Feb 2, 2011

భాషాబిడియాలు

మనిషి మనిషికో మాట ఉంటుంది. 
పలుకులో ఒక వింత సొగసు సోయగం ఉంటాయి.
భిన్న మాండలికాలతో నాకున్న ప్రత్యక్షపరిచయం వలన ,
నా రచనలలో పాత్రోచితమైన భాషను అప్రయత్నంగా ప్రకటించుకోగలుగుతున్నాను.


అయితే, ఏ మాత్రం పరిచయం లేని నక్కలోళ్ళ భాష యాస ఆకళింపు చేసుకోవడం కోసం అభ్యాసం చేయాల్సివచ్చింది. సంచారజీవులైన వారి భాషను అర్ధం చేసుకొనే ప్రయత్నంలో నాకు తెలియని ఎన్నో విషయాలు నేను తెలుసుకొన్నాను.


భాషాపరంగా నేను బిడియ పడింది ఒక్కమారే.
అది రేగడి విత్తులలో ఎల్లమ్మ గుడిలో పాటించే ఓ ఆచారాన్ని గురించి రాసినపుడు.


శరీరధర్మాల గురించి ఎలాంటి సంకోచం లేకుండా మాట్లాడడం వృత్తిరిత్యా నా నిత్య కృత్యం . అయినప్పటికీ ఇంగ్లీషులో మాట్లాడడానికి ఇబ్బందిని కలిగించని పదాలే ,తెలుగులో రాయాలనే సరికి పంటి కింద రాళ్ళయ్యాయి. అక్కడ ఇంగ్లీషు పదాలు వాడడం నాకు ఇష్టం లేదు. రాయకుండా దాటవేయడం అంతకన్నా ఇష్టం లేదు. తెలుగులో కలం సాగడం లేదు. నాలో నేను ఎంతో సంఘర్షణకు గురయ్యాక కానీ ,నా సంకోచం నన్ను వదల లేదు. అందుకేనేమో మాతృ భాష మన పలుకును తల్లిలా కాపలా కాస్తుందని అంటారు!


పాత్ర చిత్రణ విషయానికి వస్తే ..రామనాథం,శివుడు ,అనూరాధ లాంటి పాత్రల మనసతత్వాన్ని సృజియించడం కన్నా , ఏడేళ్ళ వర్ధని వంటి పాత్రలను మలచడానికే నేనెక్కువ శ్రద్ధ వహించాల్సి వచ్చింది.  పసి మనసు లోనిపారదర్శకతను అక్షరబద్దం చేయడం చాలా కష్టం. 
రచయితగా సవాలు చేసే నా రచనలలోని పిల్లల పాత్రలు నాకెంతో సంతోషాన్ని మిగిల్చాయి.నా రచనల నిండా పిల్లలు కనిపిస్తారు. పిల్లల పట్ల నాకున్న ప్రేమతో పాటు వృత్తిపరంగా ప్రవృత్తి పరంగా నాకు ఎదురయ్యే అనుభవాలు ,అధ్యయన సౌలభ్యమూ ఇందుకు మూలప్రేరణలు.

అలాగే ,పొలం గట్లపై ఆడూతూ పాడుతూ పెరినదానిని కాబట్టి ,రేగడివిత్తులలోని వస్తువుతో నాకంత సామీప్యత ఉంది. నా వృత్తి వలన నలుగురితోను కలివిడిగా మెసలగలిగే ,సాన్నిహిత్యం ఏర్పరుచుకోగలిగే అవకాశం ఉంటుంది కనుక .. నేను నక్కలోళ్ళ గుడిసెల్లోకి వెళ్ళగలిగేను.
ఇది అన్నివేళలా సాధ్యం కాక పోవచ్చు.
శ్రమకోర్చి సేకరించిన సమాచారం ,చేసిన అధ్యయనం ఒక్కోసారి ఉపయోగపడితే , మరోసారి ఎందుకూ కొరగావు. అనేకమార్లు అక్షరరూపం దాల్చలేవు.అలా రచనలో రాయని రాయలేని సమాచారం రచయిత స్వంతం అవుతుంది.
*
 రచయిత భావావేశమే సృజనాత్మక రచనకు చుక్కాని.
హేతుబద్దసత్యాలు కవితాసత్యాలు కలగాపులగమైన కళాత్మక విలువలకే  , కాల్పనిక రచనలో పెద్ద పీట.
మితి మీరిన సమాచారం రచనలోని సృఅజనాత్మకతనే మింగేయవచ్చును. రసభంగం కావచ్చును. రసాభాస కావచ్చును. అధ్యయాన్ని అనుకూలంగా నవయించి ,అందంగా సృజియించి ,రచనను రసాత్మకం చేయడంలోనే ఉంటుంది రచయిత ప్రతిభ. 
ఇక , సంభాషణల సృజన కత్తి మీద సాము.కథాగమనంలో విభిన్న పాత్రల నోటివెంట మాటలు సహజంగా దొర్లిపోతుంటాయి. అవి రచయిత మాటలు కావు.
 ఆ పాత్ర ఆ సంధర్భంలో ఆ శ్రోతతో అలా మాట్లాడుతుంది. ఒట్టి కల్పన. అవి రచయిత  ఊహాజనితాలు. ఆ మాటలతో రచయిత ఏకీభవించవచ్చును. విభేదించవచ్చును.
ఒక కాల్పనిక రచన లో అనేక పాత్రలుంటాయి. 
అన్ని పాత్రల మాటలు రచయిత మాటలు కావు. పాత్రలే మాట్లాడుతాయి. 
వాటి మనోభావాలను వ్యక్తపరుస్తాయి. రచయిత వ్యక్తిగత అభిప్రాయం వాటన్నిటి సారాంశంగా ఉండొచ్చు. 
వాటిలో ఒక్కటై ఉండొచ్చు. 
వాటన్నటికీ అతీతంగా ఉండొచ్చు.
సృజనాత్మక రచయిత చెప్పదలుకొన్న విషయానికి సంభాషణలు ఒక మాధ్యమం మాత్రమే .
కేవలం సంభాషణలతోనే ఒక కాల్పనిక రచన పూర్తి కాదు. 


రచయిత వ్యక్తం కాడు.


ఇదీ ఓ చిక్కు!

***
(అఖిల భారత తెలుగు రచయిత్రుల మహాసభలు ,మార్చి,2002 ,తెలుగు విశ్వవిద్యాలయం ,ప్రసంగ పాఠం నుంచి ఇంకొంత)

All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

No comments:

Post a Comment