Aug 21, 2013

అక్షర సాక్షిగా

ఇప్పుడే తెలిసింది.
మాలతి గారు ఇక లేరని.
నిన్న కాక మొన్ననే కదా వారు నాతో మాట్లాడిందీ.
వారింటికి రమ్మని ఆహ్వనించిందీ.ఇంతలోనే ఇలాంటి వార్తా..?
 వెన్నెల చాటున ఆకుల మాటున ఒదొగొదిగిన మలతీ పరిమళాల లను మాటల గుప్పిట బిగించబోలేం కదా!
"జగతి"నెరిగిన మాలతిచందుర్ గారి గురించి మాట్లాడబోతే , అది సాహసం కాదూ?
కాలానికి కలానికీ  ఉన్న అవినాభవ అనుబంధాన్ని వారి పాఠక దృష్టి అవగతం చేసుకొన్నంతగా, వారి సృజనాత్మక సృష్టీ అంతర్లీనం చేసుకొన్నది. ఇది నిజంగా అద్బుతమైన సమన్వయం గా తోస్తుంది.
ఒక పాఠకురాలు కావడం, అందునా, విమర్శనాత్మక పాఠకురాలు కావడం,
తనకు నచ్చిన నవలలెన్నిటినో ..కాల స్థల సాంస్కృతిక పరిధులచే ప్రభావితం కానివ్వకుండా,  తన అక్షరాలలోసృజనాత్మకంగా ముడిచి,
మన తెలుగింటి ముంగిట్లోకి  వచ్చి పలకరిచడం ,
మాలతి గారి కలానికే చెల్లు.
***
సరిగ్గా ఇలాంటి ఒక శ్రావణ మాసం ఉదయాన్నే,
వారు నాతో మొదట మాట్లాడారు.
 రేగడి విత్తులు మొలకెత్తిన వేళది .
 "రేగడివిత్తుల చంద్రలతతోనే కదా నేను మాట్లాడుతున్నాను.."
ఫోనులో నాజూకుగా తేటగా ఒక అపరిచిత కంఠం.
  "అవునండి. కానీ, సారీ, మిమ్మల్ని నేను .."
" ఎలా గుర్తుపడతావు.ఇదే కదా మొదటి సారి మాట్లాడడం.రాత్రే నీ నవల చదివాను.బాగా నచ్చింది.పొద్దున్నే నీతో మాట్లాడాలనిపించింది. "
కాస్తాగి,నేను మరో మాట మాట్లాడే లోపలే అన్నారు,
" నీ పుస్తకం చదవకుండానే చెపుతున్నానేమో అనుకుంటున్నావా? విను. రామనాథం మామిడి చెట్టు కింద పడుకుంటే కరెంట్ చీమలు కుట్టాయి అని  రాసి ఊరుకోలేదు నువ్వు. అవి రామనాథం చెవితమ్మెదాకా ఎలా వెళ్ళాయో ,చెవితమ్మెని సుతారంగా కుట్టాయో రాసావు నువ్వు! ఇప్పటికైనా నమ్మకం కుదిరిందా నీ పుస్తకాన్ని ఒక్క అక్షరం వదలకుండా చదివేననీ! చదివించావు!"
నా బిడియం తెలిసినట్లుగా ,ఆవిడ హాయిగా నవ్వారు."నేను మాలతిని.మాలతీ చందూర్ ని"
ఇక, ఆపై నా బాల్యోత్సాహాన్నీ  ,వారి ప్రోత్సాహాన్ని ఊహించుకొందురుకాక!
***మాలతి గారు చందూర్  గారు ,క్రమం తప్పకుండా పలకరిస్తూనే ఉన్నారు.అటు "జగతి"తో .ఇటు పోస్టుకార్డులతో.అప్పుడప్పుడూ ఫోనులతోనూ.
వారినుంచి ,తెలుసుకొన్నది ఒకటా...రెండా..!
చదవవలసినవి ఎన్నున్నాయో! నేర్వవలసినవి మరెన్నో !
మానవ సంబంధాలలోని సౌకుమార్యాన్ని పదిలపరిచిఉంచుకోవడం.స్నేహభావనను దాంపత్య ఔన్నత్యాన్ని అర్ధం చేసుకోగలగడం.సృజనశీలతను ఆనందించడం.నూతనత్వాన్ని ఆహ్వానించడం.   
***
సరిగ్గా ఇలాంటి ఒక శ్రావణపౌర్ణమి.  
సంజీవదేవ్ గారు కాలంలో కలిసిపోయారు.
ఇప్పుడు మాలతి గారు.
***
కాలానికి అతీతమైన వారందరూ ..
అక్షర సాక్షిగా అజరామరులు.
మాలతి గారికి జేజేలు.
ప్రపంచసాహిత్యాన్ని  నవలారూపాన్ని పరిచయం చేసినందుకు ...
వారికి ధన్యవాదాలు.
తేటగా సూటిగా కలంబాటను నిర్వచించిన ...
వారికి నమస్కారాలు.
దశాబ్దాల స్నేహానికి ,
కన్నీటి వీడ్కోలు!
ఆప్యాయంగా!
***
All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

2 comments:

  1. Ammaa- Malathi gaari smuthi ki nee nivaali 'aardram' gaa vundi- bahusa; kanneeta munchi vraasi untaavu- babayi

    ReplyDelete
  2. మాలతీచందూర్ గారు రచయితలకు రచయిత!అరుదైన,అపూర్వమైన మూర్తిమత్వంతో తెలుగు పాటకులకు అభిరుచిని నేర్పి వారి స్థాయిని పెంచి ఉన్నత ప్రమాణాలు పాటించారు!తెలుగుసాహిత్యంలో శిఖరస్తాయిని చేరుకున్నారు!మాలతి గారు ఒక వేగుచుక్క!రేగడివిత్తుల చంద్రలతగారు వారితో పెనవేసుకొన్న తమఅనుబంధాన్ని ఆర్ద్రంగా గుర్తుచేసుకున్నారు!

    ReplyDelete