Feb 10, 2010

పట్టులంగా పిప్పరమెంట్లు :-)

ఇప్పుడే జరిగినట్టుంది.
అదే మొదటి సారి పట్టులంగా కొనుక్కోవడం.
బడి  తెరవగానే, ఎప్పటి లాగానే అమ్మ ఆకులచౌరస్తాలోని "పొర్లా" దుకాణం లో,బడికి వేసుకోను ఆకుపచ్చ ,తెలుపు బాంబే డైయింగ్ యూనిఫార్మ్ తో పాటే కొన్నప్పటికీ , రోజటి వరకు వేసుకోకూడదనుకొన్నా.
ఇదీ ఆకుపచ్చదే .ముదురాకు పచ్చ.మిరప పండు రంగు బోర్డరు మీద హంసలబారు జరీనేత.ధర్మవరం పట్టు.మిల మిల మెరిసి పోతూ ఎంత ముచ్చటగా ఉండిందో.
ఏమైనా మాటంటే మాటే!

<   8.2.1979  > బడి తెరవడం, వినాయక చవితి, రాఖీ,దశరా ,దీపావళి ..అయిపోయాయి. సంక్రాంతి కూడా వచ్చి పోయింది.
అందరూ చక్కగా బుట్టల చేతుల జాకెట్లతో పట్టు లంగాలేసుకొని గున గున తిరుగుతున్నా , నేను మాత్రం గట్టిగా పట్టు బట్టి కూర్చున్నా.ఈ పూటే వేసుకొంటానని.
దశరా పండగ రోజు మిరపపండు "బాబీ" రిబ్బన్లు, సంక్రాంతి పండగ రోజు "అడివి రాముడు" గాజులు కొనిచ్చుకొన్నా.
ఎదురు చూసినంత సేఫు పట్టలేదు .
ఈ రోజు వచ్చేసింది. అప్పుడు నేను ఏడవతరగతిలో ఉన్నా. మొదటి సారి పబ్లిక్ పరీక్షలు. బడిలో అందరి దృష్టీ మా తరగతి పైనే . అందరు తెలుగు మీడియం పిల్లల్లాగే, ఇంగ్లీషు పరీక్ష అంటే , భలే బెరుకు గా ఉండేది.
ఇక, మా ఇంగ్లీషు సార్ సంగతి సరేసరి. వారు ఇంగ్లీషు ఎంతో  బాగా చెప్పేవారు. అయితే,
మమ్మల్ని ఇంగ్లీషులో మాట్లాడమనే వారు. ప్రతి తరగతిలో అంత అల్లరి చేసే వారమా.. ఈయన గదిలో అడుగు పెట్టగానే బుద్ధిమంతుల్లా పుస్తకాల్లోకి తలలు వాల్చేసి కూర్చునే వాళ్ళం.
ఆ రోజు వారిదే మొదటి క్లాసు.
ఎంత తొందరగా వద్దామనుకొన్నా.. తలంటుకొని,   చిక్కులు తీసుకొని ,జడలేసుకొని (అవన్నీ మా అమ్మే చేసినా , నేను తెగ ఆయాసపడి)..  దార్లో కొన్ని పిప్పరమెంట్లు మరికొన్ని చాక్లెట్లు కొనుక్కొని,
( పిప్పరమెంట్లు ఒట్టి ఫ్రెండ్స్ కి చాక్లెట్లు గట్టి ఫ్రెండ్స్ కీ అన్న మాట)
 బడి దగ్గరికి వచ్చేసరికి , “జన గణ మన”   వినబడుతోంది.
పరిగెత్తుకెళ్ళి పిల్లల వరసల్లో కలుద్దామా అంటే, ముందరి కాళ్ళకు బంధంలా పొడుగు లంగా.అందులోనూ కొత్తదీ. పట్టుదీ.
అడుగులో అడుగేసుకొంటూ వెళ్ళే సరికి , మా ఇంగ్లీషు సార్, నేను ఒకే సారి  క్లాసులో అడుగు పెట్టాం.ఆయన ముఖం చూడగానే పై ప్రాణాలు పైననే పోయాయి. చాలా కోపంగా ఉన్నారు. వారి చేతిలో దిద్దిన ప్రి ఫైనల్ ఇంగ్లీషు పేపర్ల కట్ట. 
అపర్ణ మెల్లి గా చెప్పింది."మార్కులు ఇస్తారంట". ఎక్కడి వారమక్కడ బిగుసుకు పోయి కూర్చున్నాం.
నా సంచిలో చాక్లెట్లూ పిప్పర్మెంట్లూ.
నేనొక్క దానినే యూనిఫార్మ్ వేసుకోనిదీ. పండక్కో పేరంటానికో తయారయినట్లు..వద్దంటే అమ్మ తలలో పెట్టిన మద్రాసు కనకంబరాలు మరువం మాల.
ఒక్క సారిగా భయం వేసింది.
సార్ లేచి నిల్చోమన్నట్లు సైగ చేసారు. బిక్కుబిక్కు మంటూ నిల్చున్నా.
ఆయన నింపాదిగా ఒక వాక్యం చెప్పి, దాని మరో టెన్స్ లోకి మార్చమన్నరు. చెప్పాను. మరోదాంట్లోకి . మరో వాక్యం .మరొక టెన్స్.ఎన్ని తప్పులు చెప్పానో తెలియదు. ఆయన అడుగుతూనే ఉన్నారు .నేను నాకొచ్చింది చెపుతూనే ఉన్నా.ఒజిమాండియాస్” పద్యం ఒప్పజెప్పమన్నారు. “స్టాపింగ్ బై వుడ్స్” నుంచి ప్రతిపదార్థాలు గడ గడ చెప్పమన్నారు.
వళ్లంతా చెమట్లు.  "సిట్ డౌన్ " హమ్మయ్య "ఆన్ ద బెంచ్ " కాదు కదా
.కూర్చునే లోపలే ..బెల్లు మోగింది.
 ఇంటర్వల్ లో ఆఫీసు లోకి రమ్మని చెప్పి, కోపంగానే వెళ్ళి పోయారు.వెళుతూ వెళుతూ  అన్నారు. "రంగు రంగు ల బట్టలు వేసుకోవడమే కాదు. కాస్త పాఠాలూ చదువుతూ ఉండాలి."
అసలీ  చిక్కంతా ఫిబ్రవరి లో ఉన్నది.మా తరగతి లో నేనూ శశి కిరణ్  మాత్రమే సంక్రాంతి సెలవల తరువాత పుట్టింది.
 అంతే కాదు, అందరు 69 వారయితే , మేము 70 వారం.ఏడాదీ మారి పోవడంతో...అందరికన్న చిన్నవాళ్ళంగా తెగ ఫీలయి పోయే వాళ్ళం.
అపర్ణ మరీను. అక్టొబరులో పుట్టింది. వీలయినప్పుడల్లా పెద్దక్కలా వ్యవహరించేది.
 మనలో మాట, అందరికన్నా చిన్నవాళ్ళగా ఉండడం ఎంతైనా బావుంటుంది కదా?
ఇక, భయం భయం గా ఆఫీసుకు వెళ్ళే సరికి అక్కడ సుమన్ కాక, స్కూలు కరస్పాండెంట్, కూర్చుని ఉన్నారు.పక్కనే ఇంగ్లీషు సార్.
పై ప్రాణాలు పైననే పోయాయి. కాకా ఒక కాగితం తీశారు. దాని మీద నా సంతకం పెట్టమన్నారు.
నాకు ఎన్నేళ్ళని ఇంగ్లీషులో అడిగారు.
 చప్పున చెప్పేద్దును. కానీ, నాకు ఎలెవెన్ అనాలో లెవెన్ అనాలో  ఎప్పుడూ సందేహమే. పై నుంచి ,మా ఇంగ్లీషు సారు ఎక్కడ ఆ స్పెల్లింగ్ అప్ప జెప్పచెప్పమంటారో అనీ చచ్చేంత భయం వేసింది.ఎవరో తరిమి నట్టు, “పదకొండు” అన్నా .
“ అయితే ఏడో తరగతి పరీక్ష రాయకూడదు.” నవ్వారాయన.
నా కళ్ళళ్ళో నీళ్ళు కుక్కుకొని బిత్తరపోయి నిల్చున్నా.
 “ఒక ఏడాది కలిపేసాం. లేక పోతే పదో తరగతి లోనూ ఇలాగే అవుతుంది. "ఆ ఒక్క ముక్కా చెప్పి ఇక వెళ్ళమన్నట్లు సైగ చేశారు.
పరుగో పరుగు!
పట్టులంగా పైకి ఎత్తి పట్టుకొని!
ఆఫీసు గదికి రమ్మన్నారంటేనే అల్లరి పిల్లలని అర్ధం. ఇక , మా తరగతి పిల్లలంతా ఏమైందబ్బా అంటూ  బిల బిలా నన్ను చుట్టు ముట్టారు.
ఇంగ్లీషు మాష్టరు మళ్ళీ పిలిచారు. చేయి చాప మన్నారు. నా కళ్ళంతా టేబులు మీద నున్న కర్ర స్కేలు మీదే.ఆయన ఆ పక్క నున్న ఎర్రకలం తీసుకొన్నారు. నా చేతిలో పెట్టారు.  మెల్లిగా అన్నారు,
 "పరీక్షలు రాయడానికి ఉపయోగం గా ఉంటుందనీ..."
భయంతో ఎప్ప్డుడు బయటికి వచ్చానో తెలియదు. ఆ ఎర్ర కలం  చాన్నాళ్ళు
 నాతోనే ఉంది. అదే నా మొట్టమొదటి బాల్ పాయింట్ పెన్ను.

నాకొచ్చిన నాలుగు ఇంగ్లీషు ముక్కలతో,
 మా తరగతిలో అందరికన్నా రెండో రెండున్నరో మార్కులు ఎక్కువే వచ్చాయని తరువాత తెలిసింది.
కానీ , ఆ పూట నుంచి పట్టులంగాలతో బడికి వస్తే ఒట్టు.
అలాగే,  ఆ పై మా అపర్ణ చిన్న చెల్లి అయిపోయింది!
తరగతి లో చిన్న వాళ్ళలా మా తరగతి లో గారాలు పడే అవకాశమే రాలేదు !  నాకూ శశికిరణ్ కూ!
పై నుంచి ,  ప్రతిఏడూ,  అందరికన్నా మావే  మొదటి పుట్టిన రోజులు !
తేదీని వారు తేలికగానే మార్చారు ,కాని ఒక ఏడాది భారాన్ని మోస్తూనే వుండాలిగా!
ఒక సంఖ్య ను మార్చేస్తే ఇన్ని మార్పులా?
10-2-10


***
All rights @ writer.
Title,labels, postings and related copyright reserved.

14 comments:

  1. మీ పట్టులంగా చాలా బావుంది.

    అందరి కంటే చిన్న వాళ్ళుగా ఉండటం మనం ఎంత పెద్దయినా బాగానే ఉంటుంది.

    పుట్టినరోజు శుభాకాంక్షలు! పిప్పరమెంట్స్ పంచారా ఇంతకీ!

    ఒజీమాండియాస్ మా అక్క చదువుతుంటే కుతూహలంగా పక్కన కూచుని చూసేవాళ్లం. కాళ్ళు సగానికి విరిగిన ఆ చక్రవర్తి ఫొటో ఇంకా గుర్తుంది ఆ టెక్స్ట్ బుక్ లో!

    ReplyDelete
  2. పుట్టినరోజు శుభాకాంక్షలండీ.....
    మరి ఈ రోజు మీ ఇంట్లో గుత్తొంకాయ కూర వండారా? :-)

    ReplyDelete
  3. మీ టపా చదువుతున్నంతసేపు మనసు హాయిగా ఉంది.
    శుభాకాంక్షలండీ!

    ReplyDelete
  4. అహ్హహ్హ!
    మా వాళ్ళంతా నిన్న అర్థరాత్రి హడావుడిగా ఫోన్ చేసి, "ఇక నుంచి ఈ రోజు మన ఇంట్లో వంకాయ డే "అని ప్రకటించేసారు..:-))
    వారి వారి ఇళ్ళల్లోనూ ,ఇక ప్రతి ఏడాదీ ఈ పూట వంకాయే వండుతారట!
    ఈ పూట నన్ను పలకరించిన వారందరికీ చాక్లెట్లూ పిప్పరమెంట్లూ కాకుండా ,తలా ఒక వంకాయ ఇవ్వాలట!
    అరరే ,పలకరించిన పాపానికి ఇదేమిటని పారిపోయేరు!
    ఆగండాగండి !
    మీ అభిమానానికి అనేక ధన్య వాదాలు.
    అన్నట్లు,నా పేరు చెప్పుకొని ఒక పిప్పరమెంటయినా తినేయ కూడదూ...ప్లీజ్ :-)

    స్నేహంతో ..చంద్ర లత

    ReplyDelete
  5. many happy returns of the day :)

    ReplyDelete
  6. పుట్టిన రోజు శుభాకాంక్షలండి .

    ReplyDelete
  7. చంద్రలత గారూ,
    ముందుగా పుట్టినరోజు జేజేలు మీకు :) ఇంకా.. మీ చిన్నప్పటి జ్ఞాపకాలు బావున్నాయండీ.! యాదృచ్చికంగా మీరు చెప్పినవే రెండు సంఘటనలు నా జ్ఞాపకాల్లోనూ ఉన్నాయి. ఒకటి వయసు సరిపోదని ఏడో తరగతిలోనే రెండేళ్ళు ఎక్కువ వేసెయ్యడం :( :(, మరోటి, తొమ్మిదో తరగతిలో ఇంగ్లీషు మాస్టారు క్లాసు ఫస్టు వచ్చినవాళ్ళకి (అంటే.. నాకే అన్న మాట ;) బహుమతిగా ఐదున్నర రూపాయల రేనాల్డ్స్ పెన్ను ఇవ్వడం :) :). మీ పోస్టు చదవడంవల్ల నా జ్ఞాపకాల దొంతర కూడా కదిలింది. ధన్యవాదాలు.

    ReplyDelete
  8. పుట్టిన రోజు శుభాకాంక్షలు చంద్రలత గారు. మీ పేరు చెప్పుకుని నేను నాలుగు చాక్లెట్స్ తిన్నా. అవును మమ్ములను పిప్పరమెంట్ లు తినమన్నారు అంటే మేము వుట్టి ఫ్రెండ్స్ మే అన్నమాట గట్టీ ఫ్రెండ్స్ కాదు :-( ఐనా మేము గట్టి అనుకుని చాక్లెట్స్ తిన్నాము లే. :-)

    ReplyDelete
  9. హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలండీ.. యెంత యాద్రుచ్చికమో కదా.. ఉదయమే 'వివర్ణం' చదివాను కాసేపు..

    ReplyDelete
  10. జన్మదిన శుభాకాంక్షలండీ ....పిప్పరమెంట్ తినలేదు కాని ఈరోజు మాది గుత్తొంకాయ కూరే :) :)

    ReplyDelete
  11. chandra garu

    Many many happy returns of the day.

    ReplyDelete
  12. మీ అభిమానానికి ధన్యవాదాలండి.

    చిన్నప్పుడు ఏమనుకొన్నానో అదే రాశా.
    ఇప్పుడేమో ఎక్కడైనా పిప్పరమెంటు దొరుకుతుందా ..అని ఆశ!

    మరొక మారు మా బడిలో
    పుట్టినరోజు జరుపుకుంటున్నట్టుగా ఉంది.
    మీ మాటలు చదువుతోంటే.

    స్నేహంతో..చంద్ర లత

    ReplyDelete
  13. చంద్రలత గారు సరదాగా ఉంది మీ పోస్టు. బీటీ మీద సాధించిన విజయానికి జయహో! జయజయహో!!
    పిప్పరమెంట్లు మొన్నోసారి ప్రసాద్స్ ఐమాక్సులో క్యాండీ బండి వాడి దగ్గర చూశా. బోలెడన్ని రకాలు పెట్టాడు. ధరలు కూడా ఐమాక్స్ ధరలు.
    పుట్టినరోజు శుభాకాంక్షలు.

    ReplyDelete
  14. పిప్పర్ మెంట్ తినీ తినగానే మంచినీళ్ళు తాగితే.. ఆహా! భలే ఉంటుంది :-)
    అంత మంచి ఫీలింగ్ మళ్ళీ గుర్తుచేసినందుకు మీకు ధన్యవాదాలతో పాటు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు :-)

    ReplyDelete