Aug 25, 2013

యథా ....తథా....

ఇష్టం లేనప్పుడు...
నష్టం జరిగినప్పుడు ...
కష్టం కలిగినప్పుడు ...
మనం...
మాములు మనుషులం...
ఏమవుతున్నాం?
కిట్టప్ప పంతులు ఏమంటున్నారంటే...

Keelu Bommalu (Telugu)"వెనుకటి కవులు పద్యపాదం పూర్తి కాకపోతే ఎలమిన్,ధరిణిన్,చూడన్ అనీ,యతి స్థానంలో అయితే దీవ్యత్ ,శుంభత్, స్ఫాయత్ వగైరాలు వాడుతూ ఉండేవారు.నేడు రాజకీయ నాయకులు సాంఘిక సమస్యలను పరిష్కరించలేక పోయినప్పుడు  ఆర్డినెన్సులు,అరెస్టులు,లాటీ చార్జీలు  ,నిర్బంధాలు ప్రయోగిస్తున్నారు.రెండూ అసమర్దతనే వ్యక్తం చేస్తాయి.
 కళాధర్మాన్ని బట్టి మొదటిదీ,జీవితధర్మాన్ని బట్టి రెండవది దూష్యం. విజ్ఞులకు రెండూ సహించరానివే.
 అయితే రెండోది మరీ దుర్భరం.ఎందుకంటే ,మొదటిదాన్నుంచి తప్పించుకోవచ్చు. ఇష్టంలేనప్పుడు పుస్తకాన్ని విసిరిపుచ్చుకొని అవతల పారేస్తాము.
రెండోది అలా కాదు. ఇష్టం కాని ప్రభుత్వాన్ని వదిలించుకోవడం ప్రాణాంతకమే కానీ మరొకటి కాదు. 
అయితే ప్రజాస్వామిక దేశాల్లో ఇష్టం కాని ప్రభుత్వాలను వదిలించుకోవచ్చును కదా అనిపించవచ్చును.కాని ఇటీవలి చరిత్ర చూస్తే అంతా దుర్భ్రమలాగా కనిపిస్తున్నది. "

."కీలుబొమ్మలు"  (1951) ,జి.వి. కృష్ణా రావు

"The poets of the past used words that were not entirely meaningful as fillers,either at end of the line or in the gaps of the poem's structure. just to adhere the to the rules of  prosody.Likewise today's politicians when unable to solve problems,administer ordinances,make arrests,order lathi charges and arrange judicial custody.In both prosody and politics these are expressions of incompetence: from an aesthetic point of view the first ,and from law of life the second are reprehensible. the wise find both intolerable but the later is more disgusting because escape from the former is possible.If we don't like  a book we can toss it away.the later is different. To try and get rid of a distasteful government is short of fatal.It may appear that unpopular governments can be dislodged in democratic countries.But an examination of recent history proves how illusory the possibility is."

Puppets (1951) G.V.KrishanRao
Translated by D.Kesava Rao
***
All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

Aug 24, 2013

మరి, దానినలా వంటరిగా వెలగనీ!

నిజానికి, ఈ పద్యం ముందో ఆ పాట ముందో సరిగ్గా గుర్తు లేదు కానీ,
ఈ  పల్లె పిల్ల-పదాలు  మాత్రం తెలియకుండానే ..
అవి నాలో ఒక భాగమై పోయాయి.
ఎన్ని మార్లు నాలో నేను వల్లెవేసుకొన్నానో! మననం చేసుకున్నానో !
ఒకానొక రోజున ,
ఎప్పటిలాగానే పల్లెపిల్లలతో కలిసి , కథాకాలక్షేపం చేస్తున్నామా...
పిల్లలు ఒక్కొక్కరు ఒక్కో రూపం దాల్చేసారు.
రామచిలుక,మందారం, మేఘం,కొండ ,సీతాకోక చిలుక ,లడ్డు..అంతే కాదు ఎలుక,పిల్లి, కాకి ,ఏనుగు .. ఆపైన ,మురుగు కాలువ, డప్పు, ముంత, చీపురు... ఇలా ఎవరికి తోచినట్లు వారు.
ఒకబ్బాయి , ఈ నాలుగు ముక్కలు ఒక నలిగిన కాగితం మీద వంకరటింకరగా గబ గబా రాసేసి,
నా చేతిలో కుక్కేసి ...  పరిగెత్తి పో యాడు. ఆగమన్నా ఆగకుండా.
ఆ పైన తీరిగ్గా ,అన్నీకాగితాలు తిరగేద్దును కదా..ఇదుగో ఇలా పలకరించాడు . నిదానంగా.నిమ్మళంగా.
నా లో లోకి ఇంకి పోయిన ఆ నాలుగు పదాల వయసు ఏడేళ్ళ పై మాటే! అయితేనేం!ఎప్పటికప్పుడు పచ్చ గానే పలకరిస్తాయి .ఫ్రాస్ట్ గారి పసుపు పచ్చని అడవిలాగా.
అయినా,
I shall be telling this with a sigh అంటూ Frost లాగా తరాల ఒరవడిలో పండిపోయిన మాటలా అవి?
ఒట్టి పసితనపు  అమాయకత్వమే  కావచ్సుకాక!

అది భిన్నత్వమా? వ్యక్తిత్వమా?జీవన తత్వమా?
తెలియదు కానీ...
మనలో కొందరికైనా ఎప్పుడోఒకప్పుడు  ఎందుకో ఒకందుకు అనిపించకపోదు సుమా..!
and I—
I took the one less traveled by,
And that has made all the difference.
నిజమే.
కొత్తదారి కొత్తపోకడ ...ఏకాకి పయనం ...ఇవన్నీ..చప్పున రవీంద్రుని పదాలను జ్ఞాపకం తేవూ..
"ఏక్లా చలో రే"..అంటూ.
 అందుకేనేమో..
ఎప్పుడు ఏకాకితనం తలుపు తట్టినా... Frost తో  పాటు రవీంద్రుడు చిన్ని అరుణూ  చెట్టాపట్టాలేసుకొని నన్ను పలకరిస్తారు.పలకరిస్తూనే ఉన్నారు!
***
ఇవిగోండి.
వినగల వారికి విన గలిగినంత!
Eklaa chalO re

చదవ గలిగిన వారికి చదవ గలిగినంత.
Ekla_Chalo_Re

వీటితో పాటే ఈ నాలుగు పదాలున్నూ ...!

***
All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

Aug 21, 2013

అక్షర సాక్షిగా

ఇప్పుడే తెలిసింది.
మాలతి గారు ఇక లేరని.
నిన్న కాక మొన్ననే కదా వారు నాతో మాట్లాడిందీ.
వారింటికి రమ్మని ఆహ్వనించిందీ.ఇంతలోనే ఇలాంటి వార్తా..?
 వెన్నెల చాటున ఆకుల మాటున ఒదొగొదిగిన మలతీ పరిమళాల లను మాటల గుప్పిట బిగించబోలేం కదా!
"జగతి"నెరిగిన మాలతిచందుర్ గారి గురించి మాట్లాడబోతే , అది సాహసం కాదూ?
కాలానికి కలానికీ  ఉన్న అవినాభవ అనుబంధాన్ని వారి పాఠక దృష్టి అవగతం చేసుకొన్నంతగా, వారి సృజనాత్మక సృష్టీ అంతర్లీనం చేసుకొన్నది. ఇది నిజంగా అద్బుతమైన సమన్వయం గా తోస్తుంది.
ఒక పాఠకురాలు కావడం, అందునా, విమర్శనాత్మక పాఠకురాలు కావడం,
తనకు నచ్చిన నవలలెన్నిటినో ..కాల స్థల సాంస్కృతిక పరిధులచే ప్రభావితం కానివ్వకుండా,  తన అక్షరాలలోసృజనాత్మకంగా ముడిచి,
మన తెలుగింటి ముంగిట్లోకి  వచ్చి పలకరిచడం ,
మాలతి గారి కలానికే చెల్లు.
***
సరిగ్గా ఇలాంటి ఒక శ్రావణ మాసం ఉదయాన్నే,
వారు నాతో మొదట మాట్లాడారు.
 రేగడి విత్తులు మొలకెత్తిన వేళది .
 "రేగడివిత్తుల చంద్రలతతోనే కదా నేను మాట్లాడుతున్నాను.."
ఫోనులో నాజూకుగా తేటగా ఒక అపరిచిత కంఠం.
  "అవునండి. కానీ, సారీ, మిమ్మల్ని నేను .."
" ఎలా గుర్తుపడతావు.ఇదే కదా మొదటి సారి మాట్లాడడం.రాత్రే నీ నవల చదివాను.బాగా నచ్చింది.పొద్దున్నే నీతో మాట్లాడాలనిపించింది. "
కాస్తాగి,నేను మరో మాట మాట్లాడే లోపలే అన్నారు,
" నీ పుస్తకం చదవకుండానే చెపుతున్నానేమో అనుకుంటున్నావా? విను. రామనాథం మామిడి చెట్టు కింద పడుకుంటే కరెంట్ చీమలు కుట్టాయి అని  రాసి ఊరుకోలేదు నువ్వు. అవి రామనాథం చెవితమ్మెదాకా ఎలా వెళ్ళాయో ,చెవితమ్మెని సుతారంగా కుట్టాయో రాసావు నువ్వు! ఇప్పటికైనా నమ్మకం కుదిరిందా నీ పుస్తకాన్ని ఒక్క అక్షరం వదలకుండా చదివేననీ! చదివించావు!"
నా బిడియం తెలిసినట్లుగా ,ఆవిడ హాయిగా నవ్వారు."నేను మాలతిని.మాలతీ చందూర్ ని"
ఇక, ఆపై నా బాల్యోత్సాహాన్నీ  ,వారి ప్రోత్సాహాన్ని ఊహించుకొందురుకాక!
***మాలతి గారు చందూర్  గారు ,క్రమం తప్పకుండా పలకరిస్తూనే ఉన్నారు.అటు "జగతి"తో .ఇటు పోస్టుకార్డులతో.అప్పుడప్పుడూ ఫోనులతోనూ.
వారినుంచి ,తెలుసుకొన్నది ఒకటా...రెండా..!
చదవవలసినవి ఎన్నున్నాయో! నేర్వవలసినవి మరెన్నో !
మానవ సంబంధాలలోని సౌకుమార్యాన్ని పదిలపరిచిఉంచుకోవడం.స్నేహభావనను దాంపత్య ఔన్నత్యాన్ని అర్ధం చేసుకోగలగడం.సృజనశీలతను ఆనందించడం.నూతనత్వాన్ని ఆహ్వానించడం.   
***
సరిగ్గా ఇలాంటి ఒక శ్రావణపౌర్ణమి.  
సంజీవదేవ్ గారు కాలంలో కలిసిపోయారు.
ఇప్పుడు మాలతి గారు.
***
కాలానికి అతీతమైన వారందరూ ..
అక్షర సాక్షిగా అజరామరులు.
మాలతి గారికి జేజేలు.
ప్రపంచసాహిత్యాన్ని  నవలారూపాన్ని పరిచయం చేసినందుకు ...
వారికి ధన్యవాదాలు.
తేటగా సూటిగా కలంబాటను నిర్వచించిన ...
వారికి నమస్కారాలు.
దశాబ్దాల స్నేహానికి ,
కన్నీటి వీడ్కోలు!
ఆప్యాయంగా!
***
All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

Aug 11, 2013

ప్రజా....రాజ్యం!

అనకూడదు కానీ... 
అనగా అనగా...
అన్నో ఇన్నో భావాలు .భావనలూ ...
మన ఆలోచనల్లోకి అట్టే ఇంకి పోతాయి.
ఎంత సహజంగా ..ఎంత లోతుగా అంటే .. మనం వాటిని వేలెత్తి చూపడం  సంగతి అటుంచి ,
కళ్ళెత్తి చూడడం మానేస్తాం సుమా!
ఇదుగోండి ,ఒక యువ రచయిత భావాలూ ఎలా ఉన్నాయో..


మనమూ బహుశా ఆ దారినే నడిచివెళ్ళుంటాం.ఆ అక్షరాల్ని చదివివుంటాం.మనకూ అనిపించే ఉండివుండొచ్చు.. అవునుస్మీ.. మనం మన ప్రజా స్వామ్య గణతంత్ర దేశ  గౌరవపౌరులమండోయ్ ..అనీ! అనిపించలేదూ?
అయితే,  తప్పక ఈ రచయిత కళ్ళతో చూడండి.ఒక మారు.
ఆ పై మళ్ళీ ఆలోచిద్దాం.
మరొక సారి , ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుకొందాం.
గుండెల నిండా ఊపిరి పీల్చుకొని!
***

***
http://www.prabhavaschool.com/
***
http://prabhavabooks.blogspot.in/
***

All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

Aug 4, 2013

ఒక్కరున్న నేమి?

మొన్నా మధ్యన,
 ఈ దారినే కదా వంటరిగా నడిచెళ్ళింది.
మండుటెండ.
ఒట్టి మేఘమైనా ఇటు సాగిందా?
వడగాడ్పు ఈడ్చికొట్టింది కదా?
గరిక పూచైనా కంటపడిందా?
నెర్రెలుబారిన నేల . అర్రులు చాస్తున్న భూమి.

అలా రోహిణి కార్తె ముగిసిందో లేదో ..మొదటి మెరుపు  మెరిసిందో లేదో...
తొలి ఉరుము ఉరిమిందో లేదో .. ఏరువాక కారుమబ్బు సాగిందో లేదో..

పిడికిడు వడగళ్ళతో బాటు చిటి చిటి చినుకులు నాలుగు అలా నేలను పలకరించడం ఆలస్యం.
భూమి బుర బురా పొంగినట్లు ..పుడమి  పులకరించినట్లు..
కమ్మటి వాసలతో పాటు ... చెంగున పైకి లేచింది ఈ నునులేత పూకాడ.
చూస్తుండగానే .. విప్పారుతూ కన్నుల పండువగా విరబూసింది.పచ్చటి ఆకుల పొత్తిళ్ళ నడుమ.

ఎర్రటి ఎండ రంగును దిద్దుకొని . ఇంద్రచాపాలని వెంటబెట్టుకొని.
ఆశ్చర్యంగా.అపురూపంగా.అద్బుతంగా.

అచ్చంగా అదాటున పక్కన నిలిచి,వెన్నుతట్టే  పలకరించే నేస్తంలా.
ఆదమరిచిన వేళ .ఆపదవేళ.

నేనున్నాను లెమ్మంటూ.

వంకర దారులు పట్టకుండా,
చెవినులిమే మంచినేస్తం ఒక్కరున్న నేమి?

మిత్రకోటికి శతకోటి వందనాలు.

స్నేహితుల రోజు శుభాకాంక్షలు.
***
మా బళ్ళో 
మే ఫ్లవర్ పూచింది చూచారా?
***
ప్రభవ  పిన్నాపెద్దలు!
****
భల్లే భల్లే !!!
http://prabhavabooks.blogspot.in/
http://www.prabhavaschool.com/#!home/c1ngg
***
All rights @ writer. Title,labels, postings and related copyright reserved.