Jul 3, 2010

గుట్టెనుక 3

<<గుట్టెనుక1,2 చదివాక ,ఇక మిగిలినది>>
"పొద్దున్న వొచ్చాడు. కసువులు చిమ్మను పోయిన మనిషికి కంచెలో దాక్కోని కనబడ్డాడు. భయపడి కేకలు పెడతా వొచ్చింది. చూద్దుము కదా. ఇతను. మాసిన గడ్డము, చింపిరి జుట్టు, ఖైదీల బట్టలు .కాళ్ళకు చేతులకూ బేడీలు.పిల్లలు భయపడి పోయారు.ఎక్కడొళ్ళక్కడే ఉరుకులు బిత్తరపడి నిలువుగుడ్లేసారు. మేమే వచ్చి అందరినీ లోపలికి పంపాం.

"ఏమ్మా, ఎవరికైనా హాని జేసినాడామ్మా?" మాటలు కుక్కుకొంటూ మెల్లిగా అడిగాడు ఆదెయ్య.
"ఊహు, కానీ,ఉదయం నుంచీ అక్కడే ఉన్నాడు.ఉలుకు పలుకు లేదు. అతనికే ఏదన్నా హాని చేసుకొంటాడేమో నని ఇన్స్పెక్టర్ గారికి కబురు పెట్టం..వాళ్ళ మేనమామలొచ్చారు. పిల్లోడు సాక్ష్యం చెప్పినందుకు  వాడిని చంపే దానికే వొచ్చాడనీ.."
ఆదెయ్య ఉన్న చోటనే కుప్ప కూలిపోయాడు. "ఇందరి కళ్ళల్లో ఇంత కిరాతకుడై పోయినాడా నా బిడ్డ.."
"వాళ్ళు కేసులు కూడా పెట్టారు" ఇన్ స్పెక్టర్ అందించాడు.
"పిల్లవాడికీ అదే చెప్పారు"ఆయ్యవోరమ్మ అంది. “ఇలాంటివి బడి దాకా రాకూడదు . వచ్చింది. ఏమి చేయడమా అని?” ఆమె కాస్తాగి అంది, "చుట్టూ గుంపు చేరి పోయింది. తలకొక మాట.దానికి అడ్డూ అదుపు లేదు కదా?
వాళ్ళ మేన మామలూ ఎక్కడ విరుచుకుపడతారో.."ఆమె ఆగి,ఆదెయ్యతో మెల్లిగా అంది,"మీరొక సారి మాట్లాడి రండి.అసలు ఎందుకింత రిస్క్ తీసుకొన్నాడో.అతని ప్రాణానికే అపాయం కదా"
ఆదెయ్య ఇన్ స్పెక్టర్ వంక అనుమానంగా చూసాడు. అయ్యవోరమ్మ అప్పటికే ఏమి మాట్లాడి ఉందో కానీ , అతను మౌనంగా చూస్తూ ,వెళ్ళమన్నట్లు తలాడించాడు.
కంచె దగ్గరకు రాగానే ,ఆదెయ్య కడుపులో పేగులు మెలి తిరిగినట్లయ్యింది. ఎంత ముద్దుమురిపెంగా పెంచుకొన్న బిడ్డ..క్షణాళ్ళో బతుకు బుగ్గిపాలెయ్యనే, ఇంత మంది నడుమ హంతకుడిగా కిరాతకుడిగా.. ఆ ముళ్ళల్లో ఆ కంపల్లో ..పడి... ఆదెయ్య తువ్వాలును నోట్లోకి మరింత కుక్కుకున్నాడు. వణుకుతున్న కాళ్ళతో మెల్లిగా దగ్గరికెళ్ళాడు.
"ఏమిరా ఇట్టా జేస్తివి ?" మాట్లడాననుకొన్నాడు. మాట పెగలలేదు.
“బుడ్డొడికి ఒక మాట చెప్పిపోదామని వొచ్చినా నాయినా , నీ మాట చెవిన బెట్టలే .. మాటిమాటికీ ఆలోచిస్తాంటే ఒక్కో మాటా తెలిసొస్తాంది నాయినా, పోయినణ్ణాల్లూ  గొర్రెలదాటునబోయినాను. ఈ పొద్దు నిలబడి ఆలోచన జేస్తే, ఇనుకొనే దానికి ఎవరూ లేరు.చెప్పకుంటే ,ఆ బాధ తొలిచేస్తాంది ,నాయినా.” కొడుకు మెల్లిగా మాటలు కూర్చుకొంటా అన్నాడు.” ఆదెయ్యకు ఏమీ తోచలేదు. కంచెవైపుగా నడిచాడు. మాటన్నా స్పష్టంగా విందామని..
“ ఈ కొండలుబండలు పనికి మాలినావని ఎద్దేవాజేస్తిని .తాతలకాలం నాటివనీ తలనుబెట్టుకోవాలనీ నీవుజెప్పినా చెవిన బెట్టలే. అవిప్పుడు ఇనుమో బంగారమో ...కానీ ..మన బతుకులు బండలు జేసి అవి మట్టి పాలవుతున్యాయి.ఆ మట్టి ని సొమ్ము జేసుకొన్నోలు మహరాజుల వుతున్నారు. ఇక, ఆప తరం కాదు. కాపలా కాయల్సినోళ్ళే కండ్లళ్ళ కారం కొడుతున్నారు.కనురెప్పల్ని కత్తిరించుకుబోతున్నారు.భూదేవమ్మ పొదుగు కోసుకుపోతున్నారు,నాయినా, పట్టపగలు.నిలబడి అడిగే మొనగాడే లేకుండా బోతున్నాడు.నా బిడ్డకు వొట్టిపోయిన నేలను బండనూ కొండనూ ..ఇయ్యాల్సిందేనా ?"
"బుడ్డోడు వానికా గమనం ఏడుంటాదిరా? నాకూ నీకే ల్యాక పాయే.." ఆదెయ్య ఎలాగో గొంతు పెగల్చుకొన్నాడు.
"ఆళ్ళమ్మ నేరం ఏమీ లేదు. నేరం జేసినోన్ని నేను. నా తప్పు నేను అనుభవించాల్సిందే. నన్ను చేతకానోన్నిజేసిన కాలానిదే కనికరం లేదు. నాలాగా వాడు కారాదు నాయినా , ఎట్టా జేస్తావో.. ."
మాట మాటగా ఉండగానే అతని తల మీద బావ మరిది చేతి కర్ర విరిగింది.పోలీసులు చుట్టుముట్టారు.
ఆదెయ్యను పక్కకు నెట్టారు.
బుడ్డోడ్ని తండ్రి దగ్గరకు తీసుకువస్తోన్న అయ్యవారమ్మ ,అక్కడే ఆగిపోయింది.
 బుడ్డోడ్ని కళ్ళారా చూడకుండానే ,నోరారా పలకరించకుండానే, గుండెల్లో గుబులు పంచుకోకుండానే , అతన్ని పట్టుకువెళ్ళారు. రెట్టలు విరిచి జీపునెక్కిస్తుంటే కొడుకు దయనీయంగా అడిగాడు, ఆ ఒక్కమాట వానికి జెప్పు నాయినా ,ఏ పొద్దుకైనా !”
 జీపు లో  వెళుతున్న కొడుకు కన్నీళ్ళ నడుమ సాగనంపి వెను తిరిగిన ఆదెయ్య ను దాటుకొని ,సెల్లు టవర్ స్తంభాలను మోస్తున్న లారీ దాటి పోయింది.ఆ వెనుకే బుల్డొజరూ. కొండను తవ్వి తలకు పోసుకొనే పొక్రెయిన్లూ ట్రక్కులు.
 “ఏ ఒక్కమాట ? వాడంటే ఎవడు? ఒక్కడా? పదిమందా? ఏ పొద్దులోపల జెప్పలా?ఎవరికి జెప్పాలా? జెప్పు. నీ కొడుకు ఏమి రహస్యాలు జెప్పి పోయినాడు?” అక్కడ ఆగిన పోలీసులు ప్రశ్నలతో ఆదెయ్యను చుట్టుముట్టారు. అంతకన్నా కోపంగా కొడుకు బావమరుదులు బంధువులు ముసురుకొన్నారు.
కొండ మీద  ఎవరో పెట్టిన పొగ ఊరంతా కమ్మింది.ఉక్కిరిబిక్కిరి జేసింది.ఎక్కడి వారక్కడే ఆగి పోయారు.
ఆదెయ్య నిలువు గుడ్లేసుకొని కొడుకు మాటలు మననం చేసుకొన్నాడు. కొడుకు మాటలు అతనిలోకి ఇంకి పోయాయి. లోలోనకు ఇమిడిపోయాయి . అప్రయత్నంగా ఒక పదం అతని గొంతులో గుర గుర లాడింది.
"గుట్టెనుకా...."
<<<అయిపోయిందనే! >>>

సురభి పత్రిక ప్రారంభ సంచికలో ప్రచురితం. సంపాదకులకు ధన్యవాదాలతో.
______

1.టివి 2. రేడియో 3. రంగురెక్కల పురుగు


 All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

No comments:

Post a Comment