Aug 10, 2009

వారెవా..!!!

అనగనగా ఒక ఊళ్ళో ఒక రాజుగారున్నారు ! రాజు గారికి ...
ఆగండాగండాగండి.
రాజు గారంటే గుర్తొచ్చింది.
మా పాలమూరు తిరుమల్దేవుని గుట్ట బళ్ళో ఒకటో తరగతిలో ఒక రాజు ఉండే వాడు.
మా రాజుకి గిల్లి కజ్జాలు పెట్టడమంటే మహా సరదా.
ఒక రోజు ఇద్దరు అమ్మయిలు బుధ్ధిగా పలక మీద ఆ లు దిద్దుకొంటుంటే ..వారి వెనకగా చేరి.. వారి జడకొనల రిబ్బన్లను ముడేసాడు.
దిద్దింది చాలని పలకను సంచిలో పెట్టి..కుంటాటకు పరిగెత్త బోయిన అమ్మాయిద్దరూ .. బొక్క బోర్లా పడ్డారు.
మా మల్లమ్మ టీచరు ఊరుకొనే రకమా ?
సీతాఫలం కొమ్మను రాజు వీపు మీద తిరగేసింది.
పిల్లలం తక్కువ తిన లేదు కదా?
కచ్చి కొట్టేసాం !
రాజు భోరు భోరు మంటూ వెళ్ళి వాళ్ళమ్మను వెంట తీసుకొని వచ్చాడు.
నేనేం పాపం ఎరగనంటూ బుధ్ధిమంతుడి మొహం పెట్టుకు నుల్చున్నాడు.
అతనికన్న దీనంగా వాళ్ళమ్మ అంది కదా..
"వాడొట్టి అమాయకుడు. నోట్లో వేలు పెడితే కొరక లేడు.బాబ్బాబు అనవసరపు అభాండాలు వేసి వాడిని ఆడిపోసుకోకండి." అంతటితో ఆగక...
" మీకు పజ్జాలు వంటపట్టవు.ఎక్కాలు బుర్రకెక్కవు" అంటూ జడిపించేసి..
" అసలే పండగ కాలం పసివాడిని .." అంటూ అర్ధాంతరంగా ఆపింది.
నిజమే మరి. రాఖీపున్నమి దాటి నాలుగునాళ్ళయినా కాలేదు.
ఒక్క మాటతో గుండె నీరయి పోయి ..అన్నిటిలోనూ ముందుంటాం కదా ఆడపిల్లలం.. రాజుతో పండు కొట్టేసాం!
మా వెనకే అడుగులో అడుగేస్తూ మగ పిల్లలూ!
వాళ్ళమ్మ మా మంచితనానికి తెగ సంతోషపడి ..
మా బడి చుట్టూ దడిలా పెరిగిన తుమ్మచెట్లను అలా దాటిందో లేదో ..
మా రాజు ఇద్దరు మగపిల్లల మధ్యన చేరి.. ఒకడి ముంజేతి కాశీదారానికి మరొకడి నిక్కరు మీది మొలతాటికీ
ముడేసి ..గుట్ట మీది సీతాఫలం చెట్టు చాటున ... చిద్విలాసంగా నవ్వుతూ కూర్చున్నాడు..!
All rights @ writer.
Title,labels, postings and related copyright reserved.

5 comments:

  1. పండగ కాలం పసోడు అసాధ్యుడే ఐతే... :-)

    ReplyDelete
  2. hhaahahaha excellent .........
    we want more abt him.............

    ReplyDelete
  3. ధన్యవాదాలు.
    అన్నట్లు,
    మా రాజు ను మరింతగా అర్ధం చేసుకోవాలంటే , ఈ రాఖీ పండగ నాటి దినపత్రికల ముఖపత్రాలు చూడగలరని సవినయ మనవి..:-)

    ReplyDelete
  4. inka rayandi madam....ee lantivi chala bagunnaye

    ReplyDelete