Sep 1, 2010

పొత్తపు ఒడి

1
 తొచీ తోచనమ్మ పుస్తకాలవ్యవహారంలో తల దూర్చిందటారేమో - మీరిదంతా  చదివాక!
ఒక అల్లిబిల్లి ఆలోచన ప్రభవగా రూపుదిద్దుకొని అప్పుడే మూడో ఏడు!
*
మొదటిసారి నెల్లూరు వచ్చినప్పుడు - నాలుగు అట్టపెట్టెల్నిండా నాక్కావల్సిన పుస్తకాలన్నీ తెచ్చుకొన్నా.నాలుగునాళ్ళలో చదవడం పూర్తయింది.
లెక్కలు, సాహిత్యం,చరిత్ర చదువుకొనే రోజులవి.లెక్కలు మిక్కిలి.పోతే ,సాహిత్యం.అందునా ఆంగ్ల సాహిత్యం.చదువుదామంటే , కావలసిన పుస్తకాలు కొత్తచోట ఎక్కడ దొరుకుతాయో తెలియదు. క్యాంటర్బరీ టేల్స్ నుంచి కమలాదాస్ దాకా చదవాలయ్యే.
ఊళ్ళో ఉన్న గ్రంథాలయాలు ,పుస్తకాల దుకాణం ఒక చుట్టేసా.
అప్పట్లో ఇన్ని డిగ్రీ కాలేజీలు లేవు.పుస్తకాలు కావలిసిన వారు మద్రాసునుంచో మరో చోట నుంచో తెప్పించుకోవలసిందే.ఊళ్ళో ఉన్న పెద్ద లైబ్రరీ మా ఇంటికి దూరం.వర్ధమాన సమాజం వారు నిర్వహిస్తున్న టౌన్ హాలు లైబ్రరీకి కాస్త కాలుసాగిస్తే వెళ్ళి రావచ్చు.
పనీపాటలు చేసుకొని పడుతూలేస్తూ అక్కడికి వెళ్ళేసరికి , లైబ్రరీ వేళలు కాస్తా అయిపోయేవి.రీడింగ్ రూము మూతపడేది.మళ్ళీ చిరచిరలాడే ఎండలో కాళ్ళీడుస్తూ ఇంటికి.
అసలే  ఎండ.ఆ పై ధారలుకట్టే చెమట.వళ్ళంతా జిడ్డు.పై నుంచి, నిరాశ.
అలా సాగిన లైబ్రరీ ప్రయాణాలలో ,
అతి కష్టం మీద  ఆగి ఆగి ,"విక్రమ సింహపురి సర్వస్వం "చదవ గలిగా. నెల్ అంటే వడ్లనీ అందుకే ఈ ఊరు వడ్లూరనీ.. అదే నెల్లూరు అని ... అలాగే నెల్లి అంటే ఉసిరికాయనీ అదనీ ఇదనీ.. బోలెడంత ఉత్సాహంగా చదివా. ఉదయగిరి , భైరవకోన తదితర చారిత్రక విశేషాలెన్నో తెలుసుకొన్నా.
అక్కడ తెలుగు పుస్తకాలు ఉన్నప్పటికీ , ఆంగ్లం తక్కువ.ఉన్నవి కూడాను ,కాలం నాటివి. అందులోను తీసి ఇచ్చేవారు, తెలియచెప్పేవారు లైబ్రరీలో ఉండే వారు కాదు. ఒకే ఒక్క క్లర్కు. అతనే లైబ్రేరియన్ ,ఆపై సమస్త కార్యనిర్వహణాను. ఏదైనా కార్యక్రమం టౌన్ హాల్ లో ఉందంటే, ఆహ్వానాలు పంచడం దగ్గర నుంచి అన్ని పనులు ఆయన చేతి మీద జరగాల్సిందే.
అందులోను అది బెజవాడ గోపాల రెడ్డి గారి హయాం. అన్నీ పద్దతి ప్రకారం జరిగి పోతూ ఉండేవి.
ఇక, బిక్కుబిక్కు మంటూ , పుస్తకాల నడుమ బైఠాయించి , నాక్కావాల్సిన పుస్తకం చేజిక్కించుకొని, నాలుగు పేజీలు తిరగేసేటప్పటికి , పుణ్య కాలం కాస్తా దాటి పోయేది.
నెల్లూరి విశేషమేమో , పుస్తకాలు పచ్చబడి ,పట్టుకుంటే విచ్చిపోయేంత పెళుసుబడిపోతాయి.
బహుశా బంగాళాఖాతం ఉప్పుగాలి మహత్యం అనుకొంటా!
ఒక రోజు ,ఎండనబడి వెళ్ళి ,లైబ్రరీ మూతబడి ఉండడంతో ..యధాప్రకారం , కాళ్ళీడ్చు కొంటూ తిరిగి వస్తుండగా ,సరిగ్గా  సండే మార్కెట్ మలుపు తిరిగే చోట,ఒక బడ్డీ కొట్టు ముందు ఆగా.రోడ్డు దాటుదామని అటూ ఇటూ చూస్తూ.
అలా చూస్తున్నానా , మూల మీద కొన్ని పుస్తకాలు.
ఆశ్చర్యం ! అక్కడనుంచి రాహులు సాంకృత్యాయన్  దరహాసం!
ఎగిరిగంతేసింత పని జేసి , అక్కడికి గబ గబ వెళ్ళా.
నాకు నోట మాటరాలేదు. అదేదో చంకలో బిడ్డను పెట్టుకొని ఊరంతా వెతికినట్లు,మా పొగతోటలో, అందునా మా వీధి చివర పుస్తకాల దుకాణం పెట్టుకొని ఊరంతా తిరిగేసిన నా తెలివిడికి నాకే నవ్వొచ్చింది!
2
మణి గారు మౌనంగా పుస్తకాలు సర్దుకొంటున్నారు.
అక్కడ ఉన్న పుస్తకాలు అప్పటికే చాలా మటుకు నా దగ్గర ఉన్నాయి.బాగా దిగులేసింది.కాకపోతే, చిన్నప్పుడు నేనెంతొ అభిమానించిన రష్యన్ పిల్లల పుస్తకాలు , నాకు ఊపిరి పోసాయి. మళ్ళీ నా బాల్యం అక్కడ ప్రోది చేసుకొన్నాను.
ఒక ఉల్లిపాయతో రెండుపూటలా తిరగమోతలేసుకొనే రోజులవి.రోజుకొక పూట కూరో ,ఒక మూర మల్లెలో తగ్గించుకొంటూ, వారానికి  ఒక రోజన్నా మణి గారి అంగడి దాకా వెళ్ళి వచ్చే దానిని.నేను స్వతహాగా బిడియస్తురాలిని. ధరవరలు మాట్లాడే ధైర్యం ఉండేది కాదప్పుడు.
పుస్తకం చూపించి, దాని మీద అచ్చేసిన డబ్బులు ఇచ్చేసి వచ్చేదానిని.ఒకా మాటైనా మాట్లాడకుండా .
అలా ఏడాదో రెండేళ్ళో గడిచింది.
మణి గారేమో మహా కచ్చితం మనిషి. లెక్కంటే లెక్కే.మాటంటే మాటే.
పుస్తకం ముట్టుకోను వీలు లేదు.పేరు చెపితే ఆయనే తీసి,పైకెత్తి పట్టుకొని, బడ్డీ కొట్టులోంచి  చూపిణ్చే వారు.
మాంత్రికుడి మాయలపెట్టిలా , చిన్న బడ్డీ లో , ఎన్ని పుస్తకాలో. తీస్తున్న కొద్దీ వస్తూనే ఉండేవి.
 రోడ్డు పక్కనే ఉండడం వలనేనో  పుస్తకాలను ప్లాస్టిక్ కాగితంలో చుట్టేసి భద్రంగా ఉంచేవారు. అందులోనూ పొగతోట గాంధీనగరమంతా మట్టిరోడ్లేగా.
అటు సాయిబాబ ,ఎదురుగా సుబ్రహ్మణ్యం దేవళాలు .
ఇక ఊరంతా అక్కడే కదా.  తిరిగే వాహనాలు.ఎగిరే ధూళి .ఆ మాత్రం జాగ్రత్త అవసరమే .
అంత మంది భక్తుల రాకపోకల మధ్యా, అటూ ఇటూ గుడులు కొలువుదీరిఉండగా, నట్టనడుమ  మణి గారి అంగడి. ఇక అక్కడ ,సమస్త హేతువాద, నాస్తిక, ఇతర ఉద్యమ నేపధ్య రచనలు, పత్రికలు.

మణి గారు మెల్లి మెల్లిగా ,ఆహ్వానాలు,కరపత్రాలు ఇవ్వసాగారు. అలా మొదటసారి వారి అచ్చేసిన "మరణశాసనం " చూశాను.
".మనలాంటి వారేనే వీరూను "అని ఒక్కరవ్వ సంతోషపడ్డా.
అసలే పెద్ద వారు.అందులోను మాట కరుకు. మా మధ్య పెద్దగా మాటల పరిచయం సాగలేదు. మహా అయితే ,ఒక పలకరింపు నవ్వు ..ఇచ్చిపుచ్చుకొనే వాళ్ళం.
పుస్తకాలు పరిమితం గానే ఉండేవి. ఆంగ్లసాహిత్యం అసలే లేదు. మళ్ళీ వేట మొదలు.
మణి గారి వద్దే, ప్రేంచంద్ పుస్తకాలన్నీ చదివింది.గురజాడను,రాహుల్జీని మళ్ళీ పలకరించింది.
మణి గారి మాటతీరు మర్మమేటో ,కొంత కాలం పోయాక గానీ అర్ధం కాలేదు. వారి మాతృభాష మళయాళం. తెలుగు మాట్లాడడం , చదవడం నేర్చుకొన్నారు. డిగ్రీలు లేవు .కానీ వారు చదవనిపుస్తకం అక్కడ పెట్టలేదు. వారి పట్ల గౌరవం ఎంతో పెరిగింది. భాష కాని భాషను నేర్చుకొని, అందులోను , మంచి పుస్తకాలను ,ముఖ్యంగా, ప్రగతిశీల భావాలు గల పుస్తకాలను మాత్రమే , అమ్మడం ,ఆ వచ్చే పరిమిత ఆదాయంతో ఒక్క కొడుకునూ , డాక్టరుగా తీర్చిదిద్దడం, వారు తండ్రి నేర్పిన బాటలో ,పల్లె పిల్లలకు వైద్యం చేయడం ,
ఇవన్నీ మా కుటుంబ స్నేహాన్ని ఏర్పరచడం  ,తర్వాతి సంగతులు.
ఇక, మణి గారు వారబ్బాయి వద్దకు విశ్రాంత జీవితం గడపను వెళ్లడం తో మరో అధ్యాయం ప్రారంభం

*

 All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

1 comment:

  1. అంగడి ,దేవళం ,ఈ రెండు మాటలు చూడగానే మా నెల్లూరు గుర్తు
    వచ్చింది. మణి బుక్ స్టాల్ లో దొంగతనం గా త్రిపురనేని శ్రీనివాస్ రహస్యోద్యమం
    కొన్న జ్ఞాపకం .మీకు ఈ పుస్తకం ఎందుకని మణి వేసిన ప్రశ్నజ్ఞాపకం.
    కృతఙ్ఞతలు చంద్రలత గారూ

    ReplyDelete