Aug 24, 2010

అలలు అలలుగా

అమ్మ రచనాకాలంలో ఎవరిని ఉత్తేజ పరిచిందని మనం భావించామో వారు, ఆనాటికి అంతగా అక్షరజ్ఞానం అబ్బని వారు. కానీ, అనతి కాలంలోనే అనేక కళారూపాలలో "అమ్మ" అన్నివైపులా ఆవరించి పోయింది. అందరి హృదయాలను స్పృశించ  గలిగింది.
బెర్నాల్డ్ బ్రెట్చ్  అమ్మ నాటక రూపాంతరం , నాటికీ గొప్ప ప్రజాదరణను పొందుతూ ,సామాన్యులకు ప్రేరణగా నిలుస్తుంది .ఆనాటి నుంచి  ఆ మధ్యన  జరిగిన వియత్నాం యుద్ధ వ్యతిరేక ఉద్యమాల వరకూ .ప్రపంచంలో ఏదో ఒక చోట అమ్మ స్వరం వినిపిస్తూనే ఉంది . అలలు అలలుగా.
అమ్మలో అంతటి శక్తి ఎక్కడిదిమనల్ని తన వైపు  అలా ఆకర్షించేస్తుందేం  ?
నూరేళ్ళ ముదిమి వయస్సులోనూ అమ్మ చలాకీ గా చురుక్కు మనిపిస్తుందే !
ఒక అమ్మలా ఆలోచించినప్పుడు ఆ ప్రత్యేకత ఏమిటో కొంత తెలియ వచ్చినట్లే అనిపించింది.
అమ్మ అందరి అమ్మలాంటిదే.
బిడ్డ ఆకలి తీర్చనిదే తన నోట ముద్ద పెట్టలేని మాములు అమ్మ.
తన బిడ్డ సుఖం గా హుందాగా భద్రంగా జీవించాలని కోరుకొనేదే. తల బొప్పి కడితే తల్లడిల్లి పోయేదే. కన్ను ఎర్ర బడితే విలవిలలాడి పోయేదే.
ఈ అమ్మ మహత్తరశక్తి లా మూర్తీభవింపజేసి మన ముందు నిలిపిన మేధావి గోర్కీ - ఈ మాములు అమ్మను ,మనందరి లాంటి అమ్మను,తన కన్న బిడ్డ మీద సహజంగా వ్య్క్తపరచ గలిగే మమతానురాగాలను -ఏ తల్లి కన్నబిడ్డపైననైనా ప్రసరిచ గల మహోన్నతవ్యక్తిత్వంగా మలిచాడు. ఆ శక్తి తల్లి తన బిడ్డల మధ్య సోదర భావాన్ని కల్పించి,సమన్వయాన్ని కలిగించి,ప్రేమతో కట్టిపడేసే అమ్మ మన్సుది.
మానవ స్వభావాన్ని బాగా ఎరిగిన వాడు కాబట్టే ,గోర్కీ అమ్మలోని మానవి ని చూడగలిగాడు. మనకు చూప గలిగాడు.
స్వేచ్చ సమత  సౌభ్రాతృత్వాలతో విలసిల్లే ఆ మరో ప్రపంచపు కలను మనముందు ఆవిష్కరించ గలిగాడు.
సమదృష్టి ,సామాజిక దృక్పథం,చైతన్య సంస్కారం- అమ్మ రచనా కాలంతో పోల్చి చూస్తే , ఎంతో సూదూర ఆదర్షప్రాయంగానే తోచ వచ్చు.సమకాలీనత ప్రశ్నార్ధకం కావచ్చు.
అయితే, అమ్మ లోని తల్లీకొడుకులు రచయిత ఊహాచిత్రణ కారని మనకు తెలుసు. అలాగే, అక్షరబద్దం చేయక పోయి ఉంటే ,అనేకమంది సామాన్య కార్యకర్తల్లో ఒకరిలా వారూ కాలం లో కలిసి పోయి ఉండే వారేమో !
నమ్మిన సిద్ధాంతం కోసం సర్వం ధారపోసిన సామాన్య కార్యకర్తల జీవితం "అమ్మ"
అందుకే అమ్మ ప్రత్యేకమైనది.అది ఏ రూపంలోని ఉద్యమమైనా,సాధారణ వ్యక్తుల గుండెను తడిమి చూపుతుంది,అమ్మ.  భుజం తడుతుంది అమ్మ.
బాంధవ్యాలు మనిషిని సున్నితంగా కట్టివేసి ఉంచుతుంటాయి.మానవ సంబధాలు మనిషి ఆలోచనలనూ అనుభూతులనూ ప్రభావితం చేస్తాయి.కొండొకచో,దిశానిర్దేశం చేస్తాయి.
అమ్మ లో ఈ సున్నిత బంధాలను బలీయమైన లక్ష్యం వైపు పరివర్తన చెందేలా చిత్రించడంలో గోర్కీ ఎంతో ప్రణాళికా బద్దమైన కథనాన్ని ఎంపిక చేసుకొన్నాడు.రచనా విధానాన్ని దగ్గరగా చూసిన కొద్దీ - చాలా అద్బుతంగా తోస్తుంది.
అమ్మ అన్ని మమకారాలకు ఆది.ప్రేమ స్వరూపిణి.కారుణ్యమూర్తి.అమ్మలో బిడ్డలను లాలించే పాలించే శక్తి సహజంగానే ఉంది.ఆ సున్నితమైన శక్తితోనే, తండ్రిని అనుకరించ బోయిన పావెల్ ను సరియైన మార్గం అన్వేషించేలా చేయగలిగింది అమ్మ.
ఆమె సునిశిత పరిశీలనాశక్తి ,చిన్ని చిన్ని మాటలు ,కొడుకు పావెల్ కు  దిశానిర్దేశం ఎలా అయ్యాయో ..తన ఈడు వారందరిలో ఒకడిగా మిగిలి పోకుండా
ఒక నాయకుడిలా ఎలా ఎదిగాడో ...చాలా సహజమైన సంభాషణల్లో సంధర్భాలలో సంఘటనల్లో చిత్రించాడు గోర్కీ .
తల్లి సహజ సిద్ధ ఆరాటం ..తనయుడు పోరాట మార్గం వైపు మళ్ళిన తీరు - ఈ నడుమ తల్లీ కొడుకులు పరస్పరం అంది పుచ్చుకొన్న ఆలోచనా స్రవంతి - చాలా నేర్పుగా మెళుకువగా అక్షరబద్దం చేసాడు గోర్కీ.అమ్మలో పరిణితి కలుగుతున్న కొద్దీ, కుటుంబ బంధాలను సమాజగతం చేస్తూ, నూతన మానవ సంబంధాలను ఆవిష్కరించుకొంటూ వస్తుంది.
ఇందులో రెండు ముఖ్యమైన అంశాలు ఉన్నయి.
ఉద్యమ కాలంలో తల్లీ బిడ్డల మమతానురాగబంధాలకు అతీతమైన కర్తవ్యమార్గం చూపే ప్రయత్నం ఒకటైతే ,ఇక కుటుంబానికే పరిమితమైన అమ్మ స్వయంగా సామాజిక ఉద్యమాలలో పాలు పంచుకోవడం రెండవది.
కార్మికులు ,కర్షకులు, స్త్రీలు ,వివిధ ప్రాంతీయులు -ఏకతాటిన ఉద్యమమార్గాన నడవడం ..ఈ నవల అందించే ముఖ్య సందేశం.
అదే నవలకు ఉద్యమ స్పూర్తినిచ్చింది.
నవల ఉద్యమానికి స్పూర్తినిచ్చింది.
***
రచన 1-3-2007.
నూరేళ్ళ అమ్మ, ప్రజాసాహితి వారి ప్రత్యేక సంచిక నుంచి ఇంకొంత.
 All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

No comments:

Post a Comment

బుద్ధుడిమాట ఈ పూట