Aug 14, 2010

"బోలో స్వతంత్ర భారత్ కీ...

జై" అనీ అనగానే, 
"జై !"అనే వాళ్ళం పిల్లలమంతా.
ఒక్క గొంతుతో.
ప్రభాత్ ఫేరీలు చుడుతూ.
ఊరంతా.
"లెఫ్ట్ రైట్... లెఫ్ట్ రైట్ ...
లెఫ్ట్ టర్న్ ..రైట్ టర్న్ ...
పీచే ముడ్.. దాయే ముడ్ ..బాయే ముడ్ ..  సావధాన్ ... ఆగే చల్ .."
అని అంటూ పిటి సార్  ఆగి ఆగి వేసే...విజిళ్ళ మధ్యన.
ఆగుతూ.సాగుతూ.
అసలే శ్రావణం. పడుతుందో లేదో తెలియని వాన. తెల్లవారుఝాము నాలుగున్నరకంతా..బడికి చేరక పోయామా..ఇక అంతే.
రాని వాళ్ళను వదిలేసి వచ్చిన వారు చక్కా  బయలుదేరి పోయే వారు.

బాయిలర్ వెలిగించి, నీటిని మరిగించి  ,స్నానపానాదులు ముగించుకోవడం ఒక ఎత్తు.
చిక్కులు తీసుకొని జడలేసుకొని రిబ్బన్లు ముడేయడం మరొక ఎత్తు.
వ్యాక్స్ పాలీషు తీసుకొని .. చేతికి అంటకుండా .. వంటికో బట్టలకో కాక బూట్లకే  రుద్దుకొని  సిద్ధం చేసుకోవడం మరొక కార్యక్రమం.
ఇక, సాగిపోయిన సాక్సులు ,బొటనవేలు కిటీకీలున్న సాక్సులను వెతికి అప్ట్టుకొని..వాటిని చక చక సూదీదారాలకు అప్పజెప్పి .. చక్కగా ఉతికి ఆరేసుకొని .. మడతేసుని.. దాచి ఉంచుకోవడం మరో ఎత్తు.
ఇక, అన్నిటినీ ధరించి..బడికి పరిగెత్తుకు పోదామంటే .. ఊరుకోవు కదా  వీధి కుక్కలు !

సమయానికి చేరామా సరే.
లేకుంటే, సందులో లోంచి ప్రభాత్ ఫేరీ వెళ్ళెప్పుడో చప్పుడు చేయకుండా దూరేయచ్చు.
కానీ, మా సార్లకు టీచర్లకు నిలువెల్లా కళ్ళే! చెవి మెలిపెట్టి , వరసల్లో సాగుతున్న వారి ఆవల పక్కనో , అందరికన్న వెనగ్గానో నడవమనడమే...కాకుండా..
  ప్రభాత్ ఫేరీ కి ఆలస్యం చేసినదేశ ద్రోహి”గా కట్టిన పట్టంతో , మరొక ఏడాది బడిలో తల వాల్చుకొని తిరగాల్సి వచ్చేది. అంతటి ప్రమాదం ఎవరు కొని తెచ్చుకొంటారు  మీరే చెప్పండి?
మేం మా శక్తి కొద్దీ కాళ్ళను నేల మీద ధనధనలాడిస్తూ  వరసగా నడుస్తూ పోతుంటే ,వాకిట్లో నిలబడి పిల్లాపాప తల్లీ  తండ్రీ ..ముసలీముతకా ..వాకిళ్ళలో నిలబడి ముచ్చటగ చూస్తుండేవారు
మెటికలు విరిచేవారు మెటికలు విరిచేరా.. చేతులు ఊపేవారు చేతులు ఊపేరా ..!

వీధిలోకి వెళితే వీధిలో.
"కదం బడాతే జాయింగే ..ఖుషీకే గీత్ గాయెంగే !".. పాలమూరు మా గొంతులతో హోరెత్తిపోయేది.
మా  బడి పిల్లల్లో ఎవరన్నా ఇంటి ముందుగా సాగేటప్పుడు . మరింత గొంతు పెంచి పెంచి జయకారాలు చేసే వాళ్ళం. అలాంటటప్పుడు, ఇంటి వారూ వంత పాడే వారు.
ఒక్కో మారు వేరే బడి పిల్లలు మాకు ఎదురొచ్చేవారుఅప్పుడు చూడాలి.  “మీరా మేమా “అని . చేతుల్లో ఎవరికి వాళ్ళం తయారు చేసుకొన్న కాగితం జెండాలను గాల్లోకి  ఎత్తి ...మా గుట్టలు పిక్కటిల్లేలా జై జై రావాలు చేసే వారంఅటూ ఇటూ పంతుళ్ళు పోటీలు పడి మరి మాతో పాటలు పాడించే వారు.
ఇంతలో పొద్దు ఎర్రబడ్డం చూసీ చూడగానే మా ప్రభాత్ ఫేరీ బడి దారి పట్టేది.
సూర్యోదయం అయ్యే సమయానికి తిరగవలసిన వీధులన్నీ తిరిగేసి.పాడవలసిన పాటలన్నీ పాడేసి.. పెనునిద్దరలన్నీ వదిలించేసి...బిల బిల మంటూ బడికి తిరిగివచ్చేవారం .
అప్పటికంతా  తయారు.
అసలు చేయవలిసిన పనతా ముందురోజే చేశేసాం కదా?
రంగుల రంగుల కాగితాలాన్నిత్రిభుజాల్లా కత్తిరంచి ..పురికొసల మీద జిగురుతో అంటించి ..బడి ఆవరణంతా తోరణాల్లా వేలాడేసే వారు.పిల్లలు పంతుళ్ళూ పంతులమ్మలూ తలా చేయేసి.
మా మట్టుకు మేం తరగతి గదిని బూజులు కొట్టి ఊడ్చి , బోర్డును పిచ్చిబీరాకుతో తెగ రుద్ది నలుపు చేసి...గదంతా రంగు కాగితం త్రిభుజాలతో  అలంకరించి.. మంచి మాటల అట్టలను గోడ మీదకు ఎక్కించి...మా గదిని తనివి తీరా అలంకరించుకొనే వాళ్ళం. కాగితాలు , మైదాపిండి కొనడానికి తలాకాస్త చందా వేసుకొనే వాళ్ళం. పదిపైసలనుచి రూపాయ దాక.ఎవరికి తోచినంత వారు.
మైదా పిండిని ఉడకబెట్టి జిగురు తయారు చేసుకొనే వారం.

కాగితం రిబ్బన్లను మెలి తిప్పి వరుసలు వరుసలు గా వేలాడేసే వారం.
మిగిలిన డబుల్తో పిప్పరమెంట్లో చాక్లెట్లో కొనుక్కొనే వారం. ఇవి మాకు పండగ
స్పెషల్ అన్న మాట!ఇక , జెంఢాకర్ర చుట్టూ ముగ్గులేసే వారు ముగ్గులేసారా.. రంగులు నింపేవారు రంగులు నింపారా..పూలతో అలంకరించేవారు అలంకరించారా.. అబ్బబ్బో !
అటు సూర్యో దయం అయిందో లేదో .. ఇటు జెంధావందనం అయిందన్నమాట!
రెప రెపలాడే జంఢా లో ముడిచి ఉంచిన పూలరేకులు గాలివాటున మా ముఖాలను తాకినప్పుడు చూడాలి.. ఎంత బావుండేదో!
 జనగణమని  ఊరంతా హోరెత్తి పోయేది  ఆ క్షణాన.
జెంఢా ఊంఛా రహే హమారాఅంటూ గొంతెత్తి పాడే దేశభక్తి గీతాలు,పెద్దలు పిల్లలకు నాలుగు మంచి మాటలు చెప్పాక.. అసలు కార్యక్రమం.
తీపిబూందీనో కోవాబిళ్ళో .. కారబ్బూందీ పాటు ..పిల్లలందరికీ.అందినవి అందినట్లుగా గుప్పిట్లో  చిక్కించుకొని ,
పటుకుపటుకు మనిపిస్తూ...   పకపక లాడుతూ   ఇంటి దారి పట్టే వాళ్ళం.
వచ్చే ఏడాది జెండాపండగ కోసం ఎదురు చూపులు మొదలు పెడుతూ.
***
మా బడిలో స్కౌట్స్ అండ్ గైడ్స్  కార్యక్రమం మొదలు పెట్టగానే , మా తరగతి నుంచి  మేమందరం చేరాం.
అయితే మాకెప్పుడూ జెండా పట్టుకుని నడిచే అవకాశం రాలేదు. ఆ పనిని ఎప్పుడూ పెద్దతరగతుల పిల్లలే చేసేవారు.
మాదెప్పుడూ వెనక వరసే.
" మనమెప్పుడు అలా జెండా పట్టుకుని ముందుకు నడుస్తామా "అని అనుకునే వాళ్ళం.
 చివరికి ఆ రోజు రానే వచ్చింది. అప్పుడు కానీ తెలియలా.అదెంత ముఖ్యమైన పనో.
నిటారుగా నిలబడాలి. పై నుంచి జెంఢా బరువు.
అటూ ఇటూ ఏ కాస్త తొట్రుపడినా  ,జెంఢా వొరుగుతుంది.
చేయి వొణికినా జెండా చేజారుతుంది. జెండా నేలకంటకూడదు కదా?
అప్పుడనిపించింది,
" వెనక వాళ్ళు చూడు ఎంత హాయిగా చేతులూపుకుంటూ నడుస్తున్నారో "అని !
***
అనకూడదు కానీ ,
జెండాపండగలోని సరదా , సంతోషం  సరిగ్గా ఎప్పుడు ఎలా తగ్గిపోయిందో తెలియనే తెలియ లేదు.
ఏర్పాట్లలోని సంఘీభావం ,ఉపన్యాసాలలోని ఉత్తేజం క్రమేణా తగ్గుతూ వచ్చాయి.
 సొర్యోదయాన కాక అథిదోదయానా జెంఢావందం కాసాగింది.ఉపన్యాసాలు ఊక దంపుళ్ళయాయి.
వారి మాటలు మాకు రూపేణ మార్గదర్షకత్వం అవుతాయన్న స్పృహ వారిలో దాదాపు మృగ్యం.
 ఊళ్ళొని పిల్లలందరినీ అట్టహాసం గా ఒకచోట జమచేసి
వారితో బృందనాట్యాలు, క్రీడావిన్యాసాలు,మార్చ్ పాస్టులు ,అతిధి వందనాలు.. పరిపాటి అయ్యాయి.
రావలసిన అతిధులు ఏనాడు సమయానికి వచ్హిన ఆనవాళ్ళు లేవు
ఆలస్యంగా మొదలయ్యి ఏ మిట్టమధ్యాహ్నానికో కార్యక్రమాలు పూర్తయ్యేవి.
ఇంతా చేసి అతిథులు అంతా చూసేవారే కారు.
 ఆ దరిమిలా , ఎర్రటి ఎండలో జెంఢా వందనం ..ఎన్ని మార్లు చేసామో!
తెల్లవారే ఇళ్ళల్లో బయలు దేరి ..తినీ తినక.. హడావుడిగా అక్కడికి చేరిన... చేర్చబడిన....  మాబోటి పిల్లలలం..సరిగ్గా ఇలాంటి స్వాతంత్రదినోత్సవాల్లోనే గా స్వతంత్రం కోల్పోయాం!
కలం పట్టిన కొత్తల్లో కరకర లాడుతూ ..ఆనాటి అనుభవాల్ని "బాలల దినం " పేరిట 'అచ్చ'రబద్దం చేసేందుకు ప్రయత్నించా .
ఎందుకంటే, అలాంటి అనేక కార్యక్రమాల్లో ఎందరు పిల్లలు  గంటల తరబడి  ఎదురుచూపులు చూస్తూ ..నిటారుగా నిలబడలేక..కళ్ళు బైర్లు కమ్మి .. స్పృహ తప్పి ఉంటారో!
***
మనుషుల్ని ముక్కలు ముక్కలుగా చూపుతూ ..
కరి పట్ల ఒకరు అపనమ్మకంతో జీవిస్తూ.. 
ఒకరిపై ఒకరికి ద్వేషభావనను రగిలిస్తూ...
ఒకరిని చూసి ఒకరు ఉలిక్కి పడే అభద్రతాభావం అంతకంతకూ పెరుగుతున్నప్పుడు....
పిల్లల్లో వారి చుట్టూ ఉన్న పెద్దల్లో ..
కులమత ప్రస్తావన లేకుండా..దేశం యావత్తు జరుపుకొనే జాతీయ పండగను .. 
భావిభారత పౌరులుగా  వారిలో ... జాతీయ భావన ను స్పూర్తినీ స్పందనను ..కలిగించ గల కార్యక్రమాలుగా మనం ఎలా మార్చుకోగలం? ఎలా మలుచుకోగలం?
 ప్రపంచీకరణ, స్థానిక వాదన నడుమ దేశకాలసీమితమైన సార్వజనీన జాతీయభావన ఒకటి ఉందనీ, దానిని మనం పదిలపరుచుకోవాలనీ .. పూటైనా మనం జ్ఞప్తికి చేసుకోవద్దూ?
స్వేచ్చకూ సమతకూ మూలమైన సౌభ్రాతృత్వ భావనకు బలమైన పునాది బడిలోనే పడుతుందనీ..
అందుకు ఇలాంటి పండగ పూట ఒక ఆహ్లాదమైన ఆవరణ కాగలదీ మనం గ్రహించ వద్దూ?
ఇదొక  ప్రహసనం కాదనీ ప్రత్యేకమైన సందర్భమనీ .. మనం అర్ధం చేసుకోవద్దూ?
ఇవీ అవీ .. అన్నో ఎన్నో  ... మనం తెలుసుకొని మన పిల్లలకు తెలియ పరచ వద్దూ?
*
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.
***
 All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

12 comments:

 1. స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.

  ReplyDelete
 2. స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.

  ReplyDelete
 3. స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.
  I was watching the flag function at Gandhi Bhavan on TV
  Mr.DS spent most of his time explaining the "sacrifice" made by Gandhi (Sonia)for this country #$%&*
  Disgrace.

  ReplyDelete
 4. స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు .

  ReplyDelete
 5. గుండె నిండా జై మోతలు మిలటరీ సాంగులు

  శుభాకాంక్షలు కాని ఒక్ఖ రోజే సంబరాలు కదా అని కొంచం....

  ReplyDelete
 6. మా చినప్పటి రోజులు గుర్తొచ్చాయి! ఆ హడవిడే వేరు. స్వాతంత్రదినోత్సవం అంటే అంతే అనుకునే అమాయకపు భాల్యం రోజులు అవి! Happy Independence Day!

  ReplyDelete
 7. మీకు 64 వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.

  - శిరాకదంబం

  ReplyDelete
 8. మీ అందరికీ ..ధన్యవాదాలండీ.

  ReplyDelete
 9. చిన్నప్పుడు స్వాతంత్ర్యదినానికి స్కూల్ లో జరిగే హడావిడితో పాటు, "ఇది చాలా పెద్ద పండుగ, కొత్త బట్టలు కొనరా" అని ఇంట్లో పెద్దవారితో వాదాలేసుకునేవాళ్ళం. ఇదివరకటికీ, ఇప్పటికీ ఈ ఉత్సవం జరుపుకోవడం లో తేడా బాగా కనిపిస్తోంది. ఏదీ ఏమైనా మనందరం కలిసి జరుపుకోవల్సిన పండుగ ఇది.
  "అందరికీ స్వాతంత్య్రదినోత్సవ శుభాకాంక్షలు.."

  ReplyDelete
 10. ammaaa- 'gata kaalamu melu vachhu kaalam kante'-mee chinnanaatianubhavaala sumahaaram - sumanojyamgaa- sundaramgaa-sourabhaalathonindi vundi.Aalaavunna daani koorpu- nee nerpu abhinanadaneeyam-assessulatho-- swaatantrya dinostsava subhaakankshalatho- baabaayi-venkata subba rao voleti,vernon hills -IL/USA.

  ReplyDelete
 11. nizam ga chala baagundi mee post. maa chinnappudu mee antha baaga kaakapoina.. baane jarigedi function school lo... happy independence day to one and all

  ReplyDelete
 12. మీ అభిమానానికి ధన్యవాదాలండీ.
  మంచి గతమున కుంచమైనా ఉండునని ..ఊరికే అన్నారా:-)
  నమస్కారం.

  ReplyDelete