మనం ప్రకృతిలో ఓ భాగం.
మనం నేర్చుకొన్న పాఠాలన్నీ ప్రకృతిని అనుకరిస్తూ అనుసరిస్తూ నేర్చుకొన్నవే.
ప్రకృతిని పరిశీలిస్తూ పరిషోదిస్తూ - మనం ఎన్నో విషయాలు తెలుసుకొన్నాం.
ప్రకృతిని ప్రేమిస్తూ ప్రకృతితో విభేధిస్తూ - ఎన్నో మెళుకువలు అలవరుచుకొన్నాం.
ప్రకృతితో పోరాడుతూ - గెలుస్తూ ఓడుతూ -ఎంతో నైపుణ్యాన్ని సాధించాం.
మనం జంతువులం.
మన బుద్ధి మనల్ని మనుషులుగా తీర్చి దిద్దింది.
మానవ విలువలు మనం ఏర్పరుచుకొన్నవి.
మానవ సంస్కారం మనం నిర్వచించుకొన్నది.
ఆలోచన అనుభూతి మనకు ప్రకృతిసిద్ధంగా లభించినవే.
నేను మనిషిగా ఉండాలంటే -
నా సహజసిద్ధ లక్షణాలను ,అపురూప గుణాలను పదిల పరుచుకొనేలా ఉండాలి.మరింత మెరుగు పరుచుకొనేలా ఉండాలి.
*
ప్రకృతి మరో చమత్కారం మనకున్న అద్బుత శక్తి - "జ్ఞాపకం"
నిప్పు కాలుతుందని నిరూపించడానికి ప్రతిసారీ మనం చేతులు కాల్చుకోనక్కర లేదు.
మనకు తెలుసు. మనం ఇతరులకు తెలియపరచ గలం.
మనకు తెలిసిన దానిని మనం భద్ర పరుచుకోగలం.పంచుకోగలం.పెంచుకోగలం.
ఒకరి నుంచి ఒకరికి - ఒక తరం నుంచి మరొక తరానికి -అందించ గలం.
ఇది మన సహజ స్వభావం. ఇవ్వాళ - ఆ స్వభావానికి ఒక క్రమబద్ద్దత వచ్చింది. " బడి" రూపమైంది!
చదువు "బడి" లోనే ఉందనీ ..ఉండలనీ.. అనుకోవడం మొదలుపెట్టాం.
అందుకే..చాలా శ్రద్ధగా బడి చుట్టూ గోడలను కట్టాం. చదువు భద్రంగా ఉందని సంతోషపడుతున్నాం.
కానీ, ప్రకృతి ఆ గోడలకు బయట ఉందన్న విషయం మరిచి పోయాం.
ప్రకృతి మన తొలి బడి.సహజమైన బడి.
చదువు ఎలా ఉండాలంటే -
ప్రకృతిలో ఓ అంతర్భాగమై ఉండాలి.
*
"బైట ఉండాల్సిన వేమిటో
లోన ఉండాల్సిన వేమిటో
అన్నీ నాకు తెలుసు .
ఐతే ,
ఈ కిటికీకి
ఇక్కడేం పని?" ...అంటూ అమాయకంగా ఓ పెద్ద ప్రశ్న వేస్తారు "స్మైల్" తమ గోడ అనే కవితలో .
చదువు ఎలా ఉండాలంటే –
గోడలతో నిండి పోయి కాదు ,ఒక చిన్న కిటికీలా ఉంటే..
చాలదా?
(26-1-07,వికాసవనం, విజయవాడ,ప్రసంగ పాఠం నుంచి ఇంకొంత )
All rights @ writer. Title,labels, postings and related copyright reserved.
No comments:
Post a Comment