Feb 28, 2011

ఎంత మేరకని !

ఒక్కో సారి అంతే !
మన జీవితాలకి సంబందించిన అతి ముఖ్యమైన నిర్ణయాలు-
ఎక్కడో జరుగుతుంటాయి. ఎవరో తీసుకుంటుంటారు.ఎప్పుడో తెలుస్తుంటాయి.
మనం అలా చూస్తూ ఉండాల్సి వస్తుంది.
నిశ్శబ్దంగా.
మనం అలా జీవించాల్సి వస్తుంది.
నిస్సహాయంగా.
చూడండి.
అది వ్యక్తిగతమైనదైనా, కుటుంబపరమైనదైనా, రాజకీయమైనదైనా, సాంస్కృతికమైనదైనా .
మనం పిల్లలం కావడం చేత  కొన్ని సార్లు,
మనం మహిళలం కావడం చేత ఎన్నో సార్లు,
మనం సిబ్బంది కావడం చేత మరికొన్ని సార్లు, 
స్వతంత్ర దేశ పౌరులం కావడం చేత అనేక సార్లు, 
అందుచేత ఇందుచేత ,
ఆ నిర్ణయ భారాలను మోస్తూ బతకాల్సి వస్తుంది.
కష్టమైనా.నష్టమైనా.
అచ్చం ఆ జీమూతవాహనుడి తల మీద గిరగిరా తిరిగే చక్రంలాగా!
అతనిని పలకరించిన పాపానికి , 
ఆ బాధాచక్రం అతని తలపై నుంచి అడిగినవారితలపైకి ఆ చక్రం ప్రత్యక్షం అవుతుందేమో కానీ,
మన విషయంలో అలా జరిగే అవకాశం ఏదీ? మన తలపై భారం మోయడానికి వేరొకరు ఎక్కడ?
ఎవరి నిర్ణయభారం వారు మోయలేనప్పుడు ,అసలా నిర్ణయం అంగీకరిచడం ఎందుకు?
ఎంత మాత్రం సబబు?
అయినా, ఎవరి నిర్ణయాలకు ఎవరు కర్త? ఎవరిది కర్మ? ఎవరు బాధ్యులు?
నిజమే.
తీరా చూస్తే , ఈ నిర్ణయాలంత సాపేక్షాలు మరోటి ఉండవు.
ఇవ్వాళ తినబోయే అన్నంలో కూరేమిటో అన్న దగ్గర నుంచి,
ఆ కూరలోకి అవసరమైన వంకాయ మొదలు తిరగమోత వరకు -
తీసుకోవల్సిన నిర్ణయాలు , ఆర్ధిక, రాజకీయ, సామాజిక , చారిత్రక నిర్ణయాలే! కాదన గలమా?
అన్నిటికన్నా ,ముఖ్యంగా ఇలా వంటింట్లో మొదలయ్యే  నిర్ణయాల రాజకీయం చట్టసభల దాకా సాగుతుండం పరిపాటని మన అనుభవమే కదా?
అంతెందుకు ? 
అమ్మకు తోచిన కూర వండాలా? నాన్నను అడిగి వండాలా? పిల్లలు కోరింది వండాలా? బజార్లో దొరికింది వండాలా? మనం కోరి వండదలుచుకొంది బజార్లో దొరకాలా? 
అన్నీ ప్రముఖ నిర్ణయాలే !
ప్రధానమైన నిర్ణయాలే!
కాదనగలమా?
అలాగే,
ఏ నిర్ణయం మంచిది ఏది కాదు ..అన్నది ఎవరూ గుణించేది?
ఆ నిర్ణయాలను తీసుకొనేవారా? అమలు పరిచేవారా? ఆ నిర్ణయం వలన రాబోయే మంచీ చెడులను భరాయించే వారేనా?
మరి, నిర్ణయాల పాటికి నిర్ణయాలు జరిగిపోతుంటే , 
ఆ నిర్ణయం తీసుకోవడంలో ప్రమేయం, భాగస్వామ్యం లేకుండా,
ఆ నిర్ణయాలఫలితాల్ని తలకెత్తుకోవలసిందేనని తెలిసినపుడు ,
ఆ నిర్ణయం తీసుకోవడంలో భాగం పంచుకోవడం మనకు అవసరమనీ ,ఆవశ్యమనీ..
తెలియపరచకుండా ఉండగలమా?
నిశ్శబ్దంగా నిలబడి చూస్తూ ఉండగలమా? నిలదీయకుండా ఉండగలమా?
ఎవరి నిర్ణయం వారిది.
ఎవరి నిర్ణయభారం వారిది.
మరొకరి నిర్ణయం మనది చేసుకోవాల్సి వచ్చిందనుకోండి ,
ఆ క్రమం లోనే ఈ ప్రశ్నలన్నీ!
అప్పుడప్పుడూ..అందరికీ ఎంతోకొంత మేరకు- తప్పనివి!
అయితే ,
అది ఎంత మేరకు ?
ఇదీ మన ముందున్న ప్రశ్న!
*** 
All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

No comments:

Post a Comment