Feb 27, 2010

ఘనా ఘన సుందరా

"ఘనా ఘన సుందరా" అంటూ రికార్డు మోగిందంటే , మా తిరుమలదేవుని గుట్ట బళ్ళో ,గణగణ మని ఘంట మోగినట్టు!
హాయిగా ముసుగు పెట్టి పడుకున్న నా వీపు విమానం మోత మోగినట్టు!
చాపను చుట్టేసి ,దిండును దొర్లించేసి.. మెట్టు మీదో గట్టు మీదో కూర్చుని, 
గోపాల్ పళ్ళపొడిని ఆనందం గా నోరంతా పులుముకుని, చూపుడు వేలితో పళ్ళని రుద్దుతూ.. అరమోడ్పు కళ్ళతో.. అలా కునుకు తీద్దాం అనుకునేదాన్నా.. మళ్ళీ రికార్డు!
“బూచాడమ్మా బూచాడూ..”అంటూ
ఇక , నా చెవి మెలిపడ్డట్టో తల మీద మొట్టికాయ పడ్డట్టో నన్న మాటే !
గబా గబా పలక,పెద్దబాలశిక్ష,బలపం, తెలుగు వాచకం ,ఎక్కాల పుస్తకం గట్రా..పట్టుకు బడికి పరిగెత్తడమే.
తీరా వెళితే, తీరిగ్గా పాచి ఊడుస్తూ చీపుళ్ళతో మా అవ్వ స్వాగతం!
మా బళ్ళో, మొదటి రికార్డు అంటే ఫస్టు బెల్లు,రెండో పాటంటే సెకండు బెల్లు.
పాపం, మా అమ్మ ఏం చేస్తుంది ?ఆమెకు లెక్కంటే లెక్కే!
ఇదంతా ,మా బాలవ్వ నిర్వాకం.
మా బాలవ్వ గదులు వూడ్చే చీపురు ఒకటి బయట చీపురు ఒకటీ ..ఎప్పుడూ తనతో ఉంచుకొనేది. ఒక దానితో ఊడుస్తుంటే రెండోది ఎడం చేత్తో పట్టుకొని ఉండెది.
మాంత్రికుడి పంచప్రాణాలు మాయలమర్రి తొర్రలోని పంచవన్నెల చిలకలో ఉన్నట్లు, మా బాలవ్వ పంచప్రాణాలు రెండు చీపుళ్ళలో ఉండేవి.
అప్పుడప్పుడూ, గోడ వారగానో విశ్రాంతి తీసుకొంటున్న చీపురును కుంచం పెద్ద పిల్లలు తీసుకొని , బాలవ్వకు వూడవడానికి సాయం చేద్దామంటే ,అదే చీపురును వారి మీద తిరిగేసిందన్న మాటే! ఇక మాలాంటి వాళ్ళం చొరవ ఎలా తీసుకొంటాం?
మా బడంటే పెద్దదేమీ కాదు. మూడు తరగతులు ఒక చోట , మిగిలినవన్నీ మరో చోట .
ఒకటి రెండు తరగతులు చదివే పిల్లలు ,వాన పడితే తప్ప ,పున్నాగ చెట్ల కిందే చదువుకోవడం.
 ఇక, చినుకు రాలితే చూరుకిందికి పరుగు,వాన పడితే బడికి సెలవు ...అన్న మాట!
మా బాలవ్వ పొద్దున్నే వచ్చి, మా హెడ్ మాస్టారు గారి గది, మూడో తరగతి పిల్లల గదీ .. ఊడ్చి, కుండల్లో నీళ్ళు నింపి, బెల్లులు కొట్టే దన్న మాట.
బాలవ్వ ఎక్కువగా మాట్లాడేది కాదు ,కానీ, రాగానే హెడ్మాస్టర్ గారి గది తీసి,రికార్డులు పెట్టేది.పిల్లలం వచ్హి వందేమాతరం పాడే దాకా అది ఆగకుండా మోగుతూనే ఉండేది.
అన్నట్లు, మాది చిన్న గేర్.
మా గేర్లో ,మున్సిపల్ ఆఫీసు పను చేసే వారు ఉండే వారు. అవి వారి క్వార్టర్లన్న మాట.
వాళ్ళ ఇళ్ళల్లోనే , మున్సిపాలిటీలో పనిచేయని వాళ్ళకి కూడా అద్దెలకు ఇస్తుండే వారు.
మా ఇంటి నుంచి బడికి వెళ్ళే దారి లో పెద్ద పిల్లల బడి , విశాలమైన ఖాళీ స్థలం ఉండెవి. చివరన మా చిన్నపిల్లల బడి. బడిచుట్టూ ఎవరో చక్కగా నాటి, పెంచినట్లు, తుమ్మచెట్ల కాంపౌండ్ . ఆ తుమ్మచెట్ల మధ్యన సన్నని బాట.
సరిగ్గా బూచాడమ్మ బూచాడు ..పాట అవ్వగానే , మా బాలవ్వ బాటను ముళ్ళకంచెతో మూసేసేది.
వెనక్కి వెళ్ళామా , అమ్మ తో మొట్టికాయలు.ముందుకు వెళ్ళామా , మా మల్లమ్మ టీచరు తో గోడకుర్చీలు గుంజిళ్ళు.
ఇక రేక్కాయలు, జాంకాయలు, పల్లీలు ,ఉప్పు శనగలు,గుగ్గిళ్ళు ..అమ్మే వాళ్ళంతా , ముళ్ళకంచెకు రోడ్డుకు మధ్యన , గోనెపట్టాల మీదో , సర్దుకు పోవలసిందే.
మా బాలవ్వ భలే ఉండేది.
ముంజేతికి వెండి కడియాలు ,వాటి ముందు ఎర్రవో పచ్చవో మట్టిగాజులు. వెండివి దండ కడియాలు.ముక్కు పిల్లలు.చెవులు పెద్ద వెండి గంటీలు.చెవిరంధ్రాలు జారి భుజాలకు తాకేట్టు ఉండేవి. కాళ్ళకు కడియాలు.మెడలో గుండుపూసలు.బొడ్లో, పోకతిత్తి. రూపాయకాసంత బొట్టు.ముఖాన చేతులకూ పచ్చబొట్లూ.
ఎప్పుడూ ఆకుపచ్హ, పసుపు,ముదురు ఎరుపు రంగు కొకారైకలు వేసుకొనేది. ఆమెకు అవే ఉన్నట్లు. అవే ఉండేవని ,కొంచం పెద్దయ్యక కానీ అర్ధం కాలెదు.
మేము గొంతు చించుకొని, ఎక్కాలు చదువుతున్నా , నారింజ పండు ..నిన్ను చూడగానే నోరూరుచుండు" అంటూ పాడినా..  ఏ గోడ పక్కనో ఏ పొగడ చెట్టు మొదలుకో ,నడుం ఆంచి నవ్వుతూ వినేది.పచ్చి వక్కలు ముక్కలు చేసుకొంటూ.
ఇంకొన్ని సార్లు, మాకు గోడ కుర్చీ వేయించినప్పుడు కాపలా కాసేది.
మంచి నీళ్ళ కడవ లోంచి గరిటతో నీళ్ళు పోసేది.మేము దోసిట పడితే.
జెండా వందనం రోజయితే చెప్పక్కర లేదు.జన గణ మన పాడగానే, తీపిబూందీ పెట్టె పని ఆమెదే!
మా బడిలో ఆకూ పువ్వును కూడా ,కళ్ళల్లో పెట్టుకుని చూసుకొనేది.బడి అయ్యాక ఎటు వెళ్ళేదో మాకు తెలియదు. 
పొద్దున్నే , మళ్ళీ పాటతో పలకరించేది.
 దానా దీనా , బాలవ్వ మా బడికి మహారాణన్నమాట!
ఒక రోజు , ఎమైందో కానీ ఎంత సేపటికీ," ఘనా ఘన సుందరా "మోగలేదు. ఇదేటబ్బా .. అనుకుంటూ గునగున వీధిలో పెద్దపిల్లలంతా బడికి పరిగెట్టి, గేర్లోకి కేకలు పెడుతూ తిరిగి వచ్చారు.
ఇంకా పక్కల్లో మునగడ తీసుకొని పడుకొన్న మాలాంటి వాళ్ళం, ఉలిక్కి పడి వీధిలోకి పరుగు.ముఖమైనా కడక్కుండా.. తుమ్మచెట్ల దాకా.. పరుగే పరుగు. 
అక్కడ,బాలవ్వ భోరుభోరున ఏడుస్తోంది. టీచర్లు సార్లు హెడ్మాస్టరు ..అందరూ అక్కడే ఉన్నారు. ఇంతలో పోలీసులు వచ్చారు. మా బళ్ళో దొంగలు పడ్డారు !
ఘనాఘనా సుందరా, బూచాడడమ్మా బూచాడు తో సహా ... అన్ని రికార్డులు, ప్లేయరూ, మైకూ ... దొంగలెత్తుకు పోయారు. ఉదయాన్నే , ఎప్పటిలాగే వచ్హ్చిన బాలవ్వకు హేడ్ మాస్టార్ గారి గది తాళం పగల గొట్టి కనపడిందట.
లోపలకెళ్ళి చూస్తే ఏముందీ?
బాలవ్వను చూస్తే భలే ఏడుపొచ్చింది. కానీ, మా సబితాబాయ్ వాళ్ళన్న ప్రవీణ్ అన్నాడూ కదా, "అసలు బాలవ్వే తీసుకుపోయిందంట.నాయిన నాతో చెప్పిండు."
నాకూ సబితకూ ఈ మాట నహ్చ్చలేదు.  అతనికి కాస్త దూరం గా వెళ్ళాం.పోలీసులు అదే మాట.బాలవ్వను జీపులో ఎక్కించుకు పోయారు. వారితో పాటే మా హెడ్ మాస్టారు కూడా.
తరిమి కొడుతున్నా పట్టించుకోకుండా , జీపు వెనక పరిగెత్తిన వాళ్ళు పరిగెత్తగా , మిగిలిన పిల్లలమంతా మల్లమ్మ టీచరు చుట్టూ చేరి ఎంత లొల్లి చేసినా , ఏమి లాభం?
మళ్ళీ మా బాలవ్వను మేము చూడలేదు. మా పాటలు వినబడలేదు.
***
"ఘంటశాల గారికి ఘన నివాళి" అన్నప్పుడు, నాకు మా బాలవ్వ గుర్తు రావడంలో .. నా తప్పేమీ లేదు.
ఆ పాట గణ గణ మంటూ నాకు వినిపిస్తూనే ఉంటుంది. మా బాలవ్వ నిశ్శబ్దంగా పలకరిస్తూనే  ఉంటుంది.

మా బాలవ్వ నా కళ్ళారా కనిపిస్తూనే ఉంటుంది,
అదాటున ఆ పాట విన్నప్పుడల్లా

***

All rights @ writer.
Title,labels, postings and related copyright reserved.

1 comment:

  1. చాలా చక్కగా రాసారు. ఒక్కొక్క అప్పుడు అనిపిస్తుంది, చిన్న వయసులో ఉండె ఆ ఆమాయకత్వం మనం అసలు ఎలా పోగొట్టుకున్నమో.

    ReplyDelete

There was an error in this gadget