Jan 9, 2011

అలవోకగా వచ్చి

మా తిరుమలదేవుని గుట్ట బడికి ఆడుతూపాడుతూ బయలుదేరినట్లు గుర్తులేదు.
మా  మూడు గదుల ఇంట్లో  ఏమీ చదవనని మొండికేసిన మా  పెద్దమేనత్త కుమారుడి దగ్గర్నుంచి ,
చదువుకోసమని అమ్మని వదిలివచ్చిన పెదనాన్న మనవడి వరకు ఏడెనిమిది మంది పిల్లాపెద్దలు.
తెమలని పని మధ్యలో, 
పొద్దున్నే బడికి బద్దకించే నా బోంట్లకు ,
 అమ్మ చీవాట్లు మొట్టి కా యలు.
బడికి తలుచుకోగానే , మల్లమ్మ టీచరు వేయించే ముక్కుచెంపలు ,గోడకుర్చీవేయించే లింగమ్మ టీచరు ,గుర్తొచ్చి ముచ్చెమట్లు పట్టపట్టవూ పొద్దున్నే !
చెక్క స్కేలు తీసుకొని వేళ్ళమీద కొట్టారో ఇక అంతే సంగతులు!
వెళ్ళకపోతే అమ్మ... వెళితే టీచరమ్మ .
ఎట్లైనా పొద్దున్నే  నా లాంటి పిల్లలకు దెబ్బలు తప్పేవి కావు కదా!
ఈ మధ్యలో బడి.
మా ఒకటీ రెండూ తరగతులు ఎప్పుడూ చెట్ల కిందే.
మా బడి చుట్టూ కంచెలా పెరిగిన తుమ్మచెట్లు. బడికి వెళ్ళినా తీసుకెళ్ళిన మట్టిపలకలలో ఒక్కటన్నా ఒక్కరిదన్నా పగులు లేకుండా ఉండేది కాదు.
 ఊరికే పగలకొట్టుకొనే వాళ్ళం. పలకముక్కలతోనే బోలెడు మంది ఒకటోతరగతి గటేక్కేవారం.
మా అసలు పలక వేరే ఉంది. బాసింపట్ట పెట్టుకొని నేల మీద  కూర్చుని ,  
 ఇసుకను చదరంగా తట్టి ,
పలకలా చేసుకొని ,వేలితో రాసుకొనే వాళ్ళం.హాయిగా తోచినప్పుడు చెరిపేసుకోవచ్చు. 
మళ్ళీ తట్టుకొని చదరంగా చేసుకోవచ్చు.
సరిగ్గా అట్లా రాసుకొంటున్నప్పుడే ,గాలిలో గింగిరాలు కొడుతూ ,
అలవోకగా వచ్చి వాలేది మా ఇసక పలకపై వాలేది ...
ఒక పొన్న పూవు.
తొడిమ చివరి చిరుతేనెను చప్పరించే వాళ్ళం చప్పరిస్తే, బాకాలు ఊదే వాళ్ళమేమో పీపీప్ అంటూ బుద్ధిగా ఆ పని మీదుండేవాళ్ళం.పొన్నాయి చెట్టు కింద సన్నాయి మోగించేవాళ్ళ హడావుడి కొరకు  బెల్లు కొట్టే దాకా ఆగాల్సిందేగా.

ఇక, అందరికన్నా నాలుగాకులు ఎక్కువ చదివిన మా సబిత ,
కొనవేళ్ళ తో పూరేకులను నలిపి, గాలి ఊది, చటుక్కున పక్కనున్న అమ్మాయి 
బుగ్గమీదనో బుర్రమీదనో టప్ మని పించేది! 
జడుసుకొని కెవ్ మందామా అంటే ,మా టీచరమ్మ చేత బెత్తం! 
ఇటేమో ముసిముసి నవ్వులు చిందిస్తూ సబిత!
 
బెదిరిపోతే సబిత పకపక నవ్వేది.
తనేమో , బుగ్గలు వూరించి తన బుగ్గ మీద తనే టప్ మనిపించుకొని , తనే నవ్వేది.

ఇక, రేఖ పూలన్నిటినీ వళ్ళో పోసుకొని , కాడలను జడ అల్లినట్లుగా అల్లి మాల చేసేది.
తన కేమో , బోలెడు పూలు కావాలి .

ఇంకేముంది. సబిత తను కొట్టుకోమంటే కొట్టుకోరూ మరీ.
ఇసక మీద పొర్లి. జుట్టు జుట్టు పట్టుకొని. జడలు పీక్కుని.
తరగతంతా సహజం గానే అటో ఇటో చేరి పోయే వారం.

ఇక, ఆకాశం లోనుంచి  రాలినట్లు ఒక పూవు అలా గాలిలో తేలుతూ నేల వైపు సాగగానే, 
ఇక టీచరూ  లేదు.చింత బరికె లేదు. గోడ కుర్చీ లేదు.ముక్కు చెంపలూ లేవు.
పరుగో పరుగు.

దొరికిన వారికి దొరికినంత.
దొరకని వారు ఇసుకలో పడి ఒకరి చొక్కాలో జుట్లో పట్టుకొని కొట్టుకోవడమే.

ఇక ఏం చేస్తాం?

పొన్న పూల కాలంలో పిల్లలమంతా ఎంత తొందరగా వీలయితే , 
అంత తొందరగా బడికి పురుగులు పెట్టేవాళ్ళం.
రాలే పూలను రాలినట్టే .ఎవరికి అందినవి వాళ్ళం దొరక పుచ్చుకొనేవాళ్ళం.

నేను, పుష్ప ఒక జట్టు.

ఇక ,మా బాలవ్వ మాకు తగ్గదే.
మీ తుమ్మ చెట్ల నడుమనున్న కాలిబాటను ఎప్పటికన్న కాస్త ముందుగానే ముళ్ళ కంచె అడ్డం వేసేసేది.
" ఘనా ఘనా సుందరా "పాటయ్యే లోగా బర బరా ,బడంతా ఊడ్చేసేది.
ధనధనా గంట కొట్టేసేది.
మేం జుట్టుజుట్టు పట్టుకొన్నా , పండు కొట్టుకొన్నా కచ్చి కొట్టుకొన్నా ఆ సంబరమంతా బడి గంట కొట్టే దాకానే కదా?
మా బళ్ళో ఉన్నవి రెండే రెండు పొన్నచెట్లు.మా బడీలో నేమో బోలెడు మంది పిల్లలము.
(ఎంత మందిమో గుర్తులేదు నాకు.)
ఒక చెట్టు కింద ఒకటో తరగతి. రెండో  దాని కింద రెండో తరగతి. మూడోతరగతి వాళ్ళకేమో రేకుల గది ఉండేది . వానాకాలం మమ్మల్ని చూసి తెగ నవ్వే వాళ్ళు కదా , పలకలెత్తుకొని అటూ ఇటూ పరిగెడుతుంతే. 
ఇప్పుడు ,ఆ సరదా మాది. ఒక్కో పూవు చేతికి చిక్కగానే దూరం నుంచే చూపించి ఊరించి ఊరించి అంతకు అంత పూర్తి చేసే వాళ్ళం!
మాకున్నది ఇద్దరు టీచర్లే . 
అన్నం బెల్లు దాక ఒక తరగతికి ఒక టీచరు , 
అదే ఒకో పొన్న చెట్టు కిందికి , .

తరువాతా అటు ఇటు మారే వారు.
పొద్దున్న లింగమ్మ టీచర్ వచ్చేవారం మాకు హాయి. 
ఎవరికి వాళ్ళం "సకులం ముకులం" పెట్టుకొని ,అక్షరాలు దిద్దడమో ఎక్కాలు గుణింతాలు పద్యాలు బిగ్గరగా చెప్పడమో చేసేవాళ్ళం.

అప్పుడు నిశ్శబ్దంగా మా మీద, మా చుట్టూ ఒక్కో పొన్నపొవు సుతారం గా వచ్చి వాలేది
.వాటితో పాటే అప్పుడొక ఇంకా విరియని మొగ్గా ,చిన్నచిన్న రెమ్మలు,పుడకలు,ఎండుటాకులు రాలుతూ ఉండేవి.
కదిలినట్టే టీచరమ్మ కనిపెట్టకుండా ,గబుక్కున వాటిని సేకరించి వళ్ళో  దాచుకోవడం భలే సరదాగా ఉండేది.
గంట కొట్టగానే ,పూలన్నీ రేఖకిస్తే మాలల్లేది.
మొగ్గలన్నీ సబితకిస్తే ,"బుడుక్ బుడుక్ "మని  బుగ్గల మీద పూలబుడగలు పగలకొట్టేది.
నేనూ పుష్పా మొదట పూల మాల అల్లడం నేర్చుకొంది పొన్న పూల కాడలను జడ అల్లడం తోనే.
ఎన్నాళ్ళీ సరదా?
 పున్నాగపూల కాలం సాగిందాకా నేగా!

మొన్నామధ్య రిషీవ్యాలీకి వెళితే , చెట్టుచుట్టు రాలిన పూలు ఇలా తివాచీ పరిచాయి.ఒక బాట బాటంతా దట్టంగా పూలు రాలి ఉంటాయి.అక్కడి వాటిని కదిలించరు. వాటి పాటికి వాటిని వదిలేస్తారు. 
నేనూరుకొంటానా ? మీకోసం ఇలా పట్టుకొచ్చా! 
అబ్బా ..ఎంత కమ్మటి వాసనో!

అక్కడి వారు వీటిని ఆకాశ మల్లెలు అంటారు.ఈ ఆకాశమల్లెల బాట మలుపులో నిలబడగానే, నాకు మాతిరుమలదేవుని గుట్ట బడీ, అక్కడ పాఠం పాటికి  పాఠం సాగుతుండండగా మాపై వయ్యారం గా వచ్చి వాలిన పొన్నపూలే గుర్తు రావూ మరి.
మా మల్లమ్మ లింగమ్మ టీచర్లు అంతగా  కోప్పడే వారు కదా, 
రేఖ పొన్నపూల మాల ఇస్తే, తెగ మురిసిపోయే వారు.
వారి ముఖాన నవ్వులదొంతరలు పూసేసేదీ
పొన్నలకాలంలోనే !

అన్నట్లు,
నా అడపాదడపా రచనలలో అక్షరాల మాటున అదాటున ఎప్పుడైనా  మీకు ఆకాశమల్లెలు అగుపడితే ,
అవి మా తిరుమలదేవుని గుట్ట బడిలో నేను సేకరించినవేనని గుర్తుంచుకోండేం !
***
All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

4 comments:

  1. వడిలిపోయినా వాసనపోని పూలు ! అద్భుతమైన సువాసన! పరిమళాల్ని మోసుకొచ్చినందుకు ధన్యవాదాలు.

    ReplyDelete
  2. గూడవల్లినుంచి చెరుకుపల్లి నడిచి వెల్లుతూంటే మధ్యలో (పొన్నపల్లి ?) చాలా పొన్నచెట్లు కనపగేవి.
    ఆచంట జానకిరాం ఆంధ్రపత్రికలో రాసినట్లు గుర్తు. ఏదో పల్లెటూరికి ఒంటెద్దు బండిలో వెళ్ళుతూంటే, బండి అబ్బాయి పాడాడట. షుమారుగా గుర్తున్నంతవరకు రాస్తున్నను:
    జొన్నచేనిలొ చిన్నదానినిజూసి
    నిన్నటేలనుంచి నిదురలేదు
    దాని నన్ను కలిపి దయచేయు మాధవా
    పొన్నపూలతో పూజ సేతును

    ReplyDelete
  3. మీ అందరికీ ధన్యవాదాలండి.
    ఇక్కడున్న పూలన్నీ మీవే.
    కావాలిసినన్ని తీసుకోండి.

    ReplyDelete