Nov 10, 2014

కారా మాష్టారితో కాసేపు.

మా ఇంటిలో కారా మాష్టారు.  1998 జనవరి 
రెండు పడవల్లో మునకలేస్తున్న రోజులవి.
మా పక్క వీధిలో ఉండే , కాళిదాసు పురుషోత్తం గారు ఆ పూట ఎందుకనో పొద్దున్నే ఫోను చేశారు. 
" నిన్న సాయంత్రం సభ. మీరు వస్తారో రారో అనుకొని , పిలవలేదు. కానీ వారు నెల్లూరు రాగానే , ఒక్కటే అడిగారు. "అమ్మాయిని ఒక సారి తప్పక చూడాలి .వీలు పడుతుందా అని."
ఎవరైనా మా బంధువులో ,మా నాన్న గారి స్నేహితులో అనుకొన్నాను. అమ్మాయి అని అనే సరికి. 
 ఏ పని మీద వచ్చినా ,  నన్ను పలకరించి వెళతారు కదా అలాగే  అనుకొన్నాను.  
ఎందుకంటే, మా బంధువులకన్నా సాహితీ బంధువులే ఇక్కడి దాకా వచ్చేవారు.పక్క వీధిలోని పురమందిరానికి కూడా నేనప్పుడు వెళ్ళగలిగే దానిని కాదు. ఈ మధ్య వరకూ .
సభా సమావేశాల సంగతులు పత్రికల్లో తెలిసేవి. వారే పెద్ద మనసు చేసుకొని, మా ఇంటికి వచ్చి 
 నన్ను పలకరించి వెళ్ళేవారు. 

"ఇంతకీ, ఆ వచ్చిన వారెవరు ?" వారి మొహమాటాన్ని నా కుతూహలం ముంచేసింది.
 కారా మాష్టారు !!!
 "భలే వారే! ఎంత మాట ! నేనే వచ్చేనా మీ ఇంటి దాకా ! "
1998, At our Home , Nellore 
"లేదు లేదు .. ఆంతరంగిక సమావేశం జరుగుతోంది మధ్యాహ్నం వరకు" అన్నారు.
"అయితే , మధ్యాహ్నం మా ఇంట్లో  కలుద్దామా"  కాళిదాసుగారు కాస్తంత  సందేహిస్తున్నా, కారా మాష్టారు టక్కున వొప్పుకొన్నారు.
అవి కథా నిలయం మొదలెట్టిన తొలిరోజులు. మాష్టారు తమ బ్రహత్ ప్రయత్నానికి నూలుపోగులు పోగు చేస్తునారు. స్వయంగా
 .  ఒక్కో పుల్లనూ ఒక్కో పుడకనూ ...అక్కడ ఇక్క డ ఎక్కడ వీలైయితే అక్కడ నుంచి ,మెల్లి మెల్లిగా తీసుకెళ్ళి ,కథల గూడును అల్లుతున్నారు. 
 పదిలంగా. పదికాలాలు నిలిచేలా .

"యజ్ఞం తో తొమ్మిది "నేను శ్రద్ధగా చదివిన ఆ నాటి కథాసంపుటాల్లో మొదటి వరుసలో ఉన్నది
వారెంత సౌమ్యంగా మాట్లాడారో ... యజ్ఞం తాలుకు రౌద్రం ఆనవాళ్ళు మచ్చుకైనా దొరలలేదు. వారి మాటల్లో మన్ననలో. 
కళ్ళింత చేసుకొని మా చుట్టూ గింగిరాలు కొడుతోన్న  బాబుతోనూ అంతే సౌమ్యంగా మాట్లాడారు. 

అప్పటికే  నాబోటి అడపాదడపా రచయిత కథలు కూడా వారివద్ద ఉన్నాయి. తమదాకా చేరని , కథల ఆనవాళ్ళు వారే చెప్పి, ఎలాగైనా కథానిలయానికి చేర్పించ మన్నారు. ఏ పూటైనా అటు వైపు వెళితే , తప్పక వచ్చి వెళ్ళమన్నారు. 

నా కథలన్నీ , వారికి చేరేదాకా , వారి ఉత్తరాలు వచ్చాయి. మరల మరల ఆహ్వానాలు అందుతూనే  ఉన్నాయి .

వారు నన్ను అడిగిందొకటే
"నవల రాసిన అనుభవం ఎలా ఉన్నదని,
" ఒకే పాత్రలతో నూరు కథలు రాసినట్టుందన్నాను."

 "ఎట్టి పరిస్థితిలోనూ కథలను మరవద్దు "

వారు నాకు చెప్పింది ఇది ఒకటే .
వారు మనందరికీ చెప్పింది ఇది ఒకటే.

ఎక్కడెక్కడి నుంచి ఆ గూటిలో చేరి ,
నిన్నమొన్నా కువకువలాడిన కథలపిట్టలన్నీ
వారి వారి గూళ్ళకి చేరిపోయి ఉంటాయి. 
వారి ఆప్యాయత  మాష్టారికి మరింత బలాన్ని , రోగ్యాన్ని సమకూర్చ గలదని అనుకుంటూ..

" దూరాన ఉన్నా  కథల రూపంలో  వారింటనే  లేనూ ?"నాకు నేను నచ్చ చెప్పుకొంటూ,
కథలమాష్టారికి జేజేలు  తెలుపుకొంటున్నాను.
వినమ్రంగా!

కథ కలకాలం నిలిచి వుండు గాక !
కథల గూడు పదికాలాల పాటు పదిలంగా ఉండు గాక! 
***
ఏనాడైనా నా కథల మూల ప్రతులు వెతుక్కుంటూ నేనక్కడి వెళ్ళనా ?
***
కథానిలయం ఇప్పుడు మీట దూరాన !  http://kathanilayam.com/
***


All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

1 comment: