Jul 6, 2015

చీరకట్టు...గోచిపట్టు !

Ladies of TANA 2015, with million dollar smiles. @ Ramarao Kanneganti
మా నాయనమ్మ  నూలు చీరను గోచిపోసుకొని చీరకట్టి, వడ్లు దంచి , పిండి విసిరి అన్నం వండి, రాట్నం వడికిన  మనిషి.
మా ఆమ్మ (పెద్దమ్మ) చేనేత చీర కుచ్చిళ్ళు ఎత్తి దోపి , చెంగును నడుమున బిగించి .., పాడిపంటను ఇంట నిలిపిన మనిషి.
మా అమ్మ   పొందికగా ఖద్దరు చీర కట్టి,ఒద్దికగా ఉమ్మడి కుటుంబంలోని బిడ్డలందరినీ  చదివించుకొని... పట్నవాసపు  నీడలో అభిమానవతి, ఆతిథేయి , పల్లెకు వెళ్ళినప్పుడు పాడి పంటల బాగోగులు ,పట్నాన ఉన్నప్పుడు, వ్యాపార వ్యవహారాల్లో జమాబందీల నిర్వహణలో పాలుపంచుకొన్న మనిషి.
మా అమ్మాయిమణి తెల్లకోటు వేసుకొని జుట్టుబిగించి కట్టి ,  ఒక చేత్తో స్టెత్తూ మరో చేత్తో కత్తీ పట్టుకొని ప్రాణాలు నిలబెట్టాలని ప్రయత్నిస్తోన్న  ... యువతి.
ఇక, నేనంటారా .... కలం  చేత పట్టి, కుర్తా పైజామాలు కట్టి , చేతనయినంతలో..పిల్లల్లో పల్లెల్లో పట్నాల్లో అక్షరాల విత్తులు నాటేస్తూ   పోవాలనుకొనే మనిషిని కదా..

ఇదంతా ఎందుకు చెపాల్సి వచ్చిందంటే...
ఒక ఫోటో చూసి , ఎందరు పెద్దమనుషులు ... వారి చీరకట్టు జుట్టూబొట్టుల  గురించి మాట్లాడారో...!
పెద్దమనుషులకి గోచిపట్టు నుంచి తెల్లకోటు దాకా జరిగిన దేశకాల సీమితమైన మార్పులు చేర్పులు కనబడక ఫొవడం ...గురించి ఏమని వ్యాఖ్యానిస్తాం?

మా నాయనమ్మ గోచి కట్టి వడ్లు దంచినా,  మా అమ్మాయి  కాటన్ జీన్సు ప్యాంట్లు వేసి ప్రాణాలు నిలబెట్టినా...అది వారి వారి పనుల పట్ల గౌరవమూ బాద్యతా...వారి మర్యాదా మన్నన, పై నుంచీ అందమూ చందమూ. 

ఆయా తరాలకు తగ్గట్టు  అందరమూ పాటించింది 
పని సౌకర్యమూ , వాతావరణానికి అనుకూలమూ ,సౌందర్య  దృష్టీ కలిగిన నిండయిన  బట్టలే...! అంతెందుకు ... ఇవ్వాళ్టికీ  ,పండగొచ్చినా పబ్బమొచ్చినా  మన సంప్రదాయల కట్టూ బొట్టులను  కాపాడాలంటే, కొంగు బిగించి నిలబడేది ఎవరూ ?
ఏమైనా,  మేము మా సూటుబూటుల తాతయ్యల తరానికన్నా ఎంత వెనక బడిఉన్నామో..! 
ఇక, ఈ ఫోటోలోని వ్యక్తులందరూ  మహిళలే !తెలుగు వారే! వ్యక్తులుగా వారిని గౌరవించడం , మంచీ మర్యాదలతో మహిళలుగా సంబోధించడమే కదా మన సాంప్రదాయం !
 వారి కట్టూ బొట్టు లను  కాదు మనం చూడాల్సింది ! .
దేశంకాని దేశాల్లో ... తాతముత్తాతలు ఎరగని  నేర్వని పనిపాట్లలో నెగ్గి నిలబడిన ... వారి ముఖాల్లోని విజయ దరహాసాలను  మనం చూడాల్సింది... వారి జీవితం జీవనం కలిగించే ప్రేరణను మనం చూడాల్సింది ! 
మనిషిని మనిషిగా గౌరవించడమే... మనం నేర్వాల్సింది ! 
మన పిల్లలకు ఆదర్శంగా నేర్పాల్సింది !
అక్కడ కనబడే మనుషులు..... కేవలం మనం ఆశించిన తీరులో మనం కోరుకొన్న కట్టూబొట్టుల్లో కనబడాల్సిన చాయాచిత్రాలు కారనీ  , జవజీవాలతో కళకళలాడే...చేతనాభరిత మానవులనీ మనం గ్రహించాలి!
***
వ్యక్తిగతం గాను, వృత్తిపరంగాను,
వ్యవహారదక్షతలోనూ,సామాజిక దృక్పథంలోనూ,

అమ్మలుగా, ఆతిదేయులుగా,
సహచరులుగా ...స్నేహితులుగా,

సభ్యతా సంస్కారాలకు ...
మర్యాద అభిమానాలకు 
చిరునామాల్లా ...


వీరిని మా పిల్లలకు ...
సగర్వంగా సంతోషంగా పరిచయం చేస్తాము !
రవ్వంత సందేహమూ సంశయమూ లేకుండా... !


***

All rights @ writer. Title,labels, postings and related copyright reserved.