Jan 29, 2011

కలానికో మేలిముసుగు


(అఖిల భారత తెలుగు రచయిత్రుల మహాసభలు ,మార్చి,2002 ,తెలుగు విశ్వవిద్యాలయం ,ప్రసంగ పాఠం నుంచి ఇంకొంత)

జీవితం అంటే జీవనం అంటే కేవలం నలుపు తెలుపు కాదు.
ఆ రెండింటి నడుమ వెల్లి విరిసిన అనేక వర్ణాల సమాహారం.
ఆ భిన్నత్వాన్నంతా రంగరించి ఒక రచనలో ఆవిష్కరించడం అంత సులువు కాదు.
పైగా, చెప్ప దలుచుకొన్నదేమిటో  సూటిగా చెప్పడం వ్యాసంలోను ఉపన్యాసంలోను వీలవుతుంది. కాల్పనిక రచనలో విషయాన్ని తేటతెల్లం చేయడం వీలవదు.

చెప్పదలుచుకొన్న విషయం కథగా పాత్రలుగా సన్నివేశాలుగా సంభాషణలుగా భావచిత్రణగా నాటకీయంగా విస్తరించి సృజియించినపుడు - అందులోని వస్తువు అంతర్లీనమై పోతుంది. అస్పష్టమైపోతుంది. అగోచరమై పోతుంది.ఒక్కోమారు అంతర్ధానమై పోతుంది.
అందుచేతనే, రచయిత సృజనాత్మకతతోనే కాల్పనిక రచన పూర్తి కాదు. పాఠకుని సృజనాత్మకత తో... ఆ రచనలో అంతర్గతంగా ఉన్న విషయాన్ని ఆవిష్కరించుకొని ..అందులోని అంతరార్ధాన్ని ఆకళింపు చేసుకొన్నప్పుడే -
ఆ రచన పూర్తవుతుంది.

పాఠకుని సృజనాత్మకతతో పాటు అతని విజ్ఞత,రసజ్ఞత తోడయితే పాఠకును అవగాహన కళాపూర్ణమవుతుంది.
రచయిత దృష్టి సృష్టి అవగతమవుతాయి.రచయితకూ పాఠకుడికీ నడుమ భావసారూప్యం సామ్యమవుతుంది.
అయితే, రచయిత చెప్పదలుచుకొన్న విషయం పాఠకుడు గ్రహించే విషయం ఒక్కటి కాకుండాపోయే అవకాశం లేక పోలేదు.

కాల్పనిక రచనలోని గోప్యతతో ఇదే చిక్కు.
ఉదాహరణకి "రేగడి విత్తులు" నవలలో హరితవిప్లవ ప్రభావం ప్రకృతిపై ఎలా ప్రసరించిందో తెలియపరచడానికి నేను వర్ణనలను మాధ్యమం గా చేసుకొన్నాను.
కొందరి అభిప్రాయం ప్రకారం ఆ నవలలో వర్ణనలే అధికం .అసంధర్భం.అనవసరం. .

నా దృష్టిలో ..హరిత విప్లవం బాగోగులు కథావస్తువైన ఆ నవలలో పర్యావరణం ప్రధాన అంశం.


సృజనాత్మక రచయిత చెప్పదలుచుకొన్న విషయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పే వీలు లేదు.
డొంకతిరుగుడే రచనా మార్గం!
నిగూఢత కాల్పనిక కలాన్ని కప్పి వుంచే మేలిముసుగు.
 
ప్రచురణ:మిసిమి ,జూన్ 2002

*
 All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

Jan 26, 2011

సాహితీ సృజన ..నా ఎరుక


(అఖిల భారత తెలుగు రచయిత్రుల మహాసభలు ,మార్చి,2002 ,తెలుగు విశ్వవిద్యాలయం ,ప్రసంగ పాఠం నుంచి కొంత)

ఏ నియమాలకు లోబడని... ఏ నిబంధనలకు ఒంగని..
ఏ సమీకరణాలలో ఇమడని ..ఏ సిద్ధాంతాలకు లొంగని..
ఏ చట్రంలో కుదించని ఏ తరాజులో తూగని ..
మానవుడినీ అతని జీవితాన్ని అతని జీవనాన్ని అర్ధం చేసుకొనే ప్రయత్నంలోనే,
సాహిత్యం సృజనాత్మకమవుతుంది.
సృజనాత్మకత జన్మతః అబ్బిన కళ.
అది ఒక్కోరిలో ఒక్కో రూపంలో బహిర్గతమవుతుంది.
మాటలో చేతలో ..వంటలో పంటలో ...కొన్నిటిలో అన్నిటిలో... ఎంతో కొంత అంతో ఇంత ప్రకటితమవుతూనే ఉంటుంది.

అక్షర రూపంలో సృఅజనాత్మకత ను వెల్లడించుకోగలనని అందరివలెనే నేనూ ఆకస్మికంగా గుర్తించాను.
నాలోని ఆలోచనా పరంపరను గాఢానుభూతిని ఇతరులతొ పంచుకోవడానికి నాకొక ద్వారం తెరుచుకొంది.
నా వేదననీ నా శోధననీ సాధననీ వ్యక్తపరుచుకోవడానికి నా ముందొక మార్గం గోచరమైంది.
వాక్యం నా వ్యాకరణమైంది.పదం నా పథమైంది.  అక్షరం అభివ్యక్తి అయ్యింది.

పిల్లలు పిట్టలు పువ్వులు రంగులు ఆటలు పాటలు పదాలు పలుకుబళ్ళు -నన్నెంతో అత్మీయంగా ఆకట్టుకొంటాయి.
బిన్నప్రాంతాలతో భిన్న సంస్కృతులతో నాకున్న సజీవ సంబంధాల వలన ,అనేకానేక స్వభావస్వరూపాలను స్వయంగా పరిశీలించే అవకాశం నాకు లభించింది.

ఆ భిన్నత్వం లోని లోతుపాతులను తరిచి చూడడం అంటే నాకు ఆసక్తి.
ఆ విభిన్న జీవన శైలులలోని రీతులలోని తీరులలోని అంతరాంతరాలను అన్వేషించడం నా అభిరుచి.
ఆ అన్వేషణలో కలిగిన ఆనందాన్ని రగిలిన ఆవేదననూ నా రచనలలో సమీకృతం చేసుకోవాలన్నది నా అభిలాష.

రచన కోసం ఒక వస్తువును ఎంపిక చేసుకొన్న తరువాత, ఆ విషయాన్ని రాయడానికి ముందుగా దానిని అర్ధం చేసుకోవాలని నేను ప్రయత్నిస్తూ ఉంటాను.
ఆ విషయంపై నాకు అవగాహన లేనిదే స్పష్టత రానిదే  ,నా రచనలో గాఢత ఉండదని నేను భావిస్తాను.

ఆవస్తువు యొక్క చారిత్రక నేపధ్యాన్ని ,తాత్విక పునాదుల్ని ,ఆర్ధిక అంశాల్ని,సాంఘిక దృక్పథాన్ని ,రాజకీయచైతన్యాన్ని కార్యకారణ సంబంధాన్ని ,అనేకకోణాల నుంచి అధ్యనం చేయడం నాకు అలవాటు.
*
ప్రచురణ:మిసిమి ,జూన్ 2002

 All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

Jan 15, 2011

సంక్రాంతి ప్రత్యేక ప్రచురణ .

శుభ సంక్రాంతి
మీకు 
మీ కుటుంబానికి. 
*
ప్రభవ పిల్లలలకు జేజే - కథారచనలో ప్రథమ బహుమతి పొందిన
 ప్రణవ్ కథ  సంక్రాంతి ప్రత్యేక ప్రచురణ .
 మీరు మీ కుటుంబం, మీ బంధుమిత్రులు
 సంతోషంగా సంక్రాంతి  గడపాలని కోరుతూ ....
ప్రణవ్ కు అభినందనలతో.
 To Live Forever 

అన్నట్లు , ప్రణవ్ రాసిన చిన్ని కవితనూ మీరు లోగడ చదివారు. 
మరో మారు ఇక్కడ చదవండి.
http://prabhavabooks.blogspot.com/2010/11/dont-want-to-miss.html



వారానికి ఒక మారు. ప్రతి శుక్రవారం. తప్పితే ఆ మరునాడు ! All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

Jan 9, 2011

అలవోకగా వచ్చి

మా తిరుమలదేవుని గుట్ట బడికి ఆడుతూపాడుతూ బయలుదేరినట్లు గుర్తులేదు.
మా  మూడు గదుల ఇంట్లో  ఏమీ చదవనని మొండికేసిన మా  పెద్దమేనత్త కుమారుడి దగ్గర్నుంచి ,
చదువుకోసమని అమ్మని వదిలివచ్చిన పెదనాన్న మనవడి వరకు ఏడెనిమిది మంది పిల్లాపెద్దలు.
తెమలని పని మధ్యలో, 
పొద్దున్నే బడికి బద్దకించే నా బోంట్లకు ,
 అమ్మ చీవాట్లు మొట్టి కా యలు.
బడికి తలుచుకోగానే , మల్లమ్మ టీచరు వేయించే ముక్కుచెంపలు ,గోడకుర్చీవేయించే లింగమ్మ టీచరు ,గుర్తొచ్చి ముచ్చెమట్లు పట్టపట్టవూ పొద్దున్నే !
చెక్క స్కేలు తీసుకొని వేళ్ళమీద కొట్టారో ఇక అంతే సంగతులు!
వెళ్ళకపోతే అమ్మ... వెళితే టీచరమ్మ .
ఎట్లైనా పొద్దున్నే  నా లాంటి పిల్లలకు దెబ్బలు తప్పేవి కావు కదా!
ఈ మధ్యలో బడి.
మా ఒకటీ రెండూ తరగతులు ఎప్పుడూ చెట్ల కిందే.
మా బడి చుట్టూ కంచెలా పెరిగిన తుమ్మచెట్లు. బడికి వెళ్ళినా తీసుకెళ్ళిన మట్టిపలకలలో ఒక్కటన్నా ఒక్కరిదన్నా పగులు లేకుండా ఉండేది కాదు.
 ఊరికే పగలకొట్టుకొనే వాళ్ళం. పలకముక్కలతోనే బోలెడు మంది ఒకటోతరగతి గటేక్కేవారం.
మా అసలు పలక వేరే ఉంది. బాసింపట్ట పెట్టుకొని నేల మీద  కూర్చుని ,  
 ఇసుకను చదరంగా తట్టి ,
పలకలా చేసుకొని ,వేలితో రాసుకొనే వాళ్ళం.హాయిగా తోచినప్పుడు చెరిపేసుకోవచ్చు. 
మళ్ళీ తట్టుకొని చదరంగా చేసుకోవచ్చు.
సరిగ్గా అట్లా రాసుకొంటున్నప్పుడే ,గాలిలో గింగిరాలు కొడుతూ ,
అలవోకగా వచ్చి వాలేది మా ఇసక పలకపై వాలేది ...
ఒక పొన్న పూవు.
తొడిమ చివరి చిరుతేనెను చప్పరించే వాళ్ళం చప్పరిస్తే, బాకాలు ఊదే వాళ్ళమేమో పీపీప్ అంటూ బుద్ధిగా ఆ పని మీదుండేవాళ్ళం.పొన్నాయి చెట్టు కింద సన్నాయి మోగించేవాళ్ళ హడావుడి కొరకు  బెల్లు కొట్టే దాకా ఆగాల్సిందేగా.

ఇక, అందరికన్నా నాలుగాకులు ఎక్కువ చదివిన మా సబిత ,
కొనవేళ్ళ తో పూరేకులను నలిపి, గాలి ఊది, చటుక్కున పక్కనున్న అమ్మాయి 
బుగ్గమీదనో బుర్రమీదనో టప్ మని పించేది! 
జడుసుకొని కెవ్ మందామా అంటే ,మా టీచరమ్మ చేత బెత్తం! 
ఇటేమో ముసిముసి నవ్వులు చిందిస్తూ సబిత!
 
బెదిరిపోతే సబిత పకపక నవ్వేది.
తనేమో , బుగ్గలు వూరించి తన బుగ్గ మీద తనే టప్ మనిపించుకొని , తనే నవ్వేది.

ఇక, రేఖ పూలన్నిటినీ వళ్ళో పోసుకొని , కాడలను జడ అల్లినట్లుగా అల్లి మాల చేసేది.
తన కేమో , బోలెడు పూలు కావాలి .

ఇంకేముంది. సబిత తను కొట్టుకోమంటే కొట్టుకోరూ మరీ.
ఇసక మీద పొర్లి. జుట్టు జుట్టు పట్టుకొని. జడలు పీక్కుని.
తరగతంతా సహజం గానే అటో ఇటో చేరి పోయే వారం.

ఇక, ఆకాశం లోనుంచి  రాలినట్లు ఒక పూవు అలా గాలిలో తేలుతూ నేల వైపు సాగగానే, 
ఇక టీచరూ  లేదు.చింత బరికె లేదు. గోడ కుర్చీ లేదు.ముక్కు చెంపలూ లేవు.
పరుగో పరుగు.

దొరికిన వారికి దొరికినంత.
దొరకని వారు ఇసుకలో పడి ఒకరి చొక్కాలో జుట్లో పట్టుకొని కొట్టుకోవడమే.

ఇక ఏం చేస్తాం?

పొన్న పూల కాలంలో పిల్లలమంతా ఎంత తొందరగా వీలయితే , 
అంత తొందరగా బడికి పురుగులు పెట్టేవాళ్ళం.
రాలే పూలను రాలినట్టే .ఎవరికి అందినవి వాళ్ళం దొరక పుచ్చుకొనేవాళ్ళం.

నేను, పుష్ప ఒక జట్టు.

ఇక ,మా బాలవ్వ మాకు తగ్గదే.
మీ తుమ్మ చెట్ల నడుమనున్న కాలిబాటను ఎప్పటికన్న కాస్త ముందుగానే ముళ్ళ కంచె అడ్డం వేసేసేది.
" ఘనా ఘనా సుందరా "పాటయ్యే లోగా బర బరా ,బడంతా ఊడ్చేసేది.
ధనధనా గంట కొట్టేసేది.
మేం జుట్టుజుట్టు పట్టుకొన్నా , పండు కొట్టుకొన్నా కచ్చి కొట్టుకొన్నా ఆ సంబరమంతా బడి గంట కొట్టే దాకానే కదా?
మా బళ్ళో ఉన్నవి రెండే రెండు పొన్నచెట్లు.మా బడీలో నేమో బోలెడు మంది పిల్లలము.
(ఎంత మందిమో గుర్తులేదు నాకు.)
ఒక చెట్టు కింద ఒకటో తరగతి. రెండో  దాని కింద రెండో తరగతి. మూడోతరగతి వాళ్ళకేమో రేకుల గది ఉండేది . వానాకాలం మమ్మల్ని చూసి తెగ నవ్వే వాళ్ళు కదా , పలకలెత్తుకొని అటూ ఇటూ పరిగెడుతుంతే. 
ఇప్పుడు ,ఆ సరదా మాది. ఒక్కో పూవు చేతికి చిక్కగానే దూరం నుంచే చూపించి ఊరించి ఊరించి అంతకు అంత పూర్తి చేసే వాళ్ళం!
మాకున్నది ఇద్దరు టీచర్లే . 
అన్నం బెల్లు దాక ఒక తరగతికి ఒక టీచరు , 
అదే ఒకో పొన్న చెట్టు కిందికి , .

తరువాతా అటు ఇటు మారే వారు.
పొద్దున్న లింగమ్మ టీచర్ వచ్చేవారం మాకు హాయి. 
ఎవరికి వాళ్ళం "సకులం ముకులం" పెట్టుకొని ,అక్షరాలు దిద్దడమో ఎక్కాలు గుణింతాలు పద్యాలు బిగ్గరగా చెప్పడమో చేసేవాళ్ళం.

అప్పుడు నిశ్శబ్దంగా మా మీద, మా చుట్టూ ఒక్కో పొన్నపొవు సుతారం గా వచ్చి వాలేది
.వాటితో పాటే అప్పుడొక ఇంకా విరియని మొగ్గా ,చిన్నచిన్న రెమ్మలు,పుడకలు,ఎండుటాకులు రాలుతూ ఉండేవి.
కదిలినట్టే టీచరమ్మ కనిపెట్టకుండా ,గబుక్కున వాటిని సేకరించి వళ్ళో  దాచుకోవడం భలే సరదాగా ఉండేది.
గంట కొట్టగానే ,పూలన్నీ రేఖకిస్తే మాలల్లేది.
మొగ్గలన్నీ సబితకిస్తే ,"బుడుక్ బుడుక్ "మని  బుగ్గల మీద పూలబుడగలు పగలకొట్టేది.
నేనూ పుష్పా మొదట పూల మాల అల్లడం నేర్చుకొంది పొన్న పూల కాడలను జడ అల్లడం తోనే.
ఎన్నాళ్ళీ సరదా?
 పున్నాగపూల కాలం సాగిందాకా నేగా!

మొన్నామధ్య రిషీవ్యాలీకి వెళితే , చెట్టుచుట్టు రాలిన పూలు ఇలా తివాచీ పరిచాయి.ఒక బాట బాటంతా దట్టంగా పూలు రాలి ఉంటాయి.అక్కడి వాటిని కదిలించరు. వాటి పాటికి వాటిని వదిలేస్తారు. 
నేనూరుకొంటానా ? మీకోసం ఇలా పట్టుకొచ్చా! 
అబ్బా ..ఎంత కమ్మటి వాసనో!

అక్కడి వారు వీటిని ఆకాశ మల్లెలు అంటారు.ఈ ఆకాశమల్లెల బాట మలుపులో నిలబడగానే, నాకు మాతిరుమలదేవుని గుట్ట బడీ, అక్కడ పాఠం పాటికి  పాఠం సాగుతుండండగా మాపై వయ్యారం గా వచ్చి వాలిన పొన్నపూలే గుర్తు రావూ మరి.
మా మల్లమ్మ లింగమ్మ టీచర్లు అంతగా  కోప్పడే వారు కదా, 
రేఖ పొన్నపూల మాల ఇస్తే, తెగ మురిసిపోయే వారు.
వారి ముఖాన నవ్వులదొంతరలు పూసేసేదీ
పొన్నలకాలంలోనే !

అన్నట్లు,
నా అడపాదడపా రచనలలో అక్షరాల మాటున అదాటున ఎప్పుడైనా  మీకు ఆకాశమల్లెలు అగుపడితే ,
అవి మా తిరుమలదేవుని గుట్ట బడిలో నేను సేకరించినవేనని గుర్తుంచుకోండేం !
***
All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

Jan 8, 2011

నీలకాంతాలు

పేరుకు ఇవి డిసెంబరాలే. 
 కానీ ,ఇదుగోండి ఇప్పుడు పూస్తున్నాయి ! 
ఆకుపచ్చని పొత్తిళ్ళ లో దాగి,
 ఎలా తొంగిచూస్తున్నాయో చూడండి.
చెట్లెక్కి కొమ్మల్లో ఊగుతూ 
కోతికొమ్మచ్చులో దాగుడు మూతలో 
ఆడుతున్న అల్లరిపిల్లల్లా...!
చెరొక వైపు చూస్తూ ! 


 మంచుదుప్పటి వీడి, ఒక్కో మొగ్గా మెల్లిగా  విచ్చుకొంటోంది.
నీలం రంగు రెక్కలమీద 
పిల్లలెవరో వెలుగు రంగులేసినట్లు తెల్లటి తెలుపు రేఖలు!
నీలకాంతాలు అని పేరు పెడితే పోలా.
 అన్నట్లు ,బంగాళాబంతులు, చేమంతులూ  ,గరుడవర్ధనాలు కూడా పూస్తున్నాయండోయ్!



వారానికి ఒక మారు. ప్రతి శుక్రవారం. తప్పితే ఆ మరునాడు ! All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

Jan 1, 2011

శుభాకాంక్షలు.

మీ కొత్త సంవత్సరం సర్వదా సృజనభరితం కావాలని.. మీరందరూ క్షేమంగా పచ్చగా ఉండాలనీ..

మీరు బోలెడన్ని పుస్తకాలు చదవాలనీ.. పుస్తకాలు రాసేవాళ్ళు మరిన్ని పుస్తకాలు రాయాలనీ..
మీ ప్రయత్నాలన్నీ ఫలప్రదం కావాలనీ కోరుకొంటూ..నూతన సంవత్సర శుభాకాంక్షలు.
స్నేహంగా.


All rights @ writer. Title,labels, postings and related copyright reserved.