Jan 26, 2011

సాహితీ సృజన ..నా ఎరుక


(అఖిల భారత తెలుగు రచయిత్రుల మహాసభలు ,మార్చి,2002 ,తెలుగు విశ్వవిద్యాలయం ,ప్రసంగ పాఠం నుంచి కొంత)

ఏ నియమాలకు లోబడని... ఏ నిబంధనలకు ఒంగని..
ఏ సమీకరణాలలో ఇమడని ..ఏ సిద్ధాంతాలకు లొంగని..
ఏ చట్రంలో కుదించని ఏ తరాజులో తూగని ..
మానవుడినీ అతని జీవితాన్ని అతని జీవనాన్ని అర్ధం చేసుకొనే ప్రయత్నంలోనే,
సాహిత్యం సృజనాత్మకమవుతుంది.
సృజనాత్మకత జన్మతః అబ్బిన కళ.
అది ఒక్కోరిలో ఒక్కో రూపంలో బహిర్గతమవుతుంది.
మాటలో చేతలో ..వంటలో పంటలో ...కొన్నిటిలో అన్నిటిలో... ఎంతో కొంత అంతో ఇంత ప్రకటితమవుతూనే ఉంటుంది.

అక్షర రూపంలో సృఅజనాత్మకత ను వెల్లడించుకోగలనని అందరివలెనే నేనూ ఆకస్మికంగా గుర్తించాను.
నాలోని ఆలోచనా పరంపరను గాఢానుభూతిని ఇతరులతొ పంచుకోవడానికి నాకొక ద్వారం తెరుచుకొంది.
నా వేదననీ నా శోధననీ సాధననీ వ్యక్తపరుచుకోవడానికి నా ముందొక మార్గం గోచరమైంది.
వాక్యం నా వ్యాకరణమైంది.పదం నా పథమైంది.  అక్షరం అభివ్యక్తి అయ్యింది.

పిల్లలు పిట్టలు పువ్వులు రంగులు ఆటలు పాటలు పదాలు పలుకుబళ్ళు -నన్నెంతో అత్మీయంగా ఆకట్టుకొంటాయి.
బిన్నప్రాంతాలతో భిన్న సంస్కృతులతో నాకున్న సజీవ సంబంధాల వలన ,అనేకానేక స్వభావస్వరూపాలను స్వయంగా పరిశీలించే అవకాశం నాకు లభించింది.

ఆ భిన్నత్వం లోని లోతుపాతులను తరిచి చూడడం అంటే నాకు ఆసక్తి.
ఆ విభిన్న జీవన శైలులలోని రీతులలోని తీరులలోని అంతరాంతరాలను అన్వేషించడం నా అభిరుచి.
ఆ అన్వేషణలో కలిగిన ఆనందాన్ని రగిలిన ఆవేదననూ నా రచనలలో సమీకృతం చేసుకోవాలన్నది నా అభిలాష.

రచన కోసం ఒక వస్తువును ఎంపిక చేసుకొన్న తరువాత, ఆ విషయాన్ని రాయడానికి ముందుగా దానిని అర్ధం చేసుకోవాలని నేను ప్రయత్నిస్తూ ఉంటాను.
ఆ విషయంపై నాకు అవగాహన లేనిదే స్పష్టత రానిదే  ,నా రచనలో గాఢత ఉండదని నేను భావిస్తాను.

ఆవస్తువు యొక్క చారిత్రక నేపధ్యాన్ని ,తాత్విక పునాదుల్ని ,ఆర్ధిక అంశాల్ని,సాంఘిక దృక్పథాన్ని ,రాజకీయచైతన్యాన్ని కార్యకారణ సంబంధాన్ని ,అనేకకోణాల నుంచి అధ్యనం చేయడం నాకు అలవాటు.
*
ప్రచురణ:మిసిమి ,జూన్ 2002

 All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

No comments:

Post a Comment