Nov 30, 2009

అన్నానే అనుకోండి

అన్నంత పనీ చేసేరండీ!
ఇంకెవరూ?
మన జ్యోతి గారే.
వంకాయ జంకాయ అయిపోతుందని ఒక పక్క దిగులు.
అలా జరిగితే ఎలా అని మరో పక్క విచారము.
ఈ రెంటి మధ్యనా....ఒక మధురమైన విప్లవం "1 కాయ వసంతోత్సవం"
అవునండీ..విప్లవాలు రుచికరంగా ఉంటాయి ! నోరూరిస్తాయి !
ఉప్పూకారాలు పట్టించి మసాలాలు దట్టించి .. కూర,పులుసు,పచ్చడి,వేపుడు,కారం..ఇంకా ఎన్నెన్ని విధాలుగా పిడికిలి బిగించవచ్చో ..మన జ్యోతిగారి చేయివాటం చూసి చెప్పేయచ్చు.


నిజమే.. మన ఇంట్లో,మన వూళ్ళో,మనకు అవకాశమున్న చోటల్లా..
వంకాయల వంటలు,పోటీలు,విందులు,వనభోజనాలు..ఇంకా ఎన్నెన్నో.
చేయాలండీ.చేస్తూపోవాలి.మరి,
మన దేశపు కన్నబిడ్డ"వంకాయ"ను మనం కనుమరగవ్వనిస్తామా?
అంత అమాయకులమా?
అంత చేతకానివారమా...?
జాగ్తేరహో..!


తిప్పండి గరిటె..విప్పండి గొంతు !!!
వంకాయా అమర్ రహే..!
వంకాయ జిందాబాద్!


జ్యోతిగారికి జేజేలు !


ఆలసించిన ఆశాభంగం..ఒక్కసారి క్లిక్కి చూడండి..!


జ్యోతి వలబోజు


ఇలా కూడా చూడండి:


Post: వగల మారి వంకాయ
> Link:
http://chandralata.blogspot.com/2009/10/blog-post_21.html


All rights @ writer.
Title,labels, postings and related copyright reserved.

Nov 25, 2009

బడిలో ఏముందీ???

కాలంలో మరీను, మూడేళ్ళు నిండీ నిండక మునుపే పిల్లలను బళ్ళో వేయలేదని అమ్మనాన్నలు దిగులు పడి పోతుంటారు. కేజీల చదువులు వచ్చాక .. మార్పంతా. అంతకు మునుపు నాలుగేళ్ళకో అయిదేళ్ళకో బడికి పంపే వారు.
ఇక, వీధి బడుల సంగతి చెప్పక్కర లేదు. పంతులుగారు మంచీచెడు చూసి ఎప్పుడు మొదలుపెట్టమంటే ..అప్పుడే .. తాంబాలంలో బియ్యం పోసి.. చదువుకు శ్రీకారం చుట్టే వారు.ఓం నమశ్శివాయ అంటూ..! కాసిన్ని బొరుగులు , పుట్నాల పప్పులు,బెల్లం ముక్కలు కలిపి పిల్లలకు తల గుప్పెడు పెట్టి,పంతులు గారికి దక్షిణతాంబూలలు ఇచ్చి ...పలకాబలపం చేత బట్టి... పిల్లలు బడిలో అడుగు పెట్టే వారు.
ఇప్పటి పిల్లలను బడిలో చేర్పించడం దగ్గర నుంచి ... బడి చదువు పూర్తయ్యేదాకా అమ్మానాన్న హడావుడి అంతా ఇంతా కాదు.play class లో చేర్చను pre-applicaiton దగ్గర నుంచి ..పుస్తకాలు, సంచులు ,నీళ్ళ సీసాలు , లంచు బాక్సులు,పెన్నులు ,పెన్సిళ్ళు రబ్బర్లు ..యూనిఫారంలు..పరీక్షలు ఫలితాలు..ఇక రోజుకు ఇరవై నాలుగు గంటలూ... బడే మన నిత్యజపం.
ఇక, పెద్దమనిషిని కదిలించినా.. మన విద్యావ్యవస్థను అంటే బడిని బాగుచేయడం ఎలా అన్న ఆలోచనలోనే మునిగి తేలుతుంటారు. బడిని దుమ్ము దులుపుతూనో.. పాఠాలను ప్రక్షాళన చేస్తూనో .. ఉపాధాయులకు ఉత్తమోత్తంగా ఎలా పాఠాలు చెప్పాలో బోధన చేస్తూనో ..అగుపిస్తారు.ఇక, బడిలో చదువు, ఆటాపాటాలను రంగురూపులను మెరుగు పరచడానికే మనం ప్రయత్నిస్తూ ఉంటాం.
ఆనాటి నుంచి నాటి వరకు.. మనం మన ఆలోచనలో, ఆచరణలో ,మన జీవితంలో.. బడికోసం ఎంత కాలాన్ని వెచ్చిస్తున్నామో గమనించారా? ఇక,ఆర్ధికపరంగాను సామాజికంగాను .. మనం వెచ్చించే సమయము, శక్తి,యుక్తి.. ఎంతుంటాయో కదా?
వీధి బడైనా ,పబ్లిక్ స్కూలైనా...ప్రైవేటయినా ప్రభుత్వానిదైనా.. బళ్ళో చేర్చడానికి అమ్మానాన్నలు ఎందుకంత తాపత్రయపడతారో ..బడి ఫీజులకు ఇతరాల కోసం ఎందుకంత రెక్కలు ముక్కలు చేసుకుంటారో.. బడికి పోనని మారాం చేస్తే వీపు చిట్లగొట్టి మరీ బడిలో ఎందుకు పడేస్తారో..బడిలో చేరని పద్నాలుగేళ్ళ లోపు పిల్లలందరూ బాలకార్మికులే అంటూ ఎందుకు చట్టాలు చేస్తారో.. నిర్భంధంగానైనా పిల్లలు బడిలో చేర్పించాలని రాజ్యాంగాలు ఎందుకు రాసుకొంటారో..యంత్రాంగాలు మంత్రాంగాలు ఎందుకు ఘోషిస్తాయో.. మనకు తెలియదూ?
***
కాసేపు, మన మహాభారతం తిరగేద్దాం.పోనీ,పోతన గారి మహాభాగవతాన్ని పరామర్షిద్దాం. అన్నిటికన్నా ముందున్నదిగా మనకు తెలిసిన ఆదిగ్రంథము రామాయణంలోకి తొంగి చూద్దాం.
కౌరవ పాండవులు యుద్ధం మొదయ్యింది ద్రోణాచార్యుల గారి బడిలో..కర్ణుడి శాపానికి ఏకలవ్యుడి గురుదక్షిణలూ .. బడితో ముడిపడిఉన్నాయి.ఇక, చండామార్కుల వారి బడి సంగతి సరేసరి. ప్రహ్లాదుడి వటి.. చదువుల్లలెల్ల సారం చదివిన "శిష్యుణ్ణి మనకు ఇచ్చింది.ఇక, విశ్వామిత్రుని బడిలో చదివిన రామ లక్ష్మణుల ముచ్చట్లు మనం ఎంత చెప్పుకున్నా తనివి తీరదు కదా?
***
మన లాంటి వాళ్ళ సంగతి ,కాస్త అటుంచండి. దృతరాష్ట్ర,హిరణ్యకశ్యప,దశరథ ..మహారాజులు మంచి గురువులను ఇంటికి రప్పించగలిగే వారు కాదా? వారి పిల్లల ముద్దూ ముచ్చట్లు చూసుకొంటూ.. ఇంటనే చదువులు చెప్పించలేక పోయే వారా? రాచబిడ్డలను బడిలో వేయడానికి ఎందుకు నిర్ణయం తెసుకొన్నారో మరి!
***
బడిలో నేర్చుకొనేది .. నాలుగు అక్షరం ముక్కలనే కాదు.
మంచినీ చెడునూ.. ! పలువురితో కలిసిమెలిసి మెలగవల్సిన తీరునూ..!
మన మొట్టమొదటి సామాజీకరణ.. సాంస్కృతీకరణ...జరిగేది బడిలోనే!
అందుకే కదా మనం అంటాం, చదువూ సంస్కారం అనీ.
నాలుగు పుస్తకాలు కంఠతా పడితే అక్షరాలు వస్తాయేమో.. అదే బడిలో పెడితే.. అక్షరాలతో పాటు ఎన్నెన్ని నేరుస్తామో! తమ ఈడు పిల్లలతో ఆడుతూ పాడుతూ.. అల్లరిచేస్తూ...!
మరి..బడి జీవితం లేని బాల్యం..మంచిదని ఎలా చెప్పగలం? కదండీ?

All rights @ writer.
Title,labels, postings and related copyright reserved.