Oct 11, 2009

బట్టలోయ్ బట్టలు..!

బట్టలోయ్ బట్టలు.!

తట్టలు తట్టలు...బుట్టలు బుట్టలు...గుట్టలు గుట్టలు.

బట్టలండీ బట్టలు...!

మంచిది.

వరద... బురద...

ఊరినీ వాడనూ .ఇంటినీ వంటినీ...ముంచెత్తాక,కట్టుకోవడానికి కప్పుకోవడానికి ఓ బట్టల జతో ఒక బట్టల మూటో...ఇవ్వాలనుకోవడం

ఎంత సహృదయత...మరెంతటి మానవస్పందన... ఎంత మంచి తనం...!

అసలు బతికి బట్టకట్టారంటే ఇక గండంగడిచినట్లే . అందుకేగా మంచికీ చెడుకు ఇంటికి పిలిచి ఒక పూట భోజనమైనాపెట్టి ,ఒక నిద్ర చేయించి మరీ కొత్త బట్టలు పూలు పండ్లతో ఆకువక్కలతోఒడినింపుతుంటాం.

ఎంత లేమిలోఉన్నా కనీసం ఒక రవిక గుడ్డ పెట్టడంమన ఆనవాయితీ.ఇంతకూఅంతకూ శాలువాల సన్మానాల సంగతి సరేసరి.

అదిసరే, ఇప్పటి సంధర్భం వేరు.

అన్నీ ఉండీ ..ఉన్నపళాన ఏమీ లేనివారైన ఆపన్నులను ఆదుకోవడానికిమనం బట్టలు పంపుతున్నాం.

ఎవరికి తోచిన రీతిలో వారు బట్టలు అందించాలని చేయని ప్రయత్నంలేదు.బట్టల సేకరణకు చేయని విన్నపాలు ..పాటించని పద్దతులులేవు.ఇంతకు అంత ఇస్తామని ఒకబట్టల దుకాణం వారే డబ్బు చెల్లించిమరీ బట్టలు సేకరిస్తున్నారు.డిసిఎంవ్యానుల్లో లారీల్లో కంటైనర్లలోనూ బట్టలవరద ముంచెత్తుతోంది.

మొన్నాదివారం మా అనుభవమే చెపుతా.

నాలుగో తేదీ ఉదయం సుధగారింటికి వెళ్ళేటప్పటికే వారు అన్నివిధాలుగా సిధ్ధంగా ఉన్నారు.

అప్పటికి మా ఊరి ఆచూకే తెలియదు, అయినా ,అయ్యేదేదో అవుతుందనిప్రయాణమయ్యాం. బీచుపల్లి వంతెనమీదుగా మూడుగంటల్లో చేరగలిగిన మావూరు చేరడానికి ..సుమారు పన్నెండుగంటలు పట్టింది. ఈ క్రమంలో,అందించిన కొత్త దుప్పట్లను తీసుకొంటూ వారు,ముఖ్యంగా స్త్రీలు,అడిగింది వారి.. వంటిని కప్పుకోను ఒకచీర.

వంటి మీదది మార్చుకోనుమరోకటి లేదని వారు చెప్పినా చెప్పకపోయినా తెలుస్తూనే ఉన్నది.

వారు సేకరించి తెచ్చిన బట్టలలో అనేకం.

ప్యాంట్లు చొక్కాల వలన మగ వారికిఇబ్బంది లేదు కానీ, ఆడవారుఅప్పటివరకు కట్టే చీరలు తప్ప మిగిలిన ఆధునిక వస్త్రాలన్నీ ..తీసుకున్న వారుతీసుకొని..చివరికి మార్పిడి చేసుకోవడమో అమ్మకానికి పెట్టడమో..కుప్పలు వేయడమో జరిగింది.

నిన్నసాయంత్రం అక్కడి నుంచి వచ్చినసమాచారం ప్రకారం ..బట్టలు రోడ్డుపక్కన బురదలో కుప్పలు పడిఉన్నాయనీ..వచ్చే లారీ వస్తోందనీతెచ్చే బట్టలు తెస్తోందనీ ఇచ్చే వారికేఇస్తోన్నారనీ తెలిసింది.

సహృదయులకు ఒక విన్నపము.

అక్కడి వారు మన లాంటి వారే. వారొక విపత్తున పడ్డారు. అల్ప, మధ్యఆదాయ వర్గాలకుచెందిన వారు.పరువు మర్యద కలిగిన. ఒకరు కట్టి విడిచిన బట్టకు చేయి చాచవలసిన పరిస్థితిని ఎవరూ ఆశించరు.చిరిగినవీ.. ఇంటిలో అడ్డంగాపడిఉన్నవీ.. వారి అలవాటుకు భిన్నంగా ఉన్నవి ఎంత ఖరీదైనవైనా..ఎలా ఉపయోగపడతాయంటారు?

అనకూడదు కాని, అమెరికా నుంచి బట్టలు వస్తున్నాయంటే.. మా బాలమణి అనింది కదా..

" యమ్మ.. నా క్యా గుడ్డలొద్దు..పులూజొరమొస్తదంటగాదూ (స్వైన్ ఫ్లూ)? ".అని!

నీకెలా తెలుసన్నా.

"నాకన్నీ తెల్సు పోమ్మా.. గా పొద్దు టివి లల్ల మస్తుజెప్పలే..అమెరికోల్లు ఎవ్వరొచ్చినా దూరం బెట్టమనీ.!వాల్లు పంపిన గుడ్డలెట్లేసుకుంట? కట్టిడిసిన గుడ్డలుల్ల యా రోగాలుండవో..!పోమ్మా పో..!"

మా బాలమణి భయం కూడా ఆలోచించవలసిందే. మనం అందిస్తున్నబట్టలన్నీ అంటువ్యాధులురాకుండా..disinfectants తో ట్రీట్ చేసి ఇవ్వగలిగితే మంచిది.

ఇక, మా కొరివిపాడుకు వెళ్దాం.ప్రఖ్యాత గద్వాల్ చీర ధరించని తెలుగు నారులున్నారా? ఆ అందమైన చీరల మగ్గాలన్నీనీటమునిగాయి.

కొరివిపాడు చిన్న వూరు.అక్కడి నేతవారు గద్వాల్ వారితో ఒప్పందంతో చీరలు నేసి పెడతారు. ఒక్క వూరిలోనే సుమారు

పాతిక పైగా సన్నకారు నేతవారు జీవనోపాధి పోగొట్టుకొన్నారు.వారికి బట్టలవైనాలన్నీ తెలుసండోయ్!

సంధర్భంలో , వారికి అందించే బట్టలు చేనేతవైతే పరోక్షంగా నేతవారికి జీవన భృతి కల్పించినట్లేకదా?

పనిని అంతటి హడావుడిలోనూ ...అనుకున్న గమ్యం చేరగలమో లేదో తెలియని అయోమయంలోనూ..ఎక్కడా రాజీపడకుండా ..చేనేత వస్త్రాలనే పెద్దేత్తున అమర్చి..అందచేసిన చావా సుధా రాణి గారి ముందుచూపుకు జేజేలు. వారికి నిధులు చేకూర్చినా తానా వారికి,మీడియామిత్రులకూ ,ప్రభుత్వశాఖలవారికీ.. అభినందనలు.

మాప్రాంతం వారి తరుపున ధన్యవాదాలు.

PS: ఆడవారిలో గర్భిణులు ఉన్నారు.బాలింతలుఉన్నారు.వారి అవసరాలు మరింత సున్నితమైనవి.సానిటరీ న్యాప్ కిన్లు వాడే అలవాటు వారిలో చాలామందికి లేదు.వారికి తెలియనే తెలియదుకూడా. గమనించగలరు.

All rights @ writer.
Title,labels, postings and related copyright reserved.

4 comments:

 1. చంద్రగారు, మంచిపని చేస్తున్నారు. బట్టలు పంపేవారు కాస్త చూసి పంపాలి.ఇంట్లో పనికిరానివి,పనిమనిషికూడా తీసుకోనివి పంపిస్తున్నారంట. ఈ వరదల్లో సర్వం కోల్పోయినవారికి కనీసం మంచిబట్టలు, అవసరమైన వస్తువులు పంపిస్తే మంచిది.

  ReplyDelete
 2. "పరువు మర్యాద కలిగిన, మధ్య తరగతి వారు ఒకరు కట్టి విడిచిన బట్టలకు చేయి చాచవలసిన పరిస్థితిని ఎవరూ ఆశించరు."
  -ఇప్పుడే హిందు దినపత్రికలో చదివాను. వరద బాధితులకు అట్టపెట్టెలలోంచి తీసి పాత బట్టలు ఇస్తుంటే వారు కళ్లనీళ్లపర్యంతమవుతున్నారని. ఈ వరదలు బీదా బిక్కీ, మధ్యతరగతివారిని సమం చేసింది. ఇలా పాత బట్టలు సేకరించి పంపినవారిలో నేనూ మా మిత్రులమూ ఉన్నాము. మా సేకరణలో దుప్పట్లు, డిండు గలీబులు చీరలు, లంగాలు, నైటీలు లాంటి దుస్తులు కూడా ఉన్నై. మీ టపా ద్వారా అవి ఉపయోగపడకలవని తెలుస్తోంది. 10 జతల చెప్పులు (ఆడవారికి, మగవారికి, పిల్లలకు) చెప్పుల షాపులో కొంటే దుకాణం వారు, వాటిని వరదబాధితులకు పంపిస్తున్నామని తెలుసుకుని అడగకుండానే రాయితీ ఇచ్చారు. వేరుశనగ పప్పులు వేయించి సీసాలో పోసి పంపాము, తక్షణ శక్తి కోసం. ఇవి కాక వంట పాత్రలు,కంచాలు, గ్లాసులు, చిన్న పెద్ద పరిమాణంలో ప్లాస్టిక్ డబ్బాలు, వంటనూనెలు, కారాలు, బిస్కట్లు, పచ్చళ్లు పంచటానికి వీలుగా ఉండేలా చిన్న పాలిథిన్ సంచులలో వేసి పంపాము. స్నానానికి, బట్టలు శుభ్రం చేసుకోవటానికి పలు రకాల సబ్బులు కూడా మేము పంపాము. వరద బాధితులకు సహాయం చేసే విషయంలో జరిగే పొరబాట్లు అనుభవంలో తెలుస్తాయి.

  ReplyDelete
 3. @జ్యోతి
  ఎంతైన పల్లీయులం కదండీ?అందునా అక్కడికి వెళ్ళి వరదలో బురదలో వాళ్ళతో రెణ్ణాళ్ళు గడిపి వచ్చాక, మానవగౌరవం అన్నది ఎంత ముఖ్యమో అర్ధం అవుతున్నది.
  ఎంతటి ఉద్వేగం కలిగిందో...!
  నేనేమీ చేయ లేక ..ఈ నాలుగు మాటలు మీతో పంచుకోంటున్నాను. నేనూ ఆ ఊరిలోనే ఉండవలసిన దానిని..ఆ పరిస్థితి నాకైనా ఎదురై ఉండేది అన్న ఆలోచన .. ఎంతలా కుదిపివేస్తుందో ..మీరు ఊహించ గలరు.

  @cbrao
  మంచి పని మొదలు పెట్టాలే గాని, మనిషికి మనిషి తోడు అని మీ అనుభవం మరో మారు చెప్పకనే చెపుతున్నది.కదండీ.

  ముఖ్యంగా, అక్కడి పంటపొలాలు ప్లాస్టిక్ తదితర వ్యర్ధాలమయం కాకుండా కూడా మనం ఒక కన్నేసి ఉంచాలి.

  ReplyDelete
 4. very true.
  THat's why such rehabilitation efforts need to be implemented only through organizations experienced in doing that.

  ReplyDelete