Nov 29, 2014

హాం... ఫట్ !


శ్రీ పసల భీమన్న గారు పంతుళ్ళకు పంతులు గారు!
మాట వరసకు అనడం లేదు. వారు , బిఇడి కళాశాలల్లో పని జేసి, జిల్లా విద్యాశాఖాధికారిగా  పదవీ విరమణ చేశారు. ఇక, వారి ఊపిరి మానవవాదం. హేతువాద ఉద్యమం తోనూ ఆయా వేళల కళ్లు తెరిచిన వివిధ సామాజిక ఉద్యమాలతోనూ వారికి ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయి. భావ విప్లవ ప్రచారం ధ్యేయంగా వారు అనేక వ్యాసాలు, కథలు వ్రాశారు.
అన్ని చోట్లా, పిల్లలు బడులు ,పంతుళ్ళు ఆయన అభిమాన విషయాలు. అయితే, వారికి అన్నిటికన్న ఇష్టమైన పని మరొకటి ఉంది.
శ్రీ ప్రేమానంద్ గారు గూడవల్లిలో మూడు రోజుల పాటు నిర్వహించిన , మహిమల గుట్టురట్టుచెసే ఇంద్రజాల ప్రదర్షన లో నేర్చుకొన్న మహిమలని చేసి చూపించడం. ఆ ఇంద్ర జాలం వెనుక ఉన్న రహస్యాల్ని వివరించడం. వారు ఎక్కువగ  పిల్లలతో పనిచేస్తారు కాబట్టి, పిల్లలకు ఇష్టమైన కొన్ని సరదా ఇంద్రజాలాలు ప్రదర్షిస్తూ , మహిమలను బట్టబయలు చేస్తారు.
 ఈ నడుమ, మా బుజ్జి బడిలోనూ వారు ఈ ప్రదర్షన నిర్వహించారు.
మా పిల్లలా చిన్నిపిల్లలు. అయినా, భీమన్న గారు ఇట్టే జట్టు కట్టేసారు. పిల్లలకోసం పిల్లలకు నచ్చిన ఇంద్రజాలాన్ని ప్రదర్షించారు.ఖాళీ డబ్బాలోంచి తీపి బిస్కట్టులు రావడం, ఖాళీ సంచిలోంచి పూలగుత్తులు రావడం ..లాంటివి .
 పిల్లలు  "కోరినప్పుడు కురిసే వాన" లాంటి కిటుకులెన్నో నేర్చుకొన్నారు.
ఆ మరునాడు మా సుశ్రుత్  , ఖాళీ పలక చూపించి మ్యాజిక్ చేస్తానని  , 
అబ్రకదబ్రా అంటూ.. చూపుడు వేలితో.  పలక చుట్టూ సున్నాలు చుట్టి, , పలకని గిర్రున తిప్పేసాడు.
తిరగేసిన పలక మీద,  
ముందే రాసి ఉంచిన గుండు సున్నాని చూపించాడు !
ఇక మేమేం చేస్తాం?
చక చక చప్పట్లు కొట్టాం !
****
ఇంతకీ, అందరిలోకి చిన్నవారెవరూ?
 భీమన్న గారే!
మా బుజ్జిపిల్లలన్నా మధ్యలో ఆటవిడుపు తీసుకొన్నారు కానీ, వారి కప్పుమంచి నీళ్ళయినా
 తీసుకోలేదు.కాసేపు  విరామం ప్రకటించి, బలవంతంగా ఓ కప్పు తేనీరు ఇవ్వవలసి వచ్చింది.
 డెబ్భై ఏళ్ళు దాటబోతోన్నప్పటికీ, ఆయనకు అలుపుసొలుపు లేకుండా చేసింది...
 పిల్లల పట్ల ఉన్న అభిమానమూ, ఆయన చేస్తోన్న పని పట్ల ప్రేమ,నమ్మిన భావాల పట్ల అంతులేని విశ్వాసం ! 
పిల్లలతో పనిచేసే వారు పసితనాన్ని వసివాడనివ్వరు అన్న మాటకు భీమన్న గారు ఒక నిలువెత్తు ఉదాహరణ. 
వారిని ఇంకా  కలవని పిల్లలూ, త్వరగా కలుసుకోండి.
బోలెడన్ని  ఇంద్రజాల మెళుకువలనీ, మహిమల ఆంతర్యాలనీ తెలుసుకోండి. !
వారెంతో ఇష్టంగా , మీతో ఆ రహస్యాలన్నీ పంచుకొంటారు.
 బోలెడంత సరదాగా.
హాం... ఫట్ ! 
***


All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

Nov 28, 2014

అందుకేగా ఈ పుటం !

మనుషుల్లా మనం బతకలేమా?
బతికేద్దుము.
బతకడం మానవనైజం కదా..!

అయితే గియితే,
మా మానాన మమ్మల్ని బతకివ్వరేం ?

***
ఇదీ,
మానవనైజమేనా ?

బతుకు... బతుకు..బతుకమ్మా..!
మా బంగరు బొమ్మా!

***
నువ్వు బంగరు తల్లివి!
అందుకేగా ఈ పుటం !
***


కుటుంబ హింస పై పదహారు రోజుల ప్రక్షాళనట !
***
పదహారు రోజులు కాదు… మూడొందల అరవై ఐదు రోజుల ఉద్యమం కావాలిప్పుడు
.
నవంబరు 25 నుండి డిసెంబరు 10 వరకు స్త్రీలపరంగా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో భిన్నమైన కార్యక్రమాలు జరుగుతాయి. చాలా సంవత్సరాలుగా ఇవి జరుగుతున్నాయి. స్త్రీల మీద అమలవుతున్న హింసకు వ్యతిరేకంగా నవంబరు 25ని ‘వయొలెన్స్‌ అగెన్‌స్ట్‌ విమెన్స్‌ డే’ అంటూ మొదలుపెట్టి అంతర్జాతీయ మానవహక్కుల దినం డిసెంబరు 10తో ఈ కార్యక్రమాలు ముగుస్తాయి.
ఒక్కోదేశంలో ఒక్కో కార్యక్రమం. మన దేశంలో కూడా వివిధ రాష్ట్రాల్లో......
( Please read the rest of the article in the link below.)
https://www.facebook.com/satyavati.kondaveeti?pnref=story
( Kondaveeti Satya vathi gaari soujanymatO.. )

***
All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

Nov 24, 2014

నాన్నకు కొత్త చూపు

Sri GuruBabu and Aruna GoginEni, Dr.indumathi Parikh, me and KotapaTi Murahari Rao garu ( father)
1998,January, IHEU International conference,Bombay.
దానం గురించైనా మాట్లాడానికైనా, ఆట్టే సంశయాలు ఎదురురావు.
ఎందుకంటే , వాటికి సంబంధించిన సామాజిక వాతావరణం మన చుట్టూ ఆవరించుకొని  ఉంటుంది. ఆయా సంస్కృతులు సమాజాలు ...  యే దానాలు ఎలా చేయాలో, దానాల వలన యే పుణ్యలోకాలకు చేరుస్తాయో కూడా సవివరంగా చెపుతాయి. ఇక, దానం చేస్తే పాప విముక్తి కలుగుతుందో కూడా.
 అదలా ఉంచి, మానవ సమాజాల్లో , మనిషన్న వాడు   సాటి మనిషికి తనకు తోచినంత సాయం చేయడం ,చేయాలనుకోవడంతన మానవధర్మ  గా  కర్తవ్యంగా భావించడం కద్దు .
 అయితే, కాలాలు మారాక ,పొరుగింట్లో గిద్దెడు పంచదార అయినా అప్పు పుడుతుందే కానీ    , చేసాయం అందడంలేదు. దానికి గల సామాజిక ఆర్ధిక కారణాలలోకి మనం వెళ్ళక్కరలేదు
కానీ, మాయమై పోతున్నడమ్మా మనిషన్న వాడు .. అని వాపోతున్న నాటి రోజుల్లో ... మానవ ధర్మాలు  మళ్ళీ కొత్త నిర్వచనాలను చిగురిస్తున్నాయి.
 కుడి చేత్తో చేసిన దానం ఎడమ చేతికి తెలియ కూడదు  అనే వారట .. పూర్వం. ఇక, మా తాయ్యగారు మా నాన్నగారికీ చెప్పినిదీ , వారు అనేకానేక సంధర్భాలలో వివరించినదీ, ఏమిటంటే,
 "ఇచ్చిన దానాన్ని జ్ఞాపకం ఉంచుకోకూడదు. పుచ్చుకున్న దానాన్ని మరిచి పోకూడదు." 
మా తాతయ్య ఒట్టి రైతే, కానీ వావిళ్ళ వారి గ్రంథమాలలన్నీ ఆకళింపు చేసుకొన్న మనిషి. మా వూళ్ళొ ఒక బడి కోసం ఆయన పడ్డ తాపత్రయం ఎందరో చెపితే వింటూ పెరిగాం. నాన్న గారు వారి తండ్రి నుంచి  నేర్చినదదే . "చేయగలిగిన సహాయం చేయి. అది నీ మానవ ధర్మం. "
అందుచేత ,ఆయన కూడబెట్టుకున్నదంతా ,  
ఆ నిశ్శబ్ద సంస్కారాన్నే. 

విద్యాదానం అన్ని దానాలలోనూ మిన్నని తాతయ్య నమ్మారు. నాన్నగారు అదే ధర్మాన్ని పాటించారు. తన బిడ్డల చదువుల గురించి ఆయన ప్రత్యేకంగా సమయం పెట్టలేదు కానీ, చుట్టూ ఉన్న పిల్లలందరితో పాటే, వారు కలిసి చదువుకోవాలని ,అందుకు కావలసిన ఏర్పాట్లు చేసారు.  
నడిగడ్డ వీధిబడిలో పలక బట్టి, పాలమూరు మున్సిపల్ బడి లో తరగతి మెట్లెక్కింది మా చదువులు.
మాకేదో నాలుగు అక్షరం ముక్కలు వస్తున్నాయని, అప్పటి బంధుమిత్రులలోని యువబృందం మమ్మల్ని కాన్వెంటులో ఆంగ్లమాధ్యమం లో చేర్పించడం,  నాన్న గారు మళ్ళీ  మమ్మలను ,తెలుగు తరగతుల్లో పెట్టి,
"గాట్టి ఇంగ్లీశు" మాష్టారూ, వీర వసంతా చారి గారికీ మమ్మలను అప్పజెప్పడం , మా సాయంకాలాలనూ సెలవలనూ.. బందీ చేయడం ఒక ఎత్తు. 

ఇక, శ్రీమతి అరుణ గారి గురించి చెప్పాలి.
మరణం గురించి  ప్రతి మనిషి కీ  ఒక స్వీయ నిర్ణయాధికారం ఉండాలన్న ఆలోచన   ( Euthanasia) గురించి నిర్ఘాంతపోతూ  తెలుసుకొన్నది , ఆమె పక్కన కూర్చునే.
నార్వే నుంచి వచ్చిన మానవ వాదులు ఒక కొత్త ఆలోచనలను  మా ముందు పెడితే, ఆకళింపు చేసుకోను కొంత తడబడుతుంటే, ఆమే, తల్లిలా వివరంగా చెప్పారు
అవయవ దానం  గురంచి కూడా విడమరిచి చెప్పారు.
వారు, శ్రీమతి.అరుణా గోగినేని గారు.     
శ్రీమతి అరుణ గారిని గురించి చెప్పాలంటే ఆమె ఇంట ఆతిధ్యం పొందిన తిదులందరి గురించి చెప్పాలి
నార్వే నుంచి నంధ్యాల వరకు, బుడాపెస్ట్ నుంచి భొధన్ వరకూ. లండన్ నుంచి ఇంకొల్లు వరకు.. వారని వీరని లేకుండా, అప్పుడని ఇప్పుడని లేకుండా,ఆమె ఆప్యాయం గా   ఆతిథ్యం  ఇచ్చే వారు. ఎవరికి కావలసిన రీతిలోవారికి  .. ఎవ్వరినీ నొప్పించకుండా..
వారింటి  గాలులలో తెలుగు, ఇంగ్లీష్ హిందీ, ఫ్రెంచ్, జర్మన్ భాషలుసాహిత్యాలు, సంస్కృతులు  గుస గుసలాడేవి .
కాళోజీ , రావిపూడి,లెవిఫ్రాగిల్  నుంచి నాబోటి వారి అందరూ ఆమె చేతి బువ్వ తిన్న వారే.
ఆమె ఏదో అన్నంపెట్టి సాగనంపే తల్లి కాదు, అందరి మాటలోనూ తన మాట కలుపుతూ , అందరి చేతల్లోనొ తనూ చేయి వేస్తూ.. అందరికీ అమ్మలా ఉండేవారు.నాలాంటి బిడియస్తులను మరింత ప్రేమగా వెన్ను తడుతూ..అభిమానంగా చూసుకొనే వారు.
 (బహుశా ఆడపిల్లలు లేని లొటు ఆమె ఇలా తీర్చుకొనే వారేమో.)
తల ముక్కలయ్యేంత నొప్పిని కూడా నిశ్శబ్దంగా ఓర్చుకొంటూ చిరునవ్వులా మార్చుకొనే , ఆ   వ్యక్తి ...నిండా యాభైఏళ్ళు లేని వయస్సులో   ,ఆకస్మాత్తుగా  ,అర్ధాంతరంగా , కోమా లోకి వెళ్లి పోయారు.
ఉన్న ఒక్క బిడ్డ దేశాంతరాన ఉన్నారు. వారు వచ్చేదాకా, ఊపిరిని నిలబెట్టిన వైద్యులు ఇక, ఆఖరి నిర్ణయం తీసుకోమన్నారు.
 ఎంతయినా తల్లి మురిపాల బిడ్డ. అలాంటి కఠిన నిర్ణయం ఎలా తీసుకోగలరు. ?
అప్పుడే ,   డా ..జయ ప్రకాశ్ నారాయణ గారు, నాన్నగారు , ప్రభృతులు పక్కన నిలబడి, ఆ ముప్పైదాటని బిడ్డను. అతని తండ్రినీ నిర్ణయం చెప్పమన్నారు.
 ఊపిరియంత్రాల బంధవిముక్తురాలిని  చేసి  , ఆమెను లోకబాంధవిని చేశారు., ఆమెను పువ్వులా  వైద్య కళాశాలకు అప్పగించారువైద్య విద్యార్ధుల అధ్యయనం కోసం.
కళ్ళు, ఇతర ముఖ్యమైన అవయవాలన్నీ అవసరమైన వారికి చేర్పించ బడ్డాయి.
అవయవ దానం లో,  మతం కన్నా, సామాజిక ధర్మాలకన్నా, ప్రాధాన్యత జీవించి ఉన్నప్పుడు ఆ వ్యక్తి అభిప్రాయలతోఉంటుంది  పేగు ముడిపడ్డ బిడ్డ మనస్సు తోనూ ఉంటుందిసహచరుని జీవితం తోనూ ఉంటుంది
ఒక వైద్య కళశాలలో విద్యార్ధుల ముందున్న విగత శరీరం పరిస్థితి  , బిడ్డ కళ్ళ ముందు కదిలి ఉండదా? సహచరుని గుండెను తాకి ఉండదా?
ఆమె మబ్బుల నీడల్లోకి  నిశ్శబ్దంలోకి జారుకొంటూ , మరెందరికో వెలుగు నిచ్చారు.

వారు, శ్రీమతి అరుణా గోగినేని గారు.
ప్రముఖన కవి  “ మో “  (మోహన ప్రసాద్) గారికి స్వయాన చెల్లెలు. ఆమె బిడ్డ శ్రీ బాబు గోగినేని గారు, సహచరుడు శ్రీ గురుబాబు గోగినేని గారు.
అవయవదానం, విగత శరీర దానంలో మానవ కోణాన్ని మనం అర్ధం చేసుకోవడం ముఖ్యం.

 నాన్నగారు అరుణ గారిని అంబులెన్సులో ఎక్కిం చి ,సాగనంపి వచ్చాక అన్నారు, "అమ్మాయిని పెళ్ళి చేసి  ఆత్తారింటికి పల్లకిలో పంపినట్టుందమ్మా. కడదాకా పువ్వులా సాగనంపాం..ఆమె నవ్వుతో సహా." అని,
" మరి నాసంగతేం చేస్తావ్?" అన్నారు.
ఆయన ఉద్దేశ్యం తెలిసిపోయింది  . కానీ,  " మాటలు ఇప్పుడెందుకు లెండి" అంటూ చనువుగా కోప్పడ్డాను.
 అడగగానే నేత్రదానానికి అంగీకరించడం  ద్వారా ఆయన మాట నిలబెట్టింది మా అమ్మ.
అవయవాలు విఫలం చెందడం వలన అవయవ దానం  వీలు కాలేదు.నేత్రదానం చేయగలిగాము. 

అన్ని దానాలలోకి సున్నితమైన దానం , అవయవ దానం.

అమ్మకు జేజే.
నాన్న మాట నిలబెట్టినందుకు.
అరుణమ్మకు జేజే 
అందరికీ  ఆదర్శమై నిలిచి నందుకు.
***
ఎక్కడ నుంచో నాన్నగారి కనులు ఈ లోకాన్ని చూస్తూనే ఉంటాయి అన్న భావం , 
ఇవ్వాళంతా నన్ను వెంటాడుతూనే ఉన్నది.
నేను  చూస్తున్న 
ఈ ఆకాశం ,ఈ మబ్బులు, ఈ వెలుగు ఈ చీకటి ....
ఈ పువ్వుల సౌకుమార్యం, ఈ సీతాకోకచిలకల సౌందర్యం ...
విరుచుకు పడుతున్న ఆ అలల నురుగులు ....
నీలాలనింగి లో  విరిసిన ఆ వానవిల్లు వన్నెలు...
ఎవరో మరిద్దరూ చూస్తున్నారు !
వారికి నమస్కారం. 

నాన్నకు కొత్త చూపును ఇచ్చినందుకు !
***



All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

జేజేలు..!

అవి శ్రీలక్ష్మి ఆయేషా ఉదంతాల రోజులు. ఆడపిల్లలు వంటరిగా పట్నమెళ్ళి చదువుకోవాలంటే , ఎక్కడ చూసినా ఒక అభద్ర భావన. 
పల్లెల గడపల్లోంచి పట్నానికి చదువులకోసం వచ్చే ఆడపిల్లలకు 
ఒక సురక్షితమైన ఆవాసం ఉండాలనీ..
ఒక అమ్మాయి చదువు,వృత్తి నైపుణ్యము ,ఆ కుటుంబానికంతా ఆసరా అవుంతుందనీ.. ఆయన చాలా స్పష్టంగా నమ్మారు. తనకు తోచినంతలో కళాశాల విద్యార్ధునిలకు ఒక వసతిగృహం ఏర్పాటులో చాలా కృషి చేశారు. డా. కాసరనేని జయప్రదాంబ డిగ్రీకళాశాలలకు అనుబంధమైన ఈ వసతి గృహానికి నాన్నగారికన్నా ఎక్కువ  ఆర్ధిక సహాయం  చేసిన వదాన్యులు ఉన్నప్పటికీ. ఆయన ఆలోచననీ  కృషిని దృష్టిలో ఉంచుకొని, వారి పేరునే నిర్ణయించారు డా. కాసరనేని జయప్రదాంబ కమిటీ వారు, డా.కాసరనేని సదాశివరావు గారి అధ్యక్షతన. 
అప్పుడు, నాన్నగారు ,"తన పేరు వద్దనీ అమ్మ పేరు పెట్టమనీ", ఆఖరుకి అమ్మపేరుతో నాన్నగారి పేరునీ కలిపి, ఇలా.
 ***

అప్పట్లో అమెరికా ప్రయాణం అంటే ,ఇంత హడావుడి!

పాలమూరు నుంచీ పరిగి నుంచీ,అదిలాబాద్ నుంచీ వరంగల్లు నుంచీ,కర్నూలు నుంచీ గుంటూరు నుంచీ నెల్లూరు నుంచీ, అయినవాళ్ళంతా వెళ్ళి వీడ్కోలు చెప్పి ,సాగనంపాం.
కల్వకూర్తి నుంచి వచ్చే చిరాకి (చి. రామకృష్ణయ్య గారు) గారిది నాన్నగారితో చిరకాల మైత్రి.ఎక్కడ ఉన్నా తప్పక హాజరయ్యి ,ఇలా తిలకం దిద్దేవారు. నీలి అంచుల పంచల చాపు కూడా చిరాకీ గారి కానుకే.అయితే,నాన్నగారెప్పుడూ అంచులున్న ధోవతి కట్టలేదు.వారి అభిమానంతో శాలువాలా కప్పుకొనే వారు.
అయితే, నాన్నగారికన్నా ముందుగా,చిరాకీ గారే తమ అఖరి- ప్రయాణం చేశారు.

***
All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

Nov 22, 2014

పొద్దొడ్డుకు జేరినమంటే..!!!

" మాయమై పోతున్నడమ్మా..
  మనిషన్నవాడు...
  ఓ చెల్లీ చెందురమ్మా..."
maayapOtunnaDammaa.. O chellee chendurammaa..Andesri
@ Balotsav 2014
PC" Amarendra Dasari garu. 

"  కలతల్ల  కదుముల్ల
  కల్లోల బతుకుల్ల ..
 కడమారి చితులల్ల
 కటికబారిన  వెతలల్ల..,
 ఇగ్గులాడి.....ఈదులాడి
పొద్దొడ్డుకు  జేరినమంటే,
పక పక నవ్వినమంటే...
                                ఇంతన్నా కొంతన్నా ఎంతన్నా ,
                            మనిషితనమున్నదన్నా
ఆ  మనిషితనమే
తోడాయన్నాన్నా..
తోడాయే నీడాయే
దరిచేర్చు తెడ్డాయే యన్నా.. 
                                   మనిషితనమున్నదన్నా...
                                   మంచితనమున్నదన్నా..
మాయమైన మడిసిని
ఒడుపుగా బట్టి...
మాపుల్ల రేపుల్ల
మాయ జేసి తెచ్చి ..

మన సుటుముట్టు జేరిన
ఈ చిటిపొటి బిడ్డల్ల
గుట్టు గుట్టుగా
నాటి  చూతమన్నా.. 
                                           మనిషితనమున్నదన్నా...
                                           మంచితనమున్నదన్నా..
 చిట్టి గుండేల్లోనా ..
నాటుకున్న మంచి
కరుకు వేటుకైనా బోదు ...
విషపుకాటుకైనా బోదు....

నిండారా గుండారా
కండ్లల్ల బెట్టి సాకుతరన్నా..
కంటిపాపోలే సాకుతరన్నా..

ఆకేసి పూవేసి
కాయేసి పండేసి..
విత్తుల్లా విరజిమ్ముతరన్నా...
                          అడవిలా వెలుగొందునన్నా...                                                                                                          మనిషితనమున్నదన్నా...    
మంచితనమున్నదన్నా..


ఈ లోకాన ఉన్న నదీనదాలన్నిటిని కలుపుతూ ఒక విశ్వగీతాన్ని రాయాలని ప్రయత్నిస్తున్న అందెశ్రీ గారికి, నమస్కారాలతో..Balotsav 2014 , PC: Amarendra Dasari garu.



All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

Nov 16, 2014

భద్రాద్రి... భద్రం. భద్రం !

ఇదే మొదటి సారి భద్రాచలం వెళ్ళడం. 
గోదావరమ్మకు  వాయినం ! 
అడిగిన వెంటనే ,కల్యాణి గారు ఆ పూట పనులన్నీ మానుకొనీ మరీ  ప్రయాణం ఏర్పాట్లు చేయడం, సాంబశివ రావు గారు సారధ్యం వహించడం వలన వీలుపడింది. మేము వెళ్ళే సరికి సాయంకాలమైంది.
" అదుగో భద్రాద్రి గౌతమి ఇదుగో చూడండి..." రామదాసు చెవుల్లో రింగు మంటుంటే , ఒక అద్భుతమైన  భావనతో గోదావరిని నావలను దాటుకొంటూ వెళ్ళాం.
 కార్తీక స్నానాలు చేయడానికి భక్తజనం  రాకపోకలు బాగానే ఉన్నాయట ఈ నడుమ. 
పై నుంచి  నిన్న కురిసిన వాన.  గోదారి మెట్లంతా  బురద . జారుడు మెట్లంటే అవే కాబోలు. 
అంచేత , కింద  చూపే కానీ , గోదారమ్మని  కళ్ళారా చూస్తూ నడవలేక పోయాం. 
తీరా వెళ్ళాక, అక్కడ శ్రాద్ధ  కర్మలు చేస్తోన్న  బృందం ఒకటి . మరో పక్కన , కార్తీక స్నానాల వారు. నావల వాళ్ళు కేకేసారు. కార్తీక స్నానాలకి అవతలి గట్టుకి తీసుకెళతాం రమ్మని . వేళ కాని వేళ. అయినా, చూసి వెళ్ళడానికి వచ్చినవారమే కదా!

ఒక ఒంటరి గువ్వ
ఒక ఒంటరి గువ్వలా ఒక అవ్వ 365 వత్తులను ముడేసి అమ్ముతోంది.ఒక్క మారు వెలిగిస్తే ఏడాది దీపారాధన చేసినట్లంట.  "బావుండే ఈ లెక్క! " అనుకొన్నాం.
ఆపై ఒక అక్క కార్తిక మాసం  గోదారమ్మ వాయినాలను , అరటి బోదేపై అమర్చి కొనుక్కోమంటూ వెంటాడింది. అది సమయం కాని సమయం.
మరొక అన్న , స్నానాలు చేసి వచ్చే వారి కోసం పొడి బట్టలు అమ్ముతున్నాడు.

వాయినాల అక్క ! 
వానకి చెదురయిన ,గూటిని కట్టుకొంటూన్నరు మరో జంట.

"గోదావరి కలుషితమై పోవడాన్ని చూస్తూ పెరిగాం కదా..." ఆతిదేయ దంపతులిద్దరూ వాపోయారు. 
"భద్రాద్రి ఒక పచ్చటిగుట్టలా ఉండేది.." జ్ఞాపకం చేసుకొన్నారు. 
గోదారి గట్టు 
'గోదావరి మరో కలుషిత గంగలా తయారవుతోందా?" వారు బాధ పడ్డారు.

అక్కడికి వెళ్ళాక కానీ తెలియలేదు. బాపూ గారు భద్రాద్రి ని ఎంత ఆప్యాయంగా తీర్చిదిద్దారో. 
ఆ కళాకృతుల తయారిలోనూ , ప్రతిష్టించడంలోనూ, ఆ తరువాత వాటి బాగోగులు చూడడం లోను.. బాపు గారుఎంతో శ్ర్ద్ధ తీసుకొణే వారట. రాముడంటే బాపు గారికి ఎంత ఇష్టమో మనకు తెలియనిది ఏముంది? బాపూ రేఖలు అలా శిల్పరూపంలో పలకరిచడం , ఎంతో రమ్యంగా ఉన్నది. ముఖకవళికలు హావభావాలు ఎంత ఒడుపుగా పట్టుకొన్నారో ఆ శిల్ప కారులు. వారికి జేజేలు.
కానీ, ఒక్కో బొమ్మను చూస్తూ నడుస్తోంటే , కలుక్కుమన్నది. వెలసి పోయిన రంగులు,

పోషణ లేమి కళ్ళకు కొట్టొచ్చినట్టు కనబడుతోంది.పెరిగిన కంప చెట్లు బొమ్మలను కప్పేస్తున్నాయి. ఇక, చుట్టూ "Junk foods " ప్లాస్టిక్ అవశేషాల గుట్టల మేటలు.
బాపూరామాయణం

గోదావరమ్మ బిడ్డలు, బాపు అభిమానులు , తెలుగు శిల్ప కళాభిమానులు, 
సీతారాముల అభిమానులు, భద్రాచల అభిమానులు పూనుకొంటేనే..
భద్రాద్రి... భద్రం. భద్రం !

 గోదావరమ్మ... శుభ్రం..శుభ్రం ! 

 ***
All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

Nov 12, 2014

శూన్యాల మాలలు

"రాయలేక పోతున్నప్పుడు ఎందుకు రాయలేకపోతున్నామో  రాయాలి కదా ..!
తీయలేకపోతున్నప్పుడు ఎందుకు తీయలేక పోతున్నామో తీయాలి కదా..!"

" ఒక మరణం" దర్శకుడిదే మరో సినిమా.. " శూన్యం "
ఎంతో సున్నితంగా..స్పష్టంగా ...సూటిగా.. ఒక చిన్న సినిమాను ఎలా తీయవచ్చో   అలా తీశాడీ తమ్ముడు.
 ఈనాటి జీవనంలో నానాటికీ పెరుగుతోన్న ,శూన్యాలను ప్రోదిచేసిన వైనం చాలా బావుంది.
వినోద్ గారికి వారి బృందానికి అభిమానాలు !
http://www.shortmovies.in/watch/soonyam-telugu-short-film-with-eng-subtitles-by-mrvinodanantoju-on-2012-05-04




All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

"తమ్ముడూ ... ఆగమ్మా !"










"తమ్ముడూ ... ఆగమ్మా నువ్వు. ఎక్కడికీ?"
"ఆ..ఆఫీసుకు సర్ "
"మీ రూం లో ఒకడు ఆత్మహత్య చేసుకొన్నాడు.."
" నాకు బాధగానే ఉంది. కానీ ,ఆఫీసులో చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది ప్లీజ్ సర్ ,లెట్ మి గో సర్ .!

http://www.shortmovies.in/watch/oka-maranam-short-film-by-varnam-by-mrvinodanantoju-on-2013-01-19

బాలోత్సవ్ లో చూపించిన రెండవ సినిమా.

Realted link: http://chandralata.blogspot.in/2014/11/2-2-5.html

***

All rights @ writer. Title,labels  postings and related copyright reserved.

Nov 11, 2014

2 + 2 = 5










 నిరంకుశ తత్వం ఎంత పురాతనమైనదో ,మానవ స్వేచ్చ అంతకన్నా పురాతనమైంది.

బహుశా , మన జంతుమూలాల్లోనే, ఇవి రెండూ సహ భావనల్లా వ్యక్తీకరించ బడ్డాయి.



దోపిడీ... దౌర్జన్యం... అణిచివేత ... దుర్మార్గం ఒక పక్క..
స్వేచ్ఛ ..స్వతంత్రం ... ఆలోచన ..భావ ప్రకటన ... మరోపక్క..

మొదటి దానికి దగ్గరవుతున్నకొద్దీ ,మన జంతు మూలాలకు దగ్గరగాను,
రెండవ దానికి దగ్గరవుతున్న కొద్దీ ,    మానవ ప్రకృతికి చేరువగాను ..
మనం జరుగుతూ ఉంటాం .

మన ప్రయత్నాలన్నీ, మరింత మానవులుగా మనలను మనం తీర్చిదిద్దుకోవడానికే కదా !

బావక్ అన్వారి రచించి, దర్శకత్వం వహించి ,నిర్మించిన 2 + 2 = 5  అనే పర్షియన్ భాషలోని ఇరానియన్ సినిమా   అలాంటిదే. ఈ సినిమాకు తరగతి గది  నేపధ్యం కావడం మనం అందరం మరింత శ్రద్ధగా ఆ  సినిమా చూడవలసిన అవసరాన్ని వత్తి చెపుతుంది.
 2+2=5 అన్న జార్జ్ ఆర్వెల్ "1984" నవలానాయకుడు  నియంతృత్వ దురంతాలను ఖండిస్తూ చేసిన వ్యాఖ్యానం అది.. నియంత చెపితే రెండు రెళ్ళూ  అయిదేగా ! అన్నది.
కొస మెరుపు : ఈ సినిమా బాలోత్సవ్ లో " లఘుచిత్ర సమీక్ష" కొరకు ప్రదర్శించారు డా.నరేంద్ర గారు.
http://www.reckontalk.com/225-two-two-must-see-nominated-as-best-short-film-bafta-awards/

మరి పిల్లలూరుకొంటారా? తరగతినీ, పంతుళ్ళనూ, విద్యావ్యవస్థను ఉతికి ఆరేసారు!
అయితే, ఈ సినిమా అంతకు మించినదీ కావడం చేత మనమందరమూ చూసి తీరాలి. ఆలోచించాలి.
***
డా.నరేంద్ర గారికి ధన్యవాదాలతో 
***

All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

Nov 10, 2014

కారా మాష్టారితో కాసేపు.

మా ఇంటిలో కారా మాష్టారు.  1998 జనవరి 
రెండు పడవల్లో మునకలేస్తున్న రోజులవి.
మా పక్క వీధిలో ఉండే , కాళిదాసు పురుషోత్తం గారు ఆ పూట ఎందుకనో పొద్దున్నే ఫోను చేశారు. 
" నిన్న సాయంత్రం సభ. మీరు వస్తారో రారో అనుకొని , పిలవలేదు. కానీ వారు నెల్లూరు రాగానే , ఒక్కటే అడిగారు. "అమ్మాయిని ఒక సారి తప్పక చూడాలి .వీలు పడుతుందా అని."
ఎవరైనా మా బంధువులో ,మా నాన్న గారి స్నేహితులో అనుకొన్నాను. అమ్మాయి అని అనే సరికి. 
 ఏ పని మీద వచ్చినా ,  నన్ను పలకరించి వెళతారు కదా అలాగే  అనుకొన్నాను.  
ఎందుకంటే, మా బంధువులకన్నా సాహితీ బంధువులే ఇక్కడి దాకా వచ్చేవారు.పక్క వీధిలోని పురమందిరానికి కూడా నేనప్పుడు వెళ్ళగలిగే దానిని కాదు. ఈ మధ్య వరకూ .
సభా సమావేశాల సంగతులు పత్రికల్లో తెలిసేవి. వారే పెద్ద మనసు చేసుకొని, మా ఇంటికి వచ్చి 
 నన్ను పలకరించి వెళ్ళేవారు. 

"ఇంతకీ, ఆ వచ్చిన వారెవరు ?" వారి మొహమాటాన్ని నా కుతూహలం ముంచేసింది.
 కారా మాష్టారు !!!
 "భలే వారే! ఎంత మాట ! నేనే వచ్చేనా మీ ఇంటి దాకా ! "
1998, At our Home , Nellore 
"లేదు లేదు .. ఆంతరంగిక సమావేశం జరుగుతోంది మధ్యాహ్నం వరకు" అన్నారు.
"అయితే , మధ్యాహ్నం మా ఇంట్లో  కలుద్దామా"  కాళిదాసుగారు కాస్తంత  సందేహిస్తున్నా, కారా మాష్టారు టక్కున వొప్పుకొన్నారు.
అవి కథా నిలయం మొదలెట్టిన తొలిరోజులు. మాష్టారు తమ బ్రహత్ ప్రయత్నానికి నూలుపోగులు పోగు చేస్తునారు. స్వయంగా
 .  ఒక్కో పుల్లనూ ఒక్కో పుడకనూ ...అక్కడ ఇక్క డ ఎక్కడ వీలైయితే అక్కడ నుంచి ,మెల్లి మెల్లిగా తీసుకెళ్ళి ,కథల గూడును అల్లుతున్నారు. 
 పదిలంగా. పదికాలాలు నిలిచేలా .

"యజ్ఞం తో తొమ్మిది "నేను శ్రద్ధగా చదివిన ఆ నాటి కథాసంపుటాల్లో మొదటి వరుసలో ఉన్నది
వారెంత సౌమ్యంగా మాట్లాడారో ... యజ్ఞం తాలుకు రౌద్రం ఆనవాళ్ళు మచ్చుకైనా దొరలలేదు. వారి మాటల్లో మన్ననలో. 
కళ్ళింత చేసుకొని మా చుట్టూ గింగిరాలు కొడుతోన్న  బాబుతోనూ అంతే సౌమ్యంగా మాట్లాడారు. 

అప్పటికే  నాబోటి అడపాదడపా రచయిత కథలు కూడా వారివద్ద ఉన్నాయి. తమదాకా చేరని , కథల ఆనవాళ్ళు వారే చెప్పి, ఎలాగైనా కథానిలయానికి చేర్పించ మన్నారు. ఏ పూటైనా అటు వైపు వెళితే , తప్పక వచ్చి వెళ్ళమన్నారు. 

నా కథలన్నీ , వారికి చేరేదాకా , వారి ఉత్తరాలు వచ్చాయి. మరల మరల ఆహ్వానాలు అందుతూనే  ఉన్నాయి .

వారు నన్ను అడిగిందొకటే
"నవల రాసిన అనుభవం ఎలా ఉన్నదని,
" ఒకే పాత్రలతో నూరు కథలు రాసినట్టుందన్నాను."

 "ఎట్టి పరిస్థితిలోనూ కథలను మరవద్దు "

వారు నాకు చెప్పింది ఇది ఒకటే .
వారు మనందరికీ చెప్పింది ఇది ఒకటే.

ఎక్కడెక్కడి నుంచి ఆ గూటిలో చేరి ,
నిన్నమొన్నా కువకువలాడిన కథలపిట్టలన్నీ
వారి వారి గూళ్ళకి చేరిపోయి ఉంటాయి. 
వారి ఆప్యాయత  మాష్టారికి మరింత బలాన్ని , రోగ్యాన్ని సమకూర్చ గలదని అనుకుంటూ..

" దూరాన ఉన్నా  కథల రూపంలో  వారింటనే  లేనూ ?"నాకు నేను నచ్చ చెప్పుకొంటూ,
కథలమాష్టారికి జేజేలు  తెలుపుకొంటున్నాను.
వినమ్రంగా!

కథ కలకాలం నిలిచి వుండు గాక !
కథల గూడు పదికాలాల పాటు పదిలంగా ఉండు గాక! 
***
ఏనాడైనా నా కథల మూల ప్రతులు వెతుక్కుంటూ నేనక్కడి వెళ్ళనా ?
***
కథానిలయం ఇప్పుడు మీట దూరాన !  http://kathanilayam.com/
***


All rights @ writer. Title,labels, postings and related copyright reserved.