సమాచారాన్ని సేకరించడానికి ముందుగా వారికి మనపై ఓ నమ్మకాన్ని కలిగించాల్సి వస్తుంది.
"ఈ సమాచారం ఎటువంటి దాపరికం లేకుండా వీరికి చెప్పవచ్చును " అన్న విశ్వాసాన్ని కలిగించాల్సి వస్తుంది.
ఆ నమ్మకాన్ని ఆ విశ్వాసాన్ని ఎల్లప్పుడు నిలబెట్టుకోవాల్సి వుంటుంది!
కొందరు ఆశించిన దానికన్న ఎక్కువ సమాచారాన్ని అందిస్తే ,ఇంకొందరి చేత పెదవి విప్పించడమే గగనమవుతుంది. మరికొందరు, నీకు చెపితే మాకేమిటి లాభం? " అంటూ తేల్చి పారేయడం మామూలే.
ఒక కథ కోసం నెల్లూరు నక్కలోళ్ళను అధ్యయనం చేసే క్రమంలో,నాకు భిన్న అనుభవాలు ఎదురయ్యాయి.
మా ఆవరణలో కలిసినపుడు వారి ధోరణి ప్రవర్తన ఒకలా ఉన్నాయి. వారి ముంగిట్లోకి వెళ్ళి నప్పుడు వారి వ్యవహారం మరోలా ఉంది.ఒక్కసారి మాట్లాడగానే ఒక్కమారు కలవగానే , సేకరించిన సమాచారం సమగ్రం కాబోదన్నది వారి నుంచి నేను నేర్చుకొన్న పాఠం.
ఈ అధ్యయనం తరువాత రాసిన కథను " ఇదం శరీరం" సంపుటం లో "పుడింగి" పేరిట చదవ వచ్చును.
ఇక, నేపధ్యాల అధ్యయనం కోసం ప్రయాణాలు చేయడం ఒక ఇబ్బంది.
వ్యక్తిగతధర్మాలు, వృత్తిపరబాధ్యతలు ..సంకల్పానికి సమయానికి సంకెళ్ళు వేస్తాయి. అందులోను పనిగట్టుకొని ప్రయాణించాలంటే ,స్త్రీలకు ఈనాటికీ ప్రయాణ సౌలభ్యం తక్కువే.
ఎందుచేతనైనా ఒక కొత్తప్రాంతానికి ప్రయాణం చేసినపుడు ..పనిలో పనిగా ..అక్కడి నేపధ్యాన్ని అధ్యయనం చేయడం సులువు.
జైపూర్ నేపధ్యంగా రాసిన కట్ పుత్లీ " కథకు నేపథ్యం అలా అమరిందే.
కాస్త శ్రమ తీసుకొని ఓ ప్రదేశానికి వెళ్ళినా ,చుట్టూ బిగించి ఉన్న సామాజిక చట్రాల్ని మర్యాదాపరిధుల్ని దాటుకొని , వెళ్ళిన చోట ఉన్నవారితో మమేకం కావడానికి ..లోలోపల ఎంతో తిరుగుబాటు చేయాల్సి ఉంటుంది.
బేజజాలను సంకోచాలను సంస్కరించుకోవాల్సి వస్తుంది. అభిప్రాయలను పునః పరిశీలించుకోవాల్సి వస్తుంది.
అందుకే, ఒక్కో అధ్యయనం మనసు పొరలను విడదీసే అనుభవం.
***
(అఖిల భారత తెలుగు రచయిత్రుల మహాసభలు ,మార్చి,2002 ,తెలుగు విశ్వవిద్యాలయం ,ప్రసంగ పాఠం నుంచి కొంత)
. ప్రచురణ:మిసిమి ,జూన్ 2002
***
All rights @ writer. Title,labels, postings and related copyright reserved.
No comments:
Post a Comment