Aug 21, 2010

అమ్మ కో నూలు పోగు !

"సరిగ్గా సమయానికి వచ్చిన నవల !" అంటూ లెనిన్ ప్రశంసలు అందుకొన్న "అమ్మ"- 
సరిగ్గా ఉద్యమ సమయానికి సాయుధంగా అంది వచ్చిన విషయం అందరికీ తెలుసు.
"నేను దీనిని అమెరికా లో ఉండగా ,హడావుడిగా తగినంత సమాచారం అందుబాటులో
లేనపుడు రాశాను- అంటూ శిల్ప నిర్మాణపు అమరికల గురించి గోర్కీ   వివరించబోతుంటే -
లెనిన్ సాలోచనగా తలూపి అన్నాడు," హడావుడిగా రాసి నువ్వు మంచి పని చేశావు.ఇప్పుడు ఇది చాలా అవసరమైన పుస్తకం!"
అలా ,ప్రపంచం ముందు అమ్మ ఉద్యమ సాహిత్యం లా ఆవిష్కరించ బడింది.
ప్రపంచచరిత్రలోనే  ఒక ముఖ్యమైన విప్లవఘట్టానికి కరదీపికలా ఉపయోగపడింది.
సామాన్యుల సంకోచాలను ,సందిగ్దాలను,సందేహాలను సున్నితంగా సమాధాన పరుస్తూ - ఒక సమోన్నత ఆశయాన్ని ఆవిష్కరించింది.మేధావి మాక్సిం గోర్కీ కలం సాధారణ జీవితాలను స్పృశించింది.వారిలో ఒక కొత్త ఉత్తేజాన్ని ఉద్వేగాన్ని కలిగించింది. ఉద్యమం వైపు మళ్ళించింది.
ఉద్యమకారులకీ సాహితీవేత్తలకీ అమ్మ ఒడి తొలి బడి అయ్యింది. మునుముందు ,గోర్కీ పరిపూర్ణంగా ప్రతిపాదించబోయే "సోషలిస్ట్ వాస్తవికత" కు అమ్మ ఆరంభం అయ్యింది.
అటు రచయితనూ ఇటు పాఠకులనూ ఒక నూతన దృక్పథం వైపు అమ్మ వేలు పట్టి నడిపించింది.నడిపిస్తూనే ఉంది. అందుకే ,అది అన్ని విధాలా సరియైన సమయం! సంధర్భం!!
***
అమెరికాలోని అడిరాన్ డాక్ పర్వతశ్రేణిలో  ప్రవాస జీవితం గడుపుతూ ,అమ్మ కు ప్రాణం పోశాడు గోర్కీ.
విప్లవకారుడైన కొడుకు భావాల బాటలో నడుస్తూ - సోషలిజాన్ని మతస్పూర్తితో కొనసాగించడం  అమ్మ కు సహజం  గానే అబ్బింది.
"పునరుత్థానమైన ఆత్మను చంప లేరు !"అమ్మ తేల్చి చెప్పింది తనలాంటి వారితో ,వారి బిడ్డలతో మమేకమవుతూ.
"నాయాలారా వినండి.దేవుని పేరు తలుచుకొని వినండి!మీరంతా చాలా మంచి వాళ్ళు.అత్మీయులైన నాయనలారా! జరిగిన సంగతులు చూడ్డానికి భయపడకండి! సాక్షాత్తు మన పిల్లలు -మన రక్తంలో రక్తమైన పిల్లలు అందరికీ సమానంగా న్యాయం జరగాలనే సంకల్పంతో కొత్త ప్రపంచంలో పడ్డారు.సత్యమూ న్యాయమూ గల మరొక జీవిత విధానాన్ని వాళ్ళు అన్వేషిస్తున్నారు.జనానికందరికీ వాళ్ళు మంచిని  కోరుతున్నారు!"
ఇంత లోతుగా మాట్లాడిన అమ్మ -ఆనాటి అందరు సామాన్య స్త్రీల లాగానే అక్షరజ్ఞానం లేని అణిగి మణిగి ఒదిగొదిగి ఉండే గృహిణి. మాములుగానే.
మరి, ఆమె మాటల్లో ఇంతటి ఆవేశం ఎందువల్లనో ,ఆమె విశ్వాసం చేత నిబ్బరంగా నిలబడగలిగిందో ..ఆమె మాటల్లోనే ."వాళ్ళు సత్యాన్ని బయటపెట్టేరు.అందుకే వారు బాధలను అనుభవిస్తున్నారు.వాళ్ళలో విశ్వాసముంచండి!"
అందుకే అచంచల విశ్వాసం తోటే ,అమ్మ గంభీరంగా అంటుంది ,"రక్త సముద్రం కూడా సత్యాన్ని ముంచేయ లేదు!"
నిజం!
గోర్కీ ని మరింత సన్నిహితంగా తెలుసుకోవడానికి ,అర్ధం చెసుకోవడానికి ఇవ్వాళ ఇనుప గోడలు లేవు .ముళ్ళకంచెలు లేవు.
అమ్మ తో ప్రపంచ ప్రసిద్ధమైన గోర్కీ మేధో ప్రస్తానం "అధోజనం" "మధ్య తరగతులు"అన్న ప్రసిద్ధ నాటకాల మీదుగా సాగి -"అసందర్భ ఆలోచనలు (1918),కొత్త జీవితం (Navya Zhizn ,New Life)పత్రికలో కొనసాగి - "అర్టమోం వాణిజ్యం (1925) వరకూ విస్తరించింది.
నడుమ చేసిన అనేక రచనల బాటలోఒక మానవ దృక్పథ అన్వేషణ లా కొనసాగింది.
ఈనాడు గోర్కీ కేవలం ఉద్యకారుడిగానో లేదా సాహిత్య కారుడిగానో పరిమితం కాడు.సత్యాన్వేషణలో అన్ని అవరోధాలనూ అధిగమించి నిలబడ్డ ఒక ఉన్నత మానవుడిగా నిలబడతాడు.
అందుకు ఓనమాలు ఆయన అమ్మ" లోనే దిద్దాడు.1935 లో గోర్కీ పరిపూర్ణంగా ప్రతిపాదించిన
సోషలిష్ట్ రియలిజం సాహిత్య సిద్ధాంతానికి మూలాలు అమ్మలోనే ప్రభవించాయి.
అమ్మ అటు రచయితనూ ఇటు పాథకులనూ ఒక ఉత్తేజ భరిత తరంగం లా ముణ్చెత్తింది. తరంగ ధైర్ఘ్య ప్రభావం శతాబ్ద కాలం ప్రకంపిస్తూనే ఉంది .ఇంకా ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి.

***
(1-3-2007)( నూరేళ్ళ  అమ్మ ,ప్రజాసాహితి ప్రత్యేక సంచిక నుంచి కొంత)


 All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

No comments:

Post a Comment