Aug 2, 2011

పని... మర్యాద...అతను !

నాలుగునాళ్ళ నాటి మాట.
పెద్దా చిన్నా చితక  సామాను తో సహా
అలా  రైలు  దిగాలని నిలబడ్డానో లేదో ,  పిలవకనే ...
ఇలా ప్రత్యక్షమయి సామాను ను చనువుగా అందుకొని ప్లాట్ ఫాం మీద పెట్టేసి , కులాసాగా నిలబడి.. ఆ పై, అమాంతంగా నెత్తికెక్కించు కోబోయాడొకతను .
"అయ్యా బాబూ కాస్తాగు.." అని  అతను అడిగిన దానికి నేను ఇద్దామనుకొన్న దానికి సరితూగడంతో .. అలాగే లెమ్మనుకొన్నా.
సరే, చిన్నా చితక సామాను నేనే పట్టుకొని, ఒక పెద్ద చక్రాల బ్యాగును మరొక సూట్ కేసు అతనికి చూపించాను.
మా వూరి కొత్త ప్లాట్ ఫాం చక్రాల సామాను ను లాక్కెళ్ళను భలే వీలుగా కట్టారులెండి. ఆసుపత్రుల్లో ఉంటాయే అలాంటి  పేద్ద మెలికల రాంపు కూడా ఉంది.
కనుక, పెద్ద బ్యాగు మరో సూట్ కేసు.
చక్రాల సామాను ను చక్కా చులాక్కా లాక్కును పోవచ్చు. పని నేనూ చేయచ్చును .కానీ , అతను చేయనిచ్చేట్టు లేడు.
ఒప్పుకోనంటే  ఒప్పుకోనంటుంటే ఏం చేస్తాం చెప్పండి?ఏం చేయాలి చెప్మా ? అన్న ఆలోచనలో పడక మునుపే, 
అతను సామాను వంకే కన్నార్పకుండా  చూస్తూ ,తన ఎర్ర చొక్కా చివర్లను మారు ధీమా గా దులుపుకొని ,ముంజేతి ఇత్తడి బిళ్ళను సవరించుకో సాగాడు.
అందవలసిన సమాధానం అందించేసాడతను
మౌనం గానే.  
అందులోను, భుజాన ,చేతుల్లోను చిన్న చిన్న సామాను ఎలాగు ఉన్నాయి కదా.
అతనితో చెప్పాను.
అవి రెండు చక్రాల సామాను అలా లాక్కుని వెళ్లచ్చు లెమ్మని.
అతను మందస్మిత వదనంతో , విలాసంగా , మారు తన తలపాగా దులిపి కట్టుకొని , సామాను నెత్తికెక్కించుకొన్నాడు.
సామాను బరువునే కాదు చక్రాల బరువును  నవ్వుతూ తలకెత్తున్నాడతను !
అది అనవసరమని గట్టిగా వారించ బోయినా , సులువైన మార్గం సూచించ బోయినా .. అతను చెవిన బెట్ట లేదు సరికదా... పైనుంచి నవ్వుతూనే నిరాకరించాడు.
"నా పని నేను చేస్తేనే మర్యాద" అతను అన్నాడు," అడిగి తీసుకొన్న మొత్తానికి న్యాయం చేయాలి  కదమ్మా!" పై వడివడిగా ముందుకెళ్ళి పోసాగాడు.
తెల్లవారే జ్ఞానోదయం ఏమైనా  కలిగిందా ..అని  అరక్షణం అయోమయంలో పడి ..తేరుకొని..
అతని వెనక పరుగు పెట్టాను...
నా చిన్నా చితకా సామాను తో సహా !
మర్యాదగా!
***
All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

5 comments:

 1. ధన్యవాదాలండీ.

  ReplyDelete
 2. తీస్కుంటున్న డబ్బుకి తగ్గ శ్రమ చేయటం లాంటి నీతి భోదిసత్వుని చూసి
  ఆఫీసు లో బాసులనీ, టీం లీడర్లనీ, బూతులు తిడుతూ బ్లాగులు రాసే జనం ఏమనుకుంటారో మీ టపా కి

  nice post!!

  ReplyDelete
 3. ధన్యవాదాలండి.
  అదేంటో కానీ, మనమంతా మన హక్కుల గురించి మాట్లాడినంత సహజంగా మన బాధ్యతల గురించి మాట్లాడలేం..:-)
  అక్కడే వస్తోంది చిక్కంతా!
  కదండీ!

  ReplyDelete