Aug 1, 2009

ఊరకుండక ఉద్యోగానికి పోతే

ఉదరపోషణార్ధ0 ఉద్యోగం ప్పదు కదా.
ఎవరికైనా.
ఎంత వారికైనా.
అందునా , ఉద్యోగం యుగ ర్మం.

ఉత్తిత్తునో ఉబలాటపడో ఉబుసుపోకో ఉద్యోగం చేసే రోజులు కావివి. అయినా ,ఉత్సాహం కొద్దీ ఉద్యోగం !

ఉద్యోగాలలో ఉద్యోగమైనా మేలు .. జీతాలు ఇచ్చే ఉద్యోగం కన్నా.

ఎ. టి. యం యంత్రాలు జీతాలు పంచేస్తుంటే కాస్త జోరు తగ్గింది కానీ.. ఇప్పటికీ ..ఎన్నో ఆఫీసుల్లో జీతాలు ఇచ్చే ఉద్యోగం పదిలంగా ఉన్నది.

నెలాఖరు దాటిన అర్ధరాత్రి అటుఇటుగా.. టంచనుగా అకౌంట్లలోకి జీతాలు చేరిపోయే వారి సంగతి ... అటుంచండి. వారు తాపీగా నిద్ర లేచి... ఉదయం పాల పాకెట్లతో పాటో .. మధ్యాహ్నం లంచ్ ప్యాక్ తోనో ..సాయంత్రం కాఫీ డే ..ముందో ఎక్కడో ఒక చోట నింపాదిగా జీత భత్యాలు లెక్క చూసుకొనవచ్చు...లేదూ చిన్నాచితక అవసరాలన్నీ కార్డుతో గీకేయవచ్చు.

కాకపోతే.. జీతాలు ఇచ్చిపుచ్చుకోనే వ్యవహారం ఒకటి ఉన్నదే .. దాని గురించి .

అడ్వాన్సులు అలవెన్సులు లెక్కేసి .. చిట్టాపద్దులు దిద్దేసి ..నయాపైసలతో సహా సరి చేసి పియఫ్ లు టిడియస్సులూ కోతేసి ... జీతాల జాబితా తయారు చేసి ..ఒకరి తరువాత ఒకరిని పిలిచి మరీ .. వరస బెట్టి జీతాలు చేసి పంచేస్తూ పోతుంటారే ..సరిగ్గా అలాంటి ఉద్యోగం .

మాటకు మాట చెప్పుకోవాలి..ఇచ్చేవారం కాక పోయినా ..పంచే వారం కావడం లో ఉన్న ఘనతే వేరు. చిన్నాపెద్ద బోనస్సు అదనంగా అందించినప్పుడు కళకళలాడుతూ ధన్యవాదాలు గుమ్మరించేసి వెళుతుంటే ..చిన్నపాటి ఏనుగెక్కింత సంతోషం కలగదూ..?

చెప్పాపెట్టకుండా కొట్టిన డుమ్మాలన్నిట్నీ సిక్ లీవుల్లోకి సర్దేస్తుంటే బోలెడంత సరదాగా ఉండదూ ?

ఉద్యోగానికేమీ లక్షణంగా ఉంటుంది కదా అంటారేమో మీరు..

ఒక్క సారి కళ్ళు మూసుకొని ఒక తెలుగు సినిమాని గుర్తుకు తెచ్చుకోండి.. ఎప్పుడు హీరో కాలరు పట్టుకొన్నా ... ఎగెరిఎగిరి తన్నినా.. తలకుపోసినా ..సరిగ్గా ఇలాంటి ఉద్యోగుల్నే.. కదూ?

ఇచ్చే వారే కానీ.. ఇప్పించే వారు వేరొకరు..! ఏది ఏమైనా , వీరు సినీ మినీ విలన్లు.

ఇక , ఆఫీసుకు తగ్గట్టుగా సిబ్బంది కస్సుబుస్సులూ కసుర్లూ విసుర్లు .

అదలా ఉంచండి.

ఇస్తినమ్మా అంటే పుచ్చుకొంటినమ్మా అనడానికి .. ఇదేమన్నా వాయినమా? నెలపాటు చేసిన ఊడిగం. మరి నయపైసా తేడా వచ్చినా ఊరుకొంటామా? ఇదీ నిజమే!

అదిగోండి..అక్కడ... టియం దగ్గర ఏదో హడావుడి.

ఎవరో కుర్ర ఉద్యోగి ఉక్రోషంతో మెషిన్ని ఒక తన్ను తన్నాడు.అనుకున్నంత జీతం రాలేదట.

"అయ్యో ..పాపం..కాలరు పట్టుకోను మనిషినైనా కాకపోయే "ఒక పెద్ద మనిషి నిట్టూర్చాడు.

ఒకటో తారీఖు ఉదయం ఇది మామూలే ..అయినా మీరు జీతాలు ఇచ్చే వారే కానీ పుచ్చుకొనే వారు కారుగా .. పూట ఇక్కడ నిలబడడానికే చోటుండదు ..మీరెందుకనీ రావడం? " అతనిని పరామర్షించాడు మరొకతను.

మా సిబ్బంది తట్టాబుట్టా సర్దుకొని సిద్ధం గా ఉన్నారు. ఇప్పుడు జీతాలు పెంచక పోయానా పక్క ఆఫీసులోకి చేరిపోతారు. వాళ్ళని ఏమీ అనలేం . పప్పు ఉప్పు.. నిప్పుమీదికి ఎక్కించే పరిస్థితిలో ఉన్నామా? మరి ఎంతో కొంత పెంపు లేనిదే ..జీతం పుచ్చు కొనే వారు నిలిచేట్టు లేరు. మా ఆదాయమా పెరగక పోయే ..అప్పోసొప్పో చేసి వాళ్ళని ఆపొద్దూ ? అందుకే.. ఉదయాన్నే. ఇలా రావడం

కుర్ర ఉద్యోగినీ ఈ పెద్ద మనిషినీ ఒక్క సారి చూసి ..గట్టిగా నిట్టూర్చడం కన్నా చేయగలిగేది ఏముంది..!

ఊడిగమో ఊరడింపో.. ఉద్యోగం ఉద్యోగమే..!

ఒకటో తారీఖు ఒకటో తారీఖే !

శుభోదయం.

*

దారేది ( దారిద్య రేఖకు దిగువన)
All rights @ writer.
Title,labels, postings and related copyright reserved.

3 comments:

 1. క్రెడిట్ కార్డులున్నప్పుడు ఒకటవ తారీఖు విలువ తెలియకుండా వుండేది. ప్రస్తుతం యు ఎస్ లో వుంటూ కూడా ప్రయోగాత్మకంగా క్రెడిట్ కార్డుల్లేని జీవితం గడుపుతూ వుండటంతో ఒకటవ తారీఖు రాగానే కుటుంబాన్నంతా తీసుకెళ్ళి షాపింగ్ చేయడం, చివరి వారం అంతా మళ్ళీ ఒకటవ తారీఖు ఎప్పుడొస్తుందా అని చూడటం లాంటివి నాకు బావున్నాయి.

  మిమ్మల్ని గత ఏడాది డెట్రాయిట్ లో, షికాగో కలిసాను.

  ReplyDelete
 2. చంద్రలతగారు,

  పూర్వాశ్రమంలో నేను రైల్వే వుద్యోగిని. ఒక చిన్నపాటి పల్లెటూరి స్టేషన్ ఇన్చార్జిగా ఐదో తారీఖు రైల్లో గార్డు పెట్టెలో వచ్చే పే క్లర్క్ కోసం ఆతృతగా ఎదురు చూడటం, ఆ స్టేషన్ ష్టాఫ్ జీతం మొత్తం ఒక్కసారే తీసుకోని బండికి పచ్చజెండా వూపడం.. ఆనక గ్యాంగు మెన్, గేట్‌కీపర్ల జీతం పంచడం భలే అనుభవం."ఏరా టీ్ఏ బిల్లు పడిందా?" "ఏమిట్రా జీతంలో ఎక్కువ కోశారు కొంపదీసి నా రెండో పెళ్ళానికి పంపించారా..?" లాంటి కబుర్లు, "రేయ్ వచ్చిన జీతం అంతా సారాకి తగలెయ్యక ఇంట్లో పెళ్ళాం పిల్లకి కాస్త వుంచూ" అంటూ హెచ్చరికలు.. భలే గుర్తుచేశారు.

  ఇప్పుడంతా నిశ్శబ్దంగా ఎకౌంట్లో పడిపోవడం ఏ అర్థరాత్రో ఒక ఎస్సెమెస్ తో నీ జీతం వచ్చిందిరోయ్ అని ప్రకటన.. రైల్వేలో కూడా ఇదే పద్ధతి పెట్టారని మొన్ననే తెలిసి నిట్టూర్చాను..!!

  ReplyDelete