May 1, 2010

అన్నీ అక్కడే ఆరంభమయాయిశ!

                                                                                                                      


అన్నీ అక్కడే ఆరంభమయాయిశ!
అని అంటారేమో ..ఇక రాన్రాను.!
నిజమండీ.
"ఎండుగడ్డి సంత "నడిబజారులో నిలబడగానే ,అప్రయత్నంగా ..నా నోట
 తొణికాయనుకున్న పలుకులవీ.కానీ, అక్కడ నిలబడ్డాక ,నా నోట మాట పెగిలితే ఒట్టు.
నిశ్శబ్దంగా నిలబడి పోయాం.
 నేను. నా ఆతిధేయ దంపతులు.

అక్కడి నీరెండలో నీడల్నీ ..
ఎక్కడికో ప్రసరించిన వెలుగునీ...
విరిగిన ఇరుసునూ ,నిలిచిన స్వరాన్ని , నిలబెట్టిన భుజాలనూ ,
 నేలపై ఎవరో గీచి వెళ్ళిన బొగ్గురాతలను ,
చూస్తూ... వింటూ ...
చుట్టేస్తున్న శరత్కాలపు చల్లగాలిలో ముడుచుకుంటూ..
నిశ్శబ్దంగా నిలబడ్డాం.

ఆ గంభీర వాతావరణాన్ని గమనించి,
 మా ఆత్మీయ ఆతిధేయి, గృహస్థు గారిని ఆట పట్టించారు.
"షికాగో నగరం చుట్టివద్దాం రమ్మంటే,ఇలా చుట్టాలందరినీ మాటిమాటికీ ఇక్కడికే తీసుకొస్తున్నారు.ఏమిటీ విషయం అని ఫెడరల్ విచారణ మొదలు పెట్టేయగలరు!"



ఇదుగోండి ..ఈ విరిగిన బండే , ఆ నాటి సాయంత్రం ఉపన్యాసాలకు వేదిక అయ్యింది.
ఇదుగోండి...ఈ  ఇరుకు కూడలే , ఆ తరువాతి కార్మిక పోరాటాలకు సూచిక అయ్యింది.
ఇదుగోండి..ఈ ఇనుప జ్ఞాపికే ,ఆ నిశ్శబ్దకెరటాల ప్రకంపనాల ప్రచండ శక్తికి ప్రతీక  అయ్యింది.

నిజమండీ.
అన్నీ అక్కడే ఆరంభం అయాయిశ!

అక్కడే నిలబడక ..అక్కడే నిలవలేక..
నిలకడలేని నిజాన్ని
నిలదీస్తూ..
నిలవనీడ లేని నిస్సహాయుల్ని..పరామర్షిస్తూ ..
ఎప్పుడైనా..
అప్పుడప్పుడు ..
ఒక చిన్ని నిశ్శబ్ద అలలా ముంచెత్తక పోతుందా?
ఒక ప్రభాత కలలా  నిజం కాకుండా పోతుందా?

 "మే డే" గా నిలిచిపోయిన ఆనాటి   " హే మార్కెట్ "లో జరిగిన ఉదంతానికి ఒక ఉదాహరణ గా.. ..ఆ కసరు గళానికి నివాళి గా... ఈ  కళా నిర్మాణం.
ఆనవాలు పట్టలేనంతగా ఇలాంటి ఎన్ని సంఘటనలు ..మన జ్ఞాపకాల్లో మలిగిపోతుంటాయో కదా!

మే డే శుభాకాంక్షలు.
క్షేమాన్ని సౌబ్రాతృత్వాన్ని శాంతిని కోరే వారందరికీ.

2 comments: