ఎక్కే రైలు దిగే రైలు అన్నచందాన తయారయ్యింది ఈ నడుమ.
ఎక్కిన రైలు ఎక్కినట్టే ఉంది. దిగిన రైలు దిగినట్టే.
రైలు బండెక్కడమంటే ,అందరు పిల్లల్లాగానే, చుక్ చుక్ రైలు బండెక్కి, ముందున్న వారి చొక్కా కొసల్నో లంగా, గౌను చివర్లనో పట్టుకొని , కూ మంటూ వీధంతా తిరగడమే.
అప్పట్లో పాలమూరు నుంచి మా వూరికి వెళ్ళాలంటే , ఒక పాసెంజరు ఎక్కి వెళ్ళే వాళ్ళం. అది ఎక్కడి దాకా వెళుతుందో తెలియదు .ఎక్కడ నుంచి వస్తుందో తెలియదు. నడుమ మా పాలమూరు నుంచి అలంపురం వరకు మాత్రం వెళుతుందని తెలుసు.
అలంపూర్ లో దిగితే దిగినట్లు. లేకుంటే , కర్నూల్ కే వెళ్ళడం.మళ్ళీ అక్కడ నుంచి బస్సెక్కాలి.
అలంపూర్ నుంచి బస్సులు తక్కువ .ఉన్నవి మా వూరెళ్ళవు. అందుకనే , ఎప్పుడూ కర్నూలెళ్ళి మళ్ళీ వెనక్కి రావడం.
అలంపూర్ లో దిగితే దిగినట్లు. లేకుంటే , కర్నూల్ కే వెళ్ళడం.మళ్ళీ అక్కడ నుంచి బస్సెక్కాలి.
అలంపూర్ నుంచి బస్సులు తక్కువ .ఉన్నవి మా వూరెళ్ళవు. అందుకనే , ఎప్పుడూ కర్నూలెళ్ళి మళ్ళీ వెనక్కి రావడం.
ఉదయాన ఏ ఎనిమిదింటికో ఎక్కామా, సాయంత్రం ఏ ఆరింటికో ఏడింటికో చేరడం.
అది బొగ్గు రైలు. అప్పట్లో అన్నీ బొగ్గు రైళ్ళేగా.
కూ చుకు చుక్ మంటూ.. రైలు నెమ్మదిగా సాగుతుంటే ,భలే ఉండేది. కిటీకీలోంచి తల బయటకు పెట్టి , వచ్చే పోయే చెట్లను లెక్కేద్దామనుకొంటే , తల మీద టక్కున మొట్టికాయ పడేది. కళ్ళలో బొగ్గు పొడి పడుతుందని.
ఇక, కృష్ణ తుంగభద్ర రెండు నదులు దాటడం ఎంత బావుండేదో..వానాకాలం అయితే పట్టాలను తాకుతాయేమో నీళ్ళు అన్నట్లుగా ఉండేది. రైలు నది మీదకి రాగానే ,అందరం అన్ని నియమలు మరిచి కిటికీ కి అతుక్కొనే వారం. చిల్లర డబ్బులు నీళ్ళలోకి విసిరేసి, కళ్ళు మూసుకొని గబగబా కోరికలన్నీ కోరుకొనేసే వారం.
మా అమ్మ దారిలో చిరుతిళ్ళన్నీ చాలా శ్రద్ధగా మూటలు కట్టేది. వేరుశనక్కాయలు,బటానీలు,కారప్పూస,చెక్కలు ,గవ్వలు, జీడీలు,జామకాయలు, అరటిపళ్ళు, పాల బిస్కెట్లు, ఉప్పు బిస్కెట్లు ,అటుకుల చుడ్వా,మరమరాల ఉండలు, మరచెంబులో నీళ్ళు ...గట్రాగట్రా. అన్నీ సర్దుకొని సావధానంగా వెళ్ళేసరికి , రైలు ఎప్పుడు వచ్చేది కాదు.
రైల్వే స్టేషన్లో వేచి ఉండడమే భలేగా ఉండేది. ముఖ్యం గా, గంటలు కొట్టడం. మొదటి గంట కొట్టగానే ఎక్కడి వారం అక్కడ సిద్దమవడం, రెండో గంట కొట్టగానే వరసలుగా నిలబడి వచ్చే రైలు కోసం బారులు తీరడం. రైలు వచ్చీ రాగానే , తోసుకొంటూ లోపలికి ఎక్కడం. మనకన్నా ముందు, తువాళ్ళు , సంచులు ,పత్రికలూ ... కిటికీల్లోంచి సీట్ల మీదకి దూరడం.
అప్పటికే లోపల కూర్చున్న వారు శక్తి వంచన లేకుండా సహక రించడం.. అంతా భలే ఉండేది. పిల్లలం కదా, కిటికీ దగ్గర ఎవరు కూర్చోవాలంటే ఎవరం కూర్చోవాలని అప్పటికి వారం నుంచి వేసుకొంటున్న తగువులు ,తీరే సమయం ఆసన్నం.
మళ్ళీ ,ఉన్న పిల్లలంతా జుట్లు పట్టుకొని కొట్టుకొని ,చీవాట్లు మొట్టికాయలు తిని ,ఆ పై తీర్పులు విని , తీరుమానం చేసుకొని వంతులు వేసుకొని ,బుద్ది మంతుల్లా సీట్లల్లో కూర్చోక మునుపే రైలు కదిలేది!
ఇక, ఉప్పూ కారం అద్ది ఏ జామకాయల ముక్కలో , ఏ రేక్కాయలో అమ్మే వారు తయారు.పిల్లలందరు మూకుమ్మడిగా ,తెచ్చుకొన్న తినుబండారాల పై దాడి.
మధ్యే మధ్యే ,కథలు చెప్పుకొనే వాళ్లు కథలు చెప్పుకొంటుంటే ,పాటలు పాడే వారు పాటలు పాడుకొనే వారు. ఇక, పెద్దాళ్ళ కబుర్లకు అంతే లేదు.కాసేపు సరదాగా, కాసేపు కుతూహలంగా కిటికీ లోనుంచి చూస్తూ కూర్చున్నా ,అందరి ఆటపాటల్లో , చిరుతిళ్ళల్లోకి ఎవరైనా మళ్ళాల్సిందే కదా?
ఇక,మేమెంత? కొట్టుకొనే వారం కొట్టుకొనే వారామా .. జుట్టూ జుట్టూ పట్టుకొనే వారం పట్టుకొనే వారామా!
ఇదుగో అదుగో అనుకొంటూ ఉండగానే రెండు నదులను దాటి ముందుకెళ్ళి, కర్నూలు స్టేషన్ కు చేరుకొనే వారం.
మళ్ళీ బస్టాండ్ కు వెళ్ళి ,ఏ రాయిచూరో గద్వాలో వెళ్ళే బస్సులో దొరికే దాకా పడిగాపులు పడి, ఎప్పటికో మా వూరికి చేరే వాళ్ళం.
వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ వచ్చాక కాని పాలమూరికి మా వూరికి మధ్యన దూరం తరగ లేదు. సరిగ్గా రెండున్నర గంటల్లో కర్నూలు చేరుకొనే వాళ్ళం. అసలు ప్రయాణం చేసినట్టే ఉండదుకదా!
నిజమే,రైళ్ళ వేగం,అనుకూలత, సౌకర్యం అన్నీ అనూహ్యం గా మారి పోయాయి. ఆనాటికీ ఈ నాటికీ ,
ఎవరం ఏమనుకొన్నా, రైళ్ళే ఒక వూరికి మరొక వూరికి నడుమే కాక,
ఒకరికొకరికి నడుమ , ప్రధానంగా, నిరాఘాట సంబంధ మాధ్యమాలంటే అతిశయోక్తి
కాదు.
మొన్నా మధ్య న అత్యవసరంగా రైల్లో వెళ్ళాల్సి వచ్చి, టికెట్ కు పంపానా, తటాలున మద్రాసు నుంచి వచ్చే రైలులో తత్కాల్ చీటీ కొట్టించుకు వచ్చాడు మా అసిస్టెంటు. మరొక అసిస్టెంటూ గారేమో తిరుపతి రైలులో.
తీరా చూద్దును దేనిలోనూ సీటు బెర్తు కన్ ఫర్మ్ చేయ లేదింకా. ఇదేంటని అడిగే లోపలే , ఇద్దరు ముక్త కంఠం తో దేనిలో కన్ ఫర్మ్ అయితే దానిలో నన్ను సాగనంపుతామని.వాళ్ళలో ఒకరెళ్ళి స్టేషనులోనే బైఠాయించారు.
మా ఇంట్లో ఆ సమయానికి నెట్ కనెక్షను కట్. పియెన్నారు స్టేటస్ తెలుసుకొందామన్నా.
సరే లెమ్మని ప్రయాణానికి సర్దుకొంటు ఉండగా,సరిగ్గా ఆరు గంటలప్పుడు సెల్లు తెలిపింది. సీటు దొరికింది స్టేషన్ కు వెంటనే రమ్మని.అరగంటలో వెళ్లాలక్కడికి.
ఉరుకులు పరుకుల మీద బయలు దేరితే, ట్రంకు రోడ్డు మీదొక యువ నాయకుడి బైఠాయింపు సాగుతోంది.అభిమన్యుడి చందంగా చక్రాన్ని తిప్పి మా కారు సారధి ఎలాగో నన్ను నా సామానును స్టేషనుకు చేర్చాడు.
ఆఖరి నిమిషాన ప్లాట్ ఫాం చేరానో లేదో.. రైల్వే అనౌన్సర్ సవినయంగా ప్రయాణీకులకు విజ్ఞప్తించారు.. "ఈ రోజు ఈ రైలు మరొక ప్లాట్ఫార్మ్ మీదకు వస్తుందని అందరిని అక్కడికి వెళ్ళమని" ..పాపం.. ఈ రూపేణా మాకు కలిగిన తీవ్ర అసౌకర్యానికి ఆవిడ చింతించింది కూడాను!
రైలు రావడానికి అయిదంటే అయిదు నిమిషాలు ..మా వూళ్ళో పట్టుమని నాలుగయిదు నిమిషాలకన్న పది సెకడ్లెక్కువ ఎప్పుడూ ఏ రైలూ నిలవలేదు. ఏ రాజకీయ నాయకుడో ఎక్కుతున్నప్పుడో దిగుతున్నప్పుడో తప్ప. ఆ పూట అంతటి మాహానుభావులెవరూ ప్రయాణిస్తున్నట్టు లేరు.
అందరం బుద్దిగా ఎవరి తట్టా బుట్టా తలకెత్తుకొని ,సూటుకేసులు చేతబుచ్చుకొని, పిల్లాపాపలను చంకకెత్తుకొని,ముసలీముతకలని ఉరుకులు పెట్టించి , మెట్లెక్కి దిగి , అవతలికి చేరే లోగానే, రైలు వచ్చేసింది.ఎన్నడూ లేనంత ఠంచనుగా.
రైల్లో కూర్చుని, స్టేషన్లో రైలు ఆగ గానే, నింపాదిగా బ్రెడ్ ఆంలెట్లు కొనుక్కొనే వారు... మమ్మల్ని చిత్రం గా చూసారంటే చూడరా?వారికి మా వాలకం ఏం అర్ధం అవుతుంది?
సరే , చెమట్లు కక్కుకొంటూ రైల్లోకి ఎక్కామో లేదో , రైలు తటాలున కదిలింది. వచ్చిన సీటేదో వెతుక్కుని,సీట్ల కిందికి సూట్కేసులు నెట్టేసి, అలా కాస్త అలుపు తీర్చు కొందామనుకొనే లోపలే, టిసి గారు వాక్రుచ్చారు, నాతో పాటు మరికొందరి సీటు అప్ గ్రేడ్ అయ్యిందని .
ఇదేంటబ్బా అని ఆశ్చర్యపోతు , లల్లు గారి గరీబీ రైలు పథకంలో భాగమని ఎవరో అన్న మాటలతో పాటు మళ్ళీ సామాను తలకెత్తుకొని, సంచులు భుజాలకేసుకొని.. భోగీ మార్పు. ఒకా పైసా అదనంగా చెల్లించకుండా ఇలా ఉన్నత తరగతుల్లో ప్రయాణించడం ,వింతగా ఉంది. మళ్ళీ సామాన్లు సీట్ కింద పేరుకున్న చెత్తలోకి తోసేసి సర్దేసి.. ఉస్సూరంటూ చూద్దుం కదా, ఊపిరాడడం లేదు. గాలి లేదు.తలెత్తి చూస్తే ఫ్యాను తిరగడం లేదు.స్విచ్ వేయ బోతే, అక్కడున్న వారు గయ్ మన్నారు.. "
మాకు చలేస్తుందని!"అయ్యా మేం చెమట్లు కక్కుతున్నాం" అంటే ,"అయిదంటే అయిదు నిమిషాలు"..అన్నారు.సరిగ్గా నేనున్న చోట ఫ్యాను తిరగనంటే తిరగనంది. పెన్సిల్తో తిప్పడానికి ప్రయత్నిచి మరింత చెమట్లు కక్కే లోపలే , ఆ అయిదు నిమిషాలు అయిపోయాయి. మా సాటి ప్రయాణికుడు స్విచ్ నొక్కేసాడు.
రైలు కదిలింది. రైలు కదిలితే ,
గాలి తిరగడానికి వీలు లేదయ్యే.బయటకు చూద్దా మంటే అసలు వీలు కాదు .కిటికీలన్నీ నల్ల అద్దాలు బిగించి ఉన్నాయి.
ఊరకుండని చూపులు అటూ ఇటూ పరి గెత్తుతుండగా, కళ్ళల్లో పడకూడనిదే పడింది.
హడావుడిగా అటూ ఇటూ చిటుక్కు చిటుక్కున తిరుగుతున్న ఓ చిట్టెలుక !
ప్లేగు నుంచి అన్నిరకాల రోగాల జాబితా గిర్రున కళ్ళ ముందు తిరిగింది.
ఒకటో రెండో ఎన్నో... రాత్రంతా , ఆ చిట్టెలుకల సైన్యం మా రైలు భోగీ ని పహారా కాస్తూనే ఉంది. కనురెప్పలు వాల్చనివ్వకుండా.
మా కాళ్ళ మీదుగా , తలదాకా బిగించి కప్పుకొన్న దుప్పటి మీదుగా ,సామాన్ల మీదుగా ,చెప్పుల్లో దూరి.. అందుగలవిందు లేవనుకుండా. అన్నింటా తామై!
కాళ్ళు పైకి ముడుచుకొని ,బిక్కు బిక్కుమంటూ ..ఎలాగో ఓ లాగా రాత్రంతా గడిచాక ,ఏ తెల్ల వారు ఝాము కో ,కాస్త కునుకు పట్టిందా, ఊపిరాడక ఉక్కిరి బిక్కిరవుతూ మెలుకువ వచ్చేసింది. వళ్ళంతా చెమట్లు.గాలి వెలుతురు రెండూ లేవు. భోగీ లోనీ అన్ని స్విచ్చులు బంద్! బాత్రూంలో నీళ్ళ సంగతి సరేసరి.
అటెండరూ కనపడలేదు. కాసేపు తలుపు దగ్గర నిలబడదామంటే ,అక్కడ పొగరాయిళ్ళు ఎప్పుడో ఆక్రమించేసారు.
ఖళ్ ఖళ్ మంటూ , మళ్ళీ సీట్లోకి. "రైళ్ళలో పొదుపు" గురించి, సిబ్బంది ని వూరిస్తున్న బహుమతులగురించి ఎవరో మాట్లాడుతున్నారు. ఏది ఏమైనా, గమ్యానికి సమయానికన్నా ముందే మా రైలు చేరడం తో తెగ సంబర పడి పోతుండగానే ,
హాల్ట్!
ఆ ఆగడం ఆగడం , రెండు గంటలు.
ముక్కుతూ మూలుగుతూ ,
పూర్వం మట్టి రోడ్ల మీద, పొలం గట్ల వెంట , కాలువ పక్కన , ఎడ్ల బండి ప్రయాణాలు ఎంత ఆహ్లాదంగా ఉండేవో , రసవంతమైన ఫ్లాష్ బ్యాకులు వేసుకొంటూ... రైలు దిగి ..
ఆటో బాట పట్టాం ఎట్టకేలకు!
ముక్కుతూ మూలుగుతూ ,
పూర్వం మట్టి రోడ్ల మీద, పొలం గట్ల వెంట , కాలువ పక్కన , ఎడ్ల బండి ప్రయాణాలు ఎంత ఆహ్లాదంగా ఉండేవో , రసవంతమైన ఫ్లాష్ బ్యాకులు వేసుకొంటూ... రైలు దిగి ..
ఆటో బాట పట్టాం ఎట్టకేలకు!
తప్పుతుందా మరి!
*
ఒక్క క్షణం ...
అక్కడేదో అంటున్నారు...
అక్కడేదో అంటున్నారు...
" ... నంబరు రైలు ఒకటో నంబరు ప్లాట్ ఫాం పైకి వచ్చునని ఆశించడమైనది.."
All rights @ writer. Title,labels, postings and related copyright reserved.
జీవితాన్ని రైలు ప్రయాణంతో పోల్చారెవరో.. మీ టపా చదవగానే అది గుర్తొచ్చింది.. నా రైలు ప్రయానలన్నీ గుర్తొస్తూనే ఉన్నాయండీ, టపా పూర్తైనా..
ReplyDelete