Oct 27, 2010

గవ్వ మీది రంగులు

3
ప్రతిఫలం ఆశించని ఈ సాహితీ బంధువు బదులుగా కోరేది ఆగకుండా రాయడాన్నే.
రాస్తూ ఉండడాన్నే.
అయితే,ఎలా పడితే అలా రాయడాన్ని కాదు. 
మొదట రాసిన దానికన్నా మరింత మెరుగుగా రాయడాన్ని .
మరింత ఉన్నతంగా  రాయడాన్ని.

"ఆవేశంతో రాసుకు పోవడం ఇతర సాహితీ రూపాలలో కొంత మేరకు చెల్లుతుందేమో కానీ ,నవలా రచనలో చెల్లదు.మానవ విలువల ఆంతర్యాన్ని ఆవిష్కరించడానికీ ,నవరసాలను సముచితంగా చిత్రించడానికీ ,జీవితాన్ని ప్రతిఫలించడానికి ,విస్తృత అవకాశం ఉన్న నవల ఉత్తమ సాహితీ రూపం .నవలారచనకు ఎంతో అధ్యయనం ,అవగాహన కావాలి . రచన చేయ గలిగిన ఉత్సాహం ఒకటే చాలదు. నవలారచయితకు దీక్షాదక్షతలతో పాటు 
నిజాయితీ నిబద్దతలు ఎంతో అవసరం. ," చేరా గారు ఒక మారన్నారు ," ఆ అధ్యయనం అన్ని కోణాల్లోంచి మూలాల్లోకి జరగాలి. ఎంచుకొన్న విషయాన్ని ఎంతగా అర్ధం చేసుకొంటే అంతటి అర్ధవంతమైన రచనలు చేయగలరు.ఉత్తమ రచనకు వేరొక అడ్డదారి లేదు. సునిశిత పరిశీలన ,నిరంతర అధ్యయనం తప్పనిసరి."


చేరా స్వయానా నిరంతర పాఠకుడు.


కవిత్వం చదివింత  ఆప్యాయంగానే సాహిత్యాన్నంతా చదువుతారు.
మొదట భావం కోసం.మరల భాష కోసం.
పదం నుంచి పాట వరకు. వాక్యం నుంచి వ్యాసం వరకు.
కల్పిక నుంచి కథ వరకు.
నాటిక నుంచి నవల వరకు .ప్రాచీనం నుంచి అత్యాధునికం వరకూ.


చేరా ఒక రచనను కవిలా చదవగలరు. రసజ్ఞత పొందగలరు.
ఒక విమర్షకుడిలా చదవగలరు.ఆంతర్యం గ్రహించగలరు.
ఈ భావుకుడైన పండితుడి భావసాంద్రత ,పదసౌందర్యం ఆయన ప్రత్యక్షరంలో ప్రత్యక్షమవుతుంది.
ఈ మానస సంస్కారమే అంతః చేతనే ఆయన మానవసంబంధాలలోకి ప్రసరిస్తుంది.


ఆయన జ్ఞాపకాల చిరుజల్లులలో పిడుగుపాటులో , తడిచిన వణికిన దడిచిన  మనకూ .. ఆయన పట్ల సాన్నిహిత్యం కలుగుతుంది.గౌరవం పెరుగుతుంది.కిణాంకమై మిగులుతుంది.

"ఇచ్చట పీఠికలు రాయబడును .సమీక్షలు చేయబడును ," అంటూ ప్రకటనలు ఇవ్వక  పోయినా ,చేరా ఇంటికి కొనితెచ్చుకొన్న మొహమాటాలెన్నెన్నో! నిందలలో నిష్టూరాలలో నిలువునా తడుస్తూ !


ఒక మారు ,ఆయన ముందు ఓ పెద్ద కాగితాలకట్ట పెట్టుక్కూర్చున్నారు. ఆరా తీస్తే, అది ఎవరో కాలమిస్టు మిత్రుడు రచించిన వందలాది , బహుశా వేలాది,కాలమ్స్   కవిలకట్ట.
ఆ వేలాది చిరిగిన చెదిరిన నలిగిన కాగితాల నుండి ఓ వంద ఉత్తమ రచనలను  ఏర్చికూర్చి పెట్టమని చేరాను కోరారా మిత్రుడు. పనిలో పనిగా పీఠికా రాయమని.ఆ తరువాత సమీక్ష చేయమని !

చేరా గారు అప్పటికింకా "గుండె కోత "  నుంచి  తేరుకున్నట్లు లేదు! ఈ వ్యవహారమంతా వారి శ్రీమతి గారికి గుండెకోతగా పరిణమించింది!
స్నేహబంధం పట్ల గౌరవం కొద్దీ మొహమాటం కొద్దీ , ఆ పనిని చేరా సంతోషంగా చేయ  బూని ఉండొచ్చు కాక ! ఇలాంటి కూర్పుకర్త పనేనా చేరా మాష్టారు చే వలసింది? దానివలన చివరకు మిగిలేది ఏముంది ? మాష్టారి ఆరోగ్యానికి చెరుపు కాక ! కుటుంబసభ్యులకు వెరుపు కాక!
చేరా ప్రధాన కృషీ ప్రత్యేకకృషీ చేసిందీ చేస్తున్నదీ భాషాశాస్త్రంలో .ఇది ఆయన ప్రత్యేకత .ఇదే అసలు సిసలు ప్రత్యేకత.ఇదే ఆయనే చేయగలిగిన ఆయన పని !
ఈ రంగం లో చేరా జీవిత కాల కృషి ఇంకా అక్షరబద్దం కాలేదు. "అది నా బద్దకమే .." అంటూ పకపకా నవ్వేయడం చేరాకు అలవాటే.
హోంవర్క్ చేయడానికి పాలుమారిన పిల్లవాడూ మాట మార్చేయాలని నవ్వే నవ్వులు రువ్వుతూ.
ఆయనే చేయగలిగిన ఆయన పనిని చేసేట్లు చూడవలసిన బాధ్యత చేరాభిమానులందరిదీ. మాష్టారి చెవి మెలిపెట్టయినా సరే!

తడి ఇసుకలో  లో అదాటున దొరికిన గవ్వ మీది రంగుల్ని చూసి సంబరపడే పిల్లవాడూ.. 

స్వేచ్చకూ చైతన్యానికీ .. సూక్ష్మానికీ స్థూలానికీ  .. ప్రజ్ఞకూ విజ్ఞతకూ ..సౌందర్యానికీ సౌజన్యానికీ ..
నడుమ ఒక సమన్వయ ప్రమాణాన్ని చూపగల పండు మేధావి ..


ఆయనలోనే ఉన్నారు.


మనందరికీ చేరువలో ...


 మన చేరా!


*
("మన చేరా" సంకలనం ,"చేరా పై రాతలెందుకని ..!?!" నుంచి  కొంత , 15-4-2003)


*
 All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

1 comment:

  1. అవును. ఆయనతో అన్ని రకాల ఉపలబ్ధులూ పొంది, ఆయన్ని ఉభయకవి శత్రువు అన్నా నవ్వేయ గలగడం ఆయనకే చెల్లింది.

    ReplyDelete