Feb 13, 2010

అవశేషం

చెపితే పట్టించుకోరు. చెప్పకపోతే తెలుసుకోరు.  అలాగని చెప్పకుండా ఎలా ఉండడం?

అందులోనూ... మా బాబాయికి.
 వేడి వేడి అన్నం , ముద్దపప్పు, ఆవకాయ,చారెడు నెయ్యి అమాంతం గా ఆవురావురని మొదటి ముద్ద ..తినందే ఆయనకు అన్నం గొంతు దిగదు. కాలంలోనూ చాదస్తం ఏమిటని మా పిన్ని గొడవ.
ఎక్కడ చూసినా ఆహారమే ఆరోగ్యమని అంటూ ఉంటే ...ఎవరికి వారు ఇంటా వంటా జాగ్రత్తలు తీసుకొంటుంటే ..మీ బాబాయేమిటీ చిన్నపిల్లాడిలా అంటూ కళ్ళ నీళ్ళెట్టుకొని మరీ వాపోతుంది పిన్ని కనబడిన వాళ్ళందరి వద్దా.
పలకరించిన వారిదే పాపం అన్నట్లు, బాబాయి మీద పిర్యాదుల చిట్టా సిద్దం చేసి సదా యుద్ధం అంటుంది కయ్యానికి కాలు దువ్వుతూ.
మా వంటి వారి పరిస్థితి ఎలా ఉంటుందో మీరు ఊహించుకోగలరు.
 ఒక పక్క ఆవకాయ నోరూరుస్తుంటే , మరో పక్క పిన్ని కన్నీళ్ళు కారుస్తుంటే .. అబ్బబ్బ .. ఎటూ చెప్పలేక ..ఎటూ తేల్చుకోక సతమతమవ్వడమే మేం చేసేది.
అలాంటిది మొన్నాదివారం ..భూమ్యాకాశాలు ఏకమైనట్లు ..మా పిన్ని ఫోను చేసి మరీ ఆవకాయ పార్టీ ఇస్తున్నాం తప్పక రారా ..అంటూ ఆహ్వానించే సరికి తల దిమ్మ తిరిగి పోయింది.వస్తూ వస్తూ వీశెడు నెయ్యి పట్టుకు రమ్మని పురమాయించింది.అన్నట్లు, గీతికనూవెంటబెట్టుకొని రమ్మంది.కాదనగలవారెవరూ..?
వెళ్ళిన వాళ్ళకు వెళ్ళినంత అనీ.. నా మట్టుకు నేను తయారయ్యా.గీతికకు ఒంట్లో నలతగా ఉండబట్టి కానీ తనూ నాకన్నా ముందే సిద్ధపడేది. మా పిన్ని చేతిరుచి మహత్యం అదీ! పై నుంచి ,గీతికకు పిన్నికి మంచి స్నేహ సంబంధం.
 వీశేడంటే ఎంతని తను ఒక పక్క బ్రౌన్ నిఘంటువు శబ్దరత్నాకరాలు మరోపక్క "తెవికీ"లు తెగ వెతికేస్తుంటే ..గీతిక మెల్లిగా నా పక్క చేరి మెత్తగా ఒక పుల్ల విరిచింది.
"చిన్నత్తయ్య గారు అంతలా పిలుస్తున్నారంటే మిమ్మల్ని మామయ్యగారితో ఏదో మధ్యవర్తిత్వం చేయించడానికన్న మాటే! మధ్యలో నేనెందుకూ ?" రాగం కూడా తీసింది.
గీతిక మాటలు గొంతులో కొట్టుకు లాడుతుంటే ..గీతిక చక్కగా తూచి మరీ సర్ది తెచ్చిన వీశెడంటే వీశెడు నెయ్యిని తీసుకొని ..మరీ బయలు దేరా .బాబాయి గారింటికి.
గీతిక అన్నదని కాదు కానీ, ఊరక పిలవరు కదా మహానుభావులు ! అందులోను అన్ని పనులు ఆచితూచి చేసే మా పిన్ని!
పిన్ని వాళ్ళింటి వాకిటి ముందరి చెప్పుల వరసలు చూసేసరికి ఇక వ్యవహారం ఏదో ప్రత్యేకమైనదేననిపించింది. ముందు గదిలో నిల్చుని , తెరల మాటుగా తొంగి చూద్దునా ..భోజనాల బల్ల చుట్టూ ఒక అతిథివలయం.
ఇంతలో వంటింట్లో నుంచి పచ్చడో  పులుసో గరిట్లో వేసుకొని .."వదినా ..ఒక సారి ఉప్పు చూడవే .." అంటూ హడావుడిగా అడుగు పెట్టింది మా పిన్ని.
ఉప్పు చూడడం మాట అటుంచి ,కమ్మటి జ్ఞాపకాల తుట్టిని తట్టి లేపింది ఒక్క మాట !
వేసవి కాలం వచ్చిందంటే ,అది ఆవకాయల కాలం.ఒక్కఆవకాయేమేటీ..?మాగాయ,అల్లం,టమాట,వంకాయ,ఎర్రగారం,ఉసిరి,నిమ్మకాయ... అవీ ఇవనీ కాదు. అన్నిరకాల పచ్చళ్ళు,వరుగులు,వడియాలు,అప్పడాలు,అప్పడంపూలు..ఒక పండుగలా ఉండేది కాదూ ఊరంతా?
 ఏదో యజ్ఞమో యాగమో చేస్తున్నంత పవిత్రం గా.. ఇంట ఆడపిల్ల పెళ్ళి చేస్తుంత హడావుడిగా ..సందడి చేస్తూ పచ్చళ్ళు పట్టుకొనే వారు. రోటి చుట్టూ పోటీలు పడూతూ పిల్లలమంతా. ఎప్పుడెప్పుడు రోటిముద్దలు కలిపి పెడతారా అని!
ఊరింపు తోనే గా పచ్చడికాయలు బద్దలు చేసే దగ్గర నుంచి ..మాగాయ ముక్కలను ఎండపెడితే కాపలా కాయడం వరకు చెప్పిన చిన్నచితకా పనులల్లా బుధ్ధి గా చేసిపెట్టడం! అందుకేగా...అమ్మలక్కలకు సమాచారం చేరేయడం, రోకళ్ళు చాటలు జల్లెళ్ళు అటూఇటూ మోసుకెళ్ళడం .. ఇంటి నుంచి ఇంటికి గిర్రుగిర్రున తిరుగుతూ,అక్కడో అప్పచ్చి ఇక్కడో మొట్టికాయ తింటూ..ఊరంతా తెగ తిరగడం ! ఆ రోజులు ఎంత కమ్మటివి..!
చేసిన పచ్చడి జాడీల్లో తీసి.. పాచారినో పంచెముక్కనో..వాసెన గట్టి..అటకమీద కెక్కించాకేగా ఇంట్లో పెద్దలు ఊపిరి పీల్చుకోనేది.పిల్లల సందడి కాస్త తగ్గేది.
రోకళ్ళ పోటు, కారాల ఘాటు,తిరగలి గిరగిరలు,చేజారే జాడీలు వీపు మీద మోగే విమానం మోతలు. పెద్ద పెద్ద మట్టి బానల్లో మజ్జిగలో ఊరేసిన పచ్చి మిరపకాయలు ఒక వైపు ..నులక మంచాలు వాకిట్లో వేసి పాతపంచెలు పరిచి ..అందమైన ముగ్గు తీర్చిదిద్దినట్లుగా పెట్టిన సగ్గుబియ్యం ,మినపవడియాలవన్నీ  ఒక ఎత్తయితే...ఇక పచ్చడి తయారయిపోయిందోచ్..పిల్లల్లారా రారండోయ్...అంటూ చాటింపు వేసే ..ఘుమఘుమలాడే తిరగమోత..అబ్బ!
 అప్పుడే వండి వార్చిన వేడివేడి అన్నం రోట్లో వేసి ..అరచేతి నిండా నెయ్యి పోసి ముద్దలు చేసి..అమ్మ పెడుతుంటే...ఆవురావురు అంటూ ..పోటీలు పడుతూ..
"అదేంట్రా సంజీవ.. అక్కడే నిలబడిపోయావ్..మాటాపలుకు లేకుండా?ఎంతసేపయ్యిందీ వచ్చి? రా రా లోపలికి.” ఆశ్చ్యర్యం ఆనందం కలగలసిన పిన్ని ఆత్మీయ ఆహ్వానం.
మాట్లాడకుండా నెయ్యిడబ్బా పిన్ని చేతికి అందించా.
 "భలేవాడివిరా..ఏదో మాటవరసకంటే నిజంగానే పట్టుకొచ్చావురా? గీతిక రాలేదు? పోనీలే ,నువ్వయినా వచ్చావు. అదే పదివేలు.."పిన్ని ప్రశ్న సమాధాన0 తనే చెప్పేసి ..భుజం మీదుగా వెనక్కి తిరిగి చూస్తూ కేకేసింది.."ఇదుగో వదినా ..అక్కాయ్..రాజ్యమక్కాయ్ కొడుకు,సంజీవ, గుర్తుపట్టారూ?"
"ఎంత పెద్దాడివయిపోయావురా..మీ అమ్మ కొంగట్టుకొని గునగునా తిరిగే వాడివి.." ముక్కున వేలేసుకొని మరీ ఆశ్చర్యపోయింది ఒకావిడ..
 "పెరిగే వయసే కానీ తరిగే వయసటమ్మా ..మరీను" మరో అమ్మలక్క బుగ్గలు నొక్కుకొని మరీ సాగదీసింది.
సన్నటిచిరునవ్వు నా పెదవులపై కదలాడింది.ఒక్కసారిగా పాతికేళ్ళు వెనక్కి వెళ్ళినట్లు..మరోసారి పాతికేళ్ళు పైబడ్డట్లు !
నా భావోద్వేగంలో నేను మునిగిఉండగానే అమ్మ పుట్టినూరు అమ్మలక్కలు వరసలు కలుపుతూ... పలకరింపులతో పరామర్షలతో ఆప్యాయంగా చుట్టుముట్టారు.
అమ్మే ఉంటే ఎంత సందడి చేసునో.. నా కళ్ళు చెమ్మగిల్లాయి.నా మనసెరిగినట్లుగా ..నాతో పాటు కొంగులకు కన్నీళ్ళను అద్దుతూ అమ్మ తోబుట్టువు ,నేస్తాలు ,బంధువులు .
అప్పుడు గమనించాను.పోయినోళ్ళు మంచోళ్ళు..ఉన్న వాళ్ళ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందా అని.ఒక్కోరిది ఒక్కో అనివార్య కారణం కావచ్చుకాక !.. పల్లెల్లో చివరికి మిగిలింది .. వంటరి తల్లులే !ఇంతలో పిన్ని అంది, “ ఒరేయ్ సంజీవ నీకిష్టమనీ ప్రత్యేకంగా తీసి అట్టి పెట్టా, వంకాయ పచ్చడి.వెళ్ళేటప్పుడు మరిచిపోకుండా తీసుకెళ్ళు.”
 ఎలా వదిలి వెళతాను? మాటమాత్రానికే నోరూరిపోతుంటే ..!బుద్ధిగా తల ఊపా.
వంకాయ నిలవపచ్చడిది ఒక రుచి. రోటిపచ్చడిది మరో రకం.
నిలవపచ్చడి పట్టడానికి కండగల పచ్చడి వంకాయలు ఏడాదికి ఒకమారే దొరికేవి.మంచి వంకాయలుసేకరిచడమే ఒక కళ.కాయనేవళాన్ని ముచ్చిక పచ్చదనాన్ని చూసి ఎంతశ్రద్ధగా ఒక్కో కాయను ఎంపిక చేసేదో అమ్మ.
ఇక, రోటి పచ్చడి తీరేవేరు.ఒక పెద్దవంకాయను నిప్పుల్లో పడేస్తే చాలు.పొంతలో నీరు వెచ్చ బడేంతలో వంకాయ మగ్గిపోయేది.అందుకేగా అంటారు,వగలమారివంకాయ సెగలేకుండా ఉడికిందని!కాసిన్ని మిరపకాయలు ,నాలుగువెల్లుల్లిరెబ్బలు,జీలకర్ర ,చింతపండు వేసిరోట్లో నూరి..తింటే..అబ్బ! తిరగమోత వేసి సన్నటి ఉల్లిపాయముక్కలు జతచేస్తే ..ఇక చెప్పక్కర లేదు.
"అసలే గీతికకు వేవిళ్ళంటగా ...?" పిన్ని కొసిరింది.
'అప్పుడే ఇంత దూరం వచ్చిందీ వార్త..!'సిగ్గు,బిడియం ,సంతోషం ముప్పిరిగొనగా..తల వాల్చుకొని..జుట్టు సవరించుకొన్నాను.
 "ఏవైనా గానీ తొలిచూలు ముద్దుమురిపెం వేరురా అబ్బాయ్..అయినా ఇలాంటి శుభవార్త దాచితే దాగుతుందంటరా?" చెవినులిమేసినంత పనిజేసింది పిన్ని.
గీతిక అన్నట్లుగా మా పిన్ని నన్ను మధ్యవర్తిత్వానికీ పిలవలేదు .కాకపోతే,అమ్మ చిన్నతనంలోకి అమ్మలోకంలోకి వేలెట్టుకొని నడిపించినట్లయ్యింది. నా ఉద్వేగంలోంచి పిన్ని మరో సారి నన్ను పడేసింది.దీవానుకు చేరగిలపడి ఉన్న నా ఎదురుగా వచ్చి కూర్చుని అంది ,"ఒరేయ్! ఇదేమన్నా న్యాయంగా ఉందా చెప్పు! "
" విషయం పిన్నీ?"
చూస్తున్నావ్ గా  ఇక్కడున్న వారందరి వైభోగం! ఎంత బతుకు బతికీ ..మెతుకు మెతుక్కీ వెతుక్కునే స్థితిలో పడ్డారు గందా?
పంటలు లేవు.పాడి లేదు.పిల్లలు రెక్కలొచ్చి ఎటు వాళ్ళటు ఎగిరి పోయారు.తలచెడో బతికిచెడో ..మరో ఆధారం లేకో ..ఇంకొకరి మీద ఆధారపడడం వొప్పకో ..నగరాల ఇరుకుతనాల్లో ఇమడలేకో ..అందుకో ఇందుకో ..మనూళ్ళో మిగిలిన అరవైలు దాటిన ఆడవాళ్ళు వీరంతా.జరక్కో జరుగుబాటు కాకో కాలక్షేపానికో ..చీటికి మాటికీ పిల్లల ముందు చాచలేకో సతమతమవుతుంటే ....అందరూ ఒకచోట చేరారు.చేదోడు వాదోడుగా. ఉబుసుపోక కబుర్లతో కాలక్షేపం చేస్తుంటే.. ఉపాయంగా వారందరిని ఒక గ్రూపుగా చేర్పించిందంట సత్యవతి చిన్నకూతురు, కల్యాణి.
ఆమె ఇప్పుడు వీరి గ్రూపుకు యానిమేటర్ లే.అనసూయమ్మ పెద్దమ్మేమో ఆర్గనైజరు ..చంద్రావతి ట్రెజరరూ.." వాళ్ళని చూపిస్తూ అంది పిన్ని. నేను వారి వంక విస్మయంతో చూసా. ఇలాంటి ఆర్గనైజేషనల్ పదబందం వారి నోటవినడం కొత్తగా వుంది.
చంద్రావతి పెద్దమ్మ అందుకోని అంది కదా.." కల్యాణి మమ్మల్నందరిని జతజేసి ..కాగితాలు అవీ తయారు జేసింది.బ్యాంకులో అకౌంట్ తెరిపించింది.ఇక, ప్రతి నెలా తలాఇంతని పొదుపు చేయడం మొదలెట్టామా..ఆటాపాటాగా ఓక ఏడాది గడిచాక ..అప్పులు తెచ్చుకోవడం మొదలెట్టాం.
మొదట్లో యమ్మ యమ్మ వడ్డీలకు తిప్పుకొనే వాళ్ళు తిప్పుకున్నారా..పాత బాకీలు తీర్చుకొన్నవారు తీర్చుకొన్నారా.. చిన్నాచితకా వస్తువులు కొనుక్కున్నారా ..ఇంట్లోకి జరుపుకున్నారా.. అలా చేతికి వచ్చిన డబ్బు వచ్చినట్లే వాడుకైపోయింది..ఒకరోజెందెకో.. మాలో మేమే ఆలోచన జేసుకొని ఉపాయంగా..ఇదుగో "స్వరాజ్యం" పచ్చళ్ళు మొదలు పెట్టాం."
అనసూయమ్మపెద్దమ్మ చేయి చూపిన వైపు చూశా. డైనింగ్ టేబుల్ మీద వరసగా పెట్టిన సీసాలను,ప్యాకెట్లపై పేరును. అది అమ్మ పేరు.ఏదో తెలియని సన్నిహిత భావం నాకు తెలియకుండానే నాలో వేళ్ళూనుకొంది.
“మొదలు పెట్టాక గానీ తెలియలేదు.. మాలాంటాళ్ళు ఎంత మంది ఉన్నారో ..వీధికొకరు! ఎవరిదాకా ఎందుకు? పట్నంలో ఉన్న మా పిల్లలేమాకిక్కడ అన్నీ దొరుకుతున్నాయి..మాకక్కడి నుంచి పంపాలాఅన్నారు. మొదలంటూ పెట్టాక సాగుబాటు చేయాలా.. మేం పడ్డ తిప్పలు తిప్పలు కావనుకో.."చంద్రావతి పెద్దమ్మ నిట్టూర్చింది.
మా కొడుకు అయితే ఇంటింటికి బోయి ..కొనమని అడుక్కుంటావా.. పని మానక పోయావంటే ..మళ్ళీ నా గుమ్మం తొక్కకన్నాడు.."...సుందరాజక్కాయ్ కన్నీళ్ళు పెట్టుకొంది.
"ఉన్న వూళ్ళో కడుపు చల్ల కదలకుడా కూచేవే అంటే ..యాపారం జేస్తావా యాపారం అని నా మీదికి చెయ్యెత్తాడమ్మా.. నా కొడుకు..." సత్యవతత్తయ్య కళ్ళనీళ్ళ పర్యంతరం అయింది.
అందరి మనసులు చివుక్కుమన్నాయ్.
"ఎన్ని గడపలు ఎక్కమో దిగామో ... ఎన్నెన్ని మాటలు పడ్డామో..ఆదరించినమ్మ ఆదరిస్తే ఈసడించినమ్మ ఈసడించింది."నిట్టూర్హ్చింది చంద్రావతి పెద్దమ్మ.
"మొత్తానికి, గడప దాటి..వీధి దాటి మండలం దాటి పట్నం దాకా మా పచ్చళ్ళు చేర్పించాం. ఊరికి వచ్హ్చి వెల్లే బంధుమిత్రులే నోటా నోటా విని తలా ఒక ప్యాకీటు పట్టుకెళతంటే ..నెమ్మదిగా నిలదొక్కున్నాం నాయనా.."అనసూయమ్మ పెద్దమ్మ బరువుగా అన్నది.
ఇలాంటి విజయ వార్తల విశేషాలను ఇలాంటి మార్గదర్శకుల వివరాలను తరుచూ టివీలలో చూస్తూనే ఉంటాం.పత్రికల్లో చదువుతూనే ఉంటాం.కానీ, ఇలా స్వయంగా వారి మధ్యలో కూర్చుని ..వారి చేతి పచ్చడి లొట్టలు వేస్తూ ..వారి నోటనే కబుర్లన్నీ వినడం అసలు నేను ఊహించలేని అనుభవం! ఇంతలోనే కొసరు కూడా ముట్టింది!
"మీ బాబాయిది మరీ విడ్డూరం రా అబ్బాయ్, ఏదో తెలిసిన మనిషి కదా ..కాస్త సాయం చేసి పెడతారని గంపెడంత ఆశతో వీళ్ళంతా వస్తే ..పొద్దుననగా అయిపులేకుండా అదే పోక! ఏం జేయాలీ మనిషిని ..ఏళ్ళు మీద పడుతున్నాయి గానీ..."పిన్ని నిరసనకు అడ్డుపుల్లేస్తూ అన్నా," ఏం పిన్నీ ..బాబాయితో ఏమిటీ పని?"
"అనసూయమ్మక్కాయ్ , కాగితం ముక్కట్టుకు రావే..అబ్బాయి చూసి విషయమూ చెపుతాడు"సమాధానం సుందరాజమ్మపెద్దమ్మ నుంచి వచ్చిందిలా. సదరు కాగితం నా చేతికి చేరే లోగా ,మళ్ళొకసారి ఆరా తీశాను,"అసలేం జరిగింది పిన్నీ..?"
“ అందరం ఇట్టా కలిసి కట్టుగా నిలబడ్డమా ...కాస్తబాగుపడ్డామా ..ఎవరికో కన్ను కుట్టింది. కష్టానబడ్డం నాయనా ..!” మాటంటూనే సుందరజక్కాయ్ కొంగుదులిపి నడుములో దోపింది.
మూడేళ్ళ నాడనుకొంటా..మన చిట్టిబాబు గారి మేనకోడలు ..అమెరికా నుంచి వచ్చిందా..వెళతా వెళతా ..పచ్చళ్ళు వడియాలు పట్టుకెళ్ళింది.ఇక అప్పటినుంచి అడపాదడపా మా పచ్చళ్ళు దేశం దాటాయి.వద్దంటే వచ్చిన అవకాశాలు కాలతంతామా .. నువ్వే చెప్పు.చేతినిండా పని.ఆపై, ఆదాయమూను!" అనసూయమ్మ పెద్దమ్మ అందుకుంది.
 ఇంతింతై విస్తరించిన వారి వ్యాపారవ్యవహారం లోని పట్టుదల నన్ను విస్మయుణ్ణి చేసింది.
 "కూతురు తిట్టా కోడలు మొట్టా..అంటా ఊరికే మొరబెట్టుకోకుండా.. మా చేతిలో నాలుగు రాళ్ళాడే సరికి మేమే పిల్లల అవసరాలకు ఆదుకోగలిగాం.ఇదట్టా సాగుతుంటే..ఇదుగో ఉత్తరం వచ్చింది.." చంద్రావతిపెద్దమ్మ ఉత్తరం చేతికందించింది.
" స్వరాజ్యం పచ్చళ్ళలో క్రిమిసంహారక మందుల అవశేషం ఉన్నదనీ ,అందుచేత అమ్మకాలను అనుమతించబోమనీ ..వెంటనే తయారీని నిలిపివేయాలనీ...తక్షణం సరుకును వెనక్కు తీసుకొవాలనీ...ఎటువంటి అనుమతులు పరిమితులు లేకుండా ఎగుమతులు చేసినందుకు సంస్థ సభ్యులు విచారణకు హాజరుకావాలనీ..ఉత్తర్వు."
ఎదురు చూడని ఆదేశపత్రాన్ని చూసి నేనే నిర్ఘాంతపోయానే .. మరి వీరెలా తట్టుకున్నారో.నా నివ్వెరపాటును నాలోనే అణుచుకొనే ప్రయత్నం చేసా .నిశ్శబ్దంగా.
వారి ఆక్రోశం కట్టలు తెంచుకొంది.అలలు అలలుగా..ఉవ్వెత్తున ఎగిసిపడుతూ.
 " కాగితం ముక్కట్టుకొని వచ్చేవాళ్ళూ పోయేవాళ్ళు..దిమ్మతిరిగి పోతందనుకో..ఆళ్ళచుట్టూ ఈళ్ళచుట్టూ తిరిగినాళ్ళం తిరిగినట్టే ఉన్నాం!"
 "ఏనాడైనా చిన్న మాటపడి ఎరుగుదుమా? ఇన్ని రకాల నేరారోపణలు...!"
"మిగులో తగులో ..మేం నలుగురం నిలబడబట్టి గానీ.."
కొనకపోతే కొనక పోయిరి.తినక పోతే తినక పోయిరి. నిందలేమిట్రా.."
"అవునూ ..మేమేమయినా మిరపకాయలు పండించామా?పురుగుమందులుకొట్టామా?ఆకాడికి చింతపండు,ఆవాలు,మెంతులు ..అన్ని దినుసులూ అంగట్లో సరుకులేగా?ఆళ్ళందర్నీ వదిలి పెట్టి మమ్మల్నెందుకురా వేధించడం..?” ఆవేదనగా అంది అనసూయమ్మపెద్దమ్మ.
 నోటమాట కరువైనట్లు చెవులప్పగించి మౌనంగా కూర్చున్నా. ఇప్పుడు అర్ధం అవుతుంది.పొద్దుననగా వెళ్ళిన బాబాయి ఇప్పటికీ ఇంటికి రాకుండా ఎందుకు ముఖం చాటేసాడో!
ప్రిన్సిపల్ సైంటిస్ట్ గా పనిజేసి రిటైరయిన బాబాయి ,ప్రస్తుతం ఒక ప్రముఖ వ్యవసాయ ఉత్పత్తుల కంపెనీకి ప్రధానసలహాదారు.లోగడ వారు చిన్నచిన్న సహకార సంఘాలనుంచి కొనుగోలు చేసి అమ్మాకాలు చేసేవారు.ఇప్పుడు వారే స్వయంగా ఒక ఉత్పాదక కేంద్రాన్ని ఏర్పరచుకొన్నారు.దానికి మూలవనరులుగా అవసరమైన పంటలనూ కాయగూరలనూ దినుసులనూ వారే పండించేందుకు ఒక వ్యవసాయక్షేత్రాన్ని అభివృద్ధిచేసే క్రమంలో ఉన్నారు.
మరి, ఎక్కడో మారుమూల పల్లెలో మహిళల చిన్నపాటి సంస్థకి జరిగిన అనుభవం వీరికీ ఎదురయిఉండవచ్చును కదా?వాళ్ళేం చేస్తున్నారు?అసలు అలా జరిగాకే ఇలాంటి సహజ వ్యవసాయపద్దతుల క్షేత్రం మొదలుపెట్టిఉంటారా? కావచ్చునేమో .ఏమైనా అంతమొత్తంలో పెట్టుబడి ..అంత స్థాయిలో విఫణిని నిర్మించుకొన్నవారేమైనా తట్టుకోగలరేమో గానీ,పల్లెల్లో అవశేషాలుగా మిగిలిన మహిళల పరిస్థితి ఏమిటి?’
నా వంకే కన్నార్పకుండా చూస్తున్న వారి ముఖాల్లోని నిస్సహాయత.. ఆశ ..నమ్మకం నా గుండెను మెలిపెట్టినట్లయ్యింది.
' వీళ్ళంతా ఎవరు? మనం నడిచొచ్చిన గతానికి సశేషజ్ఞాపకాలు.విడిచొచ్చిన పల్లెగడపల్లో నిలిచిన అనుభవాల మూటలు.'
“ అయినా అబ్బాయ్, ఊరూరికీ తిరిగి ..ఊరించి ఊరించి .. చేవమందులు.. పురుగుమందులు కొట్టమన్నదెవరు? కొట్టడం మొదలు పెట్టాక ..పురుగు నిగడదొక్కుకొని..బలపడి..పంటనే బతకనీయకపోయే... పురుగు చావక..దిగుబడి రాకా..గిట్టుబాటుధరా దక్కక..చివరాఖరికి , చేసిన అప్పులు తీర్చలేక..పరువునిలుపుకోలేకా.. చెట్టంత మనిషి ,మీ మావయ్య, ఉన్నఫళాన   పురుగు మందు గుక్కెడు మింగేసి..నన్నిట్టా నట్టేట్లో ముంచేసెనే..."సామ్రాజ్యమక్కాయ్ కొంగు నోట్లో కుక్కుకుని బావురుమంది.అందరిగుండెలూ కలుక్కుమన్నాయి.
 "పొద్దుననగా వెళ్ళారు.ఎటు పోతే అటేనా? సంజీవ కూడా వచ్చాడు! "పిన్ని అసహనాన్ని కోపాన్ని కలగలపి బాబాయి ని ఇంట్లోకి ఆహ్వానించింది.అంతా ఒక్కసారిగా లోకంలోకి పడ్డాం. చిటెకెలో అమ్మలక్కలంతా లోపలిగదుల్లోకి మటుమాయం.అయినా ,వారి ఉనికి తెలుస్తూనే ఉంది.వళ్ళంతా చెవులు చేసుకొని మా మాటలే వింటున్నట్లుగా అప్పుడప్పుడూ గుసగుసల సవ్వడి.
బాబాయి ముఖం ముడుచుకు పోయిఉంది .ఏదో ఆలోచనలో చిక్కుబడిపోయినట్లుగా.
“ అయినా అదేం విడ్డూరమమ్మా ..వచ్చిన మనిషికి కాసిన్ని మంచినీళ్ళన్నా ఇవ్వకుండా అట్టా వాకిట్లో నిలదీసా?" లోన గదిలో పెద్దమ్మ బుగ్గలునొక్కుకొనే సరికి....పిన్ని బిరబిరా వంటింట్లో కి వెళ్ళి చరచరా మంచినీళ్ళ గ్లాసుతో తిరిగి వచ్చింది.
బాబాయి ఒక్కగుక్కలో తాగేశాడు. ఎన్నాళ్ళగానో దప్పిక కొన్నట్లు.
బాబాయి చేతికి కాగితం అందించా. చూసానన్నట్లు తలాడించి...మౌనంగా పక్కన పెట్టాడు. నేనూ మౌనంగానే కూర్చున్నా.బాబాయి ముఖంలోకే చూస్తూ. కాసేపయ్యాక బాబాయి అన్నాడు, "ఏమీ తోచట్లేదురా..!"
 నేను పెదవి బిగించా. పిన్నికి కోపం నసాళానికి అంటినట్లు ఆమె ముఖకవళికలే చెపుతున్నాయి.అయినా, మా ఇద్దర్నీ మార్చి మార్చి చూస్తూ అక్కడే కూర్చుంది.మౌనంగానే.
“"సరే ,కాసేపు అనుకొందాం. పురుగుమందుల అవశేషాలతో నిండిన వ్యవసాయోత్పత్తులన్నిటినీ ..మటుమాయం చేసేద్దాం. తరువాత?" బాబాయి ఎలాంటి ఉపోద్ఘాతం లేకుండా అన్న మాట నుంచి తేరుకొని అడిగా," అదెలా బాబాయ్? పురుగు మందులు వచ్చి అరశతాబ్ది కాలేదు. పచ్చళ్ళు కూరలు మన పళ్ళెంలొ ఎప్పుడు వచ్చి చేరాయో మనకే తెలియదు."
పురుగు ను దరిచేరనివ్వని క్రిమిసంహారక జన్యువును అణువణువునా ఇముడ్చుకొన్న జన్యుమార్పిడి వంకాయ,జంకాయ,మన పళ్ళెంలోకి వచ్చిపడడానికి నేపధ్యం సిద్దమవుతోంది.."
 "అంటే..?"
 "సంజూ , మన మధ్యతరగతి మనస్తత్వం ఎలా ఉంటుంది ?ఎక్కడ రెండు వంకాయలతో ఒక ఉల్లిపాయ ఉచితంగా ఇస్తారా అని చూస్తాం. హైపర్ మార్కెట్ నుంచి చక్రాలబండి మీది కూరగాయల వరకు ..తిరిగేసి ఎక్కడ చవగ్గా వస్తే అక్కడ కొంటాం. కాని, ఎందుకు చవగ్గా వస్తుందో ఆలోచించే తీరుబడి ఎక్కడి?ఎవరికి ఉంది?అది మన వారసత్వంగా వచ్చిన వంకాయా మన మీద ప్రయోగించబడుతున్న జంకాయా అన్నది ఎవరికి తడుతుంది?"
“ఇదుగో ఒక బహుళజాతి కంపెనీ ప్రపంచాన్నంతా వదిలేసి మనదేశాన్నే ఎందుకు ప్రయోగశాలగా మారుస్తోంది?వారి వారి దేశాల్లోనే ప్రయోగాలు ఎందుకు చేయడం లేదు? ప్రయోగాలకు అక్కడ దొరకని అనుమతి మనదేశాన ఎలా దొరుకుతుంది? ఎవరిస్తున్నారు?"బాబాయి గొంతుజీర పోయింది.
పిన్ని అయోమయంగా చూస్తూ ఉంది.
"ఇదంతా తడి గుడ్డలతో గొంతులు కోసే వ్యవహారం!బిలియన్ డాలర్ల వ్యాపార రహస్యం. రూపేణా కార్పోరేట్ వ్యవసాయం వేళ్ళూనుకొంటోంది.వేలాదిఎకరాల కాంట్రాక్ట్ సేద్యం నానాటికీ బలపడుతోంది.
"బాబాయి నిట్టూర్చాడు,” మనం తరుచూ వెళ్ళే ఆసుపత్రిలోనైనా, ఒక చిన్న వైద్య పరీక్ష చేయాలంటేనే ,మన అనుమతి కోరి సమ్మతిపత్రంపై సంతకం తీసుకొంటారే.. అలాంటిది ప్రపంచం మొత్తంలోనే ,మొట్టమొదటి సారిగా జరుగుతోన్న ఒక ప్రయోగఫలితాన్ని మన పళ్ళెంలోకి నేరుగా వడ్డించేస్తూ .. తినే వారికి అనుమతిని కోరారా?సమ్మతిని పొందారా?లేదే! మన వంకాయలన్నిటినీ మటుమాయం చేసేసి.. జన్యువైవిధ్యాన్ని ప్రమాదంలో పడేసే ఇలాంటి ప్రయోగాలను ఆపేదెలా?అసలు ఆపగలమా?ఇదుగో మీ పిన్ని నన్ను ఆడిపోసుకొంటుంది కానీ, ఇది నా ఒక్కడి చేతిలో ఉన్న పరిష్కారమా?ఎంత మందిమి ఎన్ని విధాలుగా పూనుకోవాలి? విషయం చెప్పినా మీ పిన్ని అర్ధం చేసుకోగలదా?"
పిన్ని చివ్వున తలెత్తింది. వెనుకే అమ్మలక్కలూ.
 "అయినప్పటికీ చెప్పాలిగా బాబాయ్? మీ అద్బుత ఆవిష్కరణలన్నిటికీ వినియోగదారులు పిన్నిలాంటి వాళ్ళేగా? మరి వాళ్ళకి అర్ధమయ్యేటట్లు వివరించవద్దూ?”
"అలా చెప్పరా అబ్బాయ్ "అన్నట్లు పిన్ని పెదవి బిగించి తలాడించింది.
 "పిన్నీ,వివరంగా చెప్పకపోతే బాబాయి లాంటి వారిది తప్పు.వివరించి చెప్పినా పెదచెవిన పెడితే మనదీ. కాదంటావా?"
"నిజమేరా" పిన్ని వెంటనే అంగీకరించేసింది.
"బాబాయి లాంటి వాళ్ళు గట్టిగా నిలబడి మనలాంటి వాళ్ళని నిలబెట్టాలి" బాబాయిని క్రీగంట చూస్తూ అన్నా.
బాబాయి ముఖాన చిన్న చిరునవ్వు.మౌనంగా కాగితం చేతిలోకి తీసుకొన్నాడు.పిన్ని శాంతించింది. లోపలి గదిలోనుంచి ఒక్కొక్కరూ మా వద్దకు రాసాగారు.
 గీతిక అన్నంత పని చేసా.నాకు తెలియకుండానే బాబాయికి పిన్నికీ మధ్యవర్తిత్వం నిర్వహించాను! అంతకు మించి ,బాబాయి అందరికీ వివరంగా చెపుతుంటే...ఒక్కో విషయం అర్ధమవసాగింది.పచ్చళ్ళ ఎగుమతులలో పురుగుమందుల అవశేషాల సాకుతో ఎగుమతులను దిగ్బందం చేయడం దగ్గర నుంచి జన్యుమార్పిడి వంకాయను ప్రవేశపెట్టడానికి రంగం సిద్ధం అవడం వరకూ... జరిగినదేమిటో అంచెలంచెలుగా అర్ధమవసాగింది.
మొన్న వేప... నిన్న పసుపు ఆ పై ప్రత్తి... ఇవ్వాళ వంకాయ,రేపు తెలుగువారి గుండెకాయ ఆవకాయ.. తరువాత శాకంబరీ గోంగుర...!
ఏదో వణుకు.వెన్నులో జరజర పాకింది.
ఎందుకో తెలియదు.గీతిక గుర్తొచ్చింది.మాకు పుట్టబోయే బిడ్డ మనసులో మెదిలింది.
అవశేషంగా మిగలబోయేమిటి? అవశేషంగా మిగల బోయేదెవరు?
ప్రశ్నలకు సమాధానం చెప్పుకోకుండానే ... పిన్ని ఇచ్చిన వంకాయ నిలవపచ్చడి సీసా ను పదిలంగా పట్టుకొని... గబగబా ఇంటికి బయలుదేరా.
మా బిడ్డ కళ్ళు తెరిచేలోగా చేయవలసిన పనులు చాలా ఉన్నాయి కదా మరి!
8-11-9 

*
All rights @ writer.
Title,labels, postings and related copyright reserved.

6 comments:

  1. మరీ ఇంత పెద్ద పెద్ద టపాలు వ్రాస్తే నాలాంటి ఓర్పు సహనం లేని వాళ్ళు చదవలేరేమో, నేను మాత్రం సగమే చది కామెంటు వ్రాస్తున్నాను.
    ముద్దా పప్పు ఆవకాయ నెయ్యి భలే కాంబినేషన్ . వేడివేడి అన్నం లో ఆవకాయ దట్టిగా నెయ్యి గుమ్మరించుకుని , అందులో నెయ్యి నంచుకుని తింటే భలే ఉంటుంది
    తలుచుకుంటుంటేనే ఆకలి వేస్తోంది

    ReplyDelete
  2. మాకు తెలియని చాలా విశేషాలు తెలియజేశారు. ధన్యవాదాలండీ...

    ReplyDelete
  3. జన్యుమార్పిడి సైన్సునీ, తత్సంబంధ రాజకీయాల్నీ, అంతర్జాతీయ విపణి రాజకీయాల్నీ కథలో చొప్పించిన తీరు బావుంది.
    కానీ కథ చెబుతున్న నేను అనే పాత్ర ఆ డైనింగ్ రూములో ప్రవేశించి పలాని వారబ్బాయి సంజీవ అని పరిచయం చెయ్యబడే వరకూ మగవాడు అని తెలియలేదు. దాంతో కొంచెం కంఫ్యూజను

    ReplyDelete
  4. ఈ కథ భూమిక ఫిబ్రవరి 2010 సంచికలోనూ, వచ్చే దారెటు సంకలనం లోను ప్రచురించబడింది.
    ధన్యవాదాలు.
    చంద్ర లత

    ReplyDelete
  5. Came here browsing through stories about BT brinjal. Very nice story, a bit polemical, but indicating confrontations with modernity and globalization.
    ఇంకొక మాట. వంకాయ రోటి (చేత) పచ్చది ఎదో తిప్పలు పడుతున్నాం కాని, నిలవపచ్చది మంచిది దొరకటంలేదు. ఏమైనా సలహాలిస్తారా?

    ReplyDelete
  6. Nice one. Link between, Aavakaaya and Global threat on Indian tradition and culture, made perfectly. Got the taste and the flavour from lips to throat.

    ReplyDelete