|
డా.రాం |
అన్నకు తమ్ముడు లఘువా?
అన్న తమ్మునికి గురువా?
ఒక చేతి వేళ్ళయ్యా!
ఎక్కువ తక్కువ లెందుకు?
( కె వి యార్,1967 )
21 జనవరి 1915 లో పుచ్చలపల్లి వారింట కడపటి బిడ్డగా , శ్రీ పుచ్చలపల్లి సుందరయ్య గారి తమ్ముడి గా పుట్టిన రాం 1935-40 ల నడుమ మద్రాసులో వైద్య విద్య ను అభ్యసించారు. ఆ వెంటనే ప్రజలకోసం వైద్యం ..ప్రారంభించారు. 21-4-67 న ప్రజావైద్యునిగా చెరగని ముద్ర వేసి ,ఒక అద్బుతమైన ప్రజా వైద్య శాలలో తన ఊపిరిని నింపి వెళ్ళారు.
వృత్తికి, ప్రవృత్తికి నడుమ ,ఆయన జీవితం ఆలోచనలు,కార్యాచరణ, ఆవేశం, ఉద్రేకం, నిరాశ ,మనః క్లేశం ...ఎన్నిన్ని కోణాలో.. ఈ స్మారక వ్యాసాల్లో ఎంత వెతికినా ఆ మానవుడు మనకు అంతుచిక్కడు కదా!
అందుకేనేమో వారి వ్యాసాన్ని శ్రీ వేములపాటి అనంతరామయ్య గారు ,
"Do I know Ram ?" అంటూ మొదలెట్టి , అదే ప్రశ్న తో ముగించారు !
ఇందులో డా.రాం గార్ని సన్నిహితంగా ఎరిగిన మిత్రులు Prof.K.శేషాద్రి గారు, జస్టిస్ గంగాదర రావు గారు,జి,కృష్ణ గారు, డా.సంజీవ దేవ్ గారు, డా, CR రాజగోపాలన్ గారు ,ఆచార్య పి.సి.రెడ్డి గారి వంటి అనేక మంది ప్రముఖులు డా.రాం గారిని వ్యక్తిగా
పరిచయం చేస్తారు. వ్యక్తిత్వాన్ని మనకు స్పురింపజేస్తారు.
డి.రామచంద్రారెడ్డి గారు విశ్వోదయ తో డా.రాం గారి అనుబంధాన్ని తెలియ జేస్తూనే , వారి పరస్పర మైత్రి ని , వారి నుంచి వీరు పొందిన స్పూర్తిని..హృద్యంగా వివరిస్తారు. ప్రజలు వారి ఆరోగ్యం గురించి
డా .కాకర్ల సుబ్బారావు గారు రాసిన వ్యాసం ఒకటి వైద్యరంగలోని మౌలికాంశాలను స్పృశిస్తుంది.
మధురాంతకం రాజారాంగారు కథాసాహిత్యం లో సామాన్యుడి గురిచి అలవోకగా వివరిస్తే, డా. కొండప్ల్లి శేషగిరి రావు గారు , కాకతీయ కళలో వారి అనుభవాల్ని వివరించారు.
ఇవి ,కాకుండా అనేక సాహిత్య, చారిత్రక ,సమకాలీన ప్రగతి పూర్వక అంశాలను రచయితలు స్పృషించి డా. రాం కు నివాళి గా సమర్పించారు.
కాకరాల గారు వ్రాసిన "మిత్రత్రయం " ,కెవియార్ గారి జోహారు పలుకుతూ అక్షరాల్లో గుమ్మరించిన అక్షరమల్లెల పరిమళం మనల్ని చాలా సేపు వదలవు.
వకుళాభరణం రామకృష్ణ గారు హెచ్చరించినట్లుగా ," డా.రాం ప్రజా వైద్యుడు. ఉద్యమకారుడు.గొప్పవ్యక్తి .మంచి వ్యక్తి .కానీ పొరపాటునా దేవుడిని చేసేసేరు !"
నిజమే, ఈ సంచికలోని ప్రముఖ రచయితలంతా, డా. రాం లొని విభిన్న కోణాలను ,ఆయా పరిమితులతో
సహా పరిచయం చేశారు.
విఫలమైన ప్రథమ వివాహం గురించి మాట్లాడినా, "I smacked my wife! " అన్న డా. రాం మాటను వక్కాణించినా , వారేమీ దాపరికం చూపలేదు.
తనలోలో ఇంకి పోయిన ఫ్యూడల్ భావ జాలపు అవశేషాల లో నుంచి బయట పడడానికి తను నిత్యం ప్రయత్నించినట్లుగాను, ఆ ప్రయత్నాలే అతనిని మరింత వత్తిడికి ఉద్వేగానికి గురిచేసినట్లుగాను తెలుస్తుంది. రాజ్యలక్ష్మమ్మ గారి ధృఢ వ్యక్తిత్వమే డా.రాం కు బాసట అని మనం గ్రహించ గలుగుతాం. పైనుంచి, ఆ అన్నకు తమ్ముడిగా , మొక్కవోని పోరాటపటిమ చూపారు . వారి జీవనమంతా అనేక ప్రయోగాల సమ్మేళనమై ,నిత్యం ఒక కొత్త కోణం తో ఆశ్చర్యపరుస్తుంది.
మార్క్సిస్ట్ గా ఉంటూనే , వారు ఆకర్షితులైన ,నర్భవి , యోగావిధానం కూడా అలాంటిదే.
ఒక వైపు ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం "రాజకీయ అస్పృశ్యునిగా " ముద్రించి
యుద్ధానికి డా.రాం సేవలను నిరాకరించగా, మరో పక్క ..
తెలంగాణా రైతాంగ పొరాటంలో సుందరయ్య గారు మునిగి ఉండగా, ఆ
పోరాటయోధులకు వైద్య సహకారాన్ని అందించడంలో ,ఒక ప్రజా వైద్యునిగా ఉద్యమకారునిగా డా.రాం పోషించిన పాత్ర ను,రచించిన ప్రణాళికను ,కార్యాచరణనూ .. మనం తెలుసుకోవచ్చు
|
సుందరయ్య గారు |
. తెలంగాణా రైతాంగ పోరాటం అనంతరం పోగుపడిన లెక్కకుమిక్కిలి ఆయుధాలు,బంగారం, సంపద... ఏ మైయ్యాయో తెలుసుకోవచ్చు. పొగాకు వర్తకుల మైత్రి పార్టీ ని , చైనా పొత్తు పార్టీసారధులను ఏ దిశగా మళ్ళించాయో తెలుసుకోవచ్చు.
జమీన్ రైతు నివాళిలో ఇలా రాశారు,(21-4-67)
“”డా.రాం లోని కొన్ని వైరుధ్యాలు ప్రబలంగా పని చేశాయి. కేవలం వైద్యం వల్లనే ప్రజారోగ్యం చేకూరదని రాం భావన ."సాంఘిక వ్యవస్థ ,ప్రజల ఆర్ధిక జీవన జీవన విధానం సమూలంగా మారితేనే గానీ, తిండి తిప్పల్లో ఒక మార్పు రానిదే కానీ,ఆరోగ్యం శుభ్రత చేకూరవు. "అని ఆయన అంటుండేవారు.
"అందుకని నేను ఒట్టి డాక్టరుగా ఎంతకాలం ఉండేది? రాజకీయ వాదినై సాంఘిక మార్పు కోసం కృషి చేయాలి" అన్న కామన వారిలో ఉండేది.
కానీ, మొదటి సంతాప సభలో సుదరయ్యగారు చెప్పినట్లుగా,"డా.రాం ప్రత్యక్ష రాజకీయాల్లో దిగాలనే కోర్కెను ఎప్పుడు కనబరిచినా ,మేం చెపుతూనే ఉండినాం.వారిస్తూ వచ్చినాం. నీవు డాక్టరువు. నీవు వైద్యుడిగానే ప్రజాసారూప్యత ను సాధించాలి. రాజకీయాలు వేరే వాళ్ళు చూసుకొంటారు అని నిరుత్సాహ పరుస్తుండినాం. అందువల్ల డా. మనః క్లేశాన్ని పొందుతుండే వారు. "
ప్రొ.కె.శేషాద్రి గారిలా చెపుతున్నారు. " పార్టీలోని కార్యకర్తలందరికీ కొంత వరకు వైద్యం తెలిసి ఉండాలన్న ఒక పథకం డా.రాం సిద్ధం చేశాడు.గ్రామాలకు వెళ్ళి, బీదల మురికి వాడలకు వెళ్ళి పనిచేసే కమ్యూనిస్ట్ కార్యకర్తలకు కొంత ప్రథమ చికిత్స ,చిట్కావైద్యం, ఇంజెక్షను ఇచ్చేనేర్పు ఉండాలని ఆయన అభిప్రాయం. బీదరికం రోగాన్ని తెస్తుంది. బీదరికాన్ని, దానికి కారనమైన సామాజిక దోపిడీదారి విధానాన్ని ధ్వంసం చేయడం ,చాలాకాలం తీసుకొంటుంది. ఎన్నో త్యాగాలు ఎన్నో పోరాటాలు చేయాల్సి ఉంటుంది. అంతవరకు రోగాలు వేచి ఉంటవా?
అది long term plan ఇది short-term plan. ఈ రెండు ప్రణాళికలూ అవసరమే. ఈ విధంగా రూపుదిద్దుకున్న ఈ పథకాన్ని డా.రాం ఎంతో సమర్ధవంతంగా నిర్వహించారు."
అనేక మంది "బేర్ ఫుట్ డాక్టర్"లను తయారు చేశారు. ఈ నాడు డా.రామచంద్రా హస్పిటల్ ఇంతింతై పోస్ట్ గ్రాడ్యేషన్ కోర్సులలో శైక్షణ ఇచ్చే వైద్య సంస్థగా రూపొందింది. అదే డా రం గారి చిరకాల వాంచ. నెల్లూరులో ఒక వైద్య కళాశాల నెలకొల్పాలని.
వైద్యం దగ్గరికి రోగి కాక ,రోగికి అందుబాటులో వైద్యం అన్న ది వారు విశ్వసించారు. పాటించారు. అలా ,మొదలయినవే, పీపుల్స్ పాలీ క్లినిక్, సంచార వైద్య శాల, మాస్ ఎక్స్ - రే ..తదితరాలు.
ఆయన అచరించిన మరొక ముఖ్య సూత్రం. కేవం వైద్యుడు కావడం కాదు. .నిపుణుడు కావాలి.నిపుణుడు కావడమే చాలదు.
సమాజంలోని అట్టడుగు వర్గాల ప్రయోజనాలకు తన నైపుణ్యం వినియోగించాలి."
"డాక్టరు గారు శస్త్రపరికరాలకు మారుగా మాములు రేజర్ బ్లేడు ను వాడే వారు","తౌడును చక్కెర తొ కలిపి రోజుకో చంచాడు తిన మనే వారు " లాంటి అనేకానేక అధ్బుత చమత్కారాల కబుర్లు ఇప్పటికీ పచ్చగా ఉన్నాయి నెల్లూరియుల నోళ్ళలో నానుతూ.
వేయేల, డా.రాం కాలగర్భంలొ నడిచెళ్ళి , అర్ధశతాబ్ది దాటినా ,ఈ నాటికీ డా.రామచంద్రారెడ్డి ఆసుపత్రే , అనేక మంది బీదాబిక్కి కి ఆఖరి ఆశ ,ఆయువు .
వారు వెళుతున్నది డా.రాం ఆసుపత్రికి.
ఇంతకు మించి వైద్యరంగంలో ఒక వైద్యుడికి దక్కే ప్రజానివాళి ఏముంటుంది ?
***
వైద్యులైన ప్రతివారు తప్పించుకోలేని బలమైన ఆకర్షణ ఒకటి ఉన్నది.
ప్రాణాపాయ స్థితిలో వచ్చి చికిత్స చేయించుకొని , బతికి బట్టకట్టిన వారు సహజంగానే డాక్టరు గారిని, "ప్రాణం నిలబెట్టిన పరఃబ్రహ్మ నీవని" కీర్తిస్తూఉంటారు.
అనగా అనగా, ఎంతటి వారికి అంతో ఇంతో అహంభావం పొడసూపక మానదు. ఏదో ఒక నాటికి.
మరి ఈ విషయమై డా.రాం గారు ఏమంటారో తెలుసా?
"అహంకారమా! పో ! పో!
కారాలన్నీ పోయి తీపి రావాలి!
ఎగో(అహంకారం) లేక పోవడమే యోగం .
Divine అన్న పదాన్ని డా రాం ఎలా విరిచారో చూడండి.
Divine = De Wine..Remove the wine of Ahankaara ,you become Divine."
తెలుగులోకి వారే తర్జుమ చేసి చెప్పారిలా,' అహంతో తప్ప తాగి మతిలేని వాడివైనావు.ఈ మత్తుపోతేనే నీకు యోగం పొతు కుదురుతుంది. అప్పుడే దయ్యం వదిలి దైవమవుతావు "
ఇలాంటి పదాల చమత్కారాలకు డా.రాం పెట్టింది పేరు.
వారి దోపిడి ... దో ..(రెండు) ..పిడి ( పిడికెళ్ళు)..ప్రపంచయుద్దాల సమయంలో నల్లబజార్లలోకి తరలిపోబోతున్న బియ్యాన్ని ఆయన ఈ "దో పిడి " ప్రణాళిక ను ప్రచారం చేసి , వర్తకుల నుంచి రెండు పిడికిళ్ళ బియ్యం ఇచ్చేట్టు చేశాడు.
ఇక, బీడీ కార్మికుల సమ్మె లో గొరిల్లా విధానాలయినా, రిక్షా కార్మికుల సమస్యల పరిష్కారాలైనా ,
.ప్రజా నాట్య మండలి కార్యకలాపాల నుంచి స్వయంగా పెట్టుబడి పెట్టి సినిమా తీసినా .. ..అందుగలడిందు లేడనకుండా.
గర్జించినా గాండ్రించినా ,
కంటనీరుపెట్టినా, గుండెలవిసేలా ఏడ్చినా ..
ప్రజాక్షేమమే ఆయన ఊపిరిగా జీవించిన వైద్యుడాయన.
గుడిసె పీకి వేస్తుంటే
అడ్డు పడిందెవరయ్యా?
..........................................
కనిపించిన ప్రతి రోగి
కన్న బిడ్డ కాదట్రా?
తన మన అంతరమేదీ?
తనువే మనకీ లేదా?
డా.రాం వైద్యులకే కాక ఒక మానవుడిగాను మనకొక ఉదాహరణగా నిలబడడం లో వింతేముంది?
ఇంద మల్లె పువ్వు
ఇదో గులాబీ పువ్వు
మొదటి దశని మనసు
తుదటి గుండె దిణుసు
..(కె వి యార్)...
మరి మనం కూడా ఆ ప్రజావైద్యుడికి ఒక మల్లె పువ్వును ఒక గులాబీ రేకును ... సమర్పించకుండా ఉండగలమా? సగౌరవం గా.
సవినయంగా.
***
డా.రామ్స్ సావనీర్
ప్రచురణ :
21.1.1998
డా.పి.వి .రామచంద్రారెడ్డి కాం స్య విగ్రహ స్థాపన కమిటీ,విశ్వోదయ క్యాంపస్ ,
కావలి -524201
డా.రామ్స్ సావనీర్ ఆవిష్కరిస్తున్న డా.కుప్పావెంకటరామ శాస్ర్తి, ఎన్.శంకరన్, ప్రొ.శేషాద్రి *** |
All rights @ writer. Title,labels, postings and related copyright reserved.