాశ్చ్యాత్య విమర్షకులు తొసిఒపుచ్చిన ఆదర్షవాదిగానో ..ఎ ఒక్క రూపంతోనో ..మనం గోర్కీనీ స్మరించుకుంటే సరిపోదు.
ఆధునిక రష్యా జీవితం లోని సంక్లిష్టమైన నైతిక వర్తనను గుర్తించిన తొలి రచయితగా ప్రపంచం గొర్కీని గౌరవిస్తుంది.
ఇక,  విప్లవం రేకెత్తించిన ఆశలనూ ,చూపిన అద్బుత ఫలితాల్లోని పరిమితులనూ ..విప్లవ పథంలో కనబడని సున్నిత నైతికప్రమాదాలనూ ..ఎంతో ముందుగా ..ఎంతో సునిశితంగా గుర్తించిన మేధావిగా గోర్కీని మనం గుర్తించక తప్పదు.
ఇలా చూడండి.
"ఇవ్వాళ  పెట్రోల్ చక్రవర్తులు, ఉక్కు చ్క్రవర్తులు ,ఇంకా అలాంటి బోలెడు మంది చక్రవర్తులు లూయి- xi కంటే లేదా ఇవాన్ ది టెర్రిబుల్ కంటే ఎంతో దుర్మార్గులూ ,నేరస్తులూనూ.."
" సోషలిష్ట్ నిర్మాణపు సర్వరంగాల్లోనూ అంతటి ముఖ్యమైన పాత్ర నిర్వహిస్తున్న సోవియట్ మహిళని తగినంత వివరంగా చిత్రించడం అనేది నాటకం కానీ నవల కానీ చేయ లేదు."
ఈ ఆధునిక భావాల వయసు డెబ్భై ఏళ్ళ పై మాటే !
ఇన్నెందుకు?
గోర్కీని అజరామరం చేయడానికి ?
అనేకుల అంతరాంతరాలలో ఇంకిపోయిన మన "అమ్మ" చాలదా?
వెయ్యేల?
***
గోర్కీ అన్న పదానికి అర్ధం చేదు.
కల్లిబొల్లి కల్పనలు లేని వాస్తవం కరుకుగా గరుకుగా కాకరలా..
చేదుగానే ఉంటుంది. 
చక్కెర పూసిన అసత్యం తియ్యగానే ఉంటుంది.
"అమ్మ" అందుకు తిరుగుడు లేని విరుగుడు!
అమ్మ కు ఓ నూలు పోగు . 
అభిమానం తో.
 *


రచన 1-3-2007 .నూరేళ్ళ అమ్మ, ప్రజాసాహితి వారి ప్రత్యేక సంచిక నుంచి మరికొంత .
*

 All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

No comments:

Post a Comment