జీవితాన్ని ప్రేమించండి
దానిలో నిమగ్నమైపొండి.
మీరు ఇవ్వగలిగినదంతా దానికి ఇవ్వండి.
బోలెడంత అభినివేశంతో ప్రేమించండి.
ఎందుకంటే ,
మీరు ఇచ్చినదంతా జీవితం
మీకు తిరిగి ఇస్తుంది.
మళ్ళీ..మళ్ళీ.
మాయ ఏంజిలో
***
ఏడేళ్ళ పసిబిడ్డ మీద అమ్మస్నేహితుడే అఘాయత్యం చేసినపుడు, తన అన్నతో మాట్లాడిందే తన ఆఖరి వాక్యం. మూగబోయిన ఆ గొంతు మళ్ళీ విప్పుకోవడానికి ఏడేళ్ళు పట్టింది.
ఈ లోగా, తెల్లవారితోనే ఆర్ధికవ్యవహారాలు చేయగలిగిన వంటరి అమ్మమ్మ, ఆమె తెచ్చి ఇచ్చిన బోలెడన్ని పుస్తకాలు,
చిన్న పుస్తకాన్ని చెక్కిన పెన్సిలుముక్కను దారంతో ముడేసి ..లోకంతో బాంధవ్యం కలిపిన అమ్మమ్మ ...మమా...
"కవితలను పాడలేక తున్నావంటే నీకు కవిత్వమంటే ఇష్టం లేదులే" అంటూ పూనుకొని వత్తిడి పెట్టి మరీ,ఉక్రోషంతో తన చిట్టి గళం విచ్చుకొనేలా చేసిన మంచి పద్యాల పంతులమ్మ ,
తనకెంతో ఇష్టమైన వాక్యాలు రచించిన షేక్స్ పియర్ తన లాంటి దక్షిణాది నల్లమ్మాయి అని బలంగా నమ్మిన పసినాటి అమాయకత్వం ...
అన్నింటా చేదోడు వాదోడుగా ఉన్న అన్నయ్యా..
మూగబోయిన ఆ అమృత గళం విప్పినపుడు , అది విశ్వమానవ సౌభాగ్యానికే అంటూ దిశానిర్దేశం చేసిన నాయకుడు మార్టిన్ లూథర్ కింగ్...
నాయకుని అదేశానుసారం యుద్ధభూమిలో దూకడానికి తన పుట్టినరోజు నాటి వరకూ గడువు కోరి, ఆనాడే ఆ నాయకుని హత్యావార్తను వినవలసి రావడం,
ఆ దుఃఖం లో మునిగి ఉన్నతన తలుపులను బద్దలు కొట్టి మరో సారి విశాల ప్రపంచం వైపు ... తన అక్షరాలతో వంతెన నిర్మించుకొనే ... స్థైర్యాన్ని నిర్దేశాన్ని ఇచ్చిన అన్నయ్య.. అతని స్నేహితులు...
ఒకటా రెండా... ఈ కవయిత్రి,ఆత్మకథారచయిత్రి, గాయకురాలు, ఉపాధ్యాయురాలు ,నాయకురాలు,వక్త,బహుభాషాకోవిధురాలు.బహు గ్రంథ కర్త ...
మనసు విప్పి చెప్పే జీవితరహస్యాలు.
" నేను మానవిని. మానవ సంబంధమైనదేదీ నాకు పరాయిది కాదు ! " అని మరొక మారు ఢంకా బజాయించి చెపుతున్నారు.
వినగలిగిన వారికి విన్నంత.
తెలుసుకోగోరిన వారికి తెలుకోగలిగినంత.
ఎందుకంటే, ఇది విశాలమైనదీ.లోతైనదీ.గాఢమైనదీ.
అన్నిటికీ మించి... సజీవమైనది!
ఇది జీవితం.
***
అందుకేనేమో మాయా అంటారు, "ప్రేమ బంధీలను చేయదు.విముక్తులను చేస్తుంది." అని.
కారుమబ్బులలో ఇంద్రధనుస్సులను చూదగలిన ఆ విదుషీమణి మర్మమేమిటో..
మీరూ
చూడండి మరి.
http://www.tudou.com/programs/view/i9bwAfwuYyg/
"తెల్ల"బారిన ఆలోచనలను
గడగడలాడించి,
తేలివచ్చిన అనుభూతులను
నల్లబరిచి,
పంజరం లో పాటాడే పిట్టమ్మ
గుట్టు విప్పి ,
నిశ్శబ్దంలోకి
మాయమై పోయిన మాయా..
జోహార్ !
All rights @ writer. Title,labels, postings and related copyright reserved.