Sep 5, 2010

చివారఖరకు

ఒక్క విషయం తేల్చి చెప్పేయాలి మీరు!
ఇక్కడ చూస్తోన్న ఈ పూసిన పువ్వేంటో , టక్కున చెప్పగలరా?

బాగా చూడండి. దగ్గరగా.


ఇప్పుడు చూడండి!తెలియట్లేదా?
పోనీ, తెలుసుకొని చెప్పగలరా?
ఊహు!
నిత్యమల్లి కాదు.
కాగడా మల్లి కానే కాదు.
పట్నం బంతి కాదు.
పగడపు బంతి కాదు.
మాలతి కాదు.మందార కాదు.
ఏమిటీ పిల్లప్రశ్నలు అని కళ్ళెర్రజేసేరు!

పంతుళ్ల పండుగ రోజున ఈ పదారు ప్రశ్నలేమిటని అనుకోబోయేరు!


ఈ పువ్వు పేరు తెలుసనుకోండి .
మంచిది.

నాకు మాత్రం చాన్నాళ్ళ తరువాత ,వెతకగా వెతకగా దొరికింది.
దొరికాక మొదట విత్తులు సేకరించా . దాచిపెట్టి ,ఈ తొలకరిలో నాటేసా.
నాటేసిన కొన్నాళ్ళకే చక చక ఎదిగింది . కణుపుకు ఒక మొగ్గ వేసింది. అన్ని పువ్వుల్లా కాక ,కాస్త ఆలస్యంగా ఏ పదింటికో విచ్చుకొంటోంది.కొద్దిసేపటికే రాలి పోతోంది.
మొక్క మొదలంతా ముగ్గేసి కుంకుమ అద్దినట్లు.
చూశారుగా ,ఆ లేతాకుపచ్చ ఆకుల సొగసు?

సరే, ఎన్నాళ్ళగానో ఆ పూల మొక్క కోసం ఎందుకు వెతుకుతున్నానో అదీ చెపుతా.
మీరిది విన్నారా?

"చిక్కుడు పువ్వెరుపు ..చిలుక ముక్కెరుపు.
చిగురెరుపు ..చింతాల దోరపండెరుపు.
రక్కసి పండెరుపు ..రాగి చెంబెరుపు.


మంకెనపువ్వెరుపు..మావిచిగురెరుపు.
మా పెరటి మందార పువ్వెంతో ఎరుపు.
కలవారి ఇళ్ళల్లో మాణిక్యమెరుపు.
పాపాయి ఎరుపు మా ఇంటిలోన !"

ఇది అన్ని పిల్లల పాట లాంటిదే. రంగులు నేర్పుతుంది .పిల్లలకి.
పెరట్లోను ఇంట్లోను ఉన్న వాటిని చూపుతూ.
అయితే ,మా పిల్లలకు ఈ పాట ను నేర్పుదామనుకున్నప్పడు తెలిసింది. ఇందులోని ఎన్ని పదాలు తెలియకుండా పోయాయో. వాడుకలో లేవో. కేవలం పదాలుగా తప్ప పెరట్లో నుంచి ఇంట్లోనుంచి మాయమై పోయాయో.

కొంత ప్రయత్నం చేసి చూసా.
మా పిల్లలు అంత కన్నా ఘనులు కదా? అదేంటొ చూపించలేనంటే ,ఇక నెత్తికెక్కి కూర్చున్నారు!

ప్రతిపదార్ధాలు ప్రశ్నలూ పదాలపుట్టుపూర్వోత్తారాలు తేల్చి చెప్పనిదే ఊరుకోరు కదా? అందులోను, తెలియని మాటొకటి చెప్పానా నన్ను ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువుల నీరు తాగించారన్నమాటే.
అందులోనూ, ప్రస్తావించిన వాటిని కళ్ళారా చూడందే అసలు ఒప్పుకోరు కదా?
ఎందుకు నేర్చుకోవాలీ పాట నంటే  , రంగులు కోసం అన్నాననుకోండి, వారికి తెలియని వస్తువులను ప్రస్తావిస్తూ ఏదో తెలియపరచాలనుకోవడం ఎంత హస్యాస్పదమో చూడండి . అసంబద్దం కూడాను!


సరే, ఓ రాగి చెంబు పట్టుకొచ్చా.మా పెరటి  మందార పువ్వును   మా అమ్మాయే చూపించింది . చిలక ముక్కు సరే సరి. మావి చిగురు కోసం మార్చి దాకా ఆగాల్సి వచ్చింది. అయినా ,పట్టువదలేదు.
చిక్కుడు పువ్వు దొరకలేదు. కావలిసినన్ని చిక్కుడు కాయలు ఉన్నాయి కాని. దాని కోసం , మా పల్లెకు వెళ్ళే దాకా ఆగాల్సి వచ్చింది.
రక్కసి పండు అంటే ఏంటో తెలియదు. బొమ్మజెముడుకాయలు చూపించాను. పొదల్లో పాములు గట్రా ఉంటాయి పిల్లల్నేసుకును వెళ్ళానని చివాట్లు తిన్నాను.
మాగిన చింత కాయను పగలగొట్టి , చింతాల దోరపండును చూపెట్టా.మాణిక్యం చూపించా.

ఇక, చివర వాక్యం వినగానే ,
మా అమ్మాయి వెళ్లి ముఖమంతా ఎర్ర తిలకం పూసుకు వచ్చి ,జడిపించి వదిలింది!
గడ గడ వణికి జొరం తెచ్చుకొన్నాక,
ఆ పై చేసేది ఏముంది, ఆ వాక్యం తీసేయాల్సి వచ్చింది!

ఊ!
ఇక మీకు అర్ధమై పోయిందిగా..

చివారఖరకు మిగిలింది,
ఇదుగోండి, ఈ మంకెన పువ్వు ఒకటి!

అవునండి .. ఈ ఎర్రటి ఎరుపు పువ్వు ,పసుపు పుప్పొడి తో .లేతాకుపచ్చ కొమ్మ కణుపునుంచి ..వయ్యారంగా వాలి ఉన్న మంకెన పువ్వు.

ఒక సారి ఆలోచించండి, మన ప్రకృతిలోనుంచి పుట్టిన ఎన్ని పదాలను మనం కనుమరుగు చేసుకొంటున్నామో. ఎన్ని పదాలకు మూలమైన ఆ చెట్టు చేమలు , జీవజాలాలు  కాలంలో కలిసి పోతున్నాయో.మన భాషను మన భావ
జాలాన్ని పరిపూర్ణత నిచ్చిన  ఆ పచ్చని పదాలు అదృశ్యం  అవుతున్నాయో .అరుదైపోతున్నాయో.

అమ్మలకే అమ్మ ఆ ప్రకృతి ...అన్ని పాఠాలను నేర్పిన మన తొలిగురువు.

మన ఆట, పాట, మాట, నడక., జీవిక ..అన్నీ ఆ అమ్మ ఒడిలోనేగా ఓనమాలు దిద్దుకొంది?

మరి, మానవాళి ఆ గురువుకు ఇస్తోన్న దక్షిణ ఏమిటని ?

ఆ ఆదిగురువు కు జోతలివిగో !

చెయ్యెత్తి!
*
నా మట్టుకు నేను మంకెన పూలు పూయించి తెగ సంబర పడి పోతున్నా. మరి మీరో ?
*
శుభాకాంక్షలు.
*

తాజా కలం: నా వెతుకులాటలో ఈ పువ్వే మంకెన పువ్వు చెప్పేవాళ్ళు కూడా తారసపడలేదంటే నమ్మండి. ఒక పల్లెలో ఒకరి పెరట్లో పూసిన ఈ పూల రంగుకు ముచ్చటపడి ,"ఇదేం పువ్వని" ఆరా తీస్తే ,ఆ ఇంటి పెద్దావిడ యధాలాపంగా అంటే, ఎగిరి గంతేసి విత్తులు పట్టుకొచ్చా.వెతకబోయిన పువ్వు దొరకడం అంటే ఇదే!
*


 All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

18 comments:

 1. Wav ! Really beautiful , thanks for sharing .

  ReplyDelete
 2. చాలా బాగుందండీ నేను ఇదివరకు ఈ పూలను చూశాను, మంకెనపువ్వు గురించి చాలా సార్లు విన్నాను కానీ ఇదే అదని ఇప్పటివరకూ తెలియదు.

  ReplyDelete
 3. పూలు చాలా బాగున్నాయండి .

  ReplyDelete
 4. మీ భాష మంకెన పువ్వంత బావుంది!
  ఈ రోజుల్లో ఇంత అచ్చమైన, స్వచ్ఛమైన తెలుగు చదువుతుంటే మినెరల్ వాటర్ ఫాక్టరీలో గుక్కెడు మంచి గంగ దొరికినంత ఆనందంగా ఉంది.

  ReplyDelete
 5. మీ ఆవేదన సరి అయినదే. రోజురోజుకీ ప్రకృతికి దూరమవుతూ వస్తున్నాం. ప్చ్

  ReplyDelete
 6. mankena puvvunu chupinchinanduku thanq madam.

  ReplyDelete
 7. మీ అందరికీ ధన్యవాదాలండీ.

  ReplyDelete
 8. ఉదయిస్తు భానుడు ఉల్లిపుఉవ్వు చాయ మధ్యాహ్న భానుడు మంకెన పూవ్వు ఛాయ శ్రీ సూర్యనారాయణా మెలుకో అని భక్తిరంజని లో శ్రీ రంగం గోపాలరత్న పాట ఎప్పుడైనా వినంది ఉదయాస్తమయాల వరకూ సూర్యుడిని పువ్వులతో పోల్చేపాట స్త్రీల పాట

  ReplyDelete
 9. బాగుంది..చూసారా EVARIANA ఏడ్చినా వారి ఎర్రటి కళ్ళను మంకెన పువ్వులతో పోలుస్తారు KADA..BEAUTIFUL చంద్రలత గారు మీ perulaane..

  ReplyDelete
 10. Puvvu choosinappatinundi naaku tecchi pettukOvalani vundandi Chandralathagaru. India lo nurseries lo dorukutaayaa leka mee laage palleki velli vetakaala?
  Mankena puvvu choopinchinanduku chaala chaala dhanyavaadalandi.

  ReplyDelete
 11. దుర్గ గారు,
  చాలా సులభం. మా ఇంటికి వచ్చేయడమే !
  పూల విత్తనాలతో పాటు, కాసిన్ని కబుర్లు బోలెడంత స్నేహం అదనం
  ..:-)

  సత్యవతి గారు,
  మీరు ప్రస్తావించిన సూర్య నారాయణ" పాట వినలేదు.కానీ, రేగడి విత్తులలో " శ్రీ సూర్య నారాయణ " అన్న ఒక స్త్రీల పాటను ప్రస్తావించాను. అందులోనూ మారుతున్న సూర్యుడి రంగులను పువ్వులతో పోల్చడం ఉంది.మంకేన పూలు సరిగ్గా మిట్ట మధ్యహ్నానికి పూర్తిగా విచ్చుకొంటున్నాయి. బహుశా , మధ్యాహ్నానికి మంకెన పూలకీ అక్కడేనేమో సంబంధం!

  రుక్మిణి గారు ,
  ధన్యవాదాలండి.

  ReplyDelete
 12. In my childhood we learned verses for depicting colours by flowers and other natural items.
  For example for red colour:
  "Arunodayam erupu, Arunachalamerupu, ..... Mankena puvu erupu, mari donda panderupu...." It goes like that.
  Do any of you know the complete verse and verses for other colours?
  if you know can you mail to sudhirbabu2009@rediffmail.com
  Thanks
  Sudhir Babu

  ReplyDelete
 13. Namaskaram Chandra Latha garu. Nenu sumaru 10 yella vayasu lo chusina ee puvvu ( mokka ) kosam eppati nundo vethukunnanu..chivaraku google cheyyaga mee page dorikindi. Mankena vithanalu ekkada dorukutayo naku cheppa galara !

  ReplyDelete
 14. Sravanti garu, They are at Prabhava .:-) If you pass through Nellore , you can collect your plant ! Thanks and Best wishes.

  ReplyDelete
 15. Namaskaram Chandra Latha garu. Nenu chalaa samvastarulugaa ee pumokka kosam vethukunnanu..chivaraku google search loo mee page chusi chalaa shantosham vesindi. Mankena vithanalu ekkada dorukutayo naaku evvagalara dayachesi.
  P. Lakshmi kumari
  plakshmikumari@gmail.com

  Reply

  ReplyDelete
  Replies
  1. Seeds and plants can be shared .If you are any where close to Prabhava , Nellore. Best wishes.

   Delete
 16. చంద్రా, ముచ్చటగా ఉంది మీ తెలుగు రంగుల పదాల మడత పేజీ. మీ ప్రయత్నం బహు సుందరం!

  ReplyDelete
  Replies
  1. చివారఖరకు , ఈ పేజీల మడతల్లో అద్దిన అక్షరాల రంగులే మిగలబోతాయి కాబోలు ! :-) ధన్యవాదాలు.

   Delete