Aug 7, 2011

తమరూ తామరలూ

ఒక్క సారి ఊహించండి.
మన భాగ్యనగరం లో...
అందునా బేగం పేటలో ...ఒక చిన్న నీటి కొలను ..అది తేట నీరుదే అనుకుందాం.
అందులో అపుడే పూసిన తామర పూవు.
అవునండి. అదే ...
మన లచ్చిందేవమ్మ చక్కగా సింగారించుకొని  బాసింపట్ట వేసుక్కూచుంటుందే ...
అచ్చంగా అదే రంగు తామర పూవు పూసిందనుకోండి.
పూసీ పూయగానే చూసి ఊరుకొనే వారెవరు చెప్మా! 'అని తరువాత హాశ్చిర్య పోదురు గానీ, ముందు నా మాటినండీ తమరు ..
ఆ కొలను లోని తామర పూవును కొనగోట కోసి..ఛ .. ఇది అసలు సిసలుకాబోదు కదూ.. కొనగోటి తో తామర పూవెల కోస్తారు మరీ చిత్రం కాకపోతేను?
బురద నీట్లో మునిగి ,నీటి పాచును జమ్మిపొదల్నిదాటుకొంటూ..నీటిమధ్యలోకెళ్ళి.. రెండు చేతుల్తో  తామర తూడును పట్టి బలంగా లాగితేనో ...కొడవలితో .. పోనీండి పట్నంవాళ్ళు కాబోలు.. చాకు తో చటుక్కున గాటు పెడితేనో గాని ..ఓ పట్టాన పూవు తూడును వదిలి ..చేతికి రాదయ్యే...!
సరే లెద్దూ..
అష్ట కష్టాలు పడి.. కష్టనష్టాలు పడి.. తిరిగొద్దామంటే,
నేనున్ననంటూ  ...
ఏ చిరు చేపో కప్ప పిల్లో .. కాలిని వేలిని తాకి గిలిగింతలు పెట్టబోతే ,
జలగో నీటి పామో అనుకొని ...చిన్నదో పెద్దదో గెంతేసి... భయంతో కెవ్వున కేకేసి...బురదలో బోర్లా పడబోతూ.. తట్టు కొని నిలబడి...తామర తూడుల్లెమ్మని తేరుకొని.. ఊపిరి బిగబెట్టి ..ఒడ్డుకొచ్చి పడ్డానికి అదేమైనా మా వూరి చెరువటండీ!
భాగ్యనగరం ఇంటి పెరటిలో బుజ్జి నీటి కొలనైతే!
అయితే మాత్రం.. ఎక్కడి బేగంపేట మరెక్కడి బాగ్ లింగం పల్లి ..
అక్కడ నుంచి ఇక్కడకు .ఎన్ని మెలికల రోడ్లు ...
ఎంత ట్రాఫిక్ .. ఎంత మంది జనం...ఎంత పొగ ..దుమ్ము ..
ఒంటిచేత్తో లాఘవంగా వాహనాన్ని లాగించేసినా ఉదయం పూట ..అందునా బడులు ఆఫీసుల గందరగోళంలో ..వంటరి ప్రయాణం మాట అటుంచి..
తెల్లవారడంతో పూచిన పూవును ..కొలను నుంచి కోసిన క్షణం నుంచీ..
ఆ సూరీడి వేడిమి నుంచి దాచేస్తూ..
వాలిపోక మునుపే ..
సోలిపోక మునుపే  ..
అపురూపంగా అందిచగలిగారంటే ..
అది మరెవరూ..మనసెరిగిన ..మంచి స్నేహితురాలు కాక!
అర్ధమయి పోయింది కదా..
ఆకస్మాత్తుగా ఒక తాజా తామర ...అందునా మన నగరం నడిబొడ్డులో ..

ఆప్యాయంగా  అందించిన ఆ స్నేహితురాలు ..నన్నెంత ఆశ్చర్యాందానుభూతులలో
ముంచేసిందో..ఒక్కసారిగా ఎన్నెన్ని జ్ఞాపకాలు ముప్పిరిగొని ఉక్కిరిబిక్కిరి చేశాయో !

ఆ స్నేహితురాలేవరంటారా?
ఇంకెవరు?
 మన సత్య గారే.
మరేనండి..

" భూమిక "సంపాదకులు కొండవీటి సత్యవతి గారే.
సంపాదకులు రచయితల మైత్రి ఇలా కూడా ఉండొచ్చునమ్మోయ్ !అంతే కాదు క్రమం తప్పకుండా ప్రతి కొత్త ఏడాదికీ ఆవిడ పంపే పొగడపూలు, బ్రహ్మికమలాలు పూసీ పూయగానే ..ఏమండొయ్ మాఇంటికి రారండోయ్ పూలు పూచాయండోయ్ ..అంటూ చేసే హడావుడి..

పాపికొండలకు వెళుతూ దారంతా కొంటూ వెళ్ళిన మొగలి పూవులు ...గోదారి గట్టంట  పోగేసుకొచ్చిన వెదురు పూలు ..
ఒక్కటేమిటి ఈ జాబితా కి అంతేది! అదుపేది!
ఆ మాటకి వస్తే ,దొరికితే ఇప్ప పూలైనా ...మనకి వోకే !
ఇంతటి సంతోషాన్ని పంచిన సత్యాజి అలా ..మరింత సంతోషం పంచుతూనే పోవాలని..
వారి స్నేహసౌరభాలు కలకాలం నిలిచే వెలకట్టలేని అపురూప బహుమానాలనీ ..వేరే చెప్పక్కర లేదు కదా.!
ఆ ఆప్యాయతను  నేనుచేసుకొని.. ఆ  తామరను మీతో ను పంచుకొంటున్నా..!
ఎంతైనా మనం మనం స్నేహితులం కదా...!
అందులో ను సత్యగారికి ఈ మాట  తెలిస్తే ఇంకెంత సంబపడిపోతారో..!
అవునండి .
పంచుకొంటే పెరిగేది స్నేహము.
అది సత్యమూ.నిత్యమూ.
***
ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే ...
మిత్రులారా...
ఇవ్వదలుకొన్నారే అనుకోండీ..
ఏ షరాబు విలువలు కట్టలేని అపురూప బహుమతులందించడి మీ స్నేహితులకి..
ఈ స్నేహితుల పండుగ రోజున!
ఆ బహుమతి ని డబ్బుదస్కం తో మాత్రం అస్సలు తూచకూడండొయ్!
అదొక్కటే షరతు!
మీకు ఓకే నా !
*
ఆలోచించండి . అందించండి.
మన సత్య గారి లాగా..!
**
స్నేహితుల పండగ జేజేలు .
మీ అందరికీ.
***
తామరతంపరలా స్నేహబంధాలు వర్దిల్లు గాక!
తథాస్తు !!!
***
All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

7 comments:

 1. స్నేహబంధాలు వర్దిల్లు గాక!

  తథాస్తు !!! తథాస్తు !!! తథాస్తు !!!

  ReplyDelete
 2. చాలా బాగుంది చంద్ర లత గారు. మీ మైత్రి బంధం ఇలాగే వర్ధిల్లాలని మనఃస్పూర్తిగా కోరుకుంటూ..మీ ఇరువురికి మైత్రి దినోత్సవ శుభాకాంక్షలు.

  ReplyDelete
 3. Mee friendship satya thone kaadu maa andaritho kuda tamara thamparaga vardhillalani korukuntoo--- mee prabhakara sastri.

  ReplyDelete
 4. అబ్బ!ఎంత అద్భుతం
  .ఫోటో ఇన్నాళ్ళూ దాచుకుని స్నేహ దినోత్సవాన తటిల్లతలా
  మెరిపించావ్ చంద్రా!
  నా గురించి ఇన్ని మంచి మాటలు వింటుంటే హమ్మో!! ఇది నేనేనా నిజంగా నేనేనా
  అని ఒకటే హాస్చర్యం.

  http://maagodavari.blogspot.com/2011/08/blog-post_07.html
  మరిన్ని పూలు పంపుతూ సత్యవతి గారిలా రాశారన్న మాట!

  ReplyDelete
 5. ధన్యవాదాలండి.

  ReplyDelete