***
కాలపు కుంచె కొసమెరుపు
***
తెలుగు వారి జీవన చిత్రం కడుచిత్రమైనది.
కాలం వాలున రగులుతూ..నల్గుతూ.వెలుగుతూ..
కరాళమవుతూ..కలవరపడుతూ..కళకళాడుతూ..కమనీయమవుతూ..
ఎంతటి పరిణితిచెందిన సృజనశీలి ప్రతిభకైన అంతుపట్టక ఓ పెనుసవాలై కవ్విస్తుంది.
పట్టుబడీ పట్టుబడకుండా.
సూక్ష్మమై.. స్థూలమై... సమస్తకలారూప విన్యాసమై ..ఆంతర్యం అంతుబట్టే లోపలే అంతర్ధానమై పోతుంది.
అందునా సామాన్యుని జీవిక!
బహుషా తెలుగునాట సమాన్యుని జీవితంలో జీవనంలో ఉన్నంత వైవిధ్యం ఇంకెక్కడా ఉండదు కాబోలు.
ఈ భిన్నత్వంలోని వెలుగునీడలు అంత సులభంగా అవగాహన అవుతాయా?
ఈ విపులత్వంలోని రంగులు చాయలు అంత సునాయాసంగా అర్ధం చేసుకోగలిగేవేనా? సరిగ్గా ఆ భిన్నత్వంలోనే తెలుగు సంస్కృతీమూలాలు పదిలమై ఉన్నాయి.
సరిగ్గా ఆ విపులతత్వంలోనే తెలుగు సంస్కారశోభలు మూర్తిమత్వం పొందాయి.
అందుకు ఒక నిదర్షనమే....సామాన్యుడి జీవన చిత్రిక.
ఇంతకీ..
ఈ సామాన్యుడి చారిత్రక నేపధ్యం ఏమిటి? సామాజిక స్థాయి ఏమిటి?ఆర్ధిక ప్రమాణం ఏమిటి? భౌగోళిక మూలం ఎక్కడ? రాజకీయ సూత్రం ఏది? తాత్విక ప్రాతిపదిక ఏమిటి? భావపరిణితి ఏమిటి?
ఈ సామాన్యుడి వ్యక్తిగతమేమిటి?స్వంతప్రపంచం ఏది? జీవన స్థితిగతులు ఏమిటి?కుటుంబసంబంధాలేమిటి? సాంఘిక చైతన్యం ఏమిటి ?
అన్నిటికీ మించి..
కాలానుగత సామాజికపరిణామంలో సామాన్యుని పాత్ర ఏమిటి?
అన్ని ప్రశ్నలకు ఒకే సమాధానంగా నిలబడుతుంది ..నవీన్ గారి "కాలరేఖలు" నవల.
స్వేచ్చ సమతలతో పాటు సౌభ్రాతృత్వానికి ఉన్న ప్రాధాన్యతను బలంగా చాటి చెపుతోన్న ఈ నవీన చిత్రిక కాలపుకుంచె కొస మెరుపు.
"తెలంగీ బేడంగీ" అంటూ అణిచిపెట్టబడిన చోట ..పరాయిభాష పలుకుపై రాజ్యమేలుచున్న చోట ...తాగేనీరు ,కాసే కాయ ,పండిన పంట ,అబ్బిన అక్షరం ..స్వంతం కాని చోట ..క్షణక్షణం లెక్కిస్తూ , అణువణువూ గుణిస్తూ బలవంతపు బానిసత్వంలో మగ్గుతుండిన చోట .. తెలుగు భాషాసంస్కృతులను ..సంస్కారసాంప్రదాయలను ..పదిల పరిచి ఉంచింది .."బాసాడని" ఆ సామాన్యులే!
నూట పాతికేళ్ళ క్రితం ,నవలాప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి సమకాలీన సామాజిక పరిణామాలను నిజాయితీగా భద్రపరిచి ఉంచింది తెలుగు నవల.
శ్రీ వట్టికోట ఆళ్వారు స్వామి గారి ప్రజల మనిషి ,గంగు నవలలు ,శ్రీ దాశరథి రంగాచార్య గారి మోదుగు పూలు ,జనపదం ,చిల్లరదేవుళ్ళు మొదలైన నవలలు ఆయా రచయితల సమకాలీన తెలంగాణా జీవన పరిణామాలను ,సామాజిక పరిస్థితులను ఉన్నత సాహితీ ప్రమాణాలతో తరతరాలకు అందించాయి.
"ఆంధ్ర మహా సభ నుండి ఆంధ్రప్రదేశ్ అవతరణ వరకు విస్తృత తెలంగాణా జీవనచిత్రణే నవీన్ గారి "కాల రేఖలు" నవల.
***
All rights @ writer. Title,labels, postings and related copyright reserved.
No comments:
Post a Comment