

ఇవ్వాళ ఉదయం నిశ్శబ్దంగా పలకరించింది ఒక శబ్ద తరంగం.
దూరాల తీరాలనుంచి.
దృశ్యాదృశ్యమై.
***
నేనెంతో ఇష్టంగా రాసుకొన్న పుస్తకం "దృశ్యాదృశ్యం."
నాకు చిన్నప్పటి నుంచీ గణితమంటే తగని అభిమానం.
ఎంత వేగంగా ఎంత సులువుగా ఎంత తక్కువ నిడివితో లెక్కను చేయాలా అని ప్రయత్నిస్తూ ఉండేదానిని.
ఒకే లెక్కని లెక్కకు మిక్కిలి పద్దతులతో సాధించాలని ప్రయత్నించేదానిని.
ఒక్కోమారు వీలు పడేది.ఒక్కో మారు వీలు పడేది కాదు. చిక్కులెక్కయి ముడి పడేది
ముఖ్యంగా , త్రికోణమితి !
నమ్మండి.
లెక్కల సాధనకు మించిన సృజనాత్మక విషయం మరొకటి లేదు!
ఒక లెక్కను కొత్త పద్దతిలో సాధించేసినప్పుడు ఎంత సంతోషంగా ఉంటుందంటే,ఒక శిల్పి తన శిల్పాన్ని పూర్తిచేసి సంతృప్తిగా చూసుకొంటారే ..అంత!
మా లెక్కల విద్యార్థులందరికీ ఒక గొప్ప వ్యామోహం ఉండేది. గొప్ప ఇంజనీర్లము కావాలని.
కాలువ గట్టున పెరిగిన వాళ్ళం కనుక ,ఇంజనీర్ కావడం అంటే లెక్కలతోనూ నీటితోనూ ఆపై, ఆనకట్టలతోనూ ముడిపడిన కలలన్న మాట అవన్నీ.
ఆనకట్టను కట్టిన వాడే కదా ఆనాడు ఇంజనీర్ !
అవేమీ అమ్మాయిలవ్యవహారాలు కాదని కూడా నాకు అప్పట్లోతెలియదు.
ఏమైనా, ఆ కలలేవీ సాకారం చెందలేదు కానీ, కనీసం కళాశాల గడప తొక్కకుండానే ,
ఇంజనీర్ ను అవ్వాలన్న నా ఉత్సాహం పూర్ణత్వం దిద్దుకొంది "కేశవ" ద్వారానే .
అలాగే ,కొత్తావకాయ అంటే , కొత్త కారం ఘాటులో కొద్దిగా ఆవపిండి వగరు, మరికొంత మెంతి పిండి చేదు కలగలిసిన పచ్చి మామిడి ముక్క పులుపు...పంటి కింద పడి ఎక్కడ నసాళానికి అంటుతుందో ననుకొంటూ..గ్లాసుడు చల్లటి నీళ్ళు పక్కన పెట్టుకొన్నా! రుచిచూడబోయే ముందుగానే ! జాగ్రత్తగా !
ఎన్ని హెచ్చరికలు అందినా , అలాంటి ప్రమాదాలేవీ సంభవించలేదు కానీ,
దాదాపు రెండుగంటల పాటు ఏకధాటిగా కుర్చీకి కట్టిపడేసాయి వారి మాటలు .మధ్య మధ్యలో పల్లె పాటలు.
నాకు ఇష్టమైన "దృశ్యాదృశ్యం"సంఘటనలు కొత్తావకాయ గారి గొంతులో ఎంత హృద్యంగా వొలికాయో!
ఒక్కో వాక్యాన్నివారెంత ఇష్టంగా చదివారో!
ప్రతి అక్షరానికీ అనువైన శబ్దాన్ని అద్దితే ఆర్ద్రతతో దిద్దితే ..ఇంత అందంగా వుంటాయన్న మాట!
మార్దవమూ మర్యాదా కలగలసిన గొంతు వారిది. నాజూకు గానూ ఉన్నది !
ఆ మాటే వారికి తెలియ పరిచాను.సవినయంగా.
"ముఖాముఖం"గా నాకీ ముచ్చట వచ్చి చేరినా , వినగలిగిన వారికి విన్నంత!
http://telugu.tharangamedia.com/drusyadrusyam-by-chandralatha-with-kottavakaaya/
***
కొత్తావకాయ గారికి, "తరంగ" వారికి, వారి శ్రోతలకు అభిమానాలు.
***
All rights @ writer. Title,labels, postings and related copyright reserved.
yentha chakkagaa mee bhavalni teliyachesaru.abhinandanalu
ReplyDeleteమీ ఆత్మీయ ప్రశంసకి హృదయపూర్వక ధన్యవాదాలు, చంద్రలత గారూ!
ReplyDeleteనిజానికి,
ReplyDelete"మీరు రాయవలసినవి రాయడంలేదు" ..అని నా చెవి నులిమి , "చూశారా అప్పుడే పదేళ్ళు దాటి పోయాయి! మీరు చేయవలసిన పని చేయండి!" అని మెత్తగా ఓ మొట్టికాయ వేసేరు మీరు !
ఇలాంటప్పుడే అనిపిస్తుంది,
పాఠకులలో గట్టి పాఠకులు వేరయా అని !
మీకు శుభాకాంక్షలు.