Feb 9, 2010

నవల మనుగడ

నవలారచన వ్యక్తిప్రధానమైనది .
 నవలాకారులలో వ్యక్తిగతమైన జిజ్ఞాస , అన్వేషణ, ఆకాంక్ష  ఉపరితలాన్ని దాటలేక పోతున్నదేమో.జి.వి. కృష్ణారావు గారు భావించినట్లుగా-"తాత్విక అన్వేషణతో కూడిన స్వతంత్ర విచారము "అలవరచుకోవలసి ఉన్నది."స్వతంత్ర విచారము “ యొక్క మూల భావనను అర్ధం చేసుకోవాల్సి ఉన్నది.
*.ఇక పాఠకుల సంగతి కి వస్తే ..నిడుపాటి నవలలు చదివే తీరిక ఓపిక లేకుండా పోయిందనీ ..మార్మికతను ,కథనాలలోని సంక్లిష్టతను అర్ధం చేసుకొనే  ప్రయత్నం లేకుండా  పోయిందనీ..చివరకు పాఠకులే లేకుండా పోతున్నారనీ..వాపోతున్నాం.
*ఎప్పుడు పాఠకుల గురించి మాట్లాడ వలసి వచ్చినా ..మన సంభాషణలు మన భాష మనుగడ వైపు మళ్ళుతాయి.
భాష మనుగడే సందిగ్ధం లో పడ్డప్పుడు ..నవల మనుగడ మవుతుంది ..అన్న దిగులు కలుగుతుంది.
 తెలుగు నవలను బతికించుకొనే ముఖ్య వనరు ..చదివించే అలవాటు. ఆ అలవాటే గత కాలపు శృతకీర్తిలా మిగిలిపోతుందా.. అన్న విచారము కలుగుతుంది
Ø  మరోవైపు ..తెలుగు నవలే సమాచార విభ్రమ కు గురయ్యిందా అనిపిస్తుంది.
రాను రాను తెలుగు నవలలు సృజనాత్మక అనుభవం అందించ లేని..ఆస్కారం లేని ..దృశ్య మాధ్యమాల్లా సమాచార సంపుటాల్లా తయారవుతున్నాయా అనిపిస్తుంది.
ఇక, చరిత్రను తక్షణ రాజకీయ ప్రయోజనాల కొరకు ఒక సాధనం గా వాడుకోవడం సర్వత్రా కనబడుతున్నది.ఏకపక్ష వ్యవహారం లా సాగుతున్నది.నవలల పునర్మూల్యాంకనం జరిగేటప్పుడు సమగ్ర దృష్టి కొరవడుతున్నది.
***
నవల ఒక సృజనాత్మక కళ .ఒక కథన కళ.
కథనపరంగా ఈనాటి తెలుగు నవల కాలక్రమానుగత అమరిక పట్లనే మొగ్గు చూపుతున్నది.కథన పరంగా వైవిధ్యాన్ని శిల్ప ప్రాధాన్యతను ఆవిష్కరించ వలసి ఉన్నది.
గణపతి వంటి వ్యంగాత్మక నవలలు బారిష్టర్ పార్వతీషం వంటి హాస్యనవలలు రావలసి ఉన్నది.
ఈ సంధర్భం లో ,గొగోల్ "మృతజీవుల"ను ..గొర్కీ "అమ్మ"ను ఒకసారి జ్ఞపకం చేసుకోవాలి.ఒక ముఖ్యమైన చారిత్రక మార్పుకు గొగొల్ నవలలు మూలం అయ్యాయి.గోర్కీ నవల సాధనం అయ్యింది.
ఇది సమాచార యుగం.మునుపెన్నడూ లేనంతగా సమాచారం మన అందుబాటులో ఉన్నది.
కొనగోట మీటితే కోకొల్లలుగా లభ్యం అవుతున్నది.
సామాజికంగానూ వ్యక్తి విలువల్లోనూ వేగంగా వస్తున్న మార్పులు -ఉన్నవాటిని కోల్పోతున్న దిగులు -కొత్త వాటిని ఆకళింపు చేసుకోవాల్సిన అవసరం -సున్నిత మనస్కులైన కల్పనారచయితలు ప్రతి సూక్ష్మాంశాన్ని అక్షరబద్దం చేయాలనుకోవడం సహజమే.
రచయిత సేకరించిన సమాచారాన్ని ఎంత సృజనాత్మకంగా మలుచుకోగలరు..ఎంత కళాత్మకంగా ప్రకతించగలరు అన్నదే రచయిత ప్రతిభావిశేషం,కథన కౌశలం,.నేర్పరితనం .ఈ నాటి తెలుగు నవల ఆ ఆంతర్యాన్ని గ్రహించ వలసి ఉన్నది. ఈ "వాస్తవిక ధోరణి " కి మరొవైపు ఏమిటంటే- కథకూ పాత్రలకూ సంఘటనలకూ సంభాషణలకూ ..రచయిత లోనే "వాస్తవ మూలలను వెతకాలన్న ప్రయత్నాలు ..వక్రీకరించి వ్యక్తిగత దూషణలకు దాడులకు దిగడం ..వరకూ ..సాగుతున్నది.
<<< నవలల్లో (స్వేచ్ఛ తదితర నవలలు) ఒక మేరకు తన అనుభవాన్ని జనరలైజ్
చేయడం ఉన్నా వ్యాసాల్లోని అవగాహన తో పేచీ లేదు "అంటారొక విమర్షకులు ఓల్గా గారి రచనల గురించి.>>><< వరవర రావు, స్త్రీవాద వివాదాలు>>>
ఎంతటి వాస్తవ అనుభవాన్నైనా ఎంతటి చేయి తిరిగిన రచయిత అయినా --"యధాతధం గా ఆ అనుభవాన్ని వ్యక్తపరచడం వీలుకాదు. ఆ అనుభవం కేవలం పరికల్పన చేయబడుతుంది."రచయిత
‘అనుభవం ,జ్ఞానం, దార్శనికత ల ముప్పేట"గా నవలను అభివర్ణించారు భక్తిన్.
వ్యక్తిగా ఉన్న పరిమితులు రచయితగా ఉన అపరిమితమైన శక్తి ని అర్ధం చేసుకోక పోవడం లోనే ఉన్నది చిక్కంతా.
అటు వ్యక్తి గా ఇటు రచయితగా నిరంతరం కలిగే పరిణామ క్రమాన్ని కూడ మనం అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి.జివికె వంటి వారు ప్రస్తావించిన "స్వతంత్ర విచారము" రచయితలకే కాదు పాఠకులకూ  వర్తిస్తుందన్నది సత్యం.
*
"సృజనాత్మక సాహిత్యం లో సాహిత్యవిమర్శ
తెలుగు నవల ...  పూర్వాపరాలు "  చంద్ర లత
20-9-2008 Deccinial Celebrations of Detroit Telugu Literary Club
*
All rights @ writer.
Title,labels, postings and related copyright reserved.

6 comments:

  1. ఒక పాఠకుడిగా నవల మనుగడను గురించి నాకైతే ఎలాంటి సందేహాలూ లేవండీ.. కాకపొతే కాలానికి అనుగుణంగా మారాల్సిన అవసరం ఉంది.. (ఇది అన్ని రచనా ప్రక్రియలకీ వర్తిస్తుందని అనుకుంటున్నా..) ఈ మధ్య కాలంలో నవలల సంఖ్య తగ్గిన మాట వాస్తవమే అయినా, వస్తున్నా వాటిలో 'నాణ్యత లోపం' ఉన్నవి కూడా తక్కువ కావడం స్వాగతించాల్సిన పరిణామమే అనిపిస్తోంది నాకు.. పుస్తక ప్రచురణ, మార్కెటింగ్ కి సంబంధించి మీ నుంచి కొన్ని టపాలని ఆశించవచ్చా??

    ReplyDelete
  2. రియాలిటీకి లిటరరీరియాలిటీకి-సినెమాటిక్ రియాలిటీకీ ఖచ్చితంగా తేడా ఉంటుంది. ఉండాలి. లేకపోతే అవి "సృష్టి" ఎలా అవుతాయి?

    ReplyDelete
  3. చంద్రలత గారూ,
    నేను ఈమధ్య, "ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ" అని ఒక ఆన్ లైన్ నవల ను బ్లాగ్ చేసి పారేశాను. మీరు కొంచెం చదివి మీ అభిప్రాయం చెప్తారా? ఇక్కడ: http://bondalapati.wordpress.com

    ReplyDelete
  4. మురళి గారు,
    నమస్కారం.
    నవలా రచన నిజానికి చాలా పెద్ద పని.క్షణలలో రాశేసి కలం ముడేచేది వేళ్ళు విరుచుకొనేది కాదు కదా?
    ప్రచురించడానికి ఇదే ఇబంది. పత్రికలలో రెండు మూడు పేజీల కథలకు ప్రాధాన్యతనిస్తున్నయి. వారి నిబధన ప్రకారం,నవలంటే 50 నుంచి 80పేజీలు లోపు. ఇక, విషయం పై వస్తువుపై .. అనెక పరిమితులు.
    అందుకే,మీరు సూచించిన అంశాలు రెండు అవినాభావ సంబంధమున్నవి.
    మన పరిస్తిథి ఏమిటంటే, ఎలాంటి రాజీ పడకుండా ఒక రచన చేయ దలిస్తే, దాని ప్రచురణకర్తా ,ప్రూఫు రీడరూ,పేజీమేకరు, పెట్టుబడిదారు <:-)>,పంపిణీదారు.. లాంటి అన్ని పాత్రలనూ ఆ రచయితే పోషించాలి.
    అది ఒక వైపు.
    ఇక, లక్షల కొద్దీ పారితోషికాలు ప్రకటించినా,విరివిగా నవలలు రావడం లేదన్నది మరో వైపు.
    ఎప్పుడైనా ,కాలక్రమంలో మిగిలేవి ఒకటో రెండో మంచి వీ ఒకటో అరో
    గొప్పవీ..అంతే.ఇది ఏ చోటనైనా ఏ కాలంలోనైన ..మనకు నవల నేర్పిన చరిత్ర.
    యభై దశకంలోని తెలుగు నవలను ఒక సారి ప్రిశీలిస్తే , ఇవ్వాళ్టి తెలుగు నవల పురోగమించిందంటారా? "నవల" ప్రపంచ సాహిత్యంలో ఎంతటి ప్రాముఖ్యాన్ని చూపుతుందో మనకు తెలుసు.మరి, మన నవల మన ప్రపంచంలో ఎలాంటి స్థితిలో ఉందంటారు?
    నవల అభిమానులుగా ,రచయితలుగా, పాఠకులుగా,ప్రచురణ కర్తలుగా.. మనం నిజాయితీగా వేసుకోవాల్సిన ప్రశ్నలు కదా?
    ఏమంటారు?
    ధన్యవాదాలు.

    ReplyDelete
  5. మహేష్ కుమార్ గారు , ముమ్మాటీ అవ్వదు. అలా అయ్యే అవకాశమే లేదు.అయితే, ఆ మధ్యన ఒక్క సారిగా బాగా పేరు మోసిన రచయితల ఉపన్యాసాల నడుమ చిక్కుకు పోయా.
    వాళ్ళ వాదమంతా .. అనుభవాలకు అక్షరాల వాస్తవ సృష్టే సాహిత్యం అని.
    అది ఎంత వాస్తవమైనా, రచయిత సృజనశీలత ,దార్షినికత,కళాభినివేశం, కాల్పనిక ప్రతిభ,కలగలసే కదా ఆ వాస్తావాన్ని రచనగా సృష్టించేది !
    అది ఎంత వాస్తవమైనా, రచయిత సృజనశీలత ,దార్షినికత,కళాభినివేశం, కాల్పనిక ప్రతిభ ..ఆ వాస్తావాన్ని రచనగా సృష్టించేది.
    కలగలసే కదా నూటికి నూరుపాళ్ళు వాస్తవాన్ని అక్షరబద్దం చేయ సాధ్యం అవుంతుందా? ఎంతటి చేయి తిరిగిన రచయిత కైనా?అందులోనూ వాస్తవిక,అధివాస్తవిక ధోరణులను మూడు శతాబ్దాల కిందటే దాటి వచ్చామన్నది జ్ఞాపకం చేసుకోవాలి.
    అది ఎంత వాస్తవమైనా, రచయిత సృజనశీలత ,దార్షినికత,కళాభినివేశం, కాల్పనిక ప్రతిభ ..ఆ వాస్తావాన్ని రచనగా సృష్టించేది.
    కలగలసే కదా నూటికి నూరుపాళ్ళు వాస్తవాన్ని అక్షరబద్దం చేయ సాధ్యం అవుంతుందా? ఎంతటి చేయి తిరిగిన రచయిత కైనా?అందులోనూ వాస్తవిక,అధివాస్తవిక ధోరణులను మూడు శతాబ్దాల కిందటే దాటి వచ్చామన్నది జ్ఞాపకం చేసుకోవాలి.
    ఆ మాటే వారికీ చెప్పాను. మాటామాటా పెరిగిందే తప్ప ఒరిగిందేమీ లేదు...:-)
    నా

    ReplyDelete
  6. నవల వికాసం పొందుతుందని అనుకోలేను. చివరకు మిగిలేది, అసమర్ధుని జీవయాత్ర, అల్పజీవి, అంపశయ్య .... మొదలగు నవలలు ఇప్పటికీ ఉత్తమ నవలలుగా పరిగణించ బడుతున్నాయంటే ఆ స్థాయిలో ఇప్పటి నవలలు లేవనేగా ! పరిశీలిస్తే ఆ రచయితలు స్వీయ విముక్తి కోసం, అన్వేషణ కోసం రాసుకున్నవి అని అనిపిస్తుంది. పాఠకులను ఆలోచింపచేయలేని నవలలు ఎక్కువ కాలం మనలేవు. 80, 90 దశకాలలోని ప్రముఖ రచయితలు అని చెప్పబడ్డ వారి రచనలే గత రెండు సం।। వరకు నాకు తెలుసు. ఈ హోరులో పాతతరం నవలలు, కాశీభట్ల వేణుగోపాల్ అనే రచయిత పేరు తెలియటానికి చాలా సమయం పట్టింది.ఒక మూస సాహిత్యానికి పాఠకులు విసుగు చెందారు. అందుకనే నవలలు వికాసం పొందలేకపోయాయి. నవల కొత్త పుంతలు తొక్కాలంటే చిన్నప్పటి నుంచి ఎక్కువ మంది పుస్తకాలు చదివేవారు పెరగాలి.వారిలో కొంతమందైనా సృజనాత్మక రచయితలు వస్తారు. రెంటికీ అవినాభావ సంబంధం ఉంది. అంతే.

    ReplyDelete