Jun 8, 2011

వాళ్ళు ...వీళ్ళు ...పారిజాతాలు !

నమస్తే, 
ఇలా మొదలైన పారిజాతాల కథ ఎలా సాగిందో మీరే స్వయంగా చదివి చూడండి.
తీరిక దొరికినప్పుడు. 
ఈ నెల చతుర నవల , 
నాదో చిన్న ప్రయత్నం, 
విషయ సేకరణలో సహకరించిన పాలన గారికి పాణిని గారికి ధన్యవాదాలు.
స్నేహంతో ,
చంద్ర లత 

   వాళ్ళు వీళ్ళు పారిజాతాలు 
*  నవల  *         చంద్ర లత
***
వాళ్ళు
విరిసీ విరియని ఉదయం.
తూరుపు తీరం.  
ఎదిగీ ఎదగని పట్టణం.
ఎనభై దశకం ముడుచుకొనే వేళ. 
తొంభైలలోకి విచ్చుకొనే తరుణం.

తెలతెల్లవారే లోగానే ,నీలు అక్కడికి చేరుకొంది.
గబగబ వెళ్ళి గోడవారగా నిలబడింది. నిదానంగా చుట్టూ చూసింది.
ఇంకా ఎక్కడా ఎవరూ బయలు దేరిన అలికిడి లేదు. 
.................
హమ్మయ్య" నీలు కులాసాగా నిట్టూర్చింది. "ఈ పూట పూలన్నీ తనవే" ఎదురుగా ఉన్న గోడవైపు చూపు సారించింది.
జెండావీధి మలుపులో ఉన్న ఆ ఇంటిగోడకు ఒక ప్రత్యేకత ఉన్నది.
ఎత్తైన ఆ ఇటుకల గోడ మీదుగా ఆర్చీలను కనబడనీయకుందా..గేటుమీద దాకా ..విస్తరించిన పారిజాతం చెట్టొకటి ఉన్నది.
ఆ గేటు తలుపులు ఎప్పుడూ ఇనపగొలుసుతో కట్టేసి ఉంటాయి. దానికి తోడు తుప్పుపట్టిన పెద్దతాళం.మనుషులున్న అలికిడి ఉండదు కానీ, ఉన్నారన్న నిదర్షనం గా అప్పుడప్పుడు ఆ గేటుకున్న చిన్న వాకిలి మూసితెరుచుకుంటూ ఉంటుంది.
‘బయటకే ఇంత చెట్టుందంటే, లోపలి వైపున ఎంత ఎదిగి ఉందో..ఆ ఇంటి వారు అదృష్టవంతులు!’
...................


తొలికిరణాల తాకిడికి తట్టుకోలేవేమో అన్నట్లు,ఆ చెట్టు చుట్టూ అలవోకగా వాలి పోయే పారిజాతాల కోసం పిల్లలంతా పోటీలు పడతారు. ఇవ్వాళ నీలు వంతు.
తన పొడుగు లంగా కుచ్చిళ్ళను పైకెత్తి ,నేల మీద గొంతుకూర్చుంది.అడుగేస్తే పూలు అణిగి పోతాయేమో నని,మునివేళ్ళ మీదే ముందుకుజరుగుతూ ,నేలకంటా వంగి,ఒక్కో పూవునూ భద్రంగా ఏరుకొని.. గుప్పిట్లో దాస్తోంది.నిండిన గుప్పిట ను, తెరిచి పెట్టిన కంపాసు బాక్సులోకి వంపుతోంది.
తెల్లటి పూవు.నారింజ కాడ.
రాత్రంతా పరిమళాలు వెదజల్లి అలసి పోయాయేమో, అయినా నిగారింపు తగ్గలేదు. నిగడదీసుకొని నిమ్మళంగా చూస్తున్నాయి.
గోడమీదా.. నేల మీదా.. రోడ్డు చివర వంకరటింకర తారుమీదా..అక్కడకడా తలెత్తిన కంకర మీదా..
వెల్లకిలా .నింగిని చూస్తూ..పకపక నవ్వుతూ పలకరిస్తూ..
పారిజాతాలు.
నీలు గుండెల నిండా ఊపిరి పీల్చి వదిలింది.
ఏ పూటకాపూట  ఆ పారిజాతాలు  ఆమెని ఎంతగా ఊరిస్తున్నాయో! 
.................................
(చతుర ,జూన్ 2011  సంచిక)


All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

No comments:

Post a Comment