Dec 28, 2010

అక్కడా ఇక్కడా

నేనెంతో  బుద్దిమంతురాలిని కదా,
 టీవీ లో నాన్ స్టాప్ నాన్చుడు   వార్తలు గట్రా చూడను!
చూసినా జడుసుకోను!
అయినప్పటికీ అడపా దడపా వ్రతభంగం తప్పదుకదా!

ఇందాక రెండు వార్తలు ఒక చానెల్ లో.
వెంట వెంటనే.

మొదటిది  భక్తుల దీక్షా విరమణ .
రద్దీ. రహదార్లు కిక్కిరిసిపోవడం .వాహనాల రాకపోకల స్థంభన.వగైరా వగైరా.

ఇక రెండోది .
నూతన సంవత్సర వేడుకలు. ఆ వ్యాఖ్యాత్రి గారు పరమౌత్సాహంగా "అంబరాన్ని అంటిన సంబరాల్ని" చెప్పి తరింపచేశారు.

చిత్రంగా ,
రెండింటికి వారు చూపించిన వీడియో క్లిప్పింగ్లు,
 ఒకేలా తోచాయెందుకో.

వేరు వేరు ప్రదేశాలు.
వేరు వేరు సంధర్భాలు.
వేరు వేరు కట్టు బొట్టు.

కానీ, 
అందరూ ఒకేలా తోచారెందుకో! 

గుంపులుగుంపులుగా .
ఒకరిని ఒకరు తోసుకొంటూ.
మూటాముల్లె మోసుకొంటూ.

నాన్నల భుజాలెక్కి ఎగిరిగంతులేస్తున్న చిన్ని బాబులు .
అక్కడా ఇక్కడా.

మరి మీకేమనిపిస్తుంది?
పారవశ్యమా ?
మరేదన్నానా?
 ***   


All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

Dec 21, 2010

కాలపు కుంచె కొసమెరుపు

 (శ్రీ అంపశయ్య నవీన్ గారి  "కాల రేఖలు" నవల కేంద్ర సాహిత్య ఆకాడెమీ అవార్డు పురస్కృతమైనప్పుడి రాసిన ప్రత్యేక వ్యాసం నుంచి  కొంత,మిసిమి లో ప్రచురితము.5-1-2005)
***
కాలపు కుంచె కొసమెరుపు
***
తెలుగు వారి జీవన చిత్రం కడుచిత్రమైనది.
కాలం వాలున రగులుతూ..నల్గుతూ.వెలుగుతూ..
కరాళమవుతూ..కలవరపడుతూ..కళకళాడుతూ..కమనీయమవుతూ..
ఎంతటి పరిణితిచెందిన సృజనశీలి ప్రతిభకైన అంతుపట్టక ఓ పెనుసవాలై కవ్విస్తుంది.
పట్టుబడీ పట్టుబడకుండా.
సూక్ష్మమై.. స్థూలమై... సమస్తకలారూప విన్యాసమై ..ఆంతర్యం అంతుబట్టే  లోపలే అంతర్ధానమై పోతుంది.
అందునా సామాన్యుని జీవిక!
బహుషా తెలుగునాట సమాన్యుని జీవితంలో జీవనంలో ఉన్నంత వైవిధ్యం ఇంకెక్కడా ఉండదు కాబోలు.
ఈ భిన్నత్వంలోని వెలుగునీడలు అంత సులభంగా అవగాహన అవుతాయా?
ఈ విపులత్వంలోని రంగులు చాయలు అంత సునాయాసంగా అర్ధం చేసుకోగలిగేవేనా? సరిగ్గా ఆ భిన్నత్వంలోనే  తెలుగు సంస్కృతీమూలాలు పదిలమై ఉన్నాయి.
సరిగ్గా ఆ విపులతత్వంలోనే తెలుగు సంస్కారశోభలు మూర్తిమత్వం పొందాయి.
అందుకు ఒక నిదర్షనమే....సామాన్యుడి జీవన చిత్రిక.
ఇంతకీ..
ఈ సామాన్యుడి చారిత్రక నేపధ్యం ఏమిటి? సామాజిక స్థాయి ఏమిటి?ఆర్ధిక ప్రమాణం ఏమిటి? భౌగోళిక మూలం ఎక్కడ? రాజకీయ సూత్రం ఏది? తాత్విక ప్రాతిపదిక ఏమిటి? భావపరిణితి ఏమిటి?
ఈ సామాన్యుడి వ్యక్తిగతమేమిటి?స్వంతప్రపంచం ఏది? జీవన స్థితిగతులు ఏమిటి?కుటుంబసంబంధాలేమిటి? సాంఘిక చైతన్యం ఏమిటి ?
అన్నిటికీ మించి..
కాలానుగత సామాజికపరిణామంలో సామాన్యుని పాత్ర ఏమిటి?
అన్ని ప్రశ్నలకు ఒకే సమాధానంగా నిలబడుతుంది ..నవీన్ గారి "కాలరేఖలు" నవల.
స్వేచ్చ సమతలతో పాటు సౌభ్రాతృత్వానికి ఉన్న ప్రాధాన్యతను బలంగా చాటి చెపుతోన్న ఈ నవీన చిత్రిక కాలపుకుంచె కొస మెరుపు.
"తెలంగీ బేడంగీ" అంటూ అణిచిపెట్టబడిన చోట ..పరాయిభాష పలుకుపై రాజ్యమేలుచున్న చోట ...తాగేనీరు ,కాసే కాయ ,పండిన పంట ,అబ్బిన అక్షరం ..స్వంతం కాని చోట ..క్షణక్షణం  లెక్కిస్తూ , అణువణువూ గుణిస్తూ బలవంతపు బానిసత్వంలో మగ్గుతుండిన చోట .. తెలుగు భాషాసంస్కృతులను ..సంస్కారసాంప్రదాయలను ..పదిల పరిచి ఉంచింది .."బాసాడని" ఆ సామాన్యులే!
నూట పాతికేళ్ళ క్రితం ,నవలాప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి సమకాలీన సామాజిక పరిణామాలను నిజాయితీగా భద్రపరిచి ఉంచింది తెలుగు నవల.
శ్రీ వట్టికోట ఆళ్వారు స్వామి గారి ప్రజల మనిషి ,గంగు నవలలు ,శ్రీ దాశరథి రంగాచార్య గారి మోదుగు పూలు ,జనపదం ,చిల్లరదేవుళ్ళు మొదలైన నవలలు ఆయా రచయితల సమకాలీన తెలంగాణా జీవన పరిణామాలను ,సామాజిక పరిస్థితులను ఉన్నత సాహితీ ప్రమాణాలతో తరతరాలకు అందించాయి.
"ఆంధ్ర మహా సభ నుండి  ఆంధ్రప్రదేశ్ అవతరణ వరకు విస్తృత తెలంగాణా జీవనచిత్రణే నవీన్ గారి "కాల రేఖలు" నవల. 

***
All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

Dec 19, 2010

“Oh ! Taramandal ! ”

 “Oh!Taramandal!”
It  just  happend. 
Our takeoff  to Taramandal!
At The Hindu Metroplus Theatre fest conducted at Hyderabad for last four days.

Taramandal is adopted from Sathyajith Ray short stroy ,Patol Babu Film Star.
Every actor has an ambition  to twinkle at least once in their life time in a galaxy  of talent, dreams, aspirations  and immense passion. So did Patol Babu  who dreams to be the King of the Stage.Exactly where the curtain raises and the play beigns.
Patol Babu , a fifty year old man ,got a chance to act in a feature film. Unexpected. Surprising.He accepts and acts. When the production manager wants to give Patol Babu a renumeration ,he is gone. Never seen .
Taramandal extends from Patol Babu  to many such unspoken simple people.
A very intelligent presentation and clever playwright  where “Acting is life “ for these different people ,with various backgrounds  and unique experiences .
 No wonder those half dozen actors made  the audiences quietly watch not only the bright  ,dim but, the invisible stars that never twinkled. Such a story with many failures may usually end up with sad  “O”s! 
But, the seriousness of the narrative is expressed in a very sensible and subtle humour.
Few actors presenting many faces would have been confusing if not for the amazing script and perfect planning. 
Congratulations to the actors for their brilliant performance.

http://www.google.co.in/search?sourceid=chrome&ie=UTF-8&q=taramandal+metroplus
Why did Patol Babu leave the shooting spot without collecting his renumeration?
Ray has his own observation.
Those who are interested to know this answer ,  please read the original story  in the link below.
http://www.satyajitrayworld.com/rayfiction/PatolBabu.pdf

***
All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

Dec 14, 2010

వీరి వీరి గుమ్మాడి !

"వీరి వీరి గుమ్మడి పండు..
వీని పేరేమి ?"
అమ్మ మాకు నేర్పిన ఆట అది.
మా తిరమల్దేవుని గుట్ట గేర్లో సందడిగా పిల్లలం ఆడుకొనే కుంటాటకు,చోరాటకు, లింగోచ్చకు  రైలాటకు..ఇది అప్పటి నుండి జత చేరింది.
మీరు ఆడే ఉంటారు కదా?
పిల్లలందరం బచ్చాలు వేసుకొని దొంగ ఎవరో తేల్చేసి ..అందరం గప్ చుప్ గా దాక్కోని..చూస్తుంటే , అమ్మ దొంగ కళ్ళు మూసి .. మాట అంటుండగా మాలో ఒకరం వెళ్ళి ముక్కు గిల్లేసి వచ్చేవారం. ఇక కళ్ళు తెరిచిన దొంగ అదెవరో కనుక్కోవాలి.ఇక, పిల్లల సందడే సందడి.
వీరి వీరి గుమ్మడి పండు..వీని పేరేమి ...అంటూ!
అనుకుంటాం కానీ , ఇది మూసిన కళ్ళు మూసి ఉండగానే మిగిలిన జ్ఞానేంద్రియాల సాయంతో ముక్కు గిల్లిన వారెవరో గ్రహించాలి. నిజం చెప్పాలంటే , నా మట్టుకునాకు, నా ముక్కే సాయానికి వచ్చేది!
 గిచ్చిన వారి అరచేతి వాసన బట్టి ..కదలికల సవ్వడి ...కొసవేళ్ళ స్పర్ష .. ఇలా మిగిలినవన్నీ తోడయ్యేవి.
ఇప్పుడు చెప్పండి.
"వీరి వీరి గుమ్మాడి  ..దీని పేరేమి?"చప్పున చెప్పలేరా?
బాగా చూడండి.
ఇట్టే చెప్పేయ గలరు!మొన్నీమధ్య కొండదారిలో వేగంగా మలుపు తిరుగుతుంటే, కళకళలాడుతూ నా కళ్ళ బడ్డాయి..
విరిసిన  పసుపుపచ్చపూలు.
కారు కిటికీలోంచి వేగంగా కదిలిపోతుంటే, ఉండబట్టలేక ఆగి చూద్దును కదా... 
దారి పక్కనంతా అల్లుకు పోయిన తీగ... విరబూసిన పూలు!


 అప్పటికింకా మంచుతెరలు వీడలేదు.మెల్లి మెల్లిగా సూరీడు దట్టమైన పొగమంచును దాటుకొంటూ ..ఒక్కో వెచ్చటి అడుగు వేస్తున్నాడు.
తీగ లాగుతూ డొంకంతా కదిలించేసా. అది చెరుకుతోటలోకి దారి తీసింది. ఎవరో రైతు గట్టు మీద వేసిన గుమ్మడి ..ఇలా దారంతా బంగరుపూలు పూయించేసిందన్న మాట!
అవునండీ,ఈ తెర మీద విరబూసింది ..అక్షరాలా ఆ గుమ్మడి పూవే!
ఆకుపచ్చని చేలగట్లమీద పొంగుబంగరు గుమ్మడి పూలు ఎంత సొగసుగా ఉన్నాయో కదా!
ఒక్క సారిగా గుర్తొచ్చింది.
పూసే కాలం వస్తే పూయవూ!
పండగనెల మొదలవ్వబోతోంది కదా!
ముచ్చటగా ముగ్గేసి... గొబ్బెమ్మను చేసి..పసుపుకుంకుమలతో సింగారించి...గుమ్మడి పూవు తురిమి ... బంతి చేమంతి పూలరేకులు చల్లి ..తమలపాకులో పంచదారో పటికబెల్లం ముక్కలో ఫలహారం పెట్టి ..మురిసిపోకుండా ఉండగలమా!
మొదటి రోజున ఒకటి, రెండో రోజున రెండు..పండగ నాటికి వాకిలంతా గొబ్బెమ్మలే!
ముత్యాల ముగ్గులన్నిటా బంగరుపూలు పూసేవి.వాకిట్లో విరిసిన ముద్ద బంతులతో చేమంతులతో పోటీలు పడుతూ
పొద్దుట గొబ్బెమ్మ కాస్తా ..సాయంకాలానికి గోడ మీద పిడకయ్యేది.భోగినాడు వెచ్చటి మంటయ్యేది.
"గుమ్మడి పువు మీద కుంకుమ పొడి ఛాయ  " అంటే బహుశా అదేనేమో.. శీతవేళల వెలుగు వెచ్చదనం కలగలిసి ..మన ఇంటి ముంగిట్లో మురిసేవేళ .వాకిట్లో వంటింట్లో ...అక్కడ ఇక్కడా అని లేకుండా.. సరిగ్గా సంక్రాంతి శోభ ..అదిగో అక్కడే మొదలయ్యేది.
చేలగట్ల మీది గుమ్మడిపూల  పలకరింపులతో  ..పకపకలతో... మొదలయ్యి .. .కొత్తబియ్యం పరమాన్నం , కమ్మటి గుమ్మడి కాయ కూరో పులుసో దప్పళంతోనో
పూర్తయ్యేది!
ఎప్పుడు  గుమ్మడి  కాయను కోయబోయినా పెద్దామ్మ ముక్తాయించేది...
కడివెడు గుమ్మడి కత్తి పీటకు లోకువని!
***
ఏడాదీ .. ఆ  పచ్చని బంగరు పూలు పూయవలసిన చేలగట్లు నీట మునిగి ఉన్నాయి
కల్లాం లోని కుప్పలువేసిన ధాన్యం తడిచి మొలకెత్తిపోయింది.కోతకు  దగ్గరపడిన వరి చేలల్లోనే చెదిరిపోయి ఉంది. త్వరలో మన నిలువునా నీట మునిగి ... తడిచి ముద్దయిన అన్నదాతల ఆక్రందనకు ఒక మార్గం దొరుకుతుందనీ.. 
సంక్రాంతి శోభ వారింట  చేరాలనీ ...బంగరుపూలు విరియాలనీ కోరుకొందాం!
షాపింగు మాల్స్ కూ రేడియో లకూ పరిమితమై పోక...
అహర్నిషలు టివి తెరలపైననే  కాక ...
చేలగట్లపై శోభిల్లే సంక్రాంతే సంక్రాంతి .
ఏమంటారు?
***
 All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

Dec 9, 2010

పాఠం వింటుంటే..!

పాఠాలు చెప్పేవాళ్ళంతా బుద్ధిగా పాఠం వింటుంటే..
వంచిన తల ఎత్తకుండా..చక చక వర్క్ షీట్లు పూర్తిచేస్తుంటే.. 
అడిగీ అడగక మునుపే ప్రశ్నలన్నిటికీ ..
ఉత్సాహంగా మేం ముందంటే మేం ముందని పోటీలు పడి మరీ.. సమాధానాలు చెపుతుంటే,
భలే ఉంటుంది కదా!


అంతే కాదండి..ఒకే వ్యవహారం లో ఉన్న వాళ్ళంత మొదటిసారిగా కలవడం, కొత్త స్నేహాలు ఏర్పరుచుకోవడం.. అనుభవాలు కలబోసుకోవడం... మరింత బావుంటుంది.
ఈ రోజటి , సూసన్ రస్సెల్ గారి ట్రినిటి కాలేజ్ లండన్ ( జి ఇ ఎస్ ఈ)  వర్క్ షాపు అచ్చం అలాగే ఉంది. కళకళ లాడుతూ .
అందులోను ,ఇది భాష ను నేర్పించడం అన్న మౌలిక భోధానంశానికి సంబంధించింది కనుక మరింత ఉత్తేజభరితంగా సాగింది.
సూసన్ గారు చాలా భిన్న నేపధ్యాలు కలిగిన వారికి ఒక విదేశీ భాషగా ఇంగ్లీషును నేర్పారు.అటు
అటు ఆస్ట్రేలియా నందలి వలస కార్మికులు ,శరణార్ధుల నుండి   ,బోస్నియా యుద్ధ భూమిలో క్షతగాత్రులకు, మిత్రసైన్యాల వరకు. హంగేరీ, స్వీడెన్ లతో పాటు  చైనాలోను భాషాభోధన చేశారు.  
అటు ఆస్ట్రేలియా నందలి వలస కార్మికులు ,శరణార్ధుల నుండి   ,బోస్నియా యుద్ధ భూమిలో క్షతగాత్రులకు, మిత్రసైన్యాల వరకు. హంగేరీ, స్వీడెన్ లతో పాటు చైనాలోను భాషాభోధన చేశారు.  పాఠశాలల నుండి శరణార్థుల శిబిరాల వరకు వారి పాఠాలు విస్తరించాయి.

లాంచెస్టర్ విశ్వవిద్యాలయం నుండి విదేశీభాషగా ఇంగ్లీషు భాషాబోధనలలో PhD అధ్యనం చేశారు.
 ఇక వారి అనుభవాలను తెలుసుకొని, మా సందేహాలను జోడించి ,సందడి  సందడిగా.. రోజంతా... 
అధ్యాపనలో సంతోషసంబరాలు...సాధకబాధకాలు  కలబోసుకొన్నాం !వారి భాషాబోధనమెళుకువల సారాంశం ఒకటే,


ఏదైనా విషయం మీద విద్యార్థులు మాట్లాడుతుంటే ,వారిని మాట్లాడనివ్వండి.వారిని ఆపకండి. వారి తప్పులు ఎత్తి చూపకండి.మాట్లాడం పూర్తి కాకమునుపే సరిదిద్దకండి.

 మొదట,  వారి భావ వ్యక్తీకరణ ఒక సహజ ప్రకటన గా ఉండేట్టుగా ప్రోత్సహించండి. తమ భాషావినియోగంపై విశ్వాసం కలగనీయండి.ఆపై భావవ్యక్తీకరణలో స్పష్టత ,ఆ తరువాత  , దోషరహితం చేసుకోవడం ఎలాగో నేర్పించండి.
తమ భావాన్ని మరింత బాగా ఎలా వ్యక్తపరుచుకోవచ్చునో  వారిని స్వయంగా తెలుసుకోనివ్వండి.
స్వయంగా సరిదిద్దుకోనివ్వండి "
**
వింటున్నారా?

ఇవన్నీ  ఏ భాషాబోధనకైనా ఒక మంచి సూచనేగా?

గమనించగలరు.

***
All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

Dec 2, 2010

ఆ...! అంటే , తెలుగొస్తుందా?

నోరారా పలకరించాలన్నా..
నోరూరించేలా కబుర్లాడాలన్నా..
నోరెత్తి అరవాలన్నా..
అమ్మ పలుకు పలికితేనే ముద్దు!

ఎటొచ్చి, ఈ నాటి బళ్ళలో ఇరుక్కొని , నానాటికీ చిక్కి పొతున్న మన మాతృభాష మాటెత్తామా ... 
ఇక అంతే!
దుమారం రేగుతుంది!
ఆవేశం పోటేత్తుతుంది!
అది అటు తిరిగి ఇటు తిరిగి... పిల్లల మీదకు వచ్చి వాలుతుంది!

అలాంటప్పుడే , పిల్లల నోట తెలుగు పలికించాలని ,పిల్లల చేత తెలుగు  గిలికించాలనీ   ...
తపనతో తాపత్రయంతో ఉపన్యాసాలు ఒలికించేస్తాం!
అనర్ఘళంగా. ఆగ్రహోద్రకాలతో. ఆవేశకావేషాలతో.

సరిగ్గా అలాంటి  గొప్ప తాపత్రయపు నేపథ్యంలో నుంచే ,మన నోట ఆశువుగా కొన్ని వాక్యాలు దొర్లి పోతూ ఉంటాయి.ఎవరైనా పిల్లలు  తెలుగు మాట్లాడుతుంటే ,
అలవాటో పొరబాటో ఏమరుపాటో ...
ఒక ఇంగ్లీషు పదం తొణికిందనుకోండి .ఏం చేయాలి?
"హేళన చేయండి!"
"ఆపు అపు అని అరవండి!"
"ఆపే దాకా కేకలు వేయండి!"
అంతటితో ఆగని ఆత్రుత మరో వాక్యం చేరుస్తుంది.
"చెంప మీద కొట్టండి!"
ఇంకా ఆవేశం వస్తే, మరో వాక్యం తయార్ !
"చెప్పుతో కొట్టండి!"
ఆగండాగండి.
ఇంత విడ్డూరంగా ఎవరు మాట్లాడుతాం? అనుకునేరు!
అలా మాట్లాడే భాషాభిమానులు కోకొల్లలు!
ఆ నోటితో నే అడక్కుండానే అమ్మలకూ ఒక ఉచిత సలహా వచ్చి వాలిపోతుంది!
"అమ్మలారా... మీరు అన్నం పెట్టక మాడ్చైనా , అలిగయినా  అనుకున్నది సాధించాలి!"
"భయపెట్టయినా బెదిరించైనా ..పిల్లలతో తెలుగు మాట్లాడించాలి!"
బావుందండి.
ఇదన్న మాట విషయం!
నిజమే .
ఏ విషయాన్నైనా  నయానా భయానా చెప్పమన్నారు కదా పెద్దలెపుడో!
అయినా, అనునయంగా చెప్పడాన్ని ముందుంచారెందుకంటారు?
బహుశా నయానా పిల్లలకూ, ఆ తరువాతి పదం మిగిలిన వారందరికీ అయుంటుందని నా అనుమానం!
ఎందుకంటారా?
ముద్దారగ నేర్పిన ముద్దు బిడ్డలు నేర్వగలేని విద్య కలదే ?అన్నరొక పెద్దలు ఎప్పుడో!
అందుకని ,ఇప్పటి పిల్లలతో సన్నిహితంగా కాసేపు గడిపి ,ఆపై మెల్లిగా అడిగి చూడండి. తెలుగు మాట్లాడడానికి ,వాడుకకు వారికున్న సాధకబాధకాలేమిటో!

మొదటి జవాబు:
ఎవరితో మాట్లాడాలి ?
అమ్మతోనా?నాన్నతోనా?టీచర్లతోనా?స్నేహితులతోనా?
తరువాతి జవాబు:
ఎక్కడ మాట్లాడాలి?
ఇంట్లోనా?బడిలోనా? బజారులోనా? షాపింగ్ మాల్ లోనా?
ఆ పై జవాబు:
ఎందుకు మాట్లాడాలి?

మీకు చిర్రెత్తుకొస్తుందని నాకు తెలిసి పోయింది
జవాబులంటూ ..ప్రశ్నలు గుప్పిస్తున్నానని !
కదూ?

నిజమండి.
ఒకమారు తెలుగులో కథలు రాయించే ప్రయత్నం లో ఉండగా ,
ఒక విద్యార్థిని అన్ని ప్రశ్నలను ఇమిడ్చి ఒకే ఒక సూటి ప్రశ్న వేసింది.
"అక్కా, అసలు నేనెందుకు తెలుగు నేర్చుకోవాలి? మా ఇంట్లో మా అమ్మమ్మ తరం వారే ,తెలుగులో మాట్లాడరు.తెలుగు పత్రికలు చదవరు. తెలుగు సినిమాలు ,ఛానెళ్ళు  చూడరు. ఎవరైనా ఇంటికి చుట్టాలొస్తే తెలుగులో పలకరించ బోతే , మా ఇంగ్లీషు ప్రావీణ్యతను పరీక్షకు పెడతారు. అటు ఇటైనా ,మాకు మా బడికీ , అక్షింతలు ! షాపింగ్ కు వెళితే ,అక్కడా ఇంగ్లీషుతో పనయి పోతుంది. ఇక, నేనంటూ తెలుగులో మాట్లాడేది మా ఇంటి పని మనుషులతో ,  డ్రైవర్ తోనూ. ఆ మాత్రం తెలుగు నాకు వచ్చు. అంతకు మించిన తెలుగు నాకెందుకు ?"

నిజమే మరి.
మేమేమో తీరిగ్గా కూర్చోబెట్టి ..ఏకంగా తెలుగులో కథలు రాయమంటిమి!
ఆ అమ్మాయి మాటల్లో నిజం ఉంది.నిజాయితీ ఉంది.
వాటికి మనం ఇచ్చే జవాబుల్లోనే ,మన భాష మనుగడ ఉంది!
ఏమంటారు?

మరి అరుదయిపోబోతున్న అంతరించిపోబోతున్న ..ఒక అద్బుత భాషకు వారసుల్లా...అందరిలోనూ తెలుగభిమానం అంతో ఇంతో పెల్లుబుకుతున్నదన్నది సత్యమే!
అది వీరాభిమానంగా విరుచుకు పడుతున్నదండం అంతే సహజం.

కాస్త నిదానించి చూద్దాం.

ఈ నాటి బడిపిల్లల్ని ఎవరినైనా పిలిచి కాసేపు తెలుగులో మాట్లాడమంటే , ఎంత లేదన్నా వాక్యానికోక ఇంగ్లీషుపదం దొర్లక తప్పదు!దానికి గల చారిత్రక కారణాలను పక్కకు బెట్టి, 
మనం "హేళన చేసి ,భయ పెట్టి ,బెబేలు ఎత్తిస్తే.."..
ఆ పిల్లలకు తెలుగొస్తుందా?

అసలే పిల్లల్లో ఎన్నెన్ని అపనమ్మకాలో .
"మంచి తెలుగు మాకు రాదు. స్పెల్లింగులు రావు .చెప్పాలనుకొన్నది సరిగ్గా చెప్పలేము.భాష బాగా లేదు.  వత్తులు గుణింతాలు తప్పుతాయి. మేం చెప్పేది మీకు అర్ధం కాదు..."
ఇలాంటి అనేక అపనమ్మకాలు వారి తెలుగు వాడుకం మీద వారికున్నాయి. వాటి నుంచి వారిని బయట పడేస్తే తప్ప ,భాష పట్ల వారికి అభిమానం కలుగుతుందా?
భాష పై ఆత్మీయ భావం కలగనిదే , ఆప్యాయత పెరుగుతుందా? గౌరవం కలుగుతుందా?
మన భాష మనకు మిగులుతుందా?
పిల్లల సందేహాలనూ సంశయాలనూ తీర్చకుండా  ,సావధాన పరచకుండా,
భయభ్రాంతులతో భాషను బతికించాలంటే ,
తెలుగొస్తుందా?
***
విపులాచ పృధ్వీ!
అందులోను, మన తెలుగు నాట మనిషికో మాట. ఏ గూటికి ఆ చిలుక పలుకు!
పిల్లలందరినీ ఒక చోట చేర్చి భాషాబోధన  చేసేటప్పుడు , మంచి తెలుగు అంటూ తత్తర పెట్టే బదులు ,పిల్లల మాటలను పిల్లలను చెప్పనిస్తే,
వారిలోని భావధారకు ఆలోచనాస్రవంతికి సృజనాత్మకతకూ..
అడ్డుపుల్ల పడదు కదా?
పైనుంచి,
ఆడుతూ పాడుతూ తెలుగు అదే వస్తుంది!
మనకు మల్లేనే !
***

 All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

Nov 28, 2010

పత్రిక - పాఠక సంబంధాలు !

ఈ శీర్షిక ఎక్కడో విన్నట్టుగా మీకనిపిస్తే ,
ఖచ్చితంగా అది శ్రీ రమణ గారి ,
"గుత్తొంకాయ -మానవసంబంధాలు " అన్నమాట!


కొన్నేళ్ళుగా  ,  ఆపకుండా  ఆ శీర్షికతో కలిగిన పాఠక సంబంధం మహిమ అదీ !
రచయితకి  జై కొట్టి,  ఆ శీర్షికకు భూమిక అయిన "పత్రిక "విషయం లోకి వద్దాం.


ఎప్పటిలాగానే , దీపావళి మరియు జన్మదిన ప్రత్యేక సంచిక , పత్రిక ,మన మాసపత్రిక  , ను ఉత్సాహంగా తీసుకొని అలా తిరగేయగానే,
అట్ట మీది అరచేతిలో ప్రమిద  వత్తి రెపరెపలు తాకాయి!
కాదు, ఆరే దీపానికి వెలుగెక్కువని  అందుకే కాబోలు అంటారు!

ఒకటా రెండా , ఇన్ని సంచికలు" ఆర్ధిక భారం మోస్తూ , హార్ధికం గా " పాఠకులకు చేరాలని పడ్డ తాపత్రయాన్ని మొదటి పేజీలో వివరించారు.ఆని సాధకబాధకాలు ఓర్చి , ఒక మంచి కథల  పత్రికను అందిచాలని చేసిన ఈ ప్రయత్నం చివరకు ఏం మిగిల్చింది?
పత్రికొక్కటున్న పదివేల బలగమ్ము " అన్నారు కదా , మరి అంగబలం లేక ఆర్ధిక బలం చాలక పడ్డ ఇబ్బందులు వివరిస్తుంటే, చదివి బాధ పడకుండా ఉండగలమా?
"ఆ అంతేలే , ఇలాంటి పత్రికలన్నిటి అనుభవం ఆఖరికి ఇంతేలే !" అని ఓ నిట్టూర్పు వదిలి ఊరుకొందామా?
ఒక్కో మంచి పత్రిక ఉక్కిరిబిక్కిరయ్యి ఊపిరాడక కాలంలో కలిసిపోతుంటే, తెలుగువాళ్ళం మౌన ప్రేక్షకులమై సాగనంపక ఏమైనా చేయగలమా?
సీనియర్ పాత్రికేయులు శ్రీ ఐ వి వెంకటరావు గారి మానసపుత్రిక అయిన మన పత్రిక , శ్రీరమణ గారి సంపాదకత్వంలో ఎన్నెన్ని సాహిత్యవన్నెలు చిందించిందో!
***

తెలుగునాడి పత్రిక ను ఇకపై కొనసాగించలేమంటూ ఆ పత్రిక వ్యస్థాపక సంపాదకులు జంపాల గారు , రాసిన సంపాదకీయం ఇంకా మనసు లో మొదలుతూనే ఉంది. 
ఏ దేశమేగినా మన తెలుగు వాళ్ళం ఒక మంచి పత్రికను నిలబెట్టుకోలేని వాళ్ళమై పోయామే అని దిగులు  వేసింది. ఆ సంధర్భంలో , తెలుగునాడికి రాసిన ఇ .లేఖలోంచి కొన్ని వాక్యాలు. 
మళ్ళీ ఇక్కడ ప్రస్తావించ వలసి వస్తుందని అనుకోలేదు. తప్పలేదు.

***
నిన్ననే తెలుగు నాడి ఆఖరి సంచిక అందుకొన్నాను.
 ఇక పై పదమారా పలకరించే పత్రిక ఉండదని దిగులేసింది.
ప్రతి నెల క్రమం తప్పకుండా మా ఇంటికి వచ్చే ఆత్మీయ అతిథి... ఇక రాదు.
సంపదకీయం చదివేప్పుడల్లా  స్వయాన మీరే మాట్లాదుతున్నట్లుగా అనిపించేది.
సారి మీరు రాసిన సంపాదకీయం చదవ వలసిన రోజు వస్తుందనుకో లేదు.
మరొక పత్రిక రావాలంటూ మీరు చెసిన సూచన ఎంతో హృద్యంగా తోచింది.
నిజమే .
ప్రయత్నాలు కొనసాగుతూనే ఉండాలి.
మరొక  చోట.
మరొక సారి.
(16-6-2009)

***
"పత్రిక "వారందరికీ అనేకానేక ధన్యవాదాలు. 

పత్రిక సంపాదకులు "ఇది విరామమే కానీ వీడ్కోలు కాకుండా ఉండేందుకు తమ శాయశక్తులా ప్రయత్నిస్తామని "అన్నందుకు మరొక్క మారు జేజేలు.

కొంత విరామం తరువాత, మళ్ళీ  మన "పత్రిక" మనలను పలకరిస్తుందనే ..

ఆశతో ఆకాంక్షతో..
మన పాఠక సంబంధాలను మరొక మారు పునర్నిర్వచించే  ప్రయత్నం చేద్దాం!
***
 All rights @ writer. Title,labels, postings and related copyright reserved.