Feb 7, 2011

రేగడి విత్తులు వంటి నవల.....

రచయిత పడిన శ్రమ , పెట్టిన శ్రద్ధ, లోనైన వత్తిడి ..రచన బాగోగులను తేల్చవు.
రసాత్మకమైన వాక్యమైనా కావ్యమవుతుంది.

రచనను రచయితను నిగ్గుతేల్చేది పాఠకుల అభిప్రాయాలే.

కొన్ని అభిప్రాయాలు వాత్సల్యాన్ని కురిపిస్తాయి. ప్రశంసల్లో ముంచెత్తుతాయి.
నెత్తిన పెట్టుకొంటాయి.అభిమానాన్ని అందిస్తాయి. నిజాయితీగా విమర్షిస్తాయి. నిష్కపటంగా వ్యాఖ్యానిస్తాయి .

మరికొన్ని అభిప్రాయాలు కన్నెర్ర చేస్తాయి. నిప్పులు చెరుగుతాయి .నిలువుపాతర వేస్తాయి.నిర్దాక్షిణ్యంగా నేల రాస్తాయి.నిర్లక్ష్యం చేస్తాయి. హేళన  చేస్తాయి. ఔదార్యం చూపుతాయి.

ఇలా ఎందుకు రాసావని కొందరు నిలదీస్తే , అలా ఎందుకు రాయలేదని మరికొందరు నిలువరిస్తారు.
అందుచేతనే అభిప్రాయాలే అండదండలు.అవే అడ్డంకులు.

పొంగినా కుంగినా సాగనిది రచయిత కలమే.

జీవితానికి ఒక నిర్దిష్టత లేదు. రచనకు ఒక నిర్దిష్టరూపం ఉంది. ఎంతటి సమగ్ర రచన అయినా జీవిత పార్శ్వాన్ని ఆవిష్కరించగల ప్రయత్నమే కానీ ,వాస్తవానికి సంపూర్ణ జీవిత చిత్రణ కాబోదు. అందుచేతనే ఎంత చెప్పాలని ప్రయత్నించినా చెప్పినట్లు భావించినా,కొంత మిగిలే ఉంటుంది.

వెలువడిన భిన్న అభిప్రాయాలు ఒకే రచనను విభిన్న దృక్కోణాలతో దృక్పథాలతో ఎలా అర్ధం చేసుకోవచ్చునో తెలియజేస్తాయి. నిష్కర్ష విమర్షలు నిష్కపట వాఖ్యానాలు రచయితకు మార్గదర్షకాలవుతాయి.
ఎటువంటి వత్తిళ్లకు లొంగని పరిమితూల్కు లోబడని నిబత్తతే రచయితకు మార్గదర్షకాలవుతాయి.
ఎటువంటి దాపరికం లేకుండా నిజాయితీగా రాయడానికి నిబ్బరం కావాలి. నిగ్రహం కావాలి. నిశ్చయం కావాలి.విశాలదృక్పథం కావాలి.

రేగడి విత్తులు వంటి నవలను చంద్ర లత వంటి స్త్రీ రాసే అవకాశం లేదని కొందరు అభిప్రాయ పడినపుడు ,
నాకు సంతోషం కలిగింది.
వారు చంద్రలతలోని స్త్రీని చూడలేదు. రచయితను గుర్తించారు.
స్త్రీగా నాకు పరిమితులు ఉండొచ్చు. ప్రతిబంధకాలు ఉండొచ్చు.
రచయితగా అపారమైన స్వేచ్చ ఉంది. అపరిమితమైన శక్తి ఉంది. ఒక వ్యక్తిగా నన్ను నేను ప్రకటించుకోవడానికి .. నా దృష్టిని స్పష్టం చేయడానికి .. అనంతవకాశం వుంది.

రచించిన ప్రతి రచన,మలిచిన ప్రతి పాత్ర , చేసిన ప్రతి అధ్యయనం , అంది ప్రతి అభిప్రాయం, కలిగిన ప్రతి అనుభవం .. నాకు కొత్త పాఠాలు నేర్పుతున్నాయి.
కొత్త జీవిత కోణాలను ఆవిష్కరిస్తున్నాయి.  నాలోని సంకోచాలను సంస్కరిస్తున్నాయి.
ఇది రచన చేయగలిగినందున వ్యక్తిగా నేను పొందుతోన్న లాభం.

రచయిత ఆలోచన ,అనుభూతి ,ఆసక్తి ,అభిరుచి ,అధ్యయనం ,అవగాహనల నడుమ ..సమన్వయం కుదిరి ,సమతుల్యం కలిగి, ఎంతో సమన్వయంతో  సృజియించిన  సాహిత్యం మనకు ఉన్నది.

అన్ని అడ్డంకులను సునాయాసంగా అధిగమించి ..మానవస్పర్షతో మానవస్పృహతో... కలకాలం నిలిచిపోయే రచనలు చేసిన సాహితీవేత్తలు మనకు ఉన్నారు.

నేనింకా ... ఆ ప్రయత్నంలోనే ,ఆ ప్రయాసలోనే, ఆ ప్రయాణంలోనే ఉన్న ప్రారంభదశలోని రచయితను.
నేనెరిగిన ఈ కొన్ని విషయాలను మీతో పంచుకోవడానికి ,

నాకీ అవకాశం ఇచ్చిన తెలుగు విశ్వవిద్యాలయం వారికీ, కేంద్ర సాహిత్య అకాడెమీ దక్షిణ భారత శాఖ వారికీ , 
వైస్ చాన్సలర్ డా.యన్. గోపీ గారికి ..సభాద్యక్షులు సీతాదేవిగారికి .. నా ధన్యవాదాలు.


(అఖిల భారత తెలుగు రచయిత్రుల మహాసభలు ,మార్చి,2002 ,తెలుగు విశ్వవిద్యాలయం ,ప్రసంగ పాఠం నుంచి ఇంకొంత)
 ***

All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

1 comment:

  1. అవును, ఆ నవల చదివినపుడు రైతు జీవితాన్ని ఇంత నిశితంగా పరిశీలించే అవకాశం స్త్రీగా చంద్రలత కి ఎలా దొరికిందబ్బా అని ఆశ్చర్యపోయాను. స్వానుభవమూ, పరిశీలనా శక్తి, ఆ సమస్యల పట్ల సహానుభూతి(empathy),ఇవన్నీ ఉంటే తప్ప అంత సమగ్రంగా ఆ నవల రూపొందదు.

    అది చదివినపుడల్లా నాకు చంద్ర లత కనిపించదు. ఆ నవల్లోని పాత్రలతో మమేకమైన ఒక అస్పష్టమైన వ్యక్తి కనిపిస్తారు....వాళ్లలో ఒకరుగా కల్సిపోయి.

    ReplyDelete

There was an error in this gadget