Jun 30, 2011

ఏమని చెప్పేది నేను!

"అక్కా , ఆవిడెవరో చెప్పండి.ఆమెకు  చాలా అన్యాయం జరిగింది .దారుణం. ఆవిడతో  వెంటనే మాట్లాడాలి.అందరితో మాట్లాడించాలి"
 జర్న్లలిస్ట్ తమ్ముడొకరు ఉద్వేగంతో ఫోన్ చేశారు. "ఉద్యోగమో రామచంద్రా ..!" చదివి.

ఏమని చెప్పాలి నేను?

"ఆవిడెవరో చెప్పదలుచుకొంటే నేనే చెప్పేదాన్నిగా .."అన్నాను.
"ఒక సారి మాట్లాడాలి. మా పత్రికలో వారి ఇంటర్వ్యూ వేయాలి. పలువురికి తెలియ జేయాలి.." తమ్ముడు అంటూ ఉన్నాడు.
సున్నితంగా స్పందించగలిగిన వారు ఒక ప్రముఖ దినపత్రిక లో స్త్రీల పేజీలో పని చేస్తూ ఉండడం .. వారిని మరింత సున్నిత పరిచినట్లుంది.
నిజమే, ఆమె అనామకంగా ఉండాలనుకొంది. అజ్ఞాతంలోకి వెళ్ళి పోయింది. మరి ఆమె నిర్ణయాన్ని మనం మన్నించవద్దూ? ఆ మాటే చెప్పాను వారికి.
ఒక నిబద్దుడైన జర్నలిస్టుగా తన కలం బలంతో ఆమెకు సాయపడాలని వారు అనుకోవడం సహజమే కదా.ఒక వ్యక్తి గా  సాటిమనిషిపై వారి మానవస్పందననూ తెలియజేస్తోంది కూడా.
కానీ, కలానికి ఎన్ని పరిమితులు!తమ్ముడు తెలుసుకొంటాడు గా కాలక్రమాన!

మళ్ళీ అడిగారు." అక్కా, ఆవిడ నిజమేనా?"

సరే ,
ఇక పదే పదే అడిగాక ఆవిడెవరో చెప్పక తప్పదుకదా? అందులోను వారేమో విలేఖరులు ..తిప్పితిప్పి తమకు కావలసిన సమాచారాన్ని ఇట్టే గ్రహించగల నేర్పరులు.
చెప్పాను.
"ఆమె ఒక్కరు కారు. అనేకులు."
"కాకపోవచ్చు."
"అవ్వనూ వచ్చు! తమ్ముడూ మేం వార్తలు సేకరించే వారము కాదండి ...జీవితాలను చదవానుకొనే వాళ్ళం. కథలు రాసుకొనే వారము. వ్యక్తులు కారండి..వారి వ్యక్తిత్వాల్ని బేరీజులు వేయిద్దామని ... కాస్త ఆలోచన..కాస్త మెళుకువ..ఇంకాస్త ఆశతో ..పలువురాడు మాట పాడి అవబోతుంది కదా.. అన్న ఉద్దేశం పదిమంది ముందుకు  ఒక చిన్న ఆవేదనను ..సవినయంగా తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తుంటాం.నా బోటి వాండ్లము .అదలా ఉంచండి.
ఇంతకీ, ఆవిడ ఎవరంటే..???
ఆగండి .. ఇక్కడ తమ్ముడితో చెప్పిన మరో మాట మీకు చెప్పాలి.
ఆయనలు ఆవిడలు అని కాదు, ఎవరైనా సరే..ఈనాటి తెలుగు నాట..ఒక గొప్ప విభ్రాంతిలో మునిగితేలుతున్నారు. విలువలన్నీ భూకబ్జాకు లోనయ్యాయి.
నిన్నమొన్నటి వరకు , ఇంట్లో ఉద్యోగకుతుహలం ఉన్న స్త్రీలందరికీ ..చిన్నదో చితకదో ఒక నర్సరీ బడి పెట్టించే వారు. లేదూ, వారే పెట్టేసారు. అలా పెట్టిన బడి , కేజీలు  దాటి పదోతరగతి దాకా విస్తరిచడం..సర్వసాధారణం. ఎటొచ్చి, ఏదో ఆడవారి ఉద్యోగసద్యోగం అనుకున్నాది కాస్తా, ఇవ్వాళ ..రియల్టర్ల బంగారు గనులై కూర్చున్నాయి!
ఒక ఫుట్ బాల్ ఫీల్డ్ వెల యెంత ?
మీరే చెప్పండి!
వూరేమో ,పెరిగి పెరిగి ... భూమేమో  తరిగి తరిగి పోతుంటే..
ఈ కాలక్షేపానికి ఆరంభించిన బడులు ,వాటి మైదానాలు...
కొండెక్కమంటే  ఎక్కవూ?
అదే జరుగుతోంది.
నెలనెలా పిల్లలు కట్టే ఫీజులెంత? అందుకొరకై యాజమాన్యాలు వెచ్చించాల్సిన శ్రమ, సమయం ఎంత... విద్యావికాసానికై పెట్టవలసిన ఆలోచన ఎంత?
ఇవన్నీ లెక్కేసుకుంటే, ఉట్టినే కోట్లు వచ్చే భూమంత్రం బ్రహ్మండంగా కనిపించదూ ?బడి 'పెట్టు'బడి అయిపోదూ? ఇక,చదువు చట్టుబండలవ్వడం సంగతి సరే సరి!
ఆట మైదానాలు  గేటేడ్ కమ్యూనిటీలు అవ్వడం .. ఆటల్లో అరటిపండన్న మాట !

ఆదర్శాలు, విలువలు ,ఆశయాలు..ఆలోచనలు... అన్నీ ఆర్ధికబద్దమై పోవూ?యాజమాన్యం పురుషబద్దమై పోదూ?ఆమే చిన్ని చిన్ని కలల బడి కాస్తా కాసులగని అయిపోదూ?అందుకు ఆవిడ ఆయనకు చేదోడు వాదోడుగా నిలవదూ?
అయితే ఏం?
అక్కడో ఇక్కడో ,ఇంకా విలువలను ప్రాణస్పందన గా చేసుకొన్నవారు ఒక్కరైనా లేక పోతారా?
కనీసం మా కలాల్లోనైనా?
కలల్లో కాకపోయినా!

సరిగ్గా అలాంటి ఆలోచనల ప్రతిస్పందనే .. ఆవిడ.
మీకు సమాధానం  చేరినట్టేనా తమ్ముడూ?
ఇంతకన్నా ఇంతకు మించి నేనేమి చెప్పగలను?
మీరే చెప్పండి!

***
All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

No comments:

Post a Comment