Oct 23, 2010

ఒక్క కారణమే

2
 జగమెరిగిన సాహితీపెద్ద చేరాకు ప్రత్యేక పరిచయం అక్కరలేదు.
ఒక కవిగా కళ్ళు తెరిచి ,భాషాధ్యయనం చేస్తూ   ,పరిశోధిస్తూ ప్రతిపాదిస్తూ
-అటు సాహితీ విమర్షకునిగా ఇటు భాషాశాస్త్రజ్ఞునిగా ప్రసిద్దికెక్కారు. శ్రీ చేకూరి రామారావుగారు.
  
ప్రామాణికమైన చేరా రాతలు ఎన్నో కొత్త కలాలకు అండగా నిలిచాయి. కొత్త కొత్త వాదనలు ,ధోరణులు , సిద్ధంతాలు మూర్తిమత్వం పొందడానికి మూలమయ్యాయి. ప్రాచీన, ఆధునిక, అత్యాధునిక సాహిత్యాన్ని  సాహితీవేత్తలను వారి ప్రత్యేక స్థానాలలో నిలబెట్టాయి.
ఇది సాహితీ సత్యం.
చేరాది మానవ స్పృహ . విపులతత్వం. ప్రజాస్వామ్యదృక్పథం.అంతర్జాతీయదృష్టి.
కొడొకచో ,చేరా సహృదయాన్ని మెట్టులా చేసుకొని ,కొండెక్కి  కూర్చున్న సాహితీరాజులు రాణులు చేసిన పిల్లచేష్టలకు ,ఆయన నవ్వేసి ఊరుకోవడమే కానీ, సాహితీ ద్వేషం  ప్రకటించిన దాఖలాలు లేవు.

సాయంకాలం కలిసి ,కాస్సేపు కాలక్షేపం చేసి ఆ "కాస్త" రాయించుకోవచ్చు "నంటూ చేసిన గాలిప్రచారాలకూ ఆయన అంతే తేలికగా నవ్వేసి ఊరుకోలేదూ?
దుయ్యబట్టినా దుమ్మెత్తిపోసినా ,శాపనార్హ్దాలు పెట్టినా ,హేళన చేసినా ,మనసు విరిచినా , చేరా తన విమర్షలో ప్రజాస్వామ్య దృష్టినీ నిజాయితీని నిబ్బరాన్ని విడవలేదు.
అందుకు కొండంత గుండె కావాలి.
మేధో ప్రజ్ఞ తో పాటు మానససంస్కారం  కావాలి. పండిన విద్వత్తుతో పాటు పసిపిల్లవాడిలా స్పందించగల నిష్కపట మైన  మనస్సు ఉన్నాయి కాబట్టే , చేరా ఉత్తమ సాహితీ విమర్షకులు కాగలిగారు.
ఎలాంటి పటాటొపం లేకుండా కొత్త గొంతులతో గళం కలపగలిగారు.
ఇదీ చెరగని అక్షరాలతో చేరసిన చేరాతల ప్రాధాన్యత.
*
రాయడానికి ఒక్క కారణమే ఉండొచ్చు.
రాయలేక పోవడానికీ ఒక్క కారణమే ఉండొచ్చు.
"గొప్పకవి అయి ఉండొచ్చు. గొప్ప విమర్షకుడు అయిఉండొచ్చు" ద్వారకానాథ్ గారి లాగా టి.టి. ఐ .లా మిగిలి అజ్ఞాతంలోకి అంతర్ధానమై పోయి ఉండొచ్చు.
జగడం లక్ష్మీ నారాయణ గారి లాగా "గనుల్లో పర్సనల్ ఆఫీఅసర్ గా మిణుకుతూ ఉండొచ్చు." రచయిత్రిని మింగిన రాజకీయాల్లో భాగమై  మిగిలి ఉండొచ్చు.
తెలంగాణా  విప్లవోద్యమం మలిదశను ఖండకావ్య కుసుమాలుగా  వికసింపజేసి , 
సాహితీచరిత్రలో సముచిత స్థానం పొందవలసిన గంగినేని వెంకటేశ్వరరావు గారి వంటి సాహితీమూర్తులు కావచ్చు.
కరుకు పదాల దాపున పడిన సాహితీ విమర్షకుల సుతిమెత్తని హృదయం కావచ్చును చిన్ననాటి స్నేహాల చిలిపిగుర్తులు కావచ్చు.
రచనలతో పాటు ఆయా సాహితీవేత్తలతోనూ సాహితీబంధువులతోనూ చేరాకు ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఏర్పడిన ఆ మానవ సంబంధాలు, అవి నేర్పిన సంస్కారమే ఆయనలోని వెలుగు.
 సాహితీ వేత్తలుగా ఎదగలేని ఎదగనీయని ఆ అనివార్యపరిస్థితులకు స్పందించిన ఆర్ద్రత, సాహితీ చరిత్రకారుల మరూలో మాయం అయిన మసకబారిన సాహితీ వేత్తలను గుర్తించిన శోధన ,వృత్తి కాఠిన్యంలో వెలువడని కరుణార్ద్రత ను    గ్రహించ గలిగిన హృదయ స్పర్ష ..చేరా గారిది.
మానవ సంబంధాల పట్ల చేరాకు గల గౌరవం ,ఆప్యాయత, తన బలహీనతలను తనే చెప్పుకోగలిగిన బలమూ ,చేరాను మనకు మరింత సన్నిహితం చేస్తాయి.

"ఈ పుస్తకంలో చాలా అంశాలు నా పరిశోధన ఫలితాలయినా,ప్రత్యక్షరమూ నా సొంతం కాదు. నా కంటే ప్రజ్ఞా వంతులైన పూర్వుల ఆలోచనల పునాదిబలంపైనే ఈ ఆలోచనలు సాగినాయి."

ఈ చే రాత పాతికేళ్ళకు పైగా భాషాశాస్త్రంలో ప్రామాణిక గ్రంథంలా అధ్యయనం చేయబడుతున్న "తెలుగు వాక్యం "పీఠిక లోనిది.
ఎదిగిన వారు ఎంతగా ఒదిగి ఉంటారో తెలియాడానికి ఈ ఒక్క చేరాతా చాలదూ ?

చేరా రాస్తారు కదా,"ఏ తరం వారయినా తమ వెనకటి తరం వారికి ఋణపడి ఉంటారన్నది ఋజువు చేయక్కర లేని నిజం. ఎన్నటికీ తీర్చుకోలేని ఋణానుబంధం అది."


ఆ విధంగా చేరా గారితో మనదెంత ఋణానుబంధం !

("మన చేరా" సంకలనం ,"చేరా పై రాతలెందుకని ..!?!" నుంచి  కొంత , 15-4-2003) All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

1 comment:

  1. నా కంటే ప్రజ్ఞా వంతులైన పూర్వుల ఆలోచనల పునాదిబలంపైనే ఈ ఆలోచనలు సాగినాయి. -

    బ్రహ్మాండమైన వాక్యాలు....ఆయనకు నా నమోవాకాలు...మీకు ధన్యవాదాలు...

    ReplyDelete