Oct 20, 2010

పువ్వుల కొరడా

పదాలు పువ్వుల లాంటివి.
పదాలు కొరడాల లాంటివి.
పదాలు పువ్వుల కొరడాల లాంటివి.

వాక్యాలలోకి ఒదుగుతూ ..
భావోద్వేగాలను పొదుగుతూ..
పలకరిస్తూ..పరామర్షిస్తూ..
పరీక్షిస్తూ..పరిచయం చేస్తూ..
విమర్షిస్తూ..విపులీకరిస్తూ..
వెన్ను తడుతూ ..వెన్నంటి నడుస్తూ..
భాసిస్తూ ..భాషిస్తూ..
విరబూసిన ఆత్మీయ పదాలు..
చేరాతలు.


భాషతో చెలిమి చేస్తూ ..చెట్టాపట్టాలు వేసి తిరుగుతూ ..
గాలివాటున నేలరాలిన పూల సుగంధాలను .. మొగ్గ విప్పుతోన్న కుసుమ సౌరభాలనూ ..
విప్పారిన పుష్పసౌందర్యాన్ని ...
ఆస్వాదించి ..
అపురూపంగా సేకరించి,గుదిగుచ్చి, 
ఆ సుమహారాన్ని ఆప్యాయంగా ..మనకు అందంచిన పెద్దలు... 
పసివాడని .. చేరా.

ఎందరెందరి రాతలనో తిరగరాసిన , తిప్పి తిప్పి తిరగమోత వేసిన ..
చేరాపై రాతలెందుకని ?

సాహిత్యంలో లక్ష వైవిధ్యాలుంటే ,సాహితీ విమర్షలో సవాలక్ష వైరుధ్యాలుంటాయి.

భావవ్యక్తీకరణకు సాహిత్యం ఓ స్వేచ్చామాధ్యమం.
స్వంతంగా స్వతంత్రంగా వ్యక్తమయ్యే భావానికి కొలమానం ఏమిటి ?
తప్పేమిటో ఒప్పేమిటో తూకం వేయడమేమిటి ?
స్వరూప స్వభావాల పరిమితులేమిటి ?
నియమనిబంధనాల పరిధులేమిటి ?
ఏమిటీ దబాయింపు ?

మరలాగే కానీ , క్షీరనీర న్యాయం జరిగేదెట్లా?
అకవుల మెడలో గంట కట్టే వారెవరు?
వారు..
అకవిత్వం నుంచి కవిత్వాన్ని వేరు చేయడం , తిరోగమన వాదుల నడ్డి విరచడం , దారి తప్పిన వారిని ఛళ్ళున చరచడం, స్వార్ధ సంకుచితాల నుండి సాహిత్యాన్ని సాహితీవిమర్షను రప్పించడం .. వ్యక్తి ద్వేషం నుండీ వర్గద్వేషం నుండీ  రచనను కాపాడడం ..ఇలా ఎన్నెన్నో  చేయవలసి ఉంది.
అంతేనా ?
భిన్న సంకుచితాలతో సాహితీరంగంలో ఏర్పడిన వివిధ పీఠాల బారినుండి ..ఆ పీఠాధిపతుల బారినుండి  ..స్వేచ్చాగళం కుత్తుకలుత్తరించే "ముద్రా" రాక్షసం( BRANDING) బారినుండి..
నలగనీయక అయోమయంలో జారనీయక..
కొత్తకలాలకు ఒక సంయమన విమర్షాపద్దతిని పరిచయం చేయాల్సి ఉంది.
అన్నిటికీ మించి ..
ప్రజాస్వామ్య భావాలను మానవవిలువలను ప్రతిష్టించాల్సి  ఉంది.
మానవ స్ప్రుహతో. మానవస్పర్ష తో.
మళ్ళీ  మళ్ళీ.

అప్పుడే కదా..
ఉన్నత సాహితీ ప్రమాణాలను సాధించే వీలు కలుగుతుంది.
ఉత్తమ సాహితీ సృజనకు ఊపిరిసలుపుతుంది. సాహితీసౌజన్యం సర్వబాహుళ్యమవుతుంది .
సరిగా అలాంటి సౌహార్ద్ర వాతావరణాన్ని ,సాహితీప్రమాణాన్ని అందించాయి చేరా రాతలు.
అవి చేరాతలైనా.చేరా పీఠికలైనా .
తెలుగు వాక్యమైనా. లక్షణ చర్చయైనా. 
ముత్యాలసరాల ముచ్చట్లైనా .
అనుభవాల దొంతరలైనా. అధ్యయన పాఠాలైనా.
జ్ఞాపకాలతో కాచినకాయలైనా.

("మన చేరా" సంకలనం ,"చేరా పై రాతలెందుకని ..!?!" నుంచి  కొంత , 15-4-2003)


 All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

No comments:

Post a Comment