Nov 24, 2012

ఆత్మీయజ్ఞాపకం

IMG_5616.JPG
మీరు నాటిన విత్తు 
మహావృక్షమై 
ఎందరో బాటసారుల
 సేద తీర్చింది.

మీరు చూపిన బాట 
చెప్పిన మాట 
మరెందరికో
బాసటగా నిలిచింది.

మీరు పదిలపరిచి 
వెళ్ళిన అనుభవాల 
ఆసరాగా మేం
కొనసాగుతున్నాం.

మీకు ఆత్మీయజ్ఞాపకం.
సగౌరవ నమస్కారం.

****
All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

Nov 23, 2012

ఈ సిత్రాన్ని ....!!!


బాలల హక్కుల సంఘం,హైదరాబాదు వారు ,"కార్పోరల్ పనిష్మెంట్ ఇన్ స్కూల్స్" అనే అంశంపై హ్య్దెరాబదులో స్పాట్ పెయింటింగ్  కార్యక్రమాన్ని నిర్వహించారు.5ఏళ్ళ నుండి 15 ఏళ్ళలోపు శుమారు 7,000మంది విద్యార్హ్తులు ఇందులో పాల్గొన్నారు.14 వ తేదీన బహుమతులు అందజేసారు.

అందులో ఉత్తమ చిత్రానికి శ్రీ కోటపాటి మురహరి రావు స్మారక బహుమతి అందజేయడమైనది.ఆ బహుమతిని టి.ఆకాశ్ కుమార్ అందుకొన్నాడు 


లోకాయుక్త జస్టిస్ సుభాషణ రెడ్డి గారు ,AK ఖాన్,IPS గారు ,ధర్మలింగం గారు ,డా.ప్రసాద్ గారు ,బాలహక్కుల సంఘం ప్రెసిడెంట్ అచ్యుత రావు గారు బాలలకు జేజేలు పలికి బహుమతులు అందజేసారు.

కొసమెరుపు:
ఈ చిత్రాలలో అనేక మంది పిల్లలు పంతులమ్మలు బెత్తమెత్తినట్లు బొమ్మలేయడం గమనార్హం! 
పిల్లలకు బొమ్మలు గీయడం నేర్పే  అయ్యవార్లూ .... ఈ సిత్రాన్ని  ఓ కంట కనిపెట్ట మనవి :-))  

Master T.AkashKumar got special prize"Kotapati Murahari Rao memorial Prize for his painting on corporal punishment.

DSC_0048.JPG

All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

Oct 24, 2012

"నీకో బొమ్మ నాకో బొమ్మ “


 “ కొండపల్లి కొయ్యబొమ్మ
నీకో బొమ్మ నాకో బొమ్మ “
దసరా పండుగ అంటేనే “అయ్యవార్లకు పిల్లవాండ్ర”కు కు సంబందించినది.
పాఠాలకు సెలవిచ్చి కాస్త సేదదీరే సమయం ఇది.  అంతే కాదు, ఇది బొమ్మల పండుగ. పిల్లలకు బొమ్మలకు ఉన్న అనుబంధం చెప్పవలసింది ఏముంది ?
మన సంస్కృతిలో ఒక్కో పండుగ ఒక్కో పనితనాన్ని గౌరవించేది. దసరా పండుగ పిల్లలకు ఎంతో ఇష్టమైన బొమ్మల కళాకారులను గౌరవించేది.
 దసరా నాడు మన ఇళ్ళల్లో కొలువు దీర్చే బొమ్మల అందం చందం చూసి తరించ వలసిందే.
అందులోను , స్థానికంగా తయారయిన కొయ్యబొమ్మలు అక్కడ ప్రత్యేకంగా నిలవవలిసిందే.
బొమ్మల తయారీ  సజీవంగా ఉన్న ఒక చేతివృత్తి.  కుటీరపరిశ్రమ.
తరతరాలుగా మన సంస్కృతి లో అంతర్భాగమై పోయిన ఈ సాంప్రదాయాన్ని మన పిల్లలకీ పరిచయం చేయడానికి , ప్రభవ బడిలో బొమ్మల కొలువు  నిర్వహించాము.  వారి వారి ఇళ్లనుంచి తమ బొమ్మల ను చేతబట్టుకొని బుట్టబొమ్మల్లా తరలివచ్చిన పిల్లలు పువ్వులు కళ్ళారా చూడవలసిందే!

"పిల్లవాండ్రకు చాలు పప్పుబెల్లాలు"                         
దసరా పండుగ శుభాకాంక్షలు.                                                               



 మీరూ ఓ మారు ప్రభవ బడిలోకి వచ్చి చూడండి మరి.

బొమ్మల కొలువు
All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

Oct 3, 2012

మాదా బుజ్జి బడి...!


మాదా బుజ్జి బడి...!
పిల్లలా చిట్టిపొట్టి వారు...!
బాపూజిని వారికి పరిచయం ఎలా చెప్మా!?!
ఇదుగోండి ఇలా చేశాం .
మేం.
http://prabhavabooks.blogspot.in/




All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

Sep 23, 2012

" చేనేత వారం ! "

                        
అగ్గి పెట్టెలో  అమరిన ఆరు గజాల చీరలు నేసిన మగ్గం మనది.  ఆ   మగ్గం పై విరిసిన పూలతరంగాలు, అందంగా కదలాడిన హంసల బారులు, ఆనందంగా పురి విప్పి ఆడిన నెమళ్ళు  , విరగకాసిన మామిడి పిందెలు ...    
ఒకటా రెండా ..వేలాది ఏళ్ళుగా ...అన్నీ మనవే.
ఆ నూలు బట్టల మెత్తదనం , పట్టు వస్త్రాల మేళవం, జలతారు చీరల సోయగం , డాబుసరి పంచల ఆర్భాటం...
ఎంతని చెప్పినా తనివి తీరేనా? సొంపు  సొబగు   సోయగం    సౌందర్యం  ... అన్నిటినీ కలనేసిన హస్తకళా కౌశలం !
అదీ మన వారసత్వం.
పొత్తిళ్ళలో కళ్ళు తెరిచిన నాటి నుంచి , అమ్మ కుచ్చిళ్లలో దోబూచులాడం ,ఆమె కొంగు పట్టుకు వేళ్ళడం, నాన్న పైపంచను వల్లెవాటు వేసుకొని వంటలు చేయడం, తలపాగా చుట్టి ఉత్తిత్తి మీసాలు మెలేయడం ...
ఇలాంటివెన్నెన్నో మన  చిన్నతనపు జ్ఞాపకాల పేటికలో భద్రంగా ఒదిగిన మధుర క్షణాలు
స్వయంగా రాట్నం పై  వడికిన నూలుతో నేసిన కొల్లాయి గట్టిన బాపు చూపిన స్వతంత్ర భావన , స్వాలంబన  ..ఉత్తేజమై ..ఉవ్వెత్త్త్తున ముంచెత్తిన ఉద్యమ తరంగమై ...
మనలను మన ఉనికిని గుర్తించేలా చేసింది. మన మూలాల్ని తడిమిచూపింది.మన కర్తవ్యాన్ని తట్టి లేపింది.
సామ్రాజ్య వాదానికి తెరదింపింది.. మన ఇంటింట తిరిగిన  రాట్నమే కదా ! లెక్కకు మిక్కిలి తుపాకీ తూటాలను నిబ్బరంగా  నిశ్శబ్దంగా  నిలువరించిందీ ఆ నూలు కండెలే కదా ?

మరి , వారసత్వ  సిరిసంపదను మన పిల్లలకు మనం అప్పజెప్పవద్దూ?
శ్రమైక జీవన సౌదర్యానికి జేజేలు పలకొద్దూ?
దిశగా ఒక చిన్న అడుగు మన ప్రభవ లో  " చేనేత వారం ! "

మీరిప్పుడైనా మీ పిల్లల బట్టల అరలోకి చూడాలి  . 
మరి ,వాటిలో చేనేత వస్త్రాలు ఉన్నట్టేనా?

గ్లాస్కో జుబ్బా,పట్టు పావడా ,ఖాదీ లాల్చీ,నూలు గౌను .. ఏదైనా కావచ్చు.
వారం పాటు మన పిల్లలతో పాటు మనమూ ,   అమ్మానాన్నలం... ఉపాధ్యాయులం
చేనేతను ధరిద్దాం !    

బాపూజిని స్మరిద్దాం!       
***
Also,     "Handloom Week  !"                                                                                              
http://prabhavabooks.blogspot.in/



All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

Sep 17, 2012

ష్ !


మేం ఏం చేస్తున్నామో మీకు తెలిసి పోయింది కదా!
ష్! 
మా అమ్మానాన్నలతో చెప్పొద్దు!



All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

Apr 15, 2012

ఇదుగోండిదుగోండి ...


 ప్రభవ బడి...!!!



If you can't open the above link,please try the following in YOUTUBE.
prabhava_playschool14-04-2012
బాపు గారికి ధన్యవాదాలతో  

చంద్ర లత  
***

All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

Feb 20, 2012

అవును కానీ

నిరక్షరాస్యులు,అవగాహన లేని వ్యవసాయదారులవద్దకు ఈ కథలోని అంశం తీసుకుని వెళ్ళ గల్గినట్లు వ్రాసి ఉంటే  ...
ఇది చైతన్యవంతమైన కథ అయి ఉండటానికి నూటికి నూరు శాతం అర్హత ఉన్న కథ. కానీ...., 

విశ్లేషకుల అభిప్రాయం మీరు స్వయాన ఇక్కడ చూడ వచ్చును.

http://vanajavanamali.blogspot.in/2012/01/3.html

All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

Feb 1, 2012

ఒక బంగరు తళుకులా!

మా అబ్బాయిలుంగారికి అర్థరాత్రికి అటూ ఇటుగా ఎప్పుడు జ్ఞానోదయం అయిందో తెలియదు కానీ, బుద్ధిగా కూర్చుని చదువుకొంటున్నాడు.
ఈ ఆకస్మిక పరిణామానికి కుసింత హాచెర్యపోయి, 
ఆ పై కడుంగడు సంతసించి, ఆనందంతో కళ్ళుచెమ్మగిల్లగా..
నన్ను నేనో మారు గిల్లి చూసుకొని, తెప్పరిల్లి, తేరుకొని...
కప్పునిండా  వేడి వేడి హార్లిక్స్ కలుపుకొని, వాడికి అందిద్దామని వెళ్ళానా..
మా బుద్దిమంతుడు ఈ చేత్తో కప్పునందు కొంటూ ,ఆ చేత్తో కెమిస్ట్రీ రికార్డు అందించాడు.
"అమ్మోయ్ ,ఈ పుస్తకంలో కాస్త  నాలుగు అడ్డగీతలు కొట్టి పెట్టమ్మా " అంటూ ఆ చేత్తోనే చక్కగా చెక్కిన పెన్సిలు అందించాడు.
అడగడమే ఆలస్యం..వాడి కోరికకు మనం నిబద్దలమై  సదా అమలు పరుస్తాం కనుక , మరింత బుద్ధిగా తలూపి ఖాళీ కప్పుతో  సహా  ఆ పుస్తకం తీసుకొన్నా.
“స్కేలు కనబడలా... కాస్త చూసి తీసుకోమ్మా..”
సరేలెమ్మని ..ఇల్లంతా తిరగేసి బోర్లేయగా దొరికిన ఒక బుజ్జిస్కేలునుచేతబుచ్చుకొని  ,బరబరా గీతలు కొట్టడం మొదలుపెట్టా.
అడ్డంగా .నిలువుగా. గడులుగా.
కెమిస్ట్రీ ప్రాక్టికల్స్   అంటే  ఠాక్కున గుర్త్తోచ్చేది గోల్డెన్ స్పాంగ్లెస్ పరీక్షే. 
నాజూకు గాజు  రీక్ష నాళికలో సీసం  కొరకై పరీక్షచేస్తుంటే, తటాలున తళుకుతళుకులా బంగరు తునకలు ప్రత్యక్షం అయ్యేవి.
ఎంత అందంగా ఉండేవో!
ఎంత సేపు చూసిన ఆశ్చర్యంగానే ఉండేది.  మళ్ళీ మళ్ళీ ఆ పరీక్ష చేసి చూడాలనిపించేది. మా లాబ్ అసిస్టెంట్ సెబాస్టియన్ చిటికెడు పొడి అదనంగా ఇమ్మంటే ఇస్తేగా!
ఆ పై అందమైన నీలపు మైలతుత్తం, అదే నండీ కాపర్ సల్ఫేట్ ద్రావణం,సొగసు చెప్పేది ఏముంది.
ఇక నీలి రంగు మంటతో అప్పుడప్పుడు ఎరుపెక్కేబున్ సెన్ బర్నరు ,  కుళ్ళిన కోడిగుడ్డువాసన వేసే వాయువులు, భగ్గున  మండే ప్రాణవాయువు ..ఆమ్లాలు క్షారాలు ..ఒక్కక్కటిగా జ్ఞాపకం వాచ్చాయి.
క్రమం తప్పకుండా మా వీణాపట్వారి మేడం ఏ వారానికి ఆ వారం చేయించిన ప్రాక్టికల్స్..అక్యురేట్ అకురేట్ అంటూ నా  టీమ్మేట్  బృంద  చేసిన హడావుడి.. ఆమె చేతిపై చిందిన సల్ఫ్యూరిక్ యాసిడ్ చుక్కలు ..మా దుస్తులపై పడిన రంధ్రాలు.. రసాయనాలు చిందగా మిగిలిన రంగురంగుల మరకలు.. సన్నసన్నని రంధ్రాలు..
ఇద్దరం కలిసి సొంతప్రయోగాలు చేయబోయి భగ్గుమనిపించిన రసాయనాలు ..చిటపటలతో చిన్నపాటి పేల్లుళ్ళు.. గదంతా కమ్మేసిన పొగలు..వీణా మేడంతో తిన్న చివాట్లు..
ఆఖరికి బోలెడంత పరీక్షించేసి పరిశీలించేసి హడావుడి చేసేసి, మా అక్యురేట్  బృంద  పరిశోదించి భేధించిన లవణ రహస్యం..ఉప్పు... అని తేలినప్పుడు..పగలబడి నవ్విన  పకపక నవ్వులు..ఎలా మరిచి పోగలం?
ఆ ఉప్పునే అద్ది బృంద తో తినిపించిన దోరజామకాయ ముక్కలు రుచి ఇంకా నోరూస్తోంది.
మా రేఖ వాళ్ళంతా ప్రాక్టికల్స్ ఎప్పుడైనా ఎగ్గొట్టి "సంగీత్" లో సినిమాలకు వెళదామన్నా ..
మా అక్యురేట్ బృంద పుణ్యాన బుద్ధిగా ల్యాబులో హాజరవాల్సి వచ్చేది!

ఒక్క సారిగా ఆ గీతల్లో గడుల్లో పలకరించాయి. గలగల మంటూ జ్ఞాపకాలు.
కాలం కరిగిపోతుంది. పోతూనే  ఉంది.
 నిశ్శబ్దంగా.
కాకపోతే అవే ద్రావకాలు ప్రయోగాలు..అవే రికార్డులు పరీక్షలు..
అయితే అవేవి గతఇరవై ఏళ్ళలో  ఒక్క మారైనా అక్కరకు వచ్చినట్లు జ్ఞాపకం లేదు.
అంతగా అక్యురేట్గా నేర్చిన పాఠాలు తలలో నిలిచిన పాపానా పోలేదు. ఒక్కో మారు అనిపిస్తుంది కదా... ఇలా నిత్య జీవితంలోను  వ్యవహారంలోను అక్కరకు రాని చదువులు ఎందుకబ్బా అని.
ఏమి చేయదలుచుకొన్నామో ఆ చదువులు మాత్రం చదివగలిగే అవకాశం ఉంటే బావుణ్ణు అని.
ఇన్నేళ్ళు గా ఎలాంటి మార్పులు లేకుండా ఈ చదువులు చదువుతూనే ఉన్నాం ..
మరీ ఇప్పుడు మార్కుల చదువులు చదివే కాలం కదా..హ్యుమానిటీస్ చదివితే సమయం వృధా అని భావించే కాలం కూడాను!
దీనికి కాలమానం కొలమానం ఏమి టో   మనమో మారు పునరాలోచించుకోవద్దూ?
కొలమానం అంటే గుర్తొచ్చింది.కొలబద్ద నా చేతిలోనే ఉంది. పెన్సిలు అరిగి పోయింది. మా వాడిచ్చిన అసైన్మెంట్ పూర్తయ్యింది.
గబ గబ తీసికెళ్ళి వాడికిచ్చేసి వస్తా.
అన్నట్లు, మా బృంద ఆ ఏడాది IIT ఎంట్రన్సు లో  టాపర్ గా ఆమె ఫోటో దూరదర్షన్లో  కనపడింది.ఆ పై వివరాలు తెలియవు.ఆచూకి లేదు.బహుశా జ్ఞానజీవన స్రవంతిలో కలిసిపోయిఉంటుంది!
మా సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజిలో  బృంద తో గడిపిన రెండేళ్ళ గుర్తుగా నా పాత్రలకు ఆమె పేరు పెట్టుకొని మురిసి పోతుంటాను.  బృంద కు తెలుగు రాదు. ఇక నా రాతలుకోతలు చదువుతుందనీ ..నాకు ఎప్పుడో ఎక్కడో తారసపడుతుందనీ అనుకోను .
తటాలున మెరిసి మాయమై పోయింది.
మా వీణా మేడం లాగానే.మా సెబాస్టియన్ లాగానే .మా కెమిస్ట్రీ పాఠాల్లాగానే.
నాజుకు జ్ఞాపకాల్లో ఒక బంగరు తళుకులా! 
***
 All rights @ writer. Title,labels, postings and related copyright reserved.