Sep 29, 2013

సోలెడు సోలెడు ముచ్చాలిస్తా !

 ష్!
మీకో రహస్యం చెప్పాలి!
మా అమ్మాయిమణి తో ఎప్పుడైనా అనబోయేరు!
తినబోయే చోట మరీను!
నిజమండీ!
మధ్య మా అమ్మాయిమణి ఆజమాయిషీ ఎక్కువైపోయింది
ఎప్పుడెప్పుడు ఏమేమి తినాలి ..ఎంతెంత తినాలి..  ఎప్పుడు తినాలి ..అన్నీ వారి ఆజ్ఞానుసారంగా జరగాలని !
కుంచమంత కూతురుంటే కంచంలో కూడు అంటారు కదా , మా కూతురుగారు  కొంచెం అటూ ఇటూగా అంతే ననుకోండి. కాకపోతే,  కంచం మీద ఆమె సార్వభౌమాధికారం పెరిగిపోతోందన్నమాట!
పొద్దున్నే లేచీ లేవగానే , వేడి వేడి కాఫీ తాగాలా వద్దా?  మీరే చెప్పండి!
మా అమ్మాయి ససేమిరా వద్దంటుంది
ఖాళీ కడుపుతో కాఫీ మంచిది కాడు. ముందు ఏదైనా తినాలి , పైనే కాఫీ!  ఇదీ ఆమె ఉవాచ.
ముందుగా ఓ గ్లాసుడు నిమ్మరసం తాగులెమ్మని ...కొద్దిగా సవరింపు.
సరేలే , ఇదేదో " యోగా ”"కారుల  తరహా లెమ్మని సర్దుకుపోదాం అనుకుంటే , మా ఆమ్మాయి వడ్డించే   "ఫల"హారాలు, మొలకెత్తిన పెసలు వగైరాలతో మనకొచ్చిన పేచీ ఏమీ లేదు. వాటికన్నా ముందుగా పొద్దునే కప్పుడు ఓట్సు తినమని తెచ్చి పెట్టింది తను.ఇక మొక్కజొన్న పలుకుల సంగతి సరేసరి!
సరాసరిగా అటు అమెరికా నుంచి  ఎగురుకొంటూ వచ్చాయయ్యే... కోడై కూస్తూ !
వాటి వెన్నంటే  ఓడెక్కి వచ్చాయి కదా  ఓట్సు పలుకులు.
ఓట్సు అంటే ఏంటో అనుకొనేరు మన గోధుమలకు ముత్తవ్వలు అన్నారొక వ్యవసాయజ్ఞులు. కాదు.. కాదు ...కొర్రలు మన గోధుమల ముత్తాతలు అన్నారింకొకరు.
ముత్తవ్వో మూలపంటో కావొచ్చు కాక , వారి సముదాయింపు దేశవిదేశాల పంటలన్నికీ మన చుట్టరికం .
దరిమిలా మన వంటింట్లో కి సాదర ఆహ్వానం అన్నమాట!
ఆలోచనలన్నీ ఇలా సాగుతూ ఉండగా .. మా అమ్మాయి చక్కగా మిలమిల మెరిసే పింగాణీ కప్పులో వేడి వేడి పాలు పోసుకొని , అందులో గుప్పెడు ఓట్సు అటుకులు  పోసి , నా ముందుకు తోసింది. చంచాతో సహా!
మింగాలేక కక్క లేకా .. ఆమె ఉపన్యాసాలతో సహా తినవలసి వచ్చింది.
మా అమ్మాయి ఆసాంతం ఓట్సు అటుకుల ప్రాధాన్యం గురించి చెపుతూ ఉంది. లెక్కకు మిక్కిలి పోషక విలువలు ...బోలెడంత పీచుపదార్థం వగైరా వగైరా.
హతోస్మి!
నేను మాత్రం తక్కువ తిన్నానా?
అమ్మాయి ఎక్కడ నొచ్చుకుంటుందో నని ఒక  పక్క .ఆమె వడ్డింపుకు న్యాయం చేకూరుస్తూ ..
చంచాను తిరగేస్తూ...        
మరో పక్క బుర్రను గిర్రున తిరగేస్తున్నాను.
తటాల్మని గుర్తొచ్చాయి.
 మా వూరి నుంచి తెచ్చుకొని ,అటకలో  డబ్బాలో దాచి పెట్టిన సోలెడు "ముచ్చాలు"!
యస్స్!నేను మనసులోనే ఓ గెంతు గెంతాను. నా ముఖం తేటబడింది.
నేను తృప్తి గా తలాడించడం చూసి,
మా అమ్మాయి కడుంగడు సంతసించి ,
ఖాళీ కప్పు చేతబట్టుకొని వెళ్ళింది. తన పుస్తకంలో తాను మునిగి పోయింది.
 హమ్మయ్య !
చప్పుడు కాకుండా  వెళ్ళి .. వంటింటి అటక మీది డబ్బాను తీసాను.
సోలెడు సోలెడు ముచ్చాలిస్తా
సొని పూల దండలిస్తా ..
కోడలా మా కోతకు రావమ్మా .. “  అని లోలోనే పాడుకొంటూ..
గుప్పెడు ముచ్చాలు తీసి , గ్రైండర్ లో పోసి గిర్రున ఒక తిప్పు తిప్పాను.
ముచ్చాల పలుకులు సిద్ధం !
గ్లాసుడు నీళ్ళు పోసి .. కుక్కర్లో పెట్టి పలుకులు ఉడికించానో లేదో...
చక్కగా తయరయ్యింది.   
మా అమ్మాయి మళ్ళీ స్ట్రేలియన్ ఓట్సు పట్టుకొచ్చేసరికి , నేనేమో నడిగడ్డ ముచ్చాల అన్నం , గుత్తొంకాయ కూర తో తినడానికి వడ్డించుకొన్నా.
తీరా చూద్దును కదా.. మా అమ్మాయి  తెచ్చిన కప్పు ఖాళీది.
" అమ్మా.. మరి నాకో? " అన్నది బుద్ధిమాన్ బాలిక లాగా!
అందుకే కదా అంటారు అడగందే అమ్మైనా పెట్టదు అని!
అడగడం ఆలస్యం, మా అమ్మాయికి ముచ్చాల అన్నం తో పాటు నా ఆలోచనలను వడ్డించేసా!
ఇప్పుడు వినడం ఆవిడ వంతు.
చక్కగా కలిసి కబుర్లాడుకొంటూ భోంచేసేసామోచ్!
ఇక మీకు తెలిసిపోయింది కదా?
మేం జొన్నన్నం తిన్నామోచ్
తింటూనే ఉన్నామోచ్ !
మరి మీరు?
***
వేడి వేడి జొన్నన్నంలో చిక్కుడుకాయ కూరో బంగాళదుంప వేపుడో వేసుకొని తింటుంటే.. అబ్బబ్బ..నోరూరి పోదూ!
గుత్తొంకాయ వండుకోగలిగారా ఇక సరేసరి!
ఇక , పెరుగు కలుపుకొని ఆపై ఆవకాయ నంజుకొంటుంటే... అబ్బ!
 మాంసాహారులైతే వారికి రుచులవిషయం చెప్పక్కరలేదు !
అవునండీ,   శ్రీనాధుల వారు మాట వరసకు ఏమని అన్నారో కానీ..
సజ్జ జొన్న కూళ్ళు .. లేమికి ప్రతీకలుగా అయిపోయాయి .చూస్తుండగానే పురాభావనలు అయిపోయాయి.పింగాణీ కప్పుల్లో చంచాల్లో ఇమడలేక కాబోలు
ఇప్పుడు ఓట్సుకూళ్ళు కార్న్ కూళ్ళు  కనుక ఆధునికులకు చిరునామా అయిపోయినట్లు !
దానా దీనా చెప్పొచ్చేదేంటంటే, మన పంటలన్నీ మన నేపథ్యంలో పుట్టిపెరిగినవి. మన  ఆహార పోషకావసరాలు తీర్చడం ఎలాగో మన పూర్వీకులు బాగానే ఎరుగుదురు.
ఎటొచ్చి మనమే,  సంధిలో సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్నాం.ఆహార వ్యవహారాల సంబంధమై.
మా మ్మాయి సంగతి అటుంచి
రెండేళ్ళ క్రితం , తెట్టు పరిసర గ్రామాల పిల్లలు పల్లె పదాలల్లుతూ ... అల్లుతూ .. రాగులు సజ్జలు మోటు  తిండ్లనీ  ..అన్నం తిన్న  వారే ఆధునికులని కథలు రాసి మరీ వక్కాణించారు!
వారితోనూ ఈనాడు మా అమ్మాయితో  చేసిన చర్చల తరహా చేశాక.. మళ్ళీ పాత ఆహార అలవాట్ల  కొత్తకథలు  వండి వార్చారు.
అదండీ విషయం!
****
అవును మరి . ఆస్ట్రేలియా ఓట్సు పలుకుల కన్నా, అమెరికా మొక్కజొన్న అటుకుల కన్న తక్కువ తిన్నాయా మన జొన్న పలుకులు? రొట్టెలే చేసుకొన్నామా ,పేలాలే వేపుకొన్నామా,  పేలపిండితో సున్నుండలే  చేసుకొన్నామా ,బూరెలే వండుకొన్నామా...
వండు కున్న వారికి వండుకొన్నంత. తినబోయిన వారికి తినబోయినంత!
చూడండి. మనదేశంలో ప్రతి పూటా  ప్రతి ఇంటా గుప్పెడు జొన్నలో సజ్జలో తిన్నామనుకో ... మనం ఎంత పంట పండించాలి?  రైతులకు  ఎంత ఆదాయం ? వరికి గోధుమకీ మనం వాడుతున్న నీటిలో ఎంత పొదుపు చేయగలం? క్రిమి సంహారకాలు ఎరువుల ఖర్చులు ఎంత మిగిలిపోతాయి? పండించిన వారికీ వండుకున్న వారికీ, అటు డబ్బుకు విలువ .. ఇటు పోషక పదార్థాల నిలువ.
 అబ్బో.ఇలా ఆలోచిస్తూ పోతోంటే ...  సజ్జ జొన్న చేల గట్లె మీద తిన్న పాలకంకుల మాధుర్యం మెదిలింది.   చేల మంచెల మీద నుల్చుని వడిసెల రాయి  విసరకుండా ముసిరే పిట్టల గుంపులతో దోబూచులాడం గుర్తొచింది.
అబ్బ ..ఎంత మంచి కల!
వాళ్ళ వాళ్ళ దేశాల్లోని మిగులు తగులు పంటలను తెచ్చి , వారేమో మనదేశంలో ఇబ్బడిముబ్బడి లాభాలపంటను పండించుకొంటుంటే   , మనం వాటికి అంతుబట్టని అధిక ధరలు చెల్లించి  కొనుక్కొని ఊరుకోవడమాఊరుకొందామా?
“ అసలు ముచ్చాల పలుకులకి మనమే పేటేంట్ తీసుకొని అటు అమెరికాకి ఇటు ఆస్త్రేలియా కీ పంపిస్తే ఎలా ఉంటుందంటావ్? “
మా అమ్మాయి ఏం ఆలోచిస్తుందో కానీ ,
మీరు మాత్రం.. మా ముచ్చాల అటుకుల కిటుకుని ఎవరికైనా చెప్పబోయేరు!
ఇది నాకూ మీకూ మధ్యనే ఉండాలి సుమండీ
ఇంత బ్రహ్మాండమైన వ్యాపార రహస్యాన్ని ఎవరన్నా సొమ్ముజేసుకొంటే ?!?
అందునా ఆ అమెరికా వాళ్ళ ఈ ఆస్ట్రేలియావాళ్ళ చెవినబడిందే అనుకోండి .ఇక అంతే సంగతులు!  
ష్..!
***
తథాస్తు!
***
ఇవి కూడా రుచి చూడండి.
http://prabhavabooks.blogspot.in/2012/02/blog-post_14.html
http://prabhavabooks.blogspot.in/2011/09/blog-post_20.html

***
All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

Sep 23, 2013

ఒకానొక శబ్దం... తరంగమై !


drudru









ఇవ్వాళ ఉదయం నిశ్శబ్దంగా పలకరించింది ఒక శబ్ద తరంగం.
దూరాల తీరాలనుంచి.
దృశ్యాదృశ్యమై.

***
నేనెంతో ఇష్టంగా రాసుకొన్న పుస్తకం "దృశ్యాదృశ్యం."
 నాకు చిన్నప్పటి నుంచీ గణితమంటే తగని అభిమానం. 
ఎంత వేగంగా ఎంత సులువుగా ఎంత తక్కువ నిడివితో లెక్కను చేయాలా అని ప్రయత్నిస్తూ ఉండేదానిని.
ఒకే లెక్కని లెక్కకు మిక్కిలి పద్దతులతో సాధించాలని ప్రయత్నించేదానిని.
ఒక్కోమారు వీలు పడేది.ఒక్కో మారు వీలు పడేది కాదు. చిక్కులెక్కయి ముడి పడేది 
ముఖ్యంగా , త్రికోణమితి !
నమ్మండి.
లెక్కల సాధనకు మించిన సృజనాత్మక విషయం మరొకటి లేదు! 
ఒక లెక్కను కొత్త పద్దతిలో సాధించేసినప్పుడు ఎంత సంతోషంగా ఉంటుందంటే,ఒక శిల్పి తన శిల్పాన్ని పూర్తిచేసి సంతృప్తిగా చూసుకొంటారే ..అంత!   
మా లెక్కల విద్యార్థులందరికీ ఒక గొప్ప వ్యామోహం ఉండేది. గొప్ప ఇంజనీర్లము కావాలని. 
కాలువ గట్టున పెరిగిన వాళ్ళం కనుక ,ఇంజనీర్ కావడం అంటే లెక్కలతోనూ నీటితోనూ ఆపై, ఆనకట్టలతోనూ ముడిపడిన కలలన్న మాట అవన్నీ.
ఆనకట్టను కట్టిన వాడే కదా ఆనాడు ఇంజనీర్ !
అవేమీ అమ్మాయిలవ్యవహారాలు కాదని కూడా నాకు అప్పట్లోతెలియదు. 
ఏమైనా, ఆ కలలేవీ సాకారం చెందలేదు కానీ, కనీసం  కళాశాల గడప తొక్కకుండానే ,
ఇంజనీర్ ను అవ్వాలన్న నా  ఉత్సాహం పూర్ణత్వం దిద్దుకొంది  "కేశవ" ద్వారానే .

అలాగే ,కొత్తావకాయ అంటే ,  కొత్త కారం ఘాటులో కొద్దిగా ఆవపిండి వగరు, మరికొంత మెంతి పిండి చేదు కలగలిసిన  పచ్చి మామిడి ముక్క పులుపు...పంటి కింద పడి ఎక్కడ నసాళానికి అంటుతుందో ననుకొంటూ..గ్లాసుడు చల్లటి నీళ్ళు పక్కన పెట్టుకొన్నా!  రుచిచూడబోయే ముందుగానే ! జాగ్రత్తగా !

ఎన్ని హెచ్చరికలు అందినా , అలాంటి ప్రమాదాలేవీ సంభవించలేదు కానీ, 
దాదాపు రెండుగంటల పాటు ఏకధాటిగా కుర్చీకి కట్టిపడేసాయి వారి మాటలు .మధ్య మధ్యలో పల్లె పాటలు.

నాకు ఇష్టమైన  "దృశ్యాదృశ్యం"సంఘటనలు కొత్తావకాయ గారి  గొంతులో ఎంత హృద్యంగా వొలికాయో! 
ఒక్కో వాక్యాన్నివారెంత ఇష్టంగా చదివారో!
ప్రతి అక్షరానికీ అనువైన శబ్దాన్ని అద్దితే ఆర్ద్రతతో దిద్దితే ..ఇంత అందంగా వుంటాయన్న మాట! 
మార్దవమూ మర్యాదా కలగలసిన గొంతు వారిది. నాజూకు గానూ ఉన్నది !
ఆ మాటే వారికి తెలియ పరిచాను.
సవినయంగా.

"ముఖాముఖం"గా నాకీ ముచ్చట వచ్చి చేరినా , వినగలిగిన వారికి విన్నంత!
http://telugu.tharangamedia.com/drusyadrusyam-by-chandralatha-with-kottavakaaya/

***
కొత్తావకాయ గారికి, "తరంగ"  వారికి, వారి శ్రోతలకు అభిమానాలు.
***
All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

Sep 20, 2013

మరి మీరిది విన్నారా?















రిషివ్యాలీ ఎప్పుడు వెళ్ళినా,
పక్షుల కిలకిలారావాలు తెలతెలవారక మునుపే తట్టి లేపేవి.
ఆ పై ముసిచీకట్లు విచ్చుకోక మునుపే , వెచ్చటి కాఫీ ని గుమ్మం దగ్గర పెడుతూ , 
అతిథిగృహం నిర్వాహకుడు ,గోపాల్ , తలుపు మీద మునివేళ్ళతో తట్టే చప్పుడు. "గుడ్ మార్నింగ్ అక్కా "అన్న పలకరింపుతో పాటు మర్యాదగా.
 దూరంగా లయబద్దంగా మోగే ఉదయపు PT గంట కొండాకోనల్ని చుడుతూ వచ్చి, ఇక పడక వీడమని మృదువుగా చేప్పేది.
ఈ సారి మటుకు, అదాటున లేచి కూర్చున్నా. అప్పటికింకా చీకట్లు వదలనే లేదు.
తెల్లవారక మునుపే ,ఉలిక్కేపడేలా చేసిన వింతధ్వనులన్నీ కొండల నడుమ నిశ్శబ్దంలో వికృతంగా ప్రతిధ్వనిస్తున్నవి.
డమ డమల మోత, ఆపకుండ మోగుతున్న హారను, ఉండీ ఉండీ కేకలు, వీటన్నిటినీ కలగాపులగం చేస్తూ  హోరెక్కించే తెలుగు సినిమా పాట.బర్రుబర్రు న.కీచుకీచుమంటు.
ఆశ్చర్యపోతూ ఏమిటో ఆరా తీద్దామని బయలుదేరాను.
ఒక దాని తరువాత ఒకటి .
అటు నుంచి ఇటు .
ఇటు నుంచి అటు .
ఆటోలు .

గోపాల్ ఫ్లాస్కులు సర్దుకొని  బయలు దేరుతున్నాడు. కాఫీలకోసం.
వాన కురిసి వెలిసింది. అంతా బురదమయం.
నన్ను చూసి పలకరించాడు. నేనూ ఆ వైపే వస్తున్నానన్నాను.
ఫ్లాస్కులన్నీ తన సైకిల్ కు తగిలించుకొన్నాడు గోపాల్.
నడక తో పాటు మా మాట సాగింది.
ఈ నిశ్శబ్ద లోయలో  ఏమిటీ హడావుడి అని ఆరా తీశాను. 
నిజమే .
బస్సులు తిరగడం లేదు. ఇక్కడి  రాకపోకలన్నిట్కీ ఆ డమడమల  బండ్లే  శరణ్యం . పైగా,బడులు లేవు. పిల్లలకు చదువులూ లేవు. అది సరే,అన్నం ఎవరు పెడతారు?
 పొద్దున్నే పనులు వెతుక్కుంటూ పట్నం  పోవాల్సిందే కదా? పిన్నాపెద్దలందరూ? ఎందరికి పని దొరుకుతుంది?
అక్కడా ఎక్కడి పనులక్కడా ఆగిపోయి ఉంటే?
ఏ పని దొరికితే ఆ పని. ఎవరు ముందెళితే వారికి ఆ పూట పని.
గొర్రెలు మేకలు తోలుకొని గుట్టలు పట్టే వారు పట్టారా..రాళ్ళు కొట్టను పోయారా ..మూటలు మోయను పోయారా..టమాటా తోటల్లో కూలీలకు మళ్ళిన వారు మళ్ళారా.. ఇళ్ళల్లో పాచిపనుల దగ్గర నుంచి .. 
ఎక్కడ దొరికితే అక్కడ ఆ పని !
ఇంత పని ఇచ్చినయ్యకు జేజే.
ఇంత ముద్ద పెట్టినమ్మకు జేజే.
ఎంత పనికి అంత ముద్ద !
ఆడపిల్లల సంగతి అడగొద్దు ఇక.
వాళ్ళు ఎలాంటి పనులకు మళ్ళించబడతారో ఎవరికీ తెలియదు కనుక !
ఎంత కష్టం మీద వీళ్ళు బడి గుమ్మం తొక్కారో . ఎంత కష్టం మీద వీరిని తరగతిలో కూర్చో బెట్టగలిగరో . ఆ బడి పంతుళ్ళకన్నా ఎవరికి తెలుసు ?
ఒక్క పూటన్నా బిడ్డల కడుపు నింపే బడి , ఇప్పుడు ఒక్కసారిగా .. ఆ బిడ్డలను ఆకలిపాలు చేసింది.
బడికి తాళం పెట్టి..పంతుళ్ళు తోవల బట్టి...పిల్లలు చెట్టూచేమల బట్టి..
ఒకటా రెండా షష్టి పూర్తి కానున్నది . త్వరలో.
ఆముటెద్దుల పోరులో లేగదూడలు నలిగిపోతాయని ఒక పల్లెమాట.
ఆకలి అక్షరం ముడి పడిన చోట..
కోటి విద్యలు కూటికొరకే అని తెలిసి మెసిలే చోట..
ఇచ్చోట..
పిల్లలను వారి బాగోగులను గూర్చి ఒక్కమారు ఆలోచించండి.  
అక్షరం వారికి రక్షణ కావాలి కదా?
అక్షరం వారికి అన్నం పెట్టాలి కదా?
పలకా బలపం వదిలి పనులకు మళ్ళుతోన్న పిల్లల వైపు ఒక్క మారు చూడండి.
అల్లరిచిల్లరికి మళ్ళి.... చెడీబడి తిని ..
మీరు ముప్పతిప్పలు బడి  నేర్పిన విద్యలు మట్టికొట్టుకు పోతున్నాయేమో చూడండి.
.మప్పడం తేలిక .తిప్పడం కష్టం అంటారు.
 బడి తోవ తప్పించిన వారిని మరలా తిన్నని బాట ఎక్కించ గలరా?
మీరు చేస్తోన్న కృషి, మీ శ్రమ, మీ దృష్టి  ,మీ సృష్టి .. మీ బడీపిల్లలు.వారి గోస వినవల్సిందీ వినిపించ వలసిందీ మీరు కాక ఎవ్వరు ?

"ఇది పాపం అక్కా! "
గోపాల్ గొంతు బొంగురు పోయింది.

అయ్యవారల్లారా అయ్యవారమ్మల్లారా...
మరి మీరిది విన్నారా?
***
ఇంతలో,
పిల్లలతో పెద్దలతో కిక్కిరిస్న మరో ఆటో మా ముందు నుంచి బర్రున దూసుకెళ్ళింది.
ఆగకుండా.
మండేవారిపల్లి నుంచి మదనపల్లె వైపుగా!

(గల్పిక )
Related Post :

ఆకలి ..అక్షరం... పిల్లల గోస

http://chandralata.blogspot.in/2013/09/blog-post_11.html

Sep 18, 2013

తన నాలుగు కాళ్ళపై !

రిషీ వ్యాలీ కొండల్లో కోనల్లో పిన్నా పెద్దల అభిమానం సంపాందించుకుంది లింపెట్. 
కాలు వంకర పోయిందేమో కానీ .అందరి గుండెల్లో చోటు చేసుకుంది.
చూస్తుండగానే కాలంలో కలిసిపోయింది.
ఆ అభిమానాన్నే మిగిల్చి .
శ్రీ నందకుమార్ గారు, పృధ్వి,అసుతోష్  తదితరుల (ISC 2012)   చేతులలో ఇలా మలచబడి , 
రిషీ వ్యాలీ ఆర్ట్స్ గది ముందు,  
ఠీవీగా నిలబడింది !
తన నాలుగు కాళ్ళపై ! 
ఇదుగోండి ఇలా !
పిల్లలని పలకరిస్తూ.
పెద్దలని పరామర్శిస్తూ.
ప్రతిపూటా. 

Sep 15, 2013

ఇల్లు ఖాళీ చేసి

"పాఠాలలో కెల్ల ఏ పాఠం సులువు" అని పంతుళ్ళను ఎవరూ అడగరు కానీ,
మనసా వాచా చెప్పాలంటే, ఏ పూట పాఠం ఆ పూటకు కఠినమే !
అదే,కర్మణా చెప్పాలనుకోండి, కొట్టిన పిండిని అలా పిల్లల మీదకు జల్లించేసి రావొచ్చుస్మీ!
అందుకే కాబోలు.
నా మట్టుకు నాకు , పట్టుమని పదిపాఠాలు... చెప్పానో లేదో, చప్పున నచ్చాయి.
 కాలాల పాఠాలు. అంటే, Teaching Tenses  అన్న మాట.
ఆంగ్లంబున మన తెలుగుకు మల్లే ,ముచ్చటగా మూడు కాలాల్లో ముగించ జాలం కనుక , పన్నెండు కాలాలను పండిన నారింజపండు  వొలిచినంత సునాయసంగా,  పిల్లలకు మహజరుగా చెపుతూ చెపుతూ ఉండగా, వారినొకప్రశ్న అలవోకగా అడిగిచూసా .
"కాలాలలోకెల్ల ఏ కాలం మేలు?"

విశ్వనాథ  గారి శిష్యులయిఉంటే,
"గతకాలమే మేలు నేటి కంటే "అనే వారేమో  టక్కున .
పోనీ ,సినీమా .యా. విద్యార్థులయితే, "ఉందిలే మంచి కాలం ముందు ముందున " అని త్రేంచేవారేమో.
"ఎప్పటికి ప్రస్తుతమప్పటికా" కాలంబు  అని సుమతీసూత్రజ్ఞులు వక్కాణించే వారు కాబోలు.

మా అడపాదడపా శిష్య పరమాణువులు మాత్రం ,
"Tense is Non-sense!" అనీ
"  Oh! Tenses Class? Again? "అనీ
"Tense is Nuisance"  అనిన్నూ..
 పలు పలు విధములుగా పలుకుచుండగా,
నిజమే ,
"Tense లలో కెల్ల ఏ Tense మేలు? " అన్న ప్రశ్న నన్ను ముల్లులా తొలిచింది.
అవును. నా లాగా , పిల్లలకు కథల రచనాపాఠాలు చెప్పుకొనే వారికి ,
ఎంతో అనువైనదీ సులువయినదీ మేలయినదీ ...
అణుకువైనదీ ...అన్నివిధాలా  అందివచ్చేదీ ,
 Past Tense కదా!

"అనగా అనగా ఒక రాజుగారుండేవారు " అంటూ మొదలెట్టినా.  Once Upon a time.. అంటూ ప్రారంభించినా,
 "ఏక్ థా రాజా.." అంటూ షురూ చేసినా కథకు ఆయువు భూతకాలమే కదా?
నిజమే నండోయ్!

మనమనుకున్నట్లుగా , కథలన్నీ కంచికి  చేరిపోవు !
గతించిన కాలంలో బోలెడన్ని కథలుంటాయి!
విప్పిచెప్పే మనిషుండాలి. వినగలిగే మనస్సుండాలి.
అంతే!
***
నిన్న మొన్నటిదాకా అన్నిటా తాననుకొన్న ఇంటిమనిషి ,
నిశ్శబ్దంగా వొంటరిగా ..
ఇల్లు ఖాళీ చేసి,
కాలాల్లో కలిసిపోతే, 
ఆ ఖాళీలను పూరించను ,పదాలను ఏ కాలం వాక్యాలతో సరితూచగలం?
అవునండీ.

ఒక మనిషికీ ఒక మానవసంబంధానికి ఈ కాలాన్ని అన్వయించడం కన్నా ,
మనసు ముక్కలుచేసే విషయం మరేం ఉంటుంది?

Tense లలో కెల్ల కఠినమైన Tense ,  Past Tense !

***
All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

Sep 11, 2013

ఆకలి ..అక్షరం... పిల్లల గోస

ఇవ్వాళ ఒక ప్రభుత్వ పాఠశాల తెలుగు ఉపాధ్యాయిని కలిశారు.

ఈ రోజు మా ఊరంతా  కన్నీరు మున్నీరయ్యి ఉంది.
ఒక ఉపాధ్యాయుడికి అంతిమవీడ్కోలు ఇస్తూ .

వారన్న మాటలు ఆ వరదలోనే కొట్టుకు పోగూడదు కదా అన్నారామె.
వారు   ఏమన్నారంటే ,
"నిన్న మొన్నటి వరకు ,ఎక్కడెక్కడి పిల్లలను బడిలో చేర్పించడానికి తిప్పలు పడ్డాం.పిల్లల భవిష్యత్తు ఏమిటి ?" అన్నారాయన.
"అయినా, నాట్లనీ  కలుపులనీ బడిలో ఓ అడుగు మడిలో ఓ అడుగు  వేయడం మా బడి పిల్లలకు రివాజు.
ఇక, ఫిబ్రవరి నెలంటే మాకసలే అదురు.మినుముల కోతల  కాలం కదా?  మాకేమో పరీక్షల రోజులు.
మధ్యాహ్నం  దాకా కూలికి వెళ్ళి ,బోజనం వేళకు  బడికి వచ్చే పిల్లల కోసం కాపు కాయాలి.
వాళ్ళని నయానో భయానో నచ్చచెప్పుకొని , తరగతి గదిలోకి  తీసుకు రావాలి. కాళ్ళా వేళ్ళా పడి నాలుగు అక్షరం ముక్కలు నేర్పి పరీక్షల గదిలో కూర్చో బెట్టాలి ! లేకుంటే పై అధికారుల నుంచి బాజాలు ! ఫలితాలు వెలువడిన రోజున కాజాలు !
అనకూడదు కానీ, పిల్లలు బడికి రావడం లేదంటే ,ఒక్క పూటన్నా తీరే వాళ్ళ ఆకలి ఎవరు తీరుస్తారు ? " ఆమె ఆవేదన చెందారు.
"మరి వాళ్ళు కూలో నాలో చేసుకోక తప్పదు కదా! "అన్నరామె దిగాలుగా.
" ఇన్నిన్ని సెలవలు వస్తోంటే. ఇక వాళ్ళకు బడి అలవాటు తప్పుతుంది కూడా. ఇప్పటికే ఇంటింటికీ వెళ్ళి బడి రారండని  బతిమిలాడుతున్నా ఫలితం  అంతంత మాత్రం.
కొడవలి పట్టే చేతుల్లో పలకలు పెడితిమి. చెలకల దారి బట్టిన వారిని బడికి మళ్ళిస్తిమి. మరలా వాళ్ళంతా గొర్రెలు మేపుకోవాల్సిందేనా ? గుట్టమిట్టా బట్టి?
అందులోనూ ఆడపిల్లల విషయం.మరీ దారుణం.ఎవరెవరు ఏ ఏ దారిన మళ్ళించబడతారో !
ఇప్పటికే ,పట్టుమని పదో తరగతి గట్టెక్కుండానే పెళ్ళిపీటలెక్కి,  ఏడాది   తిరిగే లోగానే ,బిడ్డను  చంకలో వేసుకొని వస్తూఉంటారు. బోర్డు పరీక్షలకు వెళ్ళే స్నేహితులకు శుభాకాంక్షలు చెప్పడానికి.

***
ఆకలి తీర్చాడానికేగా అక్షరం.
ఆకలితో అక్షరం ఎలా అబ్బుతుంది?
ప్రభుత్వ బడి హాజరు పట్టీ నానాటికి ఖాళీలు ఏర్పడు తున్నాయంటే ఎందుకో తెలుస్తూనే ఉంది కదా?

ప్రభుత్వ బడి ఉపాధ్యాయుడికి నివాళి
వారి పిల్లలపట్ల ఆ బడి పంతుళ్ళ ఆవేదనను అర్హ్దం చేసుకోవడంలోనే ఉంది కదా?
అక్షరం ఆకలి నుండి రక్షణను ఇవ్వాలనే  కదా అందరం ఆశించేది ?

***
All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

Sep 7, 2013

అప్పగించితిమమ్మా...

అప్పగించితిమమ్మా...
ఒప్పులకుప్పా...
నీకిపుడు..

ఓ బుజ్జి గణపయ్యనూ..

అప్పగించితిమమ్మా...
ఓ చిట్టి తల్లీ..
నీకిపుడు..

ఆ పుడమి  తల్లినీ..

అప్పగించితిమమ్మా...
ఓ  బుజ్జి తల్లీ..
నీకిపుడు..



ఆ చెట్టూచేమలనూ....ఆ గుట్టామిట్టలను...
ఆ నదీనదాలను..ఆ కొండాకోనలనూ

ఆ సకలచరాచర జీవరాశులనూ..

అప్పగించితిమమ్మా...
ఒప్పులకుప్పా...
నీకిపుడు..

***
నిజమే!
 కానీ..ఈ బిడ్డ పెరిగి పెద్దయ్యే సరికి మనం నిజంగానే ...
ఈ రోజున్న జీవసంపదను భద్రపరిచి అప్పగించగలమా?
ఒక సమగ్ర ప్రణాళికా ఒక సంపూర్ణ అవగాహనా లేనిదే?

ఎలాంటి వారసత్వ సంపదను
మన బిడ్డలకు మనం ఇస్తామన్నదాంట్లోనేగా మన విజ్ఞత అగుపడేది !
ఈ ప్రకృతి మన చిట్టితల్లులకూ బుజ్జి తండ్రులకూ మనమివ్వబోయే  సహజ వారసత్వసంపద.


పండగ పూట పప్పూబెల్లాలు కొనేదెలా ? పాలు పంచదారలు తెచ్చేదెలా ?
ఉల్లిపాయ కందిపప్పు. ..ఇక జాబితాకు కోతవేయతప్పదు కదా?
నిత్యావసరాలే అత్యవసరాల పట్టీలో చేరుతోంటే..

చింత పడాలా? చింతన చేయాలా?

ఆలోచించండి మరి!
ఆచరించ ఆరoభించండి !

మట్టి గణపతికి జై కొట్టి !
గట్టిగా నాలుగు గుంజిళ్ళు తీసి !

***
సర్వేశాం  మంగళం భవతు !
***

వినాయక చవితి శుభాకాంక్షలు !

సర్వేజనా ఉండ్రాళ్ళుకుడుములు ప్రాప్తి రస్తు !

తథాస్తు !
***
Related Link :
http://prabhavabooks.blogspot.in/2013/09/patri-hunt.html
ఓ బొజ్జ గణపయ్య ...ఈ ఆకు నీకయ్య..!
పత్రి కోసం వెతుకులాటా?
ఈ పండుగ పూట ?
వినాయక చవితి శుభాకాంక్షలతో 
http://prabhavabooks.blogspot.com/2013/09/patri-hunt.html
***

All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

Sep 5, 2013

ఒకానొక బడి.

ఒకానొక బడి.
ఒక పాట.ఒక మాట
ఒకానొక పూట!
మీరూ చూడండి.
http://rvstorybook.wordpress.com/2013/09/04/mohnish-sings/


***
All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

Sep 4, 2013

పచ్చటి బడిలో పాఠాలు

అమ్మకు జేజే . నాన్నకు జేజే .
చదువులు చెప్పే గురువుకు జేజే.
అందరికీ సహజగురువు ..
ఆ  ప్రకృతిమాతకు  జేజే !
http://www.youtube.com/watch?v=K9b63nSt9jY
అలా పచ్చటి బడిలో పాఠాలు చెప్పే గురువులూ.. చెప్పించుకొనే అవకాశము.. అందరికీ దక్కితే ఎంత బావుణ్ణు!

  

Sep 3, 2013

బడి గంట గణ గణ మంటే ..!

బతకలేక బడిపంతులనేవారు ఒకానొకప్పుడు.
వారు అప్పుడూ ఇప్పుడూ అంతే.  పంతుళ్ళలో పుణ్యపంతుళ్ళు వారు !
ఇకపోతే, బతకనేర్చిన బడిపంతుళ్ళు మనం చూస్తుండగానే, ఇంతై ఇంతింతై తామింతై ...పోతూ ఉన్నారు.
వారి సంగతీ అటుంచండి.
బతకడానికి బడి పంతుళ్ళయిన వారు ...ఉద్యోగధర్మమో యాజమాన్యనిర్బంధమో విధివిధానమో నిర్వర్తించక తప్పదు కదా" అనవచ్చు!  
అయిప్పటికీ,
ఒకానొక పాఠం ...ఒక్క పంతులు /పంతులమ్మ ..మనల్ని పల్టీలు కొట్టనీయకుండా..తిన్నని బాటలోకి మళ్ళిస్తుంది.
నయానో భయానో.  
చెవి నులిమో .మొట్టికాయ వేసో.
 మెత్తగా మాట్లాడో.గట్టిగా పోట్లాడో.
సరిగ్గా .. అలాంటి ఆర్ద్రత తరగతి గదిలో ఆవిరయిపోయినట్లుగా  తోస్తోంది కదా !
పాఠ్యప్రాణాళికల్లో పరీక్షలనిర్వహణల్లో ఫలితాలకొలతల్లో మునిగితేలుతూ.
ఒకానొక పాఠం ...ఒక్క పంతులు /పంతులమ్మ ...నిరాశలో ముంచి నిస్పృహలో దించి  మనల్ని పక్కదోవ పట్టించవచ్చు !
పిల్లల కడుపు నిండిందో లేదో చూసే తీరిక గానీ , బిడ్డ కంట నీరుందో కనుల్లో కలలు దాగున్నాయో మునివేళ్ళలో కళలున్నాయో గ్రహించ గలిగే లోగానే, బడి గంట గణ గణ మంటొంది కదా !
బడిలో నేర్చే పాఠాలు బతుకుతెరువు కొరకు పరిమితమవుతూ పోతుంటే ..అసలుసిసలు పాఠాలు గుణపాఠాలు నేర్పేందుకు మన బతుకు బడి సదా సిద్ధమై ఉంటుంది !
ఒకమారు తడబడి నపుడు , తోలిసారి తప్పు కంటబడినపుడు , ముసిచీకటిలో ముసురుకొట్టున్నప్పుడు, వడగాడ్పులో కొట్టుమిట్టాడుతున్నప్పుడు,
నొప్పించక ...
తెలివిడిగా మనకు ఒక వెలుగు బాట చూపిన వారందరూ మన పంతుళ్ళేగా!
వారందరికీ సవినయ నమస్కారాలు.
పాఠాలన్నీ మన జీవితాంతం అందుతూనే ఉంటాయి
బతుకు బడి నేర్పే పాఠాలను అర్ధం చేసుకోవడానికి , మన జీవిత కాలం సరిపోతుందా?
బడిలోనో కళాశాలల్లోనో విశ్వవిద్యాలయాల్లోనూ... 
పాఠం చెప్పను పూనుకొన్న వారందరికీ జేజేలు.
మీరు విన్నపాలు వినవలే ఒక మారు.


 http://www.youtube.com/watch?v=kaWGFABZNjE

***
All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

Sep 1, 2013

పద్యం తీసుకెళ్ళి పంతులమ్మలకిస్తే ..!


మాములూగా ఇంట్లో అమ్మాయిదో అబ్బాయిదో పుట్టినరోజు వస్తే, తలంటు పోసి, కొత్త బట్టలేసి,  గుప్పెడు పంచదారో..
 గిన్నెడు పాయసమో తినిపించేసి,  
సరేననిపించే వారు  మా చిన్న తనాన.
మరీ గారాబం అయితే , కాసిన్ని గారెలు వండేవారేమో.

మా అమ్మ కాస్త ప్రజాస్వామికబద్దురాలు కాబట్టి, 
ఎవరి పుట్టిన రోజున వారికి నచ్చిన తీపీకారం వండిపెట్టేది. 
ఆ లెక్కన, ప్రతి ఏడాది మా అన్నయ్య పుట్టినరోజుకి రవ్వకేసరి,చెల్లెలు పుట్టిన రోజున పెరుగు గారెలు,నా పుట్టిన రోజున మిరపకాయబజ్జీలు ..తినక తప్పేది కాదు.  
నాకు పాలతాలికలు అరిసెలు గారెలు బూరెలు తినాలనిపించినా, లాభం లేదన్న మాట!

ఇక పోతే, పేరంటాలు చేసిన జ్ఞాపకం అయితే లేదు మరి.కాకపోతే తల మీది కాసిన్ని అక్షింతలు చల్లి ,పెద్దలంతా దీవెనలు పంచేసి ,కాళ్ళకు మొక్కించుకొనే వారు!

సినిమాల్లో పదేపదే పుట్టినరోజు పండుగలు చేసి చేసి,  ఆ వేడుకలనంటిని చూసి చూసి , ఆ పాటలు పాడి పాడి ,
ఆ పై ఆటలు కట్టి , పెరిగాం కదా..అయినా మనకూ అలాంటి పండుగలు చేస్తే బావుణ్ణు అనుకోలేదు.పైనుంచి ,అదేదో సినిమా వ్యవహారం అనుకున్నాం !

ఇక, మా ఇంట పిల్లలు మెసిలే సరికి కేకులు కొవ్వొత్తులు  రంగురంగుల బెలూన్లువొచ్చేసాయి.
బడిలో పంచడానికి ఒక చాక్లెట్ డబ్బా ,చేతబట్టి పంపితే సరిపోయేది.
ఆ పూట బడయ్యాక ,సాయంకాలం పిల్లందరినీ పిలిచి సరదాఆటలు, పాటలు ,గెలిచిన వారికి బహుమానాలు .గాలి బుడగలు  ,రంగుల కాగితాలు, అలంకరణలతో పాటు,  రాను రాను  హడావుడి కూడా పెరుగుతూ వచ్చింది.
 వచ్చిన బాల అతిథులకు  బోలెడన్ని వీడ్కోలు కానుకలు  Return gifts ఇచ్చి పంపడం మామూలయిపోయింది. 

"నా పుట్టిన రోజుకి ఏం కానుకలిస్తావ్ ?" అని వూరుకొనే కాలం కాదిది ."నా పుట్టిన రోజున ఎలాంటి కానుకలు పంచుతాను?" అంటున్నారు గడుగ్గాయిలు. 
పిల్లలను బట్టి అమ్మానాన్నలా ,అమ్మానాన్నలను బట్టి పిల్లలా అన్నది తరువాతి విషయం.
సరే, వారి వారి శక్థి కొద్దీ.. బోలెడన్ని ఇచ్చిపుచ్చుకోవడాలు !

మరి,  మా బడిలోకి పిల్లలొచ్చాక, వారితో పాటు వారి పుట్టిన రోజు పండుగలు పట్టుకొచ్చారు. రంగురంగుల డిస్నీ బొమ్మల సంచుల్లో కానుకలు పంచాలని ఏ పాపాయి కోరుకోదు చెప్పండి?
కేకు ,చిప్స్ ,చాక్లెట్లు వగైరాల సంగతి అటుంచి, ఈ వీడ్కోలు కానుకల్లో ,ఒక్కోరిది ఒక్కో అభిరుచి.తోటి పిన్నలతో పాటు తోడున్నాం కదా ,మాలాంటి పెద్దలకూ ఈ కానుకలు అందుతుంటాయి.  అనకూడదు కానీ, 
 బుజ్జిబడి పంతులమ్మలకు ఇదొక అదనపు సౌజన్యం అన్నమాట!

సరే, మరేమయ్యిందంటే మొన్నీ నడుమ ,
మా బుజ్జి బడిలో ఒక పాపాయి పుట్టినరోజు. 
పండగే కదా అందరికీ. 
ఎప్పటిలాగానే మేము ,పిన్నాపెద్దలం కలిసి ఆ పాపాయికి నచ్చిన పాటలన్నీ పాడీ,ఆటలన్నీ ఆడి ,ఆమెకు నచ్చిన బొమ్మల కథల పుస్తకాన్ని ఆమె చేత పెట్టామో లేదో...పుచ్చుకొంటినమ్మ వాయినం అన్నంత సంబరంగా ,మాకూ ఒక కానుక ఇచ్చింది. 
ఆందరు పిల్లల్లాగానే ,తీపో కారమో ,పెన్నులో పెన్సిళ్ళో,బంతులో బొమ్మలో.. ఇచ్చిందిలెమ్మనుకుంటాం కదా.
 మా బుజ్జి భవ్య కీర్తన ఇచ్చిందేమిటో తెలుసా?
ముచ్చట గొలిపే తన బొమ్మలతో బాటు,
తలా ఒక తెలుగు పద్యం!
అందుకేనండి,
పద్యం తీసుకెళ్ళి పంతులమ్మలకిస్తే ..!
ఏమవుతుంది?
ఇదుగోండి ఇలా,
గోడల మీదకెక్కుతుంది !
మీ అందరి ముందుకీ వస్తుంది!
భవ్యకీర్తనకూ,  “సృజనాత్మకంగాను అమూల్యంగాను  వీడ్కోలు కానుకలివ్వచ్చును సుమా “అని ఒక సద్భావనను 
వెలిగించిన భవ్య అమ్మానాన్నలకు జేజేలు!
భవ్య కీర్తన బోలెడన్ని పుట్టిన రోజులు జరుపుకోవాలి!
అందరికీ తెలుగు పద్యాల విందులు ఇవ్వాలని,
నాతో పాటూ మీరూ కోరుకోరూ మరి ?

శుభం!
***
మీకు కుదిరితే ,మరొక వీడ్కోలు కానుకల  మాంత్రికుడి గురించి ఇక్కడ చదవండి మరి!
   http://chandralata.blogspot.in/2009/11/blog-post_16.html
***
All rights @ writer. Title,labels, postings and related copyright reserved.