Jun 12, 2011

ఉద్యోగమో రామచంద్రా...!


తుమ్మితే ఊడే ముక్కూ..

ఉత్తినే ఊడే ఉద్యోగమూ ..
ఒకటేనూ...!

ఉండినా ఊడినా ...
జీవితాంతం చేసిన పని ఒట్టిదై పోతుందా?
ఒద్దన్న  కాదన్నా...
జీవితకాలపు శ్రామిక బంధాలు ఇట్టే తేలిపోతాయా?
 అయినా ,
ఉద్యోగం మీద ...అందునా ఒట్టొట్టి ఉద్యోగం మీద ..
గట్టి  భ్రమలు   పెంచుకొనే వాజమ్మలూ జేజెమ్మలూ..ఉన్నారంటారా .. రోజుల్లోనూ!
సరే, మీకొకరిని పరిచయం చేస్తాను.

ఒక ఊళ్ళో ఒక తపాలా ఉద్యోగి ఉన్నారట.
ఎండైనా వానైనా  ఒక నిష్టతో ఒక ఇష్టంతో తపాలపనులు చేసేవాడట.
ఉద్యోగమన్నాక  ఏదో ఒక రోజున విరమించాల్సిందే కదా.
ఇక, ఉద్యోగవిరమణ జరిగిన రోజున ఊరు వాడా కదిలొచ్చి , కన్నీటి వీడ్కోలు చెప్పారట.వారి అభిమానంలో మునకలేస్తున్న  పెద్దమనిషి , గుండె చెరువై పోయిందిట.
బావుంది.
 మర్నాడు ఉదయానికి కానీ , అతనికి ఉద్యోగ విరమణ అంటే ఏంటో స్పృహలోకి రాలేదు.
ఇన్నాళ్ళూ ఉద్యోగమే అతని జీవితం. ఊపిరి.
ఉద్యోగంలో అతను పెట్టిన పెట్టుబడి అతని ఉద్వేగమే.
అతని కలలు , ఆశలు , ఆశయాలు.. శక్తి సామర్ధ్యాలు ...అన్నీ అన్నీ అక్కడే ధార పోశాడు.
ఎంతో ఇష్టంగా.
తనదిగా
 ఉద్యోగమే తనుగా.
మీకు తెలిసిపోయింది కదా?
 తపాలా చిరుద్యోగి టాల్ స్టాయ్ గారి  కథానాయకుడు.

కథల్లో ఇలాంటి కమానిషులు బోల్డుంటాయి ! అని తేల్చి పారేస్తారేమో మీరు.
ఆగండాగండి.
సరిగ్గా ,అలాంటి ఒక వ్యక్తిని పరిచయం చేస్తా.

ఆమె పాతికేళ్ళ క్రితం, నగరం నుంచి పట్టణానికి వలస వచ్చింది. కొత్త కోడలిగా.
చేయడానికి చిన్ని చిన్ని ఆలోచనలతో పాటు కొద్దిపాటి ఆవేశంతో ఉండేది.
వంటావార్పు, ఇంటిపనులు,సరుకుల కొనుగోళ్ళు, బట్టలు ఉతుక్కోవడాలు,అంట్లు తోముకోవడాలు వగైరాలన్నీ ,పూర్తయినా బోలెడంత సమయం మిగిలేది.
ఇక, వాకిట్లో పూలు పూయిస్తూ పూయిస్తూ,   గోడకవతల ,సోడాలమ్మే  పట్టుమని జానాబెత్తెడు లేని కిట్టు చులాగ్గా చేస్తోన్నబేరసారాలు , నోటిలెక్కలు  చూసి పలకరిచింది. సోడాలు కొడుతూ  కొడుతూ లెక్కలు ఎక్కాలతో పాటు అక్షరాలు వంటబట్టించేసింది అతనికి. ఒకడు ఇద్దరై ..ఇద్దరు ముగ్గురై , మెల్లిగా ఒక ఆ వీధిలో పిల్లలంతా ఆమె వద్ద ఒక చిన్న అరుగుబడి మొదలెట్టేయించారు. అది కాస్తా పెరిగిపెరిగి , పెద్ద బడైయింది. తరగ్తులు ,భవనాలు,వాహనాలు.. తదితర హంగు ఆర్భాటాలు సహజం గానే అమిరాయి. ఆదాయప్రదానాలు పెరిగాయి. కిట్టు లాంటి వాళ్ళకు సాయపడడానికి ఔదార్యానికి అవసరమైన వనరులు సమకూరాయి. పేరు ప్రతిష్టలూ పెరిగాయి.
సమయవిభజన మారిపోయింది. మెల్లిమెల్లి వంటావార్పులు ఇంటిపనులకు పెట్టే సమయం తరుగుతూ, అక్షరజ్ఞానం పెంచుకొనే సమయం పెరుగుతూ వచ్చింది.
కిట్టులే కాదు కృష్ణలు పోటీలు పడి చేరే స్థాయికి ఆ  కలలబడి ఎదిగిపోయింది.
అప్పటికీ   సుమారు రెండువందల పై చిలుకు సిబ్బందితో వేలాది మంది విద్యార్థులతో ఆమె ఆలోచన  ఆమెను మించి విస్తరించి పోయింది. ఆమె ప్రతిక్షణం అక్షరమై పోయింది.
ఆమె కుటుంబమంతా అందులో భాగమై పోయారు.
ఆవిడ పతి హయాం వచ్చింది.పెరిగిన భూములు...విలాస జీవనశైలిపై మక్కువ ...ఒక్క పెట్టున విలువలని మార్చేసాయి.
ఆవిడ గ్రహించే లోపలే, బడి మైదానం... తరగతి గదులు ..విడి విడిగా బేరానికి నిలబెట్టబడ్డాయి. ఆమె అభిప్రాయాలప్రమేయం లేకుండానే!.

"సంసారమా సంస్థా..?" తేల్చుకొమ్మన్నారు. కులాసాగా విలాసంగా జీవించమన్నారు.పనిలేకుండా ప్రశాంతంగా ఉండమన్నారు. బడిభారం వదుల్చుకొని ఆనందంగా ఉండమన్నారు.
విదేశీవిహారాలు చేయమన్నారు. వచ్చిన డబ్బుతో బంగారు నగలతో అలంకరిచుకొమ్మారు.మిలమిలలాడే చీరలను కొనుక్కోమన్నారు.
కులాసా గా విలాసాల జీవితం ఆమె జీవించలేదు.
అంతే,
ఇవ్వాళ బడి లేదు.
ఆవిడ కలలూ లేవు.
ఇప్పుడు,
ఆవిడే లేదు!
***
బళ్ళు తెరుస్తున్నారు.
ఆవిడ..
ఉద్యోగమో రామచంద్రా !
అని కలవరిస్తూ....ముక్కలైన గుండెను చేతబుచ్చుకొని...ఎవరికీ కనపడకుండా పోయింది.
బహుశా ఏ కిట్టులాంటి పిల్లాడినో చేరదీసి నాలుగక్షరం ముక్కలు నేర్పే ప్రయత్నంలో ఉండి ఉంటుంది.

పెట్టుబడి ఇబ్బడి ముబ్బడిగా పెరిగిందని, అంతకంత తిరిగొచ్చిందనీ....పెద్ద మనుషులు తెగసంబరపడ్డారు.
ఆమె గడిపిన పాతికేళ్ళ జీవితం,పెట్టిన ఆలోచన, పెంచుకొన్న మమకారం,మానవసంబధాలు,విలువలూ ,తన దృక్పథంపై  నమ్మకం,విశ్వాసం.. ఆవిడ వయస్సు ,ఆమె సమయము...  వీటన్నిటికీ  ...ఖరీదులుకట్టే షరాబులుంటే బావుణ్ణు ! 
అంతకుఅంత  , 
అవన్నీ ఆవిడకు తిరిగి ఇస్తే మరీ బావుణ్ణు. 
కదా?
***
All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

2 comments:

  1. ఏమని చెప్పేది నేను? :-)
    ధన్యవాదాలండి.:-))

    ReplyDelete