Oct 6, 2009

ఆపన్నులను కలిశాక

జరిగిన ఉత్పాతంలో చేయూత ను అందించాలని ముందుకు వస్తోన్న వారు మా ప్రయాణం లో చాలామంది తారస పడ్డారు.వారికి వచ్చిన నష్టం కష్టం ఏ ఒక్కరో ఆర్చేదీ తీర్చేదీ కాకపోవచ్చు .కానీ .. కొంత తాత్కాలిక ఉపశమనాన్నైనా ఇవ్వగలుగుతోంది.మనిషికి మనిషేగా తోడు.

మేము కలిసే వరకూ ఆ వూరికి ఏ ఒక్క బాహ్య సంబంధాలూ లేవు. అధికార పర్యటనలూ లేవు.
సమీప గ్రామాల ప్రజలే ..ఉన్నంతలో ఆదుకొంటున్నారు. దారులు కొంత సర్దుకోగానే .. వారికి నీరు,ఆహారం చేరుతున్నాయి. ఎవరో సహృదయులు పెద్ద మొత్తంలో హైదరాబాదు లోనే వండి పంపిన ఆహారం అలంపూరు ఆపన్నులను చేరేటప్పటికి పూర్తిగా పాచిఫోయింది.ఆశగా వారి వద్దకు చేరిన అన్నార్తులు నిరాశగా వెనుతిరిగారు.భోజనం బురదపాలయ్యింది.
అక్కడి వారికి సాయం చేయాలనుకొనే వారు...ఈ విషయం గమనించాలి.
వారికి అందించే ఆహారం..పొడిదై ఉంటే బావుంటుంది. నిలవచేసుకొనేది గా ఉంటే బావుంటుంది. నీటి పొట్లాల సంచులు చేరుతున్నాయి. గొంతుతడుపుకోవడానికి అప్పటికప్పుడు ఒక్క గుక్కకు తప్ప నిలవ చేసుకోవడానికి వీలులేదు. ప్లాస్టిక్ వ్యర్ధం మరొక సమస్యగా కాకుండా చూసుకోవాలి.క్యాన్లలో ,ట్యాంకర్లలో నీరు చేర్పించగలిగితే బావుంటుంది.వారికి కడవలు ,బిందెలు,ఇతర నీటిపాత్రలు అందిచగలిగితే మరీ మేలు.వారి వద్దనున్న పాత్రలలో నిలవ చేసుకోవచ్చును.
మనుషులవీ, పశువులవీ శవాలు కొట్టుకు వస్తున్నాయి.
విరిగిన చెట్లు తెగిన కర్రెంటు వైర్లు , మొలకెత్తిన ధాన్యాలు,విత్తనాలు ,నీరైన ఎరువూ, పురుగుమందులు ...అన్నీ అంతా ..బురదలో కలిసి పోతున్నాయి.
రోగాలు వ్యాప్తి చెందక మునుపే.. కనీసం బ్లీచింగ్ పౌడర్ అందితే చాలునని వారు అడిగారు.దానితో పాటుగా ,ఇతర అంటువ్యాధినివారణరనా చర్యలు ముమ్మరం కావాలి.
వంటసామాగ్రితో పాటు ఇంటికి సంబంధించిన సమస్త సామాగ్రి నీటిపాలయ్యాయి. వంటపాత్రలు,చాపలు ,గొంగళ్ళు , లాంతర్లు, బుడ్లు,కిరసనాయిలు,బ్యాటరీలైట్లు మొదలైనవి.. వారికి ఉపకరం కాగలవు.
దొంగల భయం ఎక్కువగా ఉన్నది. బలం ఉన్నవారే ..అందుతోన్న ఆహారాన్ని ఇతర పంపిణీని దౌర్జన్యంతో చేజిక్కించుకొంటున్నట్లుగా తెలిసింది,కొన్నికొన్ని చోట్ల.
ముఖ్యం గా, సహయక బృందాలు పగలు చెరుకొంటున్నాయి. సహాయక కేంద్రాలు మెరక పల్లెలలోఉన్నాయి.అదే సమయం లో వరదబాధితులులోతట్టున ఉన్న తమ తమ ఇళ్ళకు తిరిగి వెళ్ళి కొంపాగోడు ..చూసుకుంటున్నారు.
సాయంత్రానికి గాని తిరిగి సహాయక కేంద్రాలకు రావడం లేదు.చేయవలసిన సాయం అన్యాక్రాంతం కాకుండా చూడడమే అక్కడ ఒక పెద్ద ఇబ్బంది గా కనబడుతున్నది:(

2 comments:

  1. ఆపన్నులకు సాయం చేయాలనుకోవడం అభినందనీయం. అన్యాక్రాంతం కాకుండా చూసుకోవడం ఆ ఆపన్నుల చేతిలొనే ఉంది.

    ReplyDelete
  2. సర్వం పోగొట్టుకొన్నవారికి ..స్వార్థం మూటగట్టుకొన్న వారికీ ..నడుమ ..చాలా సన్నటి విభజన రేఖ ఎల్లప్పుడూ ఉంటుంది కదండీ? కొంప కొల్లేరై పిల్లపాపలతో నిస్సహాయంగా నిలబడిన వారికి..ఈ బాధ్యతను కూడా అప్పగించాల్సిందేనా?

    ReplyDelete