(అఖిల భారత తెలుగు రచయిత్రుల మహాసభలు ,మార్చి,2002 ,తెలుగు విశ్వవిద్యాలయం ,ప్రసంగ పాఠం నుంచి ఇంకొంత)
జీవితం అంటే జీవనం అంటే కేవలం నలుపు తెలుపు కాదు.
ఆ రెండింటి నడుమ వెల్లి విరిసిన అనేక వర్ణాల సమాహారం.
ఆ భిన్నత్వాన్నంతా రంగరించి ఒక రచనలో ఆవిష్కరించడం అంత సులువు కాదు.
పైగా, చెప్ప దలుచుకొన్నదేమిటో సూటిగా చెప్పడం వ్యాసంలోను ఉపన్యాసంలోను వీలవుతుంది. కాల్పనిక రచనలో విషయాన్ని తేటతెల్లం చేయడం వీలవదు.
చెప్పదలుచుకొన్న విషయం కథగా పాత్రలుగా సన్నివేశాలుగా సంభాషణలుగా భావచిత్రణగా నాటకీయంగా విస్తరించి సృజియించినపుడు - అందులోని వస్తువు అంతర్లీనమై పోతుంది. అస్పష్టమైపోతుంది. అగోచరమై పోతుంది.ఒక్కోమారు అంతర్ధానమై పోతుంది.
అందుచేతనే, రచయిత సృజనాత్మకతతోనే కాల్పనిక రచన పూర్తి కాదు. పాఠకుని సృజనాత్మకత తో... ఆ రచనలో అంతర్గతంగా ఉన్న విషయాన్ని ఆవిష్కరించుకొని ..అందులోని అంతరార్ధాన్ని ఆకళింపు చేసుకొన్నప్పుడే -
ఆ రచన పూర్తవుతుంది.
పాఠకుని సృజనాత్మకతతో పాటు అతని విజ్ఞత,రసజ్ఞత తోడయితే పాఠకును అవగాహన కళాపూర్ణమవుతుంది.
రచయిత దృష్టి సృష్టి అవగతమవుతాయి.రచయితకూ పాఠకుడికీ నడుమ భావసారూప్యం సామ్యమవుతుంది.
అయితే, రచయిత చెప్పదలుచుకొన్న విషయం పాఠకుడు గ్రహించే విషయం ఒక్కటి కాకుండాపోయే అవకాశం లేక పోలేదు.
కాల్పనిక రచనలోని గోప్యతతో ఇదే చిక్కు.
ఉదాహరణకి "రేగడి విత్తులు" నవలలో హరితవిప్లవ ప్రభావం ప్రకృతిపై ఎలా ప్రసరించిందో తెలియపరచడానికి నేను వర్ణనలను మాధ్యమం గా చేసుకొన్నాను.
కొందరి అభిప్రాయం ప్రకారం ఆ నవలలో వర్ణనలే అధికం .అసంధర్భం.అనవసరం. .
నా దృష్టిలో ..హరిత విప్లవం బాగోగులు కథావస్తువైన ఆ నవలలో పర్యావరణం ప్రధాన అంశం.
సృజనాత్మక రచయిత చెప్పదలుచుకొన్న విషయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పే వీలు లేదు.
సృజనాత్మక రచయిత చెప్పదలుచుకొన్న విషయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పే వీలు లేదు.
డొంకతిరుగుడే రచనా మార్గం!
నిగూఢత కాల్పనిక కలాన్ని కప్పి వుంచే మేలిముసుగు.
ప్రచురణ:మిసిమి ,జూన్ 2002
*
All rights @ writer. Title,labels, postings and related copyright reserved.
well said. సమస్యల్ని మాత్రమే కథలకి నవలలకి వస్తువులుగా పెట్టుకుని మనవాళ్ళు అసలు సృజనాత్మక రచన మూలస్వరూపాన్ని మర్చిపోతున్నారు.
ReplyDeleteధన్యవాదాలు .
ReplyDeleteకేవలం సమస్యాపూరణమే సృజనత్మక రచనగా చలామణి కావడం నిజంగా తెలుగు కలానికికంటిన విషాదం.