May 24, 2010

అల్లిబిల్లి రచనలు

ఎప్పటిలాగానే ఈ సారీ పిల్లలతో వేసంకాలం కళాకాలక్షేపం చేయాలని ప్రభవలో అందరం అనుకున్నామా, 
అనుకున్న వెంటనే  హడావుడిగా , ఆ మూల ఈ మూల ఉన్న మిత్రులందరికీ చెప్పి, వారిని మా వూరికి వచ్చేట్టు ఏర్పాటు చేసేసుకున్నాం.
పాట,ఆట, మాట.. నిష్ణాతులు అందరూ వచ్చేయాడానికి అన్ని సౌకర్యాలు అమర్చుతున్నాం ఓ పక్క.
మరో వైపు, వారి నైపుణ్యాన్ని పిల్లలతో వారికి గల అనుబంధాన్ని వివరంగా అచ్చేసి, మా కార్యక్రమ నియమావళి తో సహా.. ఊరంతా కరపత్రాలు పంచేసాం.ఫోనులేత్తి పిలిచేసాం. 
బడులకూ కళాశాలకూ కబురు చేర్చాం. అందునా ప్రత్యేకించి, ప్రభుత్వ, గిరిజన,మున్సిపల్ పాఠశాలలకు వార్తను చేరేసాం. వేదికలకూ సంస్థలకూ సమాచారం పంపాం. పత్రికలలో అచ్చేసాం. టివి లలో తెలియపరిచాం.
ఆ నోటా ఈ నోటా వార్త నలుగురికీ చేరేసాం. పత్రికలన్నీ ఈ విషయాన్ని ప్రముఖం గా ప్రచురించాయి
అంతా బాగానే ఉన్నది.
ఇక, పిల్లలు రావడమే తరువాయి.
ఈ లోగా ,మిత్రులన్నారు కదా, "మమ్మల్ని పిలిచారు.వస్తున్నాము. బావుంది.అనేక మార్లు మీరు రచనలో వర్క్ షాపులు నిర్వహించారు.మరి మీరెందుకు నిర్వహించకూడదు " అని.
దాందేముంది అలాగే చేద్దామని, రచన ను నాట్యం,చిత్రలేఖనం,సంగీతం ,నాటకం ల జతన చేర్చాం.
కార్యక్రమ నిర్వహణలో నిమగ్నమై ఉండడం చేత తీరిక లేక కాని, పిల్లలతో గడపడానికి మించినది ఏముంటుంది?
అమ్మానాన్నలు వచ్చారు. వివరాలన్నీ చూశారు.పెదవి విరిచారు.
"అయితే గియితే, ఆంగ్లం లోనే సుమా !  "అన్నారు వారు.
ఉన్న పూర్వానుభవం అంతా తెలుగు రచనలపైనే కదా .పైనుంచి, అంతంత మాత్రం ఆంగ్లపరిజ్ఞానం.
అయితే ఏం, పిల్లల నుంచి నేర్చుకోవచ్చు  లెమ్మన్న ధైర్యం ఒక పక్కా,
భాషేదైనా సృజనాత్మక రచనను పరిచయం చేయడం ప్రధానమన్న ఆలోచన మరో పక్కా,
ఎక్కడో ఒక అక్కడ మొదలుపెట్టాలి అన్న భావన  ఇంకోపక్క,
ఆఖరికి అమ్మానాన్నల మాటే అమలు పరిచాం.
అలా వచ్చిన పిల్లలతో చేసిన చిన్నప్రయత్నాల రూపాలు.
మీరు చదువుతారనీ. 
మీ ఇంటిలోని పిల్లలకు .మీలోని పసి మనసుకు . 
కొన్ని చిన్ని రచనలు.
చదువుతూ ఉండండి. తీరిక దొరికినప్పుడల్లా.
 కొసమెరుపు ఏమంటే, సంగీతం,నాట్యం, నాటకం ..ఆయా రంగాలలో నిష్ణాతులైన వారి అధ్యయన కార్యక్రమాలను నిర్వహించలేక పోయాం. రచనాప్రయత్నం నిర్విఘ్నంగా సాగింది!
ఇవిగోండి అచ్చుతునకలు!
*
All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

May 16, 2010

ఏమిటీ శబ్దం ?

టప్ టపా టప్!
ఏమిటీ శబ్దం ?
ఎలుగుబంటికి భయం వేసింది.జింక గడగడలాడింది.బ్రతుకు జీవుడా అని పరిగెత్తింది.చిరుతపులి కూడా ఆలస్యం చేయలేదు.సింహం గారు సరేసరి!
"రండర్రా నేస్తాల్లారా !అసలీ టప్ టపా టప్! "ఏమిటో చూద్దాం.ఇంత మందిమి ఉన్నాం కదా,భయమెందుకు ?" అంది చీమ.
*
తరువాత ఏం జరిగింది? చిట్టిచీమతో అందరూ కలిసి వెళ్ళారా? వెళితే ఏమి చూశారు?ఛూసి ఏమి చేసారు?
ఊహు ,నేనెందుకు చెబుతాను? మీరే చదవండి. బుజ్జి పుస్తకం ప్రథం వారు
పిల్లలకు ప్రచురించిన చిన్ని కథలలో ఒకటి.
కథ ను మీరు చదవడం వలన , పుస్తకాన్ని కొనడం వలన "స్వాతి "లాంటి
అమ్మాయిలు మరిన్ని పుస్తకాలు చదవాడానికి మీరు చేయూత నిచ్చిన
వారవుతారు.ఇదేంటబ్బా అనుకుంటున్నారా? అయితే ,అన్ని వివరాలను మరెన్నో
పిల్లల
పుస్తకాలను ఇక్కడ చూడండి.

www.prathambooks.org
Read India Books
వారి ప్రచురణ.

*
మన టప్ టపా టప్ ! రచన(హింది, టప్ టప టపక్ !) అమర్ గోస్వామి ,చిత్రాలు
పార్తోసేన్ గుప్తా తెలుగు సేత పి.శాంతాదేవి
ISBN 81 -8263-466-0
వెల: 15 రూ.
*
పుస్తకం.నెట్ వారికి ధన్యవాదాలతో
*
 All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

May 13, 2010

తకిట తరికిట


తకిట తరికిట


***************
పిల్లల పుస్తకాలు ఎలా ఉండాలి? అక్షరాల పరిణామం ఎలా ఉండాలి? బొమ్మలు, రంగులు ఎలాంటివి వాడాలి?
పుస్తకం లో కథ ఎలా ఉండాలి?కథనం ఎలా సాగాలి? పాత్రలు, సంభాషణలు సంఘటనలు ఎలా కూర్చాలి?
నీతి ఎలా అందించాలి?ఏ వయసుకు ఎలాంటి పుస్తకాలు అందించవచ్చును?పిల్లలు స్వయానా చదవ గలిగిన పుస్తకాలు(READ ALONE) అన్నవి ఎలా ఉండాలి? పిల్లలు బిగ్గరగా చదివ గలిగే (READ Aloud)పుస్తకాలు ఎలా ఉండాలి?…ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాలు వెతికే ప్రయత్నం పిల్లలకు పుస్తకాలు అందించే వారు చేస్తూనే ఉన్నారు. అలాంటి కొన్ని ఆలోచనలకు సారూప్యాలను   పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను.
Read Aloud పుస్తకాలు:  పిల్లలు కానివ్వండి ...వాళ్ళ పెద్దలు కానివ్వండి …బిగ్గరగా చదివి వినిపించి వివరించ గలిగే పుస్తకాలు.
వీటిలో ఒక తరహా మౌఖిక సాంప్రదాయం కనబడుతుంది.పాదాల విరుపు లో లయ ,రాగం వినబడతాయి.rhyme rhythm  చెట్టాపట్టలేసుకుని పదాలను నడిపిస్తాయి.
“తకిట తరికిట తకిట తరికిట …ఆబు ఆడే పెద్ద ఎర్రని బంతితో”
- ఈ చిట్టి కథ “తకిట తరికిట చిందులేసే బంతి”.. అచ్చంగా ఒక మృదంగ లయవిన్యాసం తో చిన్నారి అబు ఆడే బంతితో ముడి పెట్టి హాయిగా సాగే కథ.
” ఈ సరళమైన సులభంగా చదివించే పుస్తకం నర్తించే పాదాల తాళగతులతో ప్రతిధ్వనిస్తుంది.ఇదొక సరదా అయిన కథ.అసలు సరదా ఉండేది ఈ నృత్య పరిభాషలోనే . అది ఒక బుజ్జి కుర్రాడిని ఎలా చిందులు వేయించ గలదు అనడంలోనూ ఉన్నది.”
-ఇలాంటి, కథల్లో ..ఆ స్వరబద్దతను పిల్లలకు పరిచయం చేయగలగడం ఎంత హాయిగా ఉంటుందో ఊహించండి.
అక్షరాలా  ఆ మృదంగ  ధ్వని బంతి తో పాటు దొర్లుతూ ఉంటుంది.  . ఆ రస మాధుర్యాన్ని ఆ పసితనపు ఆటాపాట ను మిళితం చేసి , బిగ్గర గా  చదివి వినిపించ  గలడడమే ,పెద్దలుగా మనం నేర్వాల్సిన పాఠం. చివరి పేజీ వచ్చే సరికి చిన్న నవ్వు పిల్లల ముఖంలో కనబడితే.. అబ్బ !
 అన్నట్లు,పుస్తకం చదివి వినిపించడం ఓ గొప్ప కళ.అది అమ్మానాన్నలుగా చేయగలిగిన హాయైన పని.
ఏ పుస్తకాన్నైనా .,  బిగ్గరగా చదవడంలో విరుపునూ విన్యాసాన్ని అందించ గలిగితేనే, మనం మన పిల్లలకు సంతోషంగా పరిచయం చేయ గలుగుతాం. కదండీ?
ఇక్కడ ప్రస్తావించిన పుస్తకం తో ,ఒక చిన్న చిక్కు ఉన్నది. అది మలయాళం కథ, “జాకబ్ జాన్సన్ ముట్టడి “రాసినది. తెలుగు అనువాదం లో ,మృదంగ ద్వనికీ అక్షరలాకు నడుమ లయ ..తూగు .. కుదరలేదు.అక్కడక్కడా. అయినా, ఈ పుస్తకం ప్రయత్నం నచ్చింది.నేరుగా తెలుగులో రాసినవైతే ,ఆ అసంబద్దత కు తావు ఉండదు కదా అని అనిపించింది.
***
Read aloud Age 3+
Read alone Age 5+
Spark- Tulika publications, Price Rs.60/- *  24 FEBRUARY 2010  pustakam.net పుస్తకం.నెట్ వారికి ధన్యవాదాలతో 
 All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

May 10, 2010

ఆ పుస్తకమైనా e-పుస్తకమైనా.


23-4-2010
అబ్బబ్బ పుస్తకం
నిన్ను చూడగానే నోరూరుచుండు
ధర చీటి చూసి ..పర్సు తీయగానే ..
అబ్బబ్బ ...
*
పై ఖాళీలూ తమరు పూరించ సవినయ మనవి. వాక్యం పై సర్వ హక్కులూ తమరివే.
*
పోనీండి.
ఎవరి పాపాన వారు పోతారు.
కానీ, కొని చదవడం తగ్గిపోయిందని వాపోతారే ..వారిగురించి కాసేపు.
కొని చదివే వారు లేకుండా పోయే వారి గురించి మనం మాట్లాడుకోవడం ఎంచేత?
ఇవ్వాళ అంతర్జాతీయ పుస్తక దినోత్సవం కదా అంచేత !
అని అనుకుంటున్నారా?

కాదండి బాబు.

రాత్రంతా మధ్యే పరీక్షలు రాసొచ్చిన మా అబ్బాయి  ఒకటే ఉలుకులుకి పడుతున్నాడు .
పాపం ...కలలోకి పుస్తకం వచ్చిందో ఏమో!
హాస్టల్లో ఉంటున్న మా అమ్మాయిని  పొద్దున్నే ఆఫీసులో కలవమని డీన్ హుకుం వేసార్ట , మొన్నామధ్య నేను తప్పక చదవాలి సుమా అంటూ, ఆమె బీన్ బ్యాగులో దాచి పెట్టి వచ్చిన పుస్తకం దొరికి పోయిందో ఏమో!
పొద్దున్నే కాఫీ కప్పు ఇలా ఇస్తుంటే , తిరగేసిన పుస్తకంలోకి అలా తల దూర్చి మొహం చాటేసారు మా పిల్లల నాన్న గారు ! కొత్త పుస్తకం బుర్ర తొలిచేస్తుంటే , నిద్దట్లో ఏవేవి కలవరించానో ఏమో!
సరేనండీ ,ఇలాంటి పుస్తక కష్టాలు తెల్లారి లేస్తే ఎన్నో.అర్ధం చేసుకోరు!
అదలా ఉంచండి.
రోజు స్పెయిన్ లో , ప్రతీ పుస్తకాల దుకాణం లోనూ కొన్న పుస్తకం తో పాటు ఒక గులాబీ ఇస్తారుట.
Cervantes వర్ధంతి కదా , అని,స్పెయిన్ వారు వారి జాతీయ పుస్తక దినోత్సవం ప్రకటించుకొని, రెన్నాళ్ళ పాటు ఏకబిగిన Don Quixote  "readathon" చేసి, Miguel de Cervantes Prize ఇస్తారుట.
బావుంది.
బ్రిటన్లో ,పౌండ్ కొక పుస్తకం తీసుకోండంటూ టోకెన్లు ఇస్తారుట.ఇక, షేక్ స్పియర్ నాటకమహోత్సవాల సంగతి సరేసరి.
భలే భలే.
అన్నట్లు,స్పెయిన్లో అబ్బయిలు అమ్మాయిలకు గులాబీ ఇస్తే, అమ్మాయిలు పుస్తకం తో బదులిస్తారుట.ఏకంగా నాలుగు మిలియన్ల పుస్తకాలు గులాబీలమారకం జరిగాయంటే ,చూడండి మరి.
నిజానికి, రోజున కొన్న పుస్తకం తో పాటు ఒక గులాబీ ని ఇవ్వడం క్యాటలోనియ లో మొదలయ్యిందట. పుస్తకం చడవడం ఒక ఆహ్లాదకరమైన అనుభవం అని చెప్పకనే చెప్పడానికట.
నిజమే, మకాండొ దుమ్మూధూళిలో కనుమరుగయ్యే టప్పుడు, మిగిలింది క్యటాలోనియ పుస్తకాల దుకాణదారూడి సలహా మేరకు , దుఖాణం లోని ముఖ్యమైన పుస్తకాలతో సహా దేశాంతరం పట్టిన మార్క్వెజ్, తరువాత ఆయన రచించిన One Hundred Years of Solitude" మాత్రమే కదా?
మకాండొ  ,మార్క్వెజ్  .. ఈ కథా కమానీషు అర్ధం కావాలంటే ,ఆ పుస్తకం చదవాల్సిందే ,మరో మార్గం లేదు!
అదలా ఉంచడి.
అంత మాత్రం చేత , ప్రభవ కు వచ్చి  పుస్తకానికో గులాబీ ఇమ్మనేరు. ఇప్పటికే బితుకు బితుకు మంటున్న పుస్తకాలషాపు కాస్తా చితికి పోగలదు! మా వూళ్ళో గులాబీలు పుస్తకాల కన్న ఖరీదైనవీను!
మీరు ఎప్పుడైనా గమనించారో లెదో గానీ, మన తెలుగు పుస్తకాలు ఏవీపౌండ్ను మించవు. లెక్కన పాఠకులకు అందేవన్నీ వన్ పౌండ్ చీటీలే!
ఇదండీ, పుస్తకాల క్రయవిక్రయాల వ్యవహారం.
దానా దీనా చెప్పొచ్చేంది ఏంటంటే,
రోజు పుస్తకాలరోజు మాత్రమే కాదు.
ఇవ్వాళ  పుస్తక రచయితల,ప్రచురణకర్తల ,విక్రేతల ,విమర్శకుల   ..ప్రత్యేకమైన రోజు గా UNESCO ప్రకటించింది.
వీరందరి మౌలిక హక్కుల ,కాపీ రైట్ డే ,గా కూడా రోజు గుర్తించబడింది.
రచయితే ప్రచురణకర్తా,విక్రేత,పంపిణీదారుడు,ఆపైన, ప్రూఫ్ రీడరూ అయిన చోట , ఈ రోజు మరింత ముఖ్యమైనది కాదూ ?
*
మునుపు గ్రంథాలయాల పాత్రకు  ఈనాటి - పుస్తకాలకు ...కొంత పోలిక ఉన్నది. ఉచితంగా చదవచ్చు.
పనిగట్టుకొని పుస్తకాల దుకాణానికి వెళ్ళక్కరలేకుండానే, ఇంటికి పుస్తకాలు చేర్పించే , - దుకాణాలు  బోలెడు తెరిచి ఉన్నాయి.
గ్రంథాలయాలు,దుకాణాలు ఒక్క కొనగోటి మీటు దూరంలో ఉన్నప్పటికీ ,ఎందరం పుస్తకాలను చదువుతున్నామన్నదే ప్రశ్న.
కనుక, కొని చదివారా కొనకుండా చదివారా అన్నది కాదు , అసలు చదువుతున్నారా లేదా అన్నది మన ముందున్న ప్రశ్న .
చదవండి. చదువుతూనే ఉండండి.
  పుస్తకమైనా e-పుస్తకమైనా.
అదే మనం మన రచయితలకు అభిమానంతో అందించే  గులాబీ పువ్వు!
 ఇక ,కొని చదివారే అనుకోండి...
ఆ పై , చెప్పవలసింది ఏముందీ?
పుస్తకం చదువరులకు శుభాకాంక్షలు.
*


(అంతర్జాతీయ పుస్తక దినోత్సవం సందర్భంగా చేసిన చిట్టి రచన. పుస్తకం.నెట్  వారికి ధన్యవాదాలతో )


 All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

May 1, 2010

అన్నీ అక్కడే ఆరంభమయాయిశ!

                                                                                                                      


అన్నీ అక్కడే ఆరంభమయాయిశ!
అని అంటారేమో ..ఇక రాన్రాను.!
నిజమండీ.
"ఎండుగడ్డి సంత "నడిబజారులో నిలబడగానే ,అప్రయత్నంగా ..నా నోట
 తొణికాయనుకున్న పలుకులవీ.కానీ, అక్కడ నిలబడ్డాక ,నా నోట మాట పెగిలితే ఒట్టు.
నిశ్శబ్దంగా నిలబడి పోయాం.
 నేను. నా ఆతిధేయ దంపతులు.

అక్కడి నీరెండలో నీడల్నీ ..
ఎక్కడికో ప్రసరించిన వెలుగునీ...
విరిగిన ఇరుసునూ ,నిలిచిన స్వరాన్ని , నిలబెట్టిన భుజాలనూ ,
 నేలపై ఎవరో గీచి వెళ్ళిన బొగ్గురాతలను ,
చూస్తూ... వింటూ ...
చుట్టేస్తున్న శరత్కాలపు చల్లగాలిలో ముడుచుకుంటూ..
నిశ్శబ్దంగా నిలబడ్డాం.

ఆ గంభీర వాతావరణాన్ని గమనించి,
 మా ఆత్మీయ ఆతిధేయి, గృహస్థు గారిని ఆట పట్టించారు.
"షికాగో నగరం చుట్టివద్దాం రమ్మంటే,ఇలా చుట్టాలందరినీ మాటిమాటికీ ఇక్కడికే తీసుకొస్తున్నారు.ఏమిటీ విషయం అని ఫెడరల్ విచారణ మొదలు పెట్టేయగలరు!"ఇదుగోండి ..ఈ విరిగిన బండే , ఆ నాటి సాయంత్రం ఉపన్యాసాలకు వేదిక అయ్యింది.
ఇదుగోండి...ఈ  ఇరుకు కూడలే , ఆ తరువాతి కార్మిక పోరాటాలకు సూచిక అయ్యింది.
ఇదుగోండి..ఈ ఇనుప జ్ఞాపికే ,ఆ నిశ్శబ్దకెరటాల ప్రకంపనాల ప్రచండ శక్తికి ప్రతీక  అయ్యింది.

నిజమండీ.
అన్నీ అక్కడే ఆరంభం అయాయిశ!

అక్కడే నిలబడక ..అక్కడే నిలవలేక..
నిలకడలేని నిజాన్ని
నిలదీస్తూ..
నిలవనీడ లేని నిస్సహాయుల్ని..పరామర్షిస్తూ ..
ఎప్పుడైనా..
అప్పుడప్పుడు ..
ఒక చిన్ని నిశ్శబ్ద అలలా ముంచెత్తక పోతుందా?
ఒక ప్రభాత కలలా  నిజం కాకుండా పోతుందా?

 "మే డే" గా నిలిచిపోయిన ఆనాటి   " హే మార్కెట్ "లో జరిగిన ఉదంతానికి ఒక ఉదాహరణ గా.. ..ఆ కసరు గళానికి నివాళి గా... ఈ  కళా నిర్మాణం.
ఆనవాలు పట్టలేనంతగా ఇలాంటి ఎన్ని సంఘటనలు ..మన జ్ఞాపకాల్లో మలిగిపోతుంటాయో కదా!

మే డే శుభాకాంక్షలు.
క్షేమాన్ని సౌబ్రాతృత్వాన్ని శాంతిని కోరే వారందరికీ.