Oct 30, 2009
అట్ల బోయి
Oct 27, 2009
ఆ రెండూ
Oct 24, 2009
నవల అంటే
*** " నావ"ల ..నవల ***
మనకు తెలిసిన నవల 14 వ శతాబ్దపు ఇటలీ దేశ "నావెల్లా "లో మూలాలు ఉన్నట్లుగా సాహితీచరిత్రకారులు చెపుతున్నటికీ , భక్తిన్ మరింత వెనక్కి వెళ్ళి నవల మూలాలు జానపదం లో ప్రారంభమై వ్యవసాయ సమాజాలలో స్పష్టపడ్డాయని భావించారు.
వ్యవసాయం తో కుదుట పడ్డ మానవ సమాజం నవలకు ఒక నేపధ్యమై ,14 వ శతాబ్దం నాటికి అక్షరబద్దం అయ్యింది.
Boccassio రచించిన Decameron (c.1349-51,Italy) ఆనాటి యురోపు సాహితీకారులపై ప్రభావాన్ని చూపింది. కాల్పనిక యుగం చివరి వరకు ఈ ప్రభావం కొనసాగింది. శృంగార వీర గాథలతో ఊహాలోకాల్లోకి విహరిస్తున్న నవలను వ్యంగ్యాస్త్రాలు వేస్తూ నేలకు దింపింది "Cervates" రచించిన "Don Quixito".(1605,1615,spain)
యూరోపియన్ కల్పనా సాహిత్యంపై చూపిన ప్రభావం మన “బారిష్టర్ పార్వతీశం” దాకా కొనసాగింది.
సరిగ్గా అప్పుడే ప్రారంభమైన పౌర గ్రంథాలయాలు , పెరుగుతోన్న అక్షరాస్యత , స్త్రీ విద్యలతో ... నవల సామాన్యుల సాహిత్యం గా అందివచ్చింది. నవలలోని సరళ భాష ,స్పష్టమైన భావన, సామాన్య పాత్రలు ...వారిని నవలకు దగ్గర చేసాయి.
"Robinson Crusoe"(Daniel Defoe,1719) నవలతో యూరోపియన్ నవల ఒక కొత్త కల్పనామయ జగత్తును .. నావికాయాన సాహాసాలను పరిచయం చేసింది.అన్ని యూరోపియన్ భాషలలోకి అనువదించబడిన ఈ నవల ప్రభావం అంతా ఇంతా కాదు .Robinsonade గా పిలవబడే ..ఏకాంతద్వీప సాహిత్యం గా పేర్కొనే.. ఈ తరహ నవలలు అనేకం యూరోపియన్ ప్రజల అన్వేషణాభిలాషను మరింత దోహదం చేశాయని .. భ్రమణకాంక్ష ను బలోపేతం చేశాయనీ .. ఒక ఆలోచన.
ఆ విధం గా పరోక్షం గా సామ్రాజ్యవిస్తరణకు నవల దోహదకారి అయ్యింది. నావలతో పాటే నవల కొత్త ప్రదేశాలకు చేరుకొంది. కొత్త ప్రాంతాలు ,భాషలు , సంస్కృతులను నవల సమీకృతం చేసుకొంటూ ..సామ్రాజ్యాలతో పాటు విస్తరిస్తూ పోయింది. విశ్వవ్యాప్తమైంది.
నవల అనే పదార్థ లక్షణాలు ధర్మాలు అంటూ ప్రత్యేకం గా ఏమీ ఉండవు.
గుణకర్మ విశేషాల విశ్లేషణా సామాగ్రి అంతకు మించి ఉండదు. అయినప్పటికీ, నవల అనే పద అర్ధం అన్వేషిస్తూనే ఉన్నాము.
నవల అంటే ఏమిటో మనకు తెలుసు.
ఏమిటో చెప్పమంటే గాని మనకు నవల గురించి ఎంతో తెలియదు అన్నది అర్ధమవుతుంది.
అందుకనే.... "సమకాలీన బ్రిటిష్ నవలను " గురించి . ఆల్లన్ మాస్సీ అంటారు
“ప్రచురింపబడిన సృజనాత్మక సాహిత్యం అంతా నవల అని అనడం భావ్యం కాదు .. ఎందుచేతనంటే ఒక చోట నవల పేరుతో ప్రచురించ బడిన రచన మరొక చోట మరొక భాషలోకి అనువదిస్తే ఆత్మ కథగానో జ్ఞాపకాలుగానో ప్రయాణ రచనగానో మరొక సాహితీ రూపంగానో రచనాప్రక్రియ గానో..గుర్తించబడవచ్చును. కనుక ..ప్రచురణ కర్తలు నవల గా ప్రకటించిన దానినే మేము నవల గా భావిస్తూ విశ్లేషణకు స్వీకరిస్తున్నాము."అని.
The Last Brahmin ఒక సాహిత్య ..తాత్విక ప్రక్రియ ..ముఖ్యం గా ఒక మేధా "స్వీయ "చరిత."అంటూ పరిచయం చేస్తారు డి వెంకట రావు గారు."ఉద్యమ రచనలు"గా పేర్కుంటూ నవలలను ప్రకటించదం మనకు పరిపాటి.
మరి మన సమకాలీన తెలుగు నవలలలో ఏవి నవలలు అన్న ప్రశ్నను పాఠకుల వివేచనకు వదిలి వేస్తూ ముందుకు సాగుదాం.
“నవల అన్నది ఒక భావన (idea) ఒక abstaction.” అంటూ ఆల్లన్ మాస్సీ , ఇలా అభిప్రాయ పడతారు
“నవల ఒక అన్వేషణా మాధ్యమము...పదాలను అర్ధం చేసుకొనేందుకు మార్గాలు వెతుకుతూ రచయితా పాఠకుడు కలిసికట్టుగా.. చేసే ఒక ప్రయాణం.”
“నవల అంటే శృంగార కావ్యము ,వేడుక పుస్తకము ,కథ “ అంటుంది భ్రౌన్ గారి నిఘంటువు
శృంగార కావ్యము కాని ఈ నూతన ప్రక్రియ ఏమిటో వివరించిన వారు Congreve (Incongita:or,Love and Duty Reconciled ,1713) శృంగార కావ్యము లోని అతిశయోక్తి లేక పోవడము... వీరులతో రాజులతో సాహసాకార్యాలతో ప్రణయ గాథలతో ఏకోరచనగా సాగక పోవడం...సామాన్యులకు దగ్గరగా వచ్చిఅనామకులను అర్భకులను అభాగ్యుల ను నవలలోకి స్వీకరించడము .. సరళం గానూ నవరస భరితం గానూ ఉండడము నవలా లక్షణము.
‘నవీన ప్రబంధము‘ అని నరహరి గోపాలకృష్ణమ్మ గారు అంటే.. ‘వచన ప్రబంధము‘ అన్నారు కందుకూరి.
‘నవ్యమైనదీ లాలిత్యమైనదీ నవల “ ..అని తెలుగు నవలకు పేరు పెట్టారు కాశీభట్ల బ్రహ్మయ్య శాస్త్రి గారు.
‘ప్రాచీన మానవుడు ఉబుసుపోకకై నేర్పుడై చెప్పిన కథ కు పరిణిత రూపము. నవల. శబ్ద ప్రాధానyaత లేని ప్రబంధము; ప్రదర్శనము లేని నాటకము.‘ అంటారు ఫింగళి లక్ష్మీ కాంతం గారు.
“.నవల అంటే.. ఆఖ్యాయని “ అని అంటూనే “నవలంటే కథ కాదు “ అంటారు జి వి కృష్ణారావు గారు.
“చిన్నదైతే కథ పెద్దదైతే నవల అని నేను భావించను. “ అన్నారు వడ్డెర చండీ దాస్.
“నవల సజీవమైన ప్రక్రియ. ఇందులోని ప్రతి అంశం లోనూ ఇతర అంశాలు ఉన్నాయి..”.అంటారు హెన్రీ జేమ్స్
Novel is a genre of becoming . సచేతనం గా కొనసాగుతూ నిరంతరం విస్తరిస్తూ , అసంపూర్ణము సశేషమూ అయిన ఏకైక సాహితీ ప్రక్రియ నవల. అని అంటారు మిఖైల్ భక్తిన్ .
అన్ని నిర్వచనాలకు సరిపోతున్నట్లుగా కనబడుతూనే, ఏ ఒక్క నిర్వచనానికి సరితూగని సృజనాత్మక సాహిత్యమే నవల అంటారు భక్తిన్.
అందుకే ప్రతి నవల తో పాటూ నవల ను నిర్వచించేందుకు నవలాకారులు చేసే ప్రయత్నాలన్నీ.. ఒక విషయాన్ని స్పష్టంగ తెలియజేస్తాయి... అది నవల కున్న బహు ముఖీయత.
ప్రతి ఒక నిర్వచనమూ నవల కున్న మరొక పార్శ్వాన్ని ఆవిష్కరిస్తూ పోతుంది. ఇదొక నిరంతర భావచేతనా ప్రక్రియ.
స్పానిష్ ఫిలాసఫర్ Jose Otega Y Gasst అన్నట్లుగా ...మానవ జీవితము దాని అత్యంత మానవీయ కోణంలొ ఒక సృజనాత్మకక్రియ కాదా ? మనవుడు తన జీవితాన్ని స్వయాన రచించుకొనే ఒక నవలాకారుడు లాంటి వాడు కాడా?
జీవితం లోని వైవిధ్యమే నవలాస్వరూపం .ఆద్యంతాలు లేని సజీవ చేతనా స్రవంతే నవలాస్వభావం.
నవల రచన పఠనం వేటికవే అనిర్వచనీయమైన సృజనాత్మక అనుభవాలు. నవల నిత్య చైతన్య స్వరూపిణి .
నవల అంటే జీవితం . జీవితం అంటేనే ఒక trial and error
సాఫల్యమో వైఫల్యమో ...నిరంతర ప్రయత్నం ...మన నిత్య జీవన వ్యవహారం.
"ఆ మానవుని హృదయాన్ని వ్యక్తం చేయడానికే నేను ఇన్ని వందల పేజీలుగా ఈ ప్రయత్నం చేశాను" ..అంటారు తెన్నేటి సూరి గారు తమ "ఛెంగిజ్ ఖాన్ "నవల గురించి.
లక్ష్యము సాఫల్యమో వైఫల్యమో అన్నది కాదు .ఆ లక్ష్య సాధన కు చేసిన ప్రయత్నం ప్రధానం అంటారు .
అలాంటి నిరంతర భావవ్యక్తీకరణ ప్రయత్నాలే “నవల”.
నవల అంటే...???
నవలే...!!!
***
Oct 21, 2009
వగల మారి వంకాయ
All rights @ writer.
Title,labels, postings and related copyright reserved.
Oct 11, 2009
బట్టలోయ్ బట్టలు..!
బట్టలోయ్ బట్టలు.!
తట్టలు తట్టలు...బుట్టలు బుట్టలు...గుట్టలు గుట్టలు.
బట్టలండీ బట్టలు...!
మంచిది.
వరద... బురద...
ఊరినీ వాడనూ .ఇంటినీ వంటినీ...ముంచెత్తాక,కట్టుకోవడానికి కప్పుకోవడానికి ఓ బట్టల జతో ఒక బట్టల మూటో...ఇవ్వాలనుకోవడం
ఎంత సహృదయత...మరెంతటి మానవస్పందన... ఎంత మంచి తనం...!
అసలు బతికి బట్టకట్టారంటే ఇక గండంగడిచినట్లే . అందుకేగా మంచికీ చెడుకు ఇంటికి పిలిచి ఒక పూట భోజనమైనాపెట్టి ,ఒక నిద్ర చేయించి మరీ కొత్త బట్టలు పూలు పండ్లతో ఆకువక్కలతోఒడినింపుతుంటాం.
ఎంత లేమిలోఉన్నా కనీసం ఒక రవిక గుడ్డ పెట్టడంమన ఆనవాయితీ.ఇంతకూఅంతకూ శాలువాల సన్మానాల సంగతి సరేసరి.
అదిసరే, ఇప్పటి సంధర్భం వేరు.
అన్నీ ఉండీ ..ఉన్నపళాన ఏమీ లేనివారైన ఆపన్నులను ఆదుకోవడానికిమనం బట్టలు పంపుతున్నాం.
ఎవరికి తోచిన రీతిలో వారు బట్టలు అందించాలని చేయని ప్రయత్నంలేదు.బట్టల సేకరణకు చేయని విన్నపాలు ..పాటించని పద్దతులులేవు.ఇంతకు అంత ఇస్తామని ఒకబట్టల దుకాణం వారే డబ్బు చెల్లించిమరీ బట్టలు సేకరిస్తున్నారు.డిసిఎంవ్యానుల్లో లారీల్లో కంటైనర్లలోనూ బట్టలవరద ముంచెత్తుతోంది.
మొన్నాదివారం మా అనుభవమే చెపుతా.
నాలుగో తేదీ ఉదయం సుధగారింటికి వెళ్ళేటప్పటికే వారు అన్నివిధాలుగా సిధ్ధంగా ఉన్నారు.
అప్పటికి మా ఊరి ఆచూకే తెలియదు, అయినా ,అయ్యేదేదో అవుతుందనిప్రయాణమయ్యాం. బీచుపల్లి వంతెనమీదుగా మూడుగంటల్లో చేరగలిగిన మావూరు చేరడానికి ..సుమారు పన్నెండుగంటలు పట్టింది. ఈ క్రమంలో,అందించిన కొత్త దుప్పట్లను తీసుకొంటూ వారు,ముఖ్యంగా స్త్రీలు,అడిగింది వారి.. వంటిని కప్పుకోను ఒకచీర.
వంటి మీదది మార్చుకోనుమరోకటి లేదని వారు చెప్పినా చెప్పకపోయినా తెలుస్తూనే ఉన్నది.
వారు సేకరించి తెచ్చిన బట్టలలో అనేకం.
ప్యాంట్లు చొక్కాల వలన మగ వారికిఇబ్బంది లేదు కానీ, ఆడవారుఅప్పటివరకు కట్టే చీరలు తప్ప మిగిలిన ఆధునిక వస్త్రాలన్నీ ..తీసుకున్న వారుతీసుకొని..చివరికి మార్పిడి చేసుకోవడమో అమ్మకానికి పెట్టడమో..కుప్పలు వేయడమో జరిగింది.
నిన్నసాయంత్రం అక్కడి నుంచి వచ్చినసమాచారం ప్రకారం ..బట్టలు రోడ్డుపక్కన బురదలో కుప్పలు పడిఉన్నాయనీ..వచ్చే లారీ వస్తోందనీతెచ్చే బట్టలు తెస్తోందనీ ఇచ్చే వారికేఇస్తోన్నారనీ తెలిసింది.
సహృదయులకు ఒక విన్నపము.
అక్కడి వారు మన లాంటి వారే. వారొక విపత్తున పడ్డారు. అల్ప, మధ్యఆదాయ వర్గాలకుచెందిన వారు.పరువు మర్యద కలిగిన. ఒకరు కట్టి విడిచిన బట్టకు చేయి చాచవలసిన పరిస్థితిని ఎవరూ ఆశించరు.చిరిగినవీ.. ఇంటిలో అడ్డంగాపడిఉన్నవీ.. వారి అలవాటుకు భిన్నంగా ఉన్నవి ఎంత ఖరీదైనవైనా..ఎలా ఉపయోగపడతాయంటారు?
అనకూడదు కాని, అమెరికా నుంచి బట్టలు వస్తున్నాయంటే.. మా బాలమణి అనింది కదా..
"ఓ యమ్మ.. నా క్యా గుడ్డలొద్దు..పులూజొరమొస్తదంటగాదూ (స్వైన్ ఫ్లూ)? ".అని!
నీకెలా తెలుసన్నా.
"నాకన్నీ తెల్సు పోమ్మా.. గా పొద్దు టివి లల్ల మస్తుజెప్పలే..అమెరికోల్లు ఎవ్వరొచ్చినా దూరం బెట్టమనీ.!వాల్లు పంపిన గుడ్డలెట్లేసుకుంట? కట్టిడిసిన గుడ్డలుల్ల యా రోగాలుండవో..!పోమ్మా పో..!"
మా బాలమణి భయం కూడా ఆలోచించవలసిందే. మనం అందిస్తున్నబట్టలన్నీ అంటువ్యాధులురాకుండా..disinfectants తో ట్రీట్ చేసి ఇవ్వగలిగితే మంచిది.
ఇక, మా కొరివిపాడుకు వెళ్దాం.ప్రఖ్యాత గద్వాల్ చీర ధరించని తెలుగు నారులున్నారా? ఆ అందమైన చీరల మగ్గాలన్నీనీటమునిగాయి.
కొరివిపాడు చిన్న వూరు.అక్కడి నేతవారు గద్వాల్ వారితో ఒప్పందంతో చీరలు నేసి పెడతారు. ఆ ఒక్క వూరిలోనే సుమారు
పాతిక పైగా సన్నకారు నేతవారు జీవనోపాధి పోగొట్టుకొన్నారు.వారికి బట్టలవైనాలన్నీ తెలుసండోయ్!
ఈ సంధర్భంలో , వారికి అందించే బట్టలు చేనేతవైతే పరోక్షంగా నేతవారికి జీవన భృతి కల్పించినట్లేకదా?
ఆ పనిని అంతటి హడావుడిలోనూ ...అనుకున్న గమ్యం చేరగలమో లేదో తెలియని అయోమయంలోనూ..ఎక్కడా రాజీపడకుండా ..చేనేత వస్త్రాలనే పెద్దేత్తున అమర్చి..అందచేసిన చావా సుధా రాణి గారి ముందుచూపుకు జేజేలు. వారికి నిధులు చేకూర్చినా తానా వారికి,మీడియామిత్రులకూ ,ప్రభుత్వశాఖలవారికీ.. అభినందనలు.
మాప్రాంతం వారి తరుపున ధన్యవాదాలు.
PS: ఆడవారిలో గర్భిణులు ఉన్నారు.బాలింతలుఉన్నారు.వారి అవసరాలు మరింత సున్నితమైనవి.సానిటరీ న్యాప్ కిన్లు వాడే అలవాటు వారిలో చాలామందికి లేదు.వారికి తెలియనే తెలియదుకూడా. గమనించగలరు.
All rights @ writer.
Title,labels, postings and related copyright reserved.