తుంగభద్ర ఒడ్డున మా వూళ్ళన్నీ నీళ్ళ సంద్రమైపోయాయి.
పొలాలన్నీ గట్టులు తెగిన చెరువులయ్యాయి. పంటావంటా తంటాల బడ్డాయి.ఇళ్ళూ బళ్ళూ గుళ్ళూగోపురాలు మునకేసాయి. మనుషులందరూ ...అరచేతుల్లో ప్రాణాలు పెట్టుకొని ..పిల్లామేకా తట్టబుట్టలతో సహా ..గట్టున పడే ప్రయత్నం చేస్తున్నారు.
అరరే.. అక్కడొక పిల్లవాడు చంకనెక్కిన మేకను జార విడుచుకొన్నాడే.. దాని వెనకే వెడతాడేమిటి?
కాలు జారేను..బాబూ..భద్రం..!
ఇదుగోండి..ఇతనేమిటీ ..ఎంత చెప్పినా ఆ ఎద్దు పగ్గం వదలడే..దానితో పాటూ కొట్టుకు పోదామనే..!
అయ్యయ్యో ..తల్లీ.. చంకలో బిడ్డనెలా చేజార్చుకొన్నావమ్మా..!?!
ప్చ్.
అదుగో.. అక్కడో ఇంటి కప్పు తేలి వస్తోంది.ఆ కప్పు కింద ఎన్ని ఊసులు పంచుకున్నారో ... ! కాదు.. కాదు ...ఆ కప్పు ఆ వూరి బడిది ...పిల్లల పాఠాలతో మోగిపోయేది.
అదేమీ కాదండీ.. అది పశువుల పాక పై కప్పు.చూడండి...ఆ చిక్కం ఎలా ఎగిసిపడుతోందో ..నీటి వలయాల్లో.
మీరు పొరబడ్డారు..అది చావిడి కప్పు. అది చావిడి కప్పు. ఏ జీతగాడి కుటుంబం తలదాచుకొనేదో..!
ఆగండాగండి.
అదుగో అక్కడ .. ఆలోచనల వాగు తెగి పడుతోంది.
"మన పొలం ఏ పాటి.. ఏ మాత్రం పరిహారం గా అందొచ్చు?"
"అసలే కొత్త ప్రభుత్వం.దిగుల్లేదు...ఆపై అల్లకల్లోలం..కావసినంత ..కాసులవర్షం..చూస్తూ ఉండండి."
సర్లెండి..
ఉన్నదంతా ఊడ్చుకు పోయాక చూసేదేమిటీ..చేసేదేమిటీ?
హైదరాబాదులో కూర్చుని వేడి వేడి రేడియో కబుర్లు చెప్పుకోక..!
గాంధీగిరి ఉత్సాహంగా జరుపుకోక..!!!
అవునండోయ్.. అన్నట్లు ఇవ్వాళ గాంధీ జయంతి. పదండి..
ఏటి ఒడ్డున ..నీటి మాటున .. కూటికీ నీటికీ వెంపర్లాడుతూ..ప్రాణాలరచేతిన పెట్టుకున్నవే ..ఆ పల్లెలకు..!
No comments:
Post a Comment